Editorial

Wednesday, January 22, 2025
కాల‌మ్‌ఈ వారం 'మనసు పొరల్లో' : ఎవరు రౌడీలు? ఎవరు మర్యాదస్తులు?? – పి.జ్యోతి ...

ఈ వారం ‘మనసు పొరల్లో’ : ఎవరు రౌడీలు? ఎవరు మర్యాదస్తులు?? – పి.జ్యోతి తెలుపు

నా చిన్నతనం, టీనేజ్ మొత్తం కూడా మెట్టుగూడ, లాలాగూడలో గడించింది. ఆ బస్తీల్లో చాలా మందికి రౌడీలని పేరు ఉండేది. రెగ్యులర్ గా పోలీస్ స్టేషన్ కి వెళ్ళి వస్తుండే వాళ్ళు. కానీ ఓ అమ్మాయిగా, స్త్రీగా ఒక్క రోజు కూడా వీరి మధ్యన ఇబ్బందికరమైన పరిస్థితి  నేను ఎదుర్కోలేదు. నిజానికి నాజుకు మనుషులలో చేరిపోయిన వారికంటే ఈ బండ మనుషులే నాకిష్టం. అట్లే, గాగిన్ గీసిన ఈ చిత్రం అన్నా ఇష్టం. ఈ మధ్య ఈ చిత్రం ఇంకా బాగా అర్ధం అవుతున్నట్లు అనిపిస్తుంది.

పి.జ్యోతి

ఇప్పుడు సమాజంలో మనిషి మాటకు వేషధారణకు అనవసర ప్రాధ్యాన్యత ఇవ్వడం చాలా ఎక్కువయింది. మనిషి తీయగా మాట్లాడుతూ అందంగా హుందాగా కనిపిస్తూ ఉంటే చాలు అతనికి చాలా విలువ ఇస్తాం. ఇది ఎప్పుడూ సమాజంలో అందరూ చెసిన, చెస్తున్న పొరపాటే. అందంగా ఉండే వాళ్ల పట్ల, అందంగా మాట్లాడేవాళ్ల పట్ల కొంత ఆకర్షణ ఉన్నా, సామన్యంగా ఉండే వాళ్ల మీద ఎక్కువ మందిలో చులకన భావం నా చిన్నతనపు రోజుల్లో ఇపుడున్నంతగా ఉండేది కాదు.

జనాలలో ఈ బాహ్య ప్రదర్శన పైన పిచ్చి ఇప్పుడు మరీ ఎక్కువ అయింది. ఎంతగా అంటే వేష భాషలకు నగిషీలు చెక్కుకోవడానికి ఒకో కుటుంబం పెడుతున్న ఖర్చు వారి భోజన ఖర్చుని మించి పోతుంది. గత ముప్పై సంవత్సరాలలో రేషన్ షాపుల కన్నా పెరిగిన బ్యూటీ పార్లర్ల సంఖ్యను గమనించండి, తెలుస్తుంది, నిజానికి ఆ రోజులో చదువుకున్న వారు తక్కువగా ఉన్నా కాని, అప్పట్లో నడిచిన గ్రంధాలయాల సంఖ్యను ఇప్పటి పరిస్థితులను గమనిస్తే మనుషులు బుద్దిని పదును పెట్టుకోవడాని కన్నా, ఇప్పుడు శరీరాన్ని చెక్కుకోవడం పై ఎక్కువ శ్రద్ద చూపిస్తున్నారన్నది అర్ధం అవుతుంది. ఇప్పుడు కొన్ని చోట్ల ఉద్యోగం చేయాలంటే మేకప్పులకి బట్టలకీ పెట్టే ఖర్చు నిజంగా అవసరమా అని నా లాంటి వారికి అనిపిస్తుంది కూడా. పెరుగుతున్న మగవారి బ్యూటి పార్లర్లు, జిమ్ లు కూడా వారి ఆకృతి, వేషధారణ పట్ల పెరుగుతున్న అనవసర ప్రాధాన్యతలకు కారణంగానే కనిపిస్తున్నాయి.

ఇవేవి పోని ఆరోగ్యరిత్యా మనిషి జీవితంలో ఉపయోగపడేవా అంటే, కాదని వైద్య శాస్రం చెబుతుంది. ఇక ఇప్పుడు అందం కోసం శస్త్ర చికిత్సలు అందరికీ అందుబాటులోకి వచ్చేసాయి. ఇప్పటి తరం అందంగా, ఆధునికంగా కనపడితే కాన్పిడేన్స్ పెరుగుతుంది అంటున్నారు. ఈ కాన్పిడేన్స్ అంటే మనిషి లోపల సహజంగా తయారవ్వవలసిన గుణం కదా. బైట కనిపించే వేషంతో వచ్చే కాన్పిడేన్స్ ఎంత ఆరోగ్యకరం, అది ఎన్నాళ్ళుంటుంది? ఇది మనిషికి వ్యక్తిగతంగా చేసే లాభం ఎంతో మరి నాకు అర్దం కాదు.

చిన్నప్పడు మేం ఆలుగడ్డబావి రైల్వే క్వార్టర్స్ లో ఉండేవాళ్లం అని చెప్పాను కదా. దాని వెనుక ఉన్న బస్తీ మెట్టుగుడ. దాని పక్కన లాలాగుడ. ఆ పైన తార్నాక. ఇప్పుడు ఏ.ఎస్. రావు నగర్. మధ్యలో కొన్ని రోజులు మహేంద్రాహిల్స్. మొత్తంగా నా జీవితం ఇప్పటి దాకా ఈ ప్రాంతాలలోనే గడిచింది.

