Editorial

Wednesday, January 22, 2025
కాల‌మ్‌మనసు పొరల్లో : 'చందమామ'తో మొదలు – పి.జ్యోతి ధారావాహిక

మనసు పొరల్లో : ‘చందమామ’తో మొదలు – పి.జ్యోతి ధారావాహిక

“పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి శవాన్ని భుజాం పై దించుకుని నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు ఇలా అన్నాడు…. రాజా…”

ఇదే వాక్యంతో ‘చందమామ’లో ప్రతి నెలా ఓ కొత్త కథ వచ్చేది.

ఆ విక్రమార్కుడు వేసుకున్న ఎర్రరంగు కుర్తా కుచ్చెళ్ళు ఎగురుతూ భళే కళగా ఉండేది ఆ బొమ్మ.

ఒకరకంగా విక్రమార్కుడు – నా మొదటి హీరో.

…ఇలా బొమ్మలు, కథలతో మొదలైన  వ్యాసంగం తెలుపు కథనం ఈ వారం ‘మనసు పొరలు’.

పి.జ్యోతి

పుస్తక పఠనాన్ని యువతలో పెంపొందించాలనే ప్రయత్నాలు చాలా చోట్ల జరుగుతున్న నేటి పరిస్థితులలో పుస్తకాలతో నాకు జరిగిన పరిచయం గురించి కొన్ని విషయాలు ఇక్కడ పంచుకోవాలనిపిస్తోంది.

మా చిన్నతనంలో ముఖ్యంగా పుస్తకాలు చదవడం అలవాటు అవుతున్న రోజుల్లో…తెలుగు ఎవరో ప్రత్యేకంగా నేర్పించాలని, తెలుగింట తెలుగు చదవడం రాయడం రాని వాళ్ళు ఉంటారన్న అనుమానం కూడా ఎవరిలో ఉండేది కాదు.

ఇక, మా యింట్లో ఎవరికీ హిందీ రాదు కాబట్టి ఆ కొత్త భాష మేము నేర్చుకోవాలన్న కోరికతో ప్రధమ భాషగా హిందీ తీసుకోమన్నారు పెద్దలు. అందువలన ఆరవ తరగతిలో ప్రవేశపెట్టేన రెండవ భాష స్థానంలో తెలుగు అక్షరాలు దిద్దుకున్నాం. కాని ఇంటి నిండా ఉన్న పుస్తకాలతో అప్పటికే తెలుగు దానంతట అదే వచ్చింది. దీనికి పెద్దగా ఎవరం కష్టపదాల్సిన వసరం కలగలేదు. ముందు కూడబలుక్కుని అక్షరాలు నేర్చుకుని అవి వాక్యాలుగా మేమే చదివేసేవాళ్లం. ప్రత్యేకంగా కూర్చోబెట్టి ఎవరూ తెలుగు నేర్పించలేదు. స్కూలు విడిచాక చాలా సమయం ఉండేది. నాకే తెలియకుండా పుస్తకాలు చదవడం అలవాటుగా మారాక, ఇక తెలుగు నేర్చుకోవడం పెద్ద సమస్య అనిపించలేదు.

బొమ్మలు చిత్రకళ పట్ల… కథలేమో పఠనం పట్ల…

తెలుగు నేర్చుకోవడానికి సహాయపడిన ఓ గొప్ప పత్రిక విజయా వారి ‘చందమామ’ అనే చెప్పాలి. ప్రతి నెల వచ్చె ఈ పుస్తకం మాకు తెలుగు నేర్చుకోవడానికి ఎంతగానో ఉపకరించింది. అందులో వడ్డాది పాపయ్య గారి బొమ్మలు చిత్రకళ పట్ల మక్కువను, కథలేమో పఠనం పట్ల ఆసక్తికి కలిగించాయి. మా అమ్మ తన చెల్లిలిద్దరు కూడా స్కూలు మొహం చూడలేదు. మా యింటికి వచ్చేటప్పటికి కొద్దిగా అక్షరాలు వచ్చెమో మరి. మధ్యాహ్నం పూట ‘చందమామ’ పుస్తకం చదివి వినిపించి వారితో ఆ కథలు చదివిస్తూ మా అమ్మ వారికి తెలుగు నేర్పించడం నాకు గుర్తు. ‘చందమామ’ బాగా చదవడం వచ్చాక ఇక పత్రికలు, నవలలు వాళ్ళే చదువుకునేవారు. ‘చందమామ’తో పదవ తరగతి దాకా నేను ప్రయాణం చేసాను. చాలా పౌరాణిక కథలు నాకు చందమామ ద్వారానే పరిచయం. ఆ బొమ్మలు చూస్తూ అప్పట్లో గంటలు గంటలు గడిపేదాన్ని.