ఆ బస్తీలో చాలా మందికి రౌడీలున్నా…

నేను పుట్టింది లాలాగుడా రైల్వే హాస్పిటల్ లో. అంటే నేను పక్కా లోకల్ని. మెట్టుగూడలో చాలా చిన్న పనులు, వృత్తులు చేసుకుంటూ జీవించే వాళ్ళు ఉండేవాళ్ళూ. వీళ్ళలో కొంత మంది రైల్వేలో క్లాస్ ఫోర్త్ ఎంప్లాయిస్. వీళ్ళందరిలో ఆ రోజుల్లోనే తాగుడు సాధారణమైన విషయం. సాయంత్రం అయితే బైట అరుగులపై మిర్చీ షాపులు వెలిసేవి. మేము నడిచి ఒక చోట నుండి మరో చోటకు వెళ్తున్నప్పుడు ఈ కల్లు దుకాణాల ముందుగానే నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం. అప్పట్లో ఇంట్లో సైకిల్ కూడా ఉండేది కాదు. గాజులు కొనుక్కోవాలన్నా, ఏవో చిన్న పనుల కోసం, ఆదివారం చికన్ కోసమో బైటికి తిరుగుతూనే ఉండేవాళ్ళం. మెట్టుగూడలో అడవయ్య యాదవ్ అనే ఒక చిన్న లీడర్ ఉండేవారు. ఈయన రేషన్ షాపు నడిపేవారు. మా నాన్నగారు ఆ రోజుల్లో ఆఫీసు నుండి వచ్చి సాయంత్రాలు ఈ రేషన్ షాపులో కూడా పని చేసేవారు. అలా ఆయనకు ఆ బస్తీ వారితో మంచి పరిచయాలు ఉండేవి. నాన్నగారు రైల్వేలో సాధారణ ఉద్యోగి. జనంతో సంబంధాలు ఎక్కువుండేవి. అందుకే సార్ అంటూ అప్పటి నుండి ఈ రోజు దాకా ఆయనకు అదే గౌరవం ఇస్తారు ఈ బస్తీలోని వాళ్ళు. ఇప్పుడు ఆ తరం చాలా వరకు కాలం చేశారు.

ఐతే, ఆ బస్తీలో చాలా మందికి రౌడీలని పేరు ఉండేది. రెగ్యులర్ గా పోలీస్ స్టేషన్ కి వెళ్ళి వస్తుండే వాళ్ళు కూడా. ఆ చిన్న చిన్న ఇళ్ళ మధ్య వీళ్ళు మా మధ్యనే తిరుగుతూ ఉండేవాళ్ళూ. వ్యక్తిగతంగా వారెలాంటి వాళ్ళో తెలియదు కాని నా చిన్నతనం, టీనేజ్ మొత్తం కూడా వీళ్ళ మధ్యనే గడిచింది. నాకు ఇరవై మూడు సంవత్సరాలు వచ్చేదాకా ఈ లోకాలిటీలో వాళ్ళ మద్యనే పెరిగాను. వాళ్ళు ఇంటికి వస్తుండే వాళ్ళూ. ఓ కప్పు టీ ఇస్తే తాగేవాళ్ళూ. వాళ్ళలో వాళ్లు ఎంత కొట్టుకున్నా, తిట్టుకున్నా మమ్మల్ని చాలా చక్కగా చూసుకునే వాళ్ళూ. కానీ ఓ అమ్మాయిగా, స్త్రీగా ఒక్క రోజు కూడా వీరి మధ్యన ఇబ్బందికరమైన పరిస్థితి  నేను ఎదుర్కోలేదు.

అప్పట్లో సైకిల్ అద్దెకిచ్చే షాపు ఇలాగే ఉండేది!

మెట్టుగుడ లో అశోక్ అనే ఒక అన్న మా ఇంటికి వస్తుండేవాడు. ఇతనే నాకు సైకిల్ నేర్పించాడు. కాస్త ఓవర్ వెయిట్ గానే ఉండేదాన్ని. నేను క్రిందపడిపోకుండా, నన్ను సైకిల్ సీటుపై కూరోబెట్టి, సున్నితంగా పట్టుకుని ఒక నెల రోజుల పాటు నాకు చాలా జాగ్రత్తాగా సైకిల్ నేర్పించాడు ఆ అన్న.

మా నాన్నగారు నాకు నడక రానప్పుడు ఎప్పుడో సైకిల్ తొక్కేవారని చెపుతారు. ఇంట్లో సైకిల్ కొనుక్కునే సీన్ అప్పుడు మాకు లేదు. నాన్నగారు ఈ రోజుకీ ఎక్కడకు వెళ్ళాలన్నా నడిచే వెళతారు. సైకిల్ ఆయనకే సరిగ్గా రాదు… ఇక మాకేం నేర్పించగలరు. మా అన్నకు తన ఎర్ర జెండ అన్నలతో పాపం తీరిక ఉండేది కాదు. అప్పట్లో ఆడపిల్లలకు సైకిల్ నేర్పించాలనే ఆలోచన కూడా ఎవరికీ ఉండేది కాదు. కాని మేం సైకిల్, టూ వీలర్ రెండూ నడపాలనే కోరిక మా అమ్మకు చాలా ఉండేది. ఈ అశొక్ అన్న నేర్పిస్తానంటే ఆమె అతనికి మమ్మలను అప్పగించింది.

ఆ అన్న పెద్దగా చదువుకోలేదు. చాలా రఫ్ గా ఉండేవాడు. బండ పనులు చేసేవాడు.  నాకు ఆయన నేర్పించిన సైకిల్ పుణ్యమా అని తరువాత మొత్తం హైద్రాబాద్ చక్కర్లు కొట్టే స్థాయికి ఎదిగాను.

ఆ అన్న పెద్దగా చదువుకోలేదు. చాలా రఫ్ గా ఉండేవాడు. బండ పనులు చేసేవాడు. పైగా పాన్ తినేవాడేమో నాలుక ఎర్రగా ఉండేది. పదేళ్ళ వయసులో నాకు ఆయన నేర్పించిన సైకిల్ పుణ్యమా అని తరువాత మొత్తం హైద్రాబాద్ చక్కర్లు కొట్టే స్థాయికి ఎదిగాను. ఇప్పటికి ఆ అన్న గుర్తుకు వస్తూనే ఉంటాడు. సైకిల్ నేర్పించినందుకన్నా, నన్ను నిజంగా సొంత చెల్లెలంత జాగ్రత్తగా చూసుకున్నందుకు. ముఖ్యంగా ఇలాంటి సమయంలో తమకెదురైన అనుభవాలను కొందరు ఆడపిల్లలు కౌన్సలింగ్ సమయంలో నాతో పంచుకున్నప్పుడు ఈ అన్న మరీ మరీ గుర్తుకు వస్తాడు.

ఒక్క రోజు కూడా చెడు అనుభవం లేదు

ఈ సైకిల్ నేర్చుకోవాలంటే మెట్టుగుడలోని ఓ సైకిల్ అద్దెకిచ్చే షాపుకి వెళ్ళేదాన్ని. అక్కడ బట్టతలతో ఓ అంకుల్ కూర్చునే వాడు. గంటకు పావలా తీసుకుని సైకిల్ అద్దెకిచ్చేవాడు. ఆ అంకుల్ షాపు ముందు గాంగులుగా ఈ రౌడీలని పేరుపడిన వారంతా చేరేవారు. ఒక్క రోజు కూడా నాకు వాళ్ళతో ఒక్క చెడు అనుభవం లేదు. పద్నాలుగేళ్లు వచ్చేదాకా అక్కడి అన్నలతో ఏదో ఒకటి మాట్లాడుతూ, పలకరిస్తూ నడుచుకుంటూ వెళ్లిన గుర్తులే అన్నీ. ముందు ఓ చిన్న సైకిల్ తరువాత పెద్ద సైజున్న సైకిల్ అద్దెకి తీసుకుని తొక్కేదాన్ని. ఆ అన్నే మొదట గేర్ లెస్ బండి నడపడం నేర్పించాడు కూడా. ఒక్క రోజు కూడా పొరపాటున కూడా తప్పుగా అతను ప్రవర్తించలేదు. కాని చూడడానికి చాలా బండగా ఉండేవాడు. ఆ రోజుల్లో నాజూకు ప్రాంతపు వాళ్ళ కళ్ళకు అసలు ఆనేవాడు కాదు. కాని ఎంత రక్షణగా ఉండేదో అతని దగ్గర సైకిల్ నేర్చుకున్నన్ని రోజుల్లో నాకు. ఈ అన్న విచిత్రమైన పరిస్థితులలో హాస్పిటల్ లో చనిపోతే అతన్ని ఐడెంటిఫై చేయడానికి మా అన్నయ్యే వెళ్లవలసి వచ్చింది. ఆరోగ్యం బాలేదని ఎవరో అడ్మిట్ చేసి వెళ్ళారని తరువాత కొన్ని గంటలకే ఆయన మరణించాడని, అతని జేబులో చిన్న డైరీలో అన్నయ్య నంబర్ ఉందని అది చూసి హాస్పిటల్ స్టాఫ్ ఫోన్ చేసి ఎవరో వచ్చి ఐడెంటిఫై చేయమని అడిగితే అన్నయ్యే హాస్పిటల్ కి వెళ్ళాడని తరువాత ఏదో సందర్భంలో తెలిసింది. నాకు సైకిల్ నేర్పించాక ఆ అన్నని మా ఇంట్లో చూసిన గుర్తు మాత్రం నాకు లేదు. అన్నయ్య తో టచ్ లో ఉండేవాడేమో అదీ తెలీదు.

మా చెల్లెలికి డ్రైవింగ్ నేర్పించిన బజాజ్ చేతక్ స్కూటర్

క్వార్టర్స్ తరువాత మెట్టూగుడలో ఓ ప్రైవేట్ ఇంటికి మారాం. అప్పుడు నేను ఇంటర్ సెకెండియర్ కి వచ్చాను. ఓ రెండేళ్ళ తరువాత మా చెల్లెలు గేర్ ఉన్న బజాజ్ స్కూటర్ నేర్చుకుంది. వీధి మొదట్లోనూ, వీధి చివర్లోనూ ఈ అల్లరి చిల్లర పిల్లలని పేరు పడిన కొందరు మగపిల్లలుండేవారు. బండి స్టార్ట్ చేసి న్యూట్రల్ నుండి గేర్ లోకి మార్చి నేరుగా వెళ్ళి వాళ్ళ ముందు నుంచునేది తను. అ బండిని వాళ్ళు టర్న్ చేసి ఇచ్చేవాళ్ళూ. ఇక మళ్ళీ స్ట్రేట్ డ్రైవ్ చేసి అటు నిల్చున్న మగపిల్లల దగ్గరకు వెళ్ళి బండి ఆపేది అలా నేర్చుకుని తరువాత గేరున్న స్కూటర్ నడిపేది. నేనిప్పటికీ ఆ స్కూటర్ నడపలేను. తను మాత్రం అన్ని గేర్ స్కూటర్లు నడిపేది ఆ వీధిలోని పిల్లల సహాయంతో. అంత బాగా ఉండేవాళ్ళు ఆ మగపిల్లలంతా కూడా.

చాలా పాలిష్డ్ గా ఉన్నవారి మధ్యనే…

అడపిల్లలు మగవారితో కలిసిమెలిసి పెరుగుతున్నప్పుడు కొందరి దగ్గర ఒక రకమైన అసౌకర్యం అనుభవిస్తారు. ఈ శారీరిక చేష్టల గురించి ఆ వయసులో వారికి అవగాహన లేక పోయినా సహజంగా తమవైపు చూసే ఆకలి చూపులు, అసౌకర్యవంతమైన చర్యలు వారికి అర్ధం అవుతూనే ఉంటాయి. అయితే ఒక స్త్రీ గా ఈ అసౌకర్యాన్ని నేను అనుభవించింది చాలా పాలిష్డ్ గా ఉన్నవారి మధ్యనే అన్నది మాత్రం నిజం.