వడ్డాది పాపయ్య గారి బొమ్మలంటే ఎంత ఇష్టం అంటే అసలు రంగులలోని అందాలను చూడడం ఆ బొమ్మలతోనే నేర్చుకున్నాను.

ఇప్పటికీ మా యింటి ముందు పెద్ద సైజులో వడ్డాది పాపయ్య గారి బొమ్మను ప్రేం చేయించి పెట్టుకున్నాను. నాకు వారి తరువాతే వస్తారు బాపు ఇంక రాజా రవివర్మ మరియు ఇతర భారతీయ చిత్రకారులు.  అసలు బొమ్మ అంటే ఇలా ఉండాని అనిపిస్తూ ఓ ప్రత్యేక ప్రపంచంలోకి తీసుకు వేళ్ళేవి వడ్డాది పాపయ్య గారి చిత్రాలు. వీరి తరువాత అంత అభిమానించిన చిత్రాలు బాపు గారివి. బాపు గారి బొమ్మలతో పరిచయం కాలేజీ రోజుల్లో జరిగింది. అప్పటి దాకా వారిని పెద్దగా పట్టించుకునేదాన్ని కాదు. అప్పుడే రాజా రవివర్మ చిత్రాలతోనూ పరిచయం కలిగింది. ఇప్పటికీ ఆ ముగ్గురు గీసిన బొమ్మలు ప్రత్యేకంగా నేను ఇష్టపడే అందాలు. ఈ ముగ్గురి చిత్రాలు ఒరిజినల్స్ గా కాకపోయినా, కొన్ని ప్రింట్లను ఇంటి గోడలను అలంకరించుకోగలిగాన్నది నాకు ఈ జీవితంలో లభించిన గొప్ప తృప్తి.

బిస్కెట్ అంకుల్… బిస్కెట్ ఆంటీలు…

మా యింటికి దగ్గరగా ఓ చిన్న హనుమంతుని గుడి ఉండేది. ఈ గుడిని ప్రతి సంవత్సరం బాగు చేసి గుడికి మూడు వైపులా రంగులు వేసి గోడలపై బొమ్మలు చిత్రించడం ఓ అన్న చేస్తుండే వారు. ఆయన పేరు గుర్తులేదు. కాని ఆ కుటుంబంతో పరిచయం జరిగిన విధానం గురించి రాయాలి. చాలా చిన్నప్పుడు  ఇంట్లో గొడవ చేస్తుంటేనో మరింకే కారణంతోనో తెలీదు కాని నాకు కంచంలో అన్నం పెట్టుకుని మా నానమ్మ ఈ గుడి ప్రాంగణంలో వచ్చి అన్నం తినిపించేది. అప్పుడు అక్కడ చిన్న చిన్న ఇళ్లల్లో ఊండేవాళ్ళంతా అరుగులపై చెరేవాళ్ళు. వీరిలో ఓ అంకుల్ ఆంటీతో నాన్నమ్మకి పరిచయం అయింది. నానమ్మ చేతిలో ఉన్న నన్ను ఎత్తుకుని ఆ అంకుల్ ఇంటికి తీసుకువెళ్లి చిన్న చిన్న పుల్లటి బిస్కెట్లు ఇచ్చేవారు. అప్పటి నుండి ఆ క్వార్టర్స్ వదిలే దాకా ఆయన పేరు బిస్కెట్ అంకుల్. ఆయన భార్య బిస్కెట్ ఆంటీ. వీరుండే రెందు గదుల ఇంటికి నేను ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళిపోయేదాన్ని.

అన్న ఇంచుమించు ఇలాంటి చిత్రాలనే వేసేవాడు. చంద్రుడు తెల్లరంగులో నల్ల నీడలో కొబ్బరి చెట్లు

ఆ చిన్న ఇంట్లో మొదటి గదిలో చిన్న చిన్న అట్ట ముక్కలపై అందమైన చందమామ కొబ్బరి చెట్లను చిత్రించే వాడు వారి అబ్బాయి. ఇతన్నే ‘అన్నా’ అని పిలిచేదాన్ని. ఆయన పేరు నాకు ఎప్పటికీ తెలియలేదు.

నా జీవితంలో నేను చూసిన మొదటి పెయింటింగ్ ఎగ్జిబిషణ్ ఆ అన్న గదే.

ఈ అన్న ఎవరినీ తన గదిలోకి రానిచ్చేవాడు కాదు కాని, నన్ను మాత్రం తీసికెళ్ళి ఆ పెయింటింగ్లు చూపించేవాడు. నాకవన్నీ అద్భుతంగా అనిపించేవి. నా జీవితంలో నేను చూసిన మొదటి పెయింటింగ్ ఎగ్జిబిషణ్ ఆ అన్న గదే. అప్పటి నుండి నాకు కొబ్బరాకుల మధ్యనుండి తొంగి చూసే చంద్రుడంటే చాలా ఇష్టం. అందుకే కాస్త పెద్దయిన తరువాత టీవీ లో వచ్చే తెలుగు సినిమాలలో డ్యూయెట్లు ఇష్టపడేదాన్ని. ఆ చంద్రుడు అంత పెద్దగా ఆకాశంలో విహరిస్తూ ఆకుల మధ్య మెరుస్తూ తెలుగు సినిమాలలోనే కనిపించేవాడు.

చెరిగిపోని ముద్రల ఆరంభం

చిన్నపిల్లల మనసుపై పడిన ముద్రలు చెరిగిపోవు అంటారు కదా. ఇప్పటికీ నేను అందమైన దృశ్యాన్ని ఊహించుకోవాలంటే ఆ అన్న గీసిన చిత్రలలోని కొబ్బరి చెట్లు, వాటి మధ్య చంద్రుడు కళ్ళ ముందు కనిపిస్తారు. ప్రకృతితో మేళవించిన ఆ రంగుల మాయాజాలం ప్రభావం నాపై అలాగే ఉండిపోయింది. ఈ రోజుకీ ఆ అన్న నాకు ఆ చిన్న గదిలో అపురూపంగా ఆ పెయింటింగ్స్ చూపించడం నిన్న మొన్న జరిగినంత స్పష్టంగా గుర్తుండిపోయింది.

బిస్కెట్లు కావాలి అంటూ, ఆ ఇంటికి నాకు పదేళ్ళ వయసు వచ్చినప్పటి నుండి వెళ్ళలేదు, కాని ఆ కుటుంబంతో పరిచయం ఆ తరువాత కూడా కొన్నాళ్లు సాగింది. ఆ అన్న తరువాత రైల్వే లో పెయింటింగ్ జాబ్ లో చేరాడని నేను టీచర్ గా రైల్వే మిక్సడ్ హై స్కూల్లో చేరిన తరువాత ఏదో పని మీద అతను స్కూల్ కి వచ్చినప్పుడు తెలిసింది. ఇప్పుడు వాళ్ళేక్కడున్నారో మాత్రం తెలియదు.