నేను చాలా కాన్పిడేంట్ గా ఉంటానని, మగవారిపట్ల ఒక కామ్రెడ్ షిప్ తోనే ప్రవర్తిస్తానని, ఆ ధైర్యం నాలో సహజంగా వచ్చిందని చాలా మంది అనుకుంటారు. కాని దానికి కారణం నా బాల్యంలో ఎటువంటి చెడు అనుభవాలు నాకు ఎదురు కాకపోవడం.

నేను చాలా కాన్పిడేంట్ గా ఉంటానని, మగవారిపట్ల ఒక కామ్రెడ్ షిప్ తోనే ప్రవర్తిస్తానని, ఆ ధైర్యం నాలో సహజంగా వచ్చిందని చాలా మంది అనుకుంటారు. కాని దానికి కారణం నా బాల్యంలో ఎటువంటి చెడు అనుభవాలు నాకు ఎదురు కాకపోవడం. మరి నేను పెరిగింది మెట్టుగుడ లాంటి ప్రాంతంలో రౌడీలని పేరు బడిన ఈ యువకుల మధ్య. వాళ్ళెందరి మధ్యలో ఏ స్థితిలో ఉన్నా నాకు వారు కనిపించినప్పుడు, ఏదో ఒక పని మీద వాళ్ళు ఇంటి ముందుకు వచ్చారని తెలిసినప్పుడు “అన్నా’ అని వెళ్ళిపోయి వాళ్ళతో మాట్లాడేదాన్ని. వాళ్ళు అంత సూటిగానే సమాధానం చెప్పి వెళ్ళిపోయేవాళ్ళూ. ఎప్పుడు ఒక తప్పు మాట కూడా మాట్లాడేవాళ్ళు కాదు. దీనికి మా కుటుంబంతో పరిచయం కారణమనో మా నాన్న, అన్నల పరపతి కారణమనో కొన్ని రోజులు దాకా అనుకున్న సందర్భాలు ఉన్నాయి. కాని మిగతా అనుభవాలు కొన్ని గుర్తుకువస్తే మాత్రం, మరి వాళ్ళ దగ్గర ఆ పరపతి ఎందుకు పనికి రాలేదు అని ఇప్పుడు ఆలోచిస్తాను.

ఎంత పాలిష్డ్ గా ఉన్నవాడు అంత ఎక్కువ అడ్వాంటేజ్ తీసుకునే ప్రయత్నం చేస్తాడని నాకు చాలా తొందరగానే అర్ధం అయింది. ఆ మెట్టుగుడలోని రౌడీ పిల్లలలోని ఓపెన్నెస్ తరువాత మహేంద్రా హిల్స్, బంజారా హిల్స్ లాంటి ప్రాంతంలో గొప్ప కారులు మెయింటేన్ చేసిన వాళ్ళ మధ్యన కూడా నేను అనుభవించలేకపోయాను. చాలా గార్డేడ్ గా ఉండాలని అనిపిస్తుంది వారితో మాట్లాడుతున్నప్పుడు, ఏ తెర లేకుండా నేను నేనుగా ఉన్నది, ఉండేది ఈ మెట్టుగుడ, లాలాగుడ వారితోనే అప్పట్లోనూ, ఇప్పటికి కూడా.

నల్ల రంగు ఆకారం, కళ్ళు ఎప్పుడు ఎర్రగ…

మెట్టుగుడలో శ్రీశైలం అని ఒక రౌడీ ఉండేవాడు. ఇతనికి ముత్యాలు అని ఒక తమ్ముడు ఉండేవాడు. వీరంటే చాలా మందికి భయం. నేను చిన్నప్పటి నుండి వారిని చూస్తూ ఉండేదాన్ని. ఈ ముత్యాలు నేను స్కూలులో టీచర్ గా ఉద్యోగం చేస్తున్నప్పుడు రైల్వే హాస్పిటల్ లో సైకిల్ స్టాండ్ కాంట్రాక్టుకు తీసుకుని అక్కడ కూర్చునే వాడు. చాలా పెద్ద శరీరం నల్ల రంగు ఆకారం, కళ్ళు ఎప్పుడు ఎర్రగా ఉండేవి. ఆ ఆకారం చూపి పిల్లలను భయపెట్టవచ్చు. నేను ఎదో ఒక కారణంతో రైల్వే హాస్పిటల్ కు తరుచుగా ఎవరో ఒకరి కోసం వెళ్ళేదాన్ని. సరాసరి అతని ముందు బండి ఆపి, అన్నా, ఇదుగో ఇక్కడ బండి పెట్టా చూసుకో అని ఆర్డర్ వేసి వెళ్ళిపోయేదాన్ని. నాతో వచ్చిన వాళ్ళూ అతన్ని చూసి కిక్కురు మనేవాళ్ళు కాదు. పైగా ఆయన్నిఅన్నా అని ఎలా పిలుస్తున్నావు. అంత ఘోరంగా ఉన్నాడు అని కామెంట్లు వేసేవాళ్ళూ. డబ్బులు ఇస్తే తీసుకునేవాడు. ఇవ్వకపోతే అడిగేవాడు కూడా కాదు. స్వచ్చంగా నవ్వేవాడు, నన్ను చూసి ఒక్క మాట కూడా మాట్లాడేవాడు కాదు.

వీళ్లకి వేష బాషల్లో నాజుకు తనం ఉంటే ఉండవచ్చు కాని ఒక పని చేస్తున్నప్పుడు ఉండవలసిన నిబద్దత లేదు. అది ఆ వేషంతోనూ ఇంగ్లీషు ఉచ్చారణతోనూ వస్తుందా.