మా గుడి ఇంచుమించు ఇలాగే ఉండేది కాని మూడు పక్కలా హనుమంతుని, రాముని బొమ్మలు ఉండేవి

ఆ అన్న ఆ చిన్న గుడి గోడలమీద మూడు వైపులా రాముని హనుమంతుని బొమ్మలు వేసేవాడు. ప్రతి సంవత్సరం బొమ్మలు మారుతుండేవి. ఈ బొమ్మలను ఆ ఇంట్లో మేము ఉన్నంతకాలం నేను జాగ్రత్తగా గమనించేదాన్ని. ఏ రంగు దేనికి వాడారో చూడడం చాలా ఇష్టంగా ఉండేది. పెయింటింగ్ల కాన్వాసు నాకు ఆ రోజుల్లో ఆ గుడి గోడలే. ఆ గోడలను ఎంతగా పరిక్షించేదాన్నంటే దేవుని విగ్రహం నాకు ఇప్పటికీ గుర్తు లేదు కాని ఆ పెయింటింగులు చాలా వరకు గుర్తు.

గుండెను చీల్చి చూపిస్తున్న హనుమంతుడు, సూర్యుడి వైపు ఎగురుతున్న హనుమంతుడు, రాముడు సీతా లక్ష్మణుడు ఎక్కువగా ఈ బొమ్మలే ఉండేవి….

గుండెను చీల్చి చూపిస్తున్న హనుమంతుడు, సూర్యుడి వైపు ఎగురుతున్న హనుమంతుడు, రాముడు సీతా లక్ష్మణుడు ఎక్కువగా ఈ బొమ్మలే ఉండేవి కాని ప్రతి సారి అవి కొత్త అందాలతో కనిపించేవి. ఆర్ట్ పై నాకు ఆసక్తి కలగడానికి కారణం ఆ అన్న వేసిన ఈ గోడ మీద బొమ్మలు. అతను దాచుకున్న చంద్రుడు, కొబ్బరి చెట్ల బొమ్మలు. నాకు ఓ చిన్న గీత గీయడం కూడా రాదు కాని పెయింటింగ్ లను ఇష్టపడడం, గొప్ప చిత్రాల గురించి తెలుసుకోవడం ఓ హబీగా మారడానికి ఆ ప్రభావమే కారణం.

విక్రమార్కుడు – నా మొదటి హీరో…

సరే మళ్ళీ ‘చందమామ’ పత్రిక దగ్గరకు వద్దాం.

ఈ పుస్తకం తెలుగునాట, తెలుగు పిల్లలకు చేసిన మేలు మర్చిపోలేనిది. పిల్లలలో అన్ని రకాల ఆసక్తులకు ఇది ప్రారంభంగా ఉండేది.

‘చందమామ’ కలర్ లో ఉంటే ఈ ‘బాలమిత్ర’ ఒక వింత రంగులో ఉండేది.

అప్పట్లొ ‘బాలమిత్ర’ అని మరో పత్రిక కూడా వచ్చేది. ప్రభావతి ఆంటి ఈ రెండు పత్రికలు తెప్పించేవారు. ‘చందమామ’ కలర్ లో ఉంటే ఈ ‘బాలమిత్ర’ ఒక వింత రంగులో ఉండేది. కాస్త ఎరుపు తెలుపు కాంబినేషన్ లో బొమ్మలు, పేజీలు ఉండేది. ‘చందమామ’లో నాకు బాగా నచ్చిన సీరీస్ విక్రం బేతాళుడి కథలు. “పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి శవాన్ని భుజాం పై దించుకుని నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు ఇలా అన్నాడు…. రాజా…” ఇదే వాక్యంతో ప్రతి నెల ఓ కొత్త కథ వచ్చేది. ఈ విక్రం బేతాళ బొమ్మ ఎంత బావుండేదో. ఆ విక్రమార్కుడు వేసుకున్న ఎర్రరంగు కుర్తా కుచ్చెళ్ళు ఎగురుతూ భళే కళగా ఉండేది ఆ బొమ్మ.

ఆ  నాలుగు మ్యాగజైన్లు…ఒక ప్రారంభం …

అప్పట్లో ఇంటికి ‘ఈనాడు’ పేపర్ వచ్చేది. దాంట్లో రెండవ పేజీ క్రింద కుడివైపున తెలుగులో కామిక్స్ లోని ఓ పేజి వచ్చేది. ఇది ఎంత మందికి గుర్తుందో నాకు తెలియదు కాని. ఈ పేజీ కోసం ఎదురు చూడడంలో ఓ మజా ఉండేది. పేపర్ రాగానే ఇంట్లో ఎవరికీ దొరకనీయకుండా ఈ పేజీని చదివి అప్పుడు అది మిగతావారికి ఇచ్చేదాన్ని. ఇక ఆ రోజు రాత్రి ఆ పేజిని చించుకుని దాచుకునే దాన్ని. నేను సేకరించిన మొదటి పుస్తకం ఈ పేపర్ కటింగ్ లో వచ్చే కామిక్స్.