నిజం చెప్పాలంటే తనకై తాను ఎవరితోనన్నా గొడవ పడగా అక్కడ నేను చూడలేదు. కాని రౌడి అనే పేరుతో అతన్నిచూసి చాలా భయపడేవాళ్ళంతా. ఎవరన్నా నా బండి ముట్టుకోవాలన్నా, దానిపై కూర్చున్నా ఓ చూపు చూసేవాడు. ఇప్పుడు అతను లేడు. సిటీలో ఇప్పుడు ఎక్కడ పార్కింగ్ లో బండి పెడుతున్నాఅక్కడ రిసిప్ట్ తీసుకుని నాజూకుగా మాట్లడే ఆ పిల్లలు తరువాత ఏదో కారణంతో బండి నేను వచ్చే లోపల అక్కడి నుండి జరిపి, గీతలు పడేలా లాగి పడేసి మళ్ళీ స్టైలిష్ గా నవ్వే ఈ ఆధునిక ఫాస్ట్ జనరేషణ్ ని చూస్తున్నప్పుడు ఆ ముత్యాలు గుర్తుకు వస్తాడు. వీళ్లకి వేష బాషల్లో నాజుకు తనం ఉంటే ఉండవచ్చు కాని ఒక పని చేస్తున్నప్పుడు ఉండవలసిన నిబద్దత లేదు. అది ఆ వేషంతోనూ ఇంగ్లీషు ఉచ్చారణతోనూ వస్తుందా.

‘ఓయ్… ఇది నా దగ్గర సాగదు’ అంటే చాలు…

ఉద్యోగంలో చేరాక ఆడ మగ కలిసి పని చేయవలసిన పరిస్థితులు చాలా ఉంటాయి. అందులో నేను చాలా ఎక్స్ట్రా ఆక్టివిటీస్ లో ఉండేదాన్ని. ఆ పీ.హెచ్.డీ ల దగ్గర పని చేస్తూ కొన్ని సందర్భాలలో వారి వెకిలి మాటలు చేష్టలకు రియాక్ట్ అవుతూ నాకు ఆ అశోక్ అన్న, ముత్యాలు, మీనయ్య అంకుల్, పిండి గిర్నీ శంకర్ వీళ్ళంతా గుర్తుకు వస్తారు. వీళ్ళకు భాషరాదు, లేటెస్ట్ దుస్తులు వేసుకోలేదు, పక్కా తెలంగాణ యాసతో ఒకింత నంగి నంగిగా మాట్లాడేవాళ్ళు (ఎక్కువగా తాగేవాళ్ళు కాబట్టి) కాని వారి దగ్గర నేను పొందిన భద్రత నా కులంలో, నా మనుషులు అనే వారి మధ్యన కూడా నేను పొందని సందర్భాలు నా జీవితంలో ఉన్నాయని చెప్పుకోవడానికి నేను బాధపడట్లేదు. అందుకే వేష బాషల బట్టి నేను మనుషులని ఎప్పటికీ ఎంచలేను.

నేను ఇప్పటికీ ఈ రౌడీలుగా కనిపించే వారితో చాలా కూల్ గా ఏ దాపరికం లేకుండా చెప్పాలనుకున్నది చెప్పగలను. విద్యాధికులం అనుకునే వారి మధ్యకు వెళ్తున్నప్పుడే ఒత్తిడికి గురవుతాను.

ఈ ఆర్ధికంగా తక్కువ వర్గం వారిలో ఓ స్త్రీ పట్ల ఎటువంటి ఆకర్షణ కలిగినా వారు అది బైటికే ప్రకటిస్తారు. దీని వలన వీరి వద్ద ఎప్పుడు అసౌకర్యంగా ఉండవలసిన అవసరం స్త్రీలకు రాదు. ఇష్టం ఉంటే ఆ బంధం ముందుకు సాగుతుంది లేదా ‘ఓయ్… ఇది నా దగ్గర సాగదు’ అంటే సరే అని అదే నవ్వుతో మామూలుగా ఉండిపోతారు. కాని ఈ చదువుకున్న నాజూకు వర్గం పైకి మాట్లాడేది ఒకటి, లోపల భావం ఇంకోటి ఇక అవసరం అవకాశం వస్తె వారి ప్రవర్తన మరోలా ఉంటుంది.

నేను ఇప్పటికీ ఈ రౌడీలుగా కనిపించే వారితో చాలా కూల్ గా ఏ దాపరికం లేకుండా చెప్పాలనుకున్నది చెప్పగలను. విద్యాధికులం అనుకునే వారి మధ్యకు వెళ్తున్నప్పుడే ఒత్తిడికి గురవుతాను. చాలా సార్లు నా అవగాహన నిజం అని ఎన్నో ఉదంతాలు నిరూపించాయి కూడా.

నా అనుకున్న వాళ్ళు…

ఇరవై ఐదు సంవత్సరాలకి వితంతువు అని ముద్ర వేయించుకున్న తరువాత, అప్పుడు ప్రపంచంలో ఓ స్త్రీ పట్ల మనుషుల ప్రవర్తన ఎలా మారిపోతుందో ప్రత్యక్షంగా అనుభవించాను.

అందరితోనూ అన్ని ఈక్వేషన్లు మారిపోతాయి. కుటుంబంలోనూ, సమాజంలోనూ కూడా. అయినా నా పట్ల అదే విధమయిన ప్రేమతో, ఇష్టంతో ఈ రోజుకీ అలాగే ఉన్నది ఆ చదువురాని మెట్టుగుడ లాలాగుడా బస్తీ వాసులే. వారింటికి వెళితే తినే చికెన్ లో మంచి ముక్కలు ఏరి పెట్టేవాళ్ళూ. పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకు వెళితే అక్కా అని చిన్నవాళ్ళూ, వచ్చినావా అమ్మా అని పెద్దవాళ్ళూ ఆప్యాయంగా పలకరించడం, తరువాత రండి మేడమ్ అని నా స్టూడెంట్శ్ కుటుంబీకులు అభిమానంగా ఎదురు రావడం నేను అనుభవించాను.

నా ఇన్నేళ్ళ అనుభవంలో నేను నిజంగా అదరణ పొందింది, పొందుతుంది ఈ అతి సాధారణ ఔట్ కాస్ట్ ల నుండే.

మా లేదా నా అనుకున్న వాళ్ళు పెళ్ళి మంటపంలో వారి పిల్లల నెత్తిపై అక్షింతలు చల్లడానికి కూడా నేను పనికి రానని నాజుకుగా వారి భర్తలకు తెలియనివ్వకుండా నన్ను పక్కన పెడితే ఈ బస్తీ వాళ్ళు ఆప్యాయంగా నా చేతిని పట్టుకుని వారి పిల్లల పై అక్షింతలు చల్లించుకుంటారు. తేడా ఎక్కడుంది?

జెనరల్ మినహాయింపులు సరే సరి. కానీ మా ఆంద్రా ప్రాంతపు వారి మాటల్లో దీర్ఘాలు ఎక్కువగా ఉంటాయి. బళే నాజూకు మాటలు మాట్లాడతారు. అంతే నాజూకుగా విషపు బీజాలు కూడా మనసుల్లో నాటగలరు. కుటుంబంలో కూడా కొన్ని సందర్భాలలో ఈ ఒంటరి స్త్రీ అనే వివిక్షను ఎదుర్కున్నాను. అదీ చాలా నాజూకుగా. కాని ఈ అతి సాధారణ చదువులేని బండ జనం మధ్య అంతే స్థాయిలో ప్రేమను కూడా అనుభవించాను. ఒంటరి స్త్రీగా వివక్ష చూపిన వారు పైకి పలికే మాటలు, ప్రదర్శించే హేతువాదపు సిద్దాంతాలు, ముఖ్యంగా కుటుంబ స్త్రీలు చూపే ఆ రాజకీయం గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. నా ఇన్నేళ్ళ అనుభవంలో నేను నిజంగా అదరణ పొందింది, పొందుతుంది ఈ అతి సాధారణ ఔట్ కాస్ట్ ల నుండే.

నాజుకు మనుషులలూ …వీళ్ళూ…

మా కాలేజీ పిల్లలంటే నాకు అందుకే చాలా ప్రేమ. వీరికి పాలిష్డ్ గా మాట్లాడడం రాదు. రెండు రోజుల ముందు జరిగిన ఓ తాజా సంఘటన చెబుతాను. ఇప్పుడే ఇంటర్ రిజల్ట్లు వచ్చాయి కదా. మళ్ళీ పరీక్ష రాసే వాళ్ళకి ఆన్ లైన్ లో ఫీజు కట్టించుకుంటున్నారు. అది డెబిట్ కార్డ్ తో కట్టాలి. కొందరు ముస్లిం పిల్లలు డబ్బు కట్టడానికి వస్తారు. వీరికి ఇంట్లో గైడెన్స్ ఇచ్చే పెద్దలు ఉండరు. డబ్బు తీసుకుని వస్తారు. ఫీజ్ కౌంటర్లో కాష్ కాదు కార్డ్ కావాలని అడుగుతారు. నేరుగా నా దగ్గరకు వచ్చి “మేడం కార్డ్ దో” అని ఎందరున్నా సరే నా కార్డు కావాలని అడిగేస్తారు. ఎవరున్నా, నేనెక్కడున్నా వీళ్ళ మాట అలాగే ఉంటుంది. మళ్ళీ అంతే భయపడతారు కూడా. కాని వారి మాటల్లో ఒక అమాయకత్వం ఉంటుంది. మొన్నొక సారి నాదగ్గరకు బిలాల్ అన్న స్టూడేంట్ “ఆప్కా కార్డ్ దో మేడమ్… నీచే వాలోంకో దిఖానా హై” అని క్లాసులోకి చొచ్చుకు వచ్చి అడిగేస్తే నేను బిత్తరపోయాను. ఎందుకురా అంటే కార్డు లేని వాడివి మా టైము పాడు చెయడానికి కాకపోతే ఎందుకు వచ్చావురా అని వాడిని క్రింద ఆఫీసులో తిట్టారని అందుకని నా కార్డు తీసుకుని వాళ్ళ మొహం పై కొట్టి సమాధానం చెప్పాలనుకుంటున్నానని చెబితే ఆ భోళాతనానికి నవ్వు వచ్చింది.

ఎన్నో సార్లు గుడ్డిగా నా గది తాళాలిచ్చినా కూడా ఒక్క వస్తువు తీసుకోవడం కాని, పొరపాటున పర్సులో ఒక్క రూపాయి ముట్టటం కాని చేయలేదు వీళ్ళు. నా ఇరవై ఆరు సంవత్సరాల ఆధ్యాపక అనుభవంలో పర్సు ఎక్కడ అంటే అక్కడ నేను పెట్టగలిగింది కేవలం ఒకప్పుడు స్కూలు, ఇప్పుడు కాలేజీలో మాత్రమే. ఈ పిల్లలు చాలా మంది కళ్ళకు మాత్రం ఆనరు.

మా వాళ్ళంతా నాజుకు మనుషులలో చేరిపోయారు మరి. ఇప్పటికీ ఏ ఫంక్షణ్ కి పిలిచినా ఈ పాష్ వాళ్ళ మధ్యకు వెళ్ళడానికి రెండు సార్లు ఆలోచిస్తాను. అదే మా మెట్టుగూడ, లాలాగూడ వారయితే ఆలోచించవలసిన పనే లేదు.

మా అబ్బాయిని ఒక క్లాసు నుండి మరో క్లాసుకు తీసుకువెళ్ళాలంటే వాడి చిన్నప్పుడు సహయం చేసింది నా స్టూడెంట్శ్, ఇప్పటికీ ఏ అవసరం ఉన్నా పనికి వచ్చేది వీళ్ళే. నాన్నగారి తరంలోని వాళ్ళూ, అన్నయ్య వయసున్న వాళ్ళు ఈ బస్తీలో మాతో ఒకప్పుడు పరిచయం ఉన్న చాలా మంది ఇప్పుడు లేరు. వారి దగ్గర ఎంత దగ్గరితనం అనుభవించానో అది చుట్టాలమని చెప్పుకునే మా ఇంటిపేరున్న వారి మధ్యన కూడా ఏనాడు అనుభవించలేదు.