ఒకే ఒక్క పేజి ఆ కామిక్ నుంచి తెలుగులో ప్రింట్ అయితే అది చదివి మరో పేజి కోసం మరుసటి రోజు ఎదురు చూడడంలో ఎంత ఉత్సాహం ఉండేదో. అప్పట్లో పేపర్ అంతా బ్లాక్ అండ్ వైట్ లో ఉండేది. నేను ఈ కామిక్ పేజ్ కోసం ఎన్నో సార్లు ఇంట్లో గొడవ పడేదాన్ని. ఆ పేజీ మిస్ అయినా, ఆ భాగం చినిగిపోయినా ఇక ఏడ్పులే.

అప్పటి పుస్తక వ్యాపకం ఎలా ఉండేదో చెబుతాను. ప్రతి ఇంట్లో అందరూ పుస్తకాలు చదివేవాళ్ళూ. మా నాన్నగారి కొలిగ్స్ మరో ముగ్గురు ఆ క్వార్టర్స్ లోనే ఉండేవాళ్ళూ. చివరి ఇంట్లో ప్రభావతి ఆంటీ ఆంధ్రభూమి పత్రిక తెప్పించేవారు. ఇక క్రింద ప్రకాశ రావంకుల్ ఇంట్లో ఆంద్ర సచిత్ర వార పత్రిక వచ్చేది. విజయ ఆంటి వాళ్ళు ఆంధ్ర జ్యోతి తెప్పించేవాళ్ళు, ఇక మా ఇంట్లో ఆంధ్ర ప్రభ వచ్చేది.

ఈ నాలుగు మ్యాగజైన్లు ఇంట్లో పెద్దవాళ్లతో పాటు నేనూ ఫాలో అయేదాన్ని. ముందు అందులో వచ్చే జోక్సు, సినిమా బొమ్మలు, సినిమా కబుర్లు చదివేదాన్ని, క్రమంగా ఇది సీరియల్ల దాకా పాకింది.

సెవెంత్ క్లాసులో అనుకుంటా ఓ రోజు రాత్రందరూ నిద్రపోయిన తరువాత లేచి కూచుని చిన్న బెడ్ లైట్ వెలుగులో యద్దనపూడి సులోచనారాణి నవల ‘శ్వేత గులాబి’ పూర్తి చేయడం గుర్తు.

ఇవి కాకుండా మెట్టుగుడ లోని ఓ లైబ్రరీ నుంచి నెలకు రెండు నవల్స్ ప్రభావతి ఆంటి వెళ్లి తీసుకువచ్చేది. ఈ నవలలన్నీ కూడా గ్రీన్ కలర్ బౌండ్ అట్టతో ఉండేవి. ఐదు ఆరు క్లాసుల్లో చదువుతున్నప్పుడే అంటే క్లాసులో ఇంకా తెలుగు అక్షరాలు మొదలవనప్పుడే ఈ నవలల కోసం లైబ్రరీకి వెళుతూ అక్కడ కూర్చుని పుస్తకాలు తిరగేస్తూ తెలుగు నేర్చుకున్నాను.

ఇంగ్లీషులో నేను చదివిన మొదటి పుస్తకం

ఇక ఏడో తరగతికి వచ్చేసరికి టెక్స్ట్ బుక్స్ మధ్యన నవలలు పెట్టుకుని చదవడం అలవాటయిపోయింది. సెవెంత్ క్లాసులో అనుకుంటా ఓ రోజు రాత్రందరూ నిద్రపోయిన తరువాత లేచి కూచుని చిన్న బెడ్ లైట్ వెలుగులో యద్దనపూడి సులోచనారాణి నవల ‘శ్వేత గులాబి’ పూర్తి చేయడం గుర్తు. ఆ నవల పేరు అలా ఇంప్రింట్ అయిపోయింది. నవలలో కథ మాత్రం గుర్తులేదు.

ఇంగ్లీషులో నేను చదివిన మొదటి పుస్తకం నాకు గుర్తున్నది Bright Red Star అనే కథ. గ్రే కలర్ అట్టపై తెల్ల రంగులో ఓ అబ్బాయి బొమ్మ, అతని చేతిలో మెరుస్తున్న ఎర్ర నక్షత్రం. దీని రచయిత పేరు గుర్తులేదు కాని రష్యన్ విప్లవ నేపద్యంలో వచ్చిన ఓ బాలల పుస్తకం ఇది అన్నది గుర్తు.

మొదటి ఇంటలెక్చువల్ బుక్…

ఇక నేను చూసి దడుచుకున్న అతి పెద్ద పుస్తకం ఇంగ్లీషులో IAM OK YOU ARE OK. యెల్లో రంగు అట్ట మీద నల్ల అక్షరాలు ఉన్న అట్ట ఉంటుంది దానికి. అంతవరకే గుర్తు. అది చదివే సీన్ నాకు అప్పట్లో లేదు. ఆ పుస్తకాన్ని నేను చదవలేదు. కాని ఈ పుస్తకం నాకు సంబంధించిన ఓ పాత ఫోటోలో నేను పట్టుకుని ఉన్నట్లు గుర్తు. చాలా సార్లు అప్పట్లో ఈ పుస్తకాన్ని చేతుల్లో తీసుకునేదాన్ని. కాని ఎందుకో మరి ఇప్పటి దాకా కూడా ఈ పుస్తకం నాకు గుర్తుకు రాలేదు. ఇప్పుడు రచయిత పేరు కనుక్కుని చదవాలి. హై స్కూల్ లో స్కూల్ లైబ్రరీ నుండి హార్డి బాయిస్ నవలలు ఇష్టపడి చదివేదాన్ని.

నేను ఇంగ్లీషులో చదివిన మొట్టమొదటి క్రైం ఫిక్షన్ ఇదే. ఇంట్లో ఈ నవలలు చదివి చర్చించుకోవడం జరిగేది. మా అమ్మతో పాటు అప్పుడు అందరూ యద్దనపూడి సులోచనారాణి ఫాన్స్, ఆమె సీరియల్ ఉందంటే ఆ పత్రిక తొందరగా ఇంటికి వచ్చేది కాదు. పట్టు చీరల మధ్య ఈ మాగజీన్లు దాచిపెట్టేవాళ్ళూ. ఇంట్లో ఎవరూ లేనప్పుడు చూసి చదివేయాలని.

ఆత్రంగా చదవడం వల్లే ఫాస్ట్ రీడర్ నయ్యా!

అమర్ చిత్ర కథ సీరిస్ లో వచ్చే కామిక్స్. పై నున్న ఆ లోగో అంటే నాకు చాలా ఇష్టంగా ఉండేది.

హై స్కూల్ కి వచ్చాక మార్కెట్ లోకి అమర్ చిత్ర కథ అనే సీరిస్ తో కామిక్స్ వచ్చేవి. ఒకో కామిక్ ఐదు రూపాయలు ఉండేది. ఈ కామిక్స్ కొనే స్థోమత మాకు లేదు అనే అనుకుంటాను. ఎప్పుడూ కొనలేదు. కాని అమర్ చిత్ర కథ పేరుతో వచ్చిన ప్రతి కామిక్ నేను టెంత్ క్లాస్ అయిపోయేదాకా మార్కెట్లో వచ్చినవన్నీ చదివాను. నా క్లాస్ మేట్ రుక్మిణీ ఈ కామిక్స్ కొనేది. ఆమె కొన్న వెంటనే అది తీసుకుని నేను చదివేదాన్ని. కొన్ని సార్లు ఈ కామిక్ కోసం ఆమెకు హోం వర్క్ చేసి పెట్టినట్లు కూడా గుర్తు. భారతీయ పురాణాలు, చరిత్రలోని గొప్ప వ్యక్తులు, నాయకులు వీరందరు నాకు ఈ కామిక్స్ తోనే పరిచయం.