మా వాళ్ళంతా నాజుకు మనుషులలో చేరిపోయారు మరి. ఇప్పటికీ ఏ ఫంక్షణ్ కి పిలిచినా ఈ పాష్ వాళ్ళ మధ్యకు వెళ్ళడానికి రెండు సార్లు ఆలోచిస్తాను. అదే మా మెట్టుగూడ, లాలాగూడ వారయితే ఆలోచించవలసిన పనే లేదు. ఎందుకంటే వారు అతి సామాన్యులు. లోపల ఏం ఉందో అదే చెబుతారు, చూపిస్తారు. విధ్యాధికులు అంటే లోపలి కుల్లుని అందంగా అలంకరించి దాచుకునే వాళ్ళే అన్నది నేను ఎన్నో సార్లు అనుభవించిన వాస్తవం. మా కుటుంబంలో కూడా స్థాయి మార్పులు వచ్చాక పరిచయం అయిన చాలా మంది నాజూకు వ్యక్తులతో సమయం గడిపిన తరువాత నా ప్రపంచం వీరి ప్రపంచం ఒకటి కాదని మాత్రం ఖచ్చితంగా అవగాహన కొచ్చింది.

ఈ మధ్య ఏర్పడిన కొత్త సంబంధాలు, కొత్త అనుబంధాలు నా బీ.పీని విపరీతంగా పెంచేస్తే ఆరోగ్యం కోసం మౌనవ్రతం పాటించడం నేర్చుకుంటున్నాను.

రిచర్డ్ ఒక నిశ్శబ్ద అమాయకమైన పాట!

నేను పని చేసిన రైల్వే మిక్స్డ్ హై స్కూల్ లో నేను జాయిన్ అవక ముందు ఒక ఆయా ఉండేది. ఆమె చిన్న కొడుకు రిచర్డ్ మతి లేకుండా పుట్టాడు. తల్లితో ఆ స్కూల్ లోనే తిరిగే వాడు. ఆమె రిటైర్ అయిన తరువాత తన పెన్షన్ ఈ కొడుకు పేరున రాసి చనిపోయింది. ఆ పెన్షన్ వచ్చే రోజు అతని అక్క రిచర్డ్ ని ఇంటికి తీసుకుని వెళ్ళి ఆ రోజు కడుపు నిండా తిండి పెట్టి స్నానం చేయించి ఆ డబ్బులు తీసేసుకునేది. ఇక తరువాత వాడి మొహం చూసేదే కాదు. రిచర్డ్ మాత్రం ఎప్పుడు స్కూల్ లో పిలల్ల మధ్య ఉండేవాడు. పిల్లలు కూడా అతనికి అలవాటు పడిపోయేవారు. ఒక సారి ఏదో ఇన్శురెన్స్ డబ్బులు రిచర్డ్ పేరునే వచ్చాయి. నీ కిష్టమైనది కొనిస్తాం సంతకం పెట్టు అని కాగితాల పై సంతకం పెట్టించుకుని ఆ అక్క వాడికి ఓ చిన్న ట్రాన్సిస్టర్ కొచ్చింది. ఆ డబ్బు మాత్రం వాళ్ళు తీసేసుకున్నారు. మతి లేని వాడికి డబ్బు యావ ఉండదు కదా. వాడికి ఆ ట్రాన్సిస్టర్ అంటే ప్రాణం. అది ఆన్ చేసుకుని పాటలు వింటూ స్కూల్ లో చెట్ల మధ్యన పిల్లలు ఆడుకుంటూ ఉంటే చూస్తూ తన రోజులు గడిపేవాడు రిచర్డ్.

ఆ ఒక్క క్షణం ఆత్మీయత ముందు…

93 నుండి నా కష్టకాలం మొదలయింది. దాన్ని జ్ఞాన కాలం అనాలని ఈ మధ్యే అర్ధం అయ్యింది. 97 లో  అది చాలా పీక్ లో కి వెళ్ళింది. అప్పుడు ఒకో సారి ఒకో మూడ్ లో స్కూల్ కి వెళ్ళిదాన్ని. కాని నేను కట్టే చీరలు, పెట్టే నగల మాటున ఎవరికీ నా స్థితి అర్ధం అయే చాన్స్ ఉండేది కాదు.

అందరూ పిచ్చివాడనుకున్న ఈ రిచర్డ్ మాత్రం ప్రొద్దుటి నుండి నేను బాలేనని నా చుట్టూ తిరుగుతూ చివరకు “ఇలా ఉండకు టీచర్” అని చెప్పి వాడి ట్రాన్సిస్టర్ లోనించి ఓ పాట వినిపించి వెళ్ళిపోయాడు.

ఒక రోజు రాత్రి బాగా ఏడ్చి, తెల్లారి స్కూలికి పట్టు చీర కట్టుకుని మరీ వెళ్ళాను. ఏదో ఆక్టివిటీకి స్టాప్ అంటా చాలా పని చేస్తున్నాం. నాతో కలిసి చాలా మంది అతి దగ్గరగా కుర్చుని పని చేస్తున్నారు. రిచర్డ్ అప్పటికి నాలుగు సార్లు నా చుట్టూ తిరిగాడు, చూస్తూనే ఉన్నా. కాని వాడికి ఇది మామూలే అని నేను వాడ్ని అస్సలు పలకరించలేదు. ఈ లోపు లంచ్ అయింది. అప్పట్లో స్కూల్ లైబ్రరి నేనే చూసేదాన్ని కూడా. ఆ రూంలో అన్నం తినాలని కారియర్ విప్పుకుని కూర్చుని కాసేపు కళ్ళు మూసుకున్నాను. మెల్లిగా రిచర్డ్ వచ్చి నా పక్కన నిలబడ్డాడు. వాడి ట్రాన్సిస్ట్రర్ నుండి ఏదో పాత తెలుగు పాట వినిపిస్తుంది. ఏంటిరా అంటే వాడి మొహం నా మొహంలోకి పెట్టి చూస్తూ “టీచర్… ఈ రోజు నువ్వు అస్సలు బాలేవు. ఒక్కసారి కూడా నవ్వలేదు. ఏం అయింది. ఏడ్చినావా” అని వాడు అడుగుతే బిత్తరపోయా.