ఆ కామిక్స్ ఎంత బాగా గుర్తుండేవి అంటే చాలా విషయాలు ఇప్పటికీ కూడా ఆ కామిక్స్ లో చదివినవే గుర్తు పెట్టుకుని చెప్పడం నాకు అలవాటు. భక్త జయదేవ, తుకారాం, లాంటి భక్తులు, ఝాన్సి లక్ష్మీబాయి, రాణీ రూప్ మతి, ప్రిత్విరాజ్ చౌహాన్, రాణా ప్రతాప్, చంద్రగుప్త మౌర్య, హర్ష, లాంటి వారి గురించి ఇప్పటికీ నాకు గుర్తున్నది ఈ కామిక్స్ లో చదువుకున్న విషయాలే.

చిన్నప్పుడు ఆ పుస్తకం తిరిగి ఇచ్చేయాలనే ఆతురతతో ఓ రకమైన టెన్షన్తో పుస్తకాలను చదవడం అలవాటుగా ఉండేది. అ అలవాటే ఈ వేగంగా చదవడంలోకి మారిందనిపిస్తూ ఉంటుంది.

ప్రతి కామిక్ వెనుక ఆ పుస్తకాల లిస్ట్ ప్రింట్ అయి ఉండేది. అది చూసి చదవని పుస్తకాలను నోట్ చేసుకుని రుక్మిణీకి చెబితే ఆమె కొని వాటిని క్లాసుకు తీసుకువచ్చేది. ఇక అందరూ ఆటలలో మునిగిపోతే నేను ఈ పుస్తకం చదువుతూ ఉండేదాన్ని. నేను చాలా వేగంగా చదువుతానని చాలా మంది అంటారు. చిన్నప్పుడు ఆ పుస్తకం తిరిగి ఇచ్చేయాలనే ఆతురతతో ఓ రకమైన టెన్షన్తో పుస్తకాలను చదవడం అలవాటుగా ఉండేది. అ అలవాటే ఈ వేగంగా చదవడంలోకి మారిందనిపిస్తూ ఉంటుంది. చందమామ చదివి త్వరగా తిరిగి ఇచ్చేయాలి. మాగజీన్ ఎవరూ చూడకుండా త్వరగా చదివేసి మరో ఇంట్లో ఇచ్చేయాలి. రోడ్డు మధ్య, బస్ స్టాపుల్లో కూర్చుని త్వరగా తిరిగి ఇచ్చేయాలి… ఇలాంటి టెన్షన్స్ తోనే చదవుతూ ఉండేదాన్ని.

రంగనాయకమ్మ గారిని అలా కలిశాను!

మా అన్నకు అప్పట్లో ప్రసాద్ అని ఓ స్నేహితుడు ఉండేవాడు. ఈయన గొప్ప ధనవంతుల కుటుంబానికి చెందినవాడని అందరూ అనుకునేవారు. ఎక్కువగా మాట్లాడేవాడు కాదు కాని ఎప్పుడు మాట్లాడినా పుస్తకాల గురించే చెప్పేవాడు. ఆయన రంగనాయకమ్మ గారి భక్తుడు. అమ్మతో ఎప్పుడు మాట్లాడినా ఆమె గురించే మాట్లాడేవాడు. ఆ పేరు నా మెదడులో ఎంతగా ఇంకిపోయిందంటే, నేను కైనటిక్ హోండా కొనుక్కున్న రోజుల్లో స్కూల్లో టీచర్ గా పని చేస్తున్నప్పుడు నాకై నేను ఎవరికీ చెప్పకుండా దూరాలు ప్రయాణించే స్వేచ్చ వచ్చాక నవోదయ బుక్ హౌస్ లోని కోటేశ్వరరావు గారి వద్ద రంగనాయకమ్మగారి ఫోన్ నంబర్ సంపాదించి ఆమెకు ఫోన్ చేసి ఆమె అడ్రస్సు కనుక్కుని వారింటికి వెళ్ళాను. దుర్గం చెరువు దగ్గర ఆమె ఇల్లు వెతుక్కుంటూ వెళ్లి ఆమెని కలిసి ఆవిడ పెట్టిన పచ్చికొబ్బరి బెల్లం తిని ఇంటికి వచ్చాను.

ప్రసాద్ గారి నోట ఆమె మాట పదే పదే విని ఆవిడను కలవడమే మహాభాగ్యం అన్న అభిప్రాయం నా మనసులో ఉండిపోయిందని, అదే ఆ ప్రయాణానికి కారణం అని అనిపిస్తూ ఉంటుంది.

నేనేం మాట్లాడానో, ఆమె ఏం అడిగారో ఏమో గుర్తు లేవు. కాసేపు ఆమె ముందు కూర్చోవడం కోసం అంత దూరం ఒంటరిగా ఎందుకు వెళ్ళానో కూడా అర్ధం కాదు. కాని ఆప్పట్లో ఆ ప్రసాద్ గారి నోట ఆమె మాట పదే పదే విని ఆవిడను కలవడమే మహాభాగ్యం అన్న అభిప్రాయం నా మనసులో ఉండిపోయిందని, అదే ఆ ప్రయాణానికి కారణం అని అనిపిస్తూ ఉంటుంది. తరువాత ఎందరో రచయిత్రులను కలిసినా, మాట్లాడినా వాళ్లంతా మామూలు వ్యకులుగా అనిపించారు కాని ఇప్పటికీ మరో సారి రంగనాయకమ్మ గారిని కలవాలన్నా ఏ బెదురు లేకుండా సాధ్యపడదని నాకు తెలుసు. ఆమె గురించి అంతగా విని ఉన్న ఆ చిన్నతనపు రోజుల ప్రభావం ఎప్పటికీ నాతో ఉండిపోయింది.

‘తెల్ల కాకులు’ …మరికొన్ని వార పత్రికలు…

ఇక రచయిత్రుల గురించి ఇంట్లో జరిగిన చర్చల గురించి చెప్పాలంటే ఓ రెండు సంఘటనలు గుర్తుకున్నాయి. మాదిరెడ్డి సులోచన అని ఇంకో రచయిత్రి ఉండేవారు. వీరి నవలలు కూడా దొంగతనంగా చదవడం గుర్తు. ఈమె తెల్లవారు జామున రాసుకునేవారంట. ఓ రోజు ప్రొద్దున్నే లేచి పొయ్యి వెలిగించబోయి అప్పటికే లీకైన గాస్ సిలెండర్ పేలి వీరు మరణించారు. ఆ న్యూస్ ఈనాడు పేపర్ లో వివరంగా ఇచ్చారు. అది నేనే స్వయంగా చదివి మా అమ్మకు చెప్పడం గుర్తు. ఆమె కిచెన్ లో పని వదిలేసి పరుగెత్తుకుంటూ వచ్చే ఎంత బాధపడిపోయారొ! ఆ రోజంతా ఆమె గురించే ఇంట్లో చర్చ.

ఇక కొంత పెద్దయిన తరువాత యండమూరి వీరేంద్రనాద్ కు సంబంధించిన ఓ అభిమాని ఉరి వేసుకుని చనిపోయిన సంఘటన ఓ పెద్ద హాట్ టాపిక్. ఆ చనిపోయిన అమ్మాయి పేరు కూడా జ్యోతి అవడం కారణంగా ఈ సంఘటన కూడా ఇంట్లో చర్చించుకోవడం చాలా బాగా గుర్తు నాకు.

ప్రోగ్రెసివ్ భావజాలం ఉన్న వ్యక్తులు ఇంటికి వస్తూ పుస్తకాలను ప్రస్తావిస్తూ ఉండడం వలన ఎవరో ఈ పుస్తకం గురించి అమ్మకు చెప్పి ఉంటారు.

“తెల్ల కాకులు” అనే నవల కోసం మా అమ