ఎవరూ కనిపెట్టని ఆ తేడాని ఆ మతిలేని వాడెలా కనుక్కున్నాడొ మరి. ఇతరులు ఒకవేళ కనిపెట్టినా అడగాలనే ప్రయత్నం మాత్రం చేయలేదు. అందరూ పిచ్చివాడనుకున్న ఈ రిచర్డ్ మాత్రం ప్రొద్దుటి నుండి నేను బాలేనని నా చుట్టూ తిరుగుతూ చివరకు “ఇలా ఉండకు టీచర్” అని చెప్పి వాడి ట్రాన్సిస్టర్ లోనించి ఓ పాట వినిపించి వెళ్ళిపోయాడు. వాడు చూపిన ఆ ఆత్మీయత విద్యాధికులమనుకునే వారి నుండి నాకు దొరకలేదు మరి.

ఈ రిచర్డ్ తరువాత లాలాపేట బ్రిడ్జి క్రింద కనిపించే రైల్వే ట్రాక్ పై ట్రైన్ కొట్టేస్తే మరణించాడు. మతి లేని వాని మరణం అంత ప్రాముఖ్యత సంతరించుకోదు కదా. అతన్ని ఎవరూ మిస్ అవలేదు. కాని ఇప్పటికీ రిచర్డ్ నాకు గుర్తుకు వస్తూనే ఉంటాడు. వారానికి ఒక్క సారి స్నానం చేసి ఎవరేది పెడితే అది తిని, నోటి నుండి సొంగ కారుతుంటే, ఓ చిన్న ట్రాన్సిస్టర్ లోనించి వచ్చే పాటలు వింటూ ఫిట్శ్ వస్తే ఎక్కడ పడితే అక్కడ పడిపోయి గిలగిల కొట్టుకుంటూ రోజులు నెట్టిన రిచర్డ్ దగ్గర నేను అనుభవించిన ఆ ఒక్క క్షణం ఆత్మీయత ముందు ఈ పైపై మెరుగులు అన్నీ డోల్లగా కనిపిస్తాయి.

జీవన సారాన్ని విడమర్చి చెప్పిన చిత్రం

పాల్ గాగిన్ అనే ఫ్రెంచ్ పెయింటర్ డబ్బుని, ఉద్యోగాన్ని, కుటుంబాన్ని, పేరుని, పరపతిని వదిలేసి తాహితీ అనే ఆదిమ వాసులు ఉండే ద్వీపంలో వెళ్ళిపోయి అక్కడే అడవి మనిషిలా బ్రతికి పెయింటింగ్లు వేసుకుంటూ కాలం గడిపాడని మీరూ చదివే ఉంటారు. ఇతను చనిపోయిన తరువాత అతని పెయింటింగ్లు కోట్లు గడించి మళ్ళీ అతని పాత కుటుంబానికి బోల్డు డబ్బు సంపాదించి పెట్టాయని తెలిసిందే. నాగరికతకు దూరంగా, నాగరికులు ఆటవీకులుగా ఎంచిన వ్యక్తుల పట్ల ఆయన జీవిత కాలంలో చూపిన మక్కువ నాకు చాలా ఇష్టం. ఈ నాగరికత, ఈ ప్రదర్శనలు, పై పై ప్రేమలు, అవసరం లేని మాటలు, పనికి రాని బంధాలు ఇవన్నీ నాకు ఇప్పుడు మరీ భారంగా అనిపిస్తున్నాయి. వీలయినంతగా వీటికి దూరంగా ఉండే ప్రయత్నమే చేస్తున్నాను. ఆ కృత్రిమ జీవితం అస్సలు నచ్చట్లేదు. అదే సహజమని నా చూట్టూ చాలా మంది భావించి జీవిస్తున్నా వారితో కలవలేకపోతున్నాను. అందుకే నాదనే ప్రపంచాన్ని ఏర్పాటు చేసుకుని అందులోనే బ్రతుకుతున్నాను. ఇదే నాకు చాలా ప్రశాంతంగా ఉంది.

గాగిన్ చిత్రం Where do we come from, what are we, where are we going నాకు చాలా ఇష్టం. ఈ మధ్య ఈ చిత్రం ఇంకా బాగా అర్ధం అవుతున్నట్లు అనిపిస్తుంది.

రచయిత్రి పి. జ్యోతి హిందీ ఉపన్యాసకులు. చక్కటి సమీక్షకురాలు. హైదరాబాద్ లో పుస్తకాల పట్ల అభిరుచి పెంచడంలో విశేషంగా కృషి చేస్తున్న spreading Lights నిర్వాహకురాలు కూడా. పుస్తకం, సినిమా తనకు రెండు కళ్ళు. ప్రపంచానికి గవాక్షాలు. తెలుపు కోసం రాస్తున్న ఈ శీర్షికలో తాను మొదటిసారిగా అంతర్ముఖంలోకి చూసుకుంటున్నారు. జీవితాన్నే పుస్తకంగా అనుభవాలనే చలన చిత్రంగా ఎంచి సరళమూ, నిరాడంబరమూ, సామాన్యమూ ఐన జ్ఞాపకాలను ఆత్మీయంగా పంచుకుంటున్నారు. ఈ శీర్షికలో మొదటి వ్యాసం మనసు పొరల్లో. రెండో వారం చిన్ననాటి చిరుతిళ్లు. మూడో వారం చిన్ననాటి సంగతులు. నాలుగో వారం పంచుకోవడంలో అనందం. ఐదో వారం ఒంగోలు గిత్తలు ….మా తాత. ఆరో వారం ‘చందమామ’తో మొదలు. మీరు చదువుతున్నది ఏడో వారం జ్ఞాపకాలు.

అన్నట్టు, ఇటీవలే వీరు రచించన దిలీప్ కుమార్ సినిమనసు పొరల్లోమాల సమగ్ర పరిచయ పుస్తకం కోసం ఈ లింక్ క్లిక్ చేసి తెప్పించుకోవచ్చు.

 

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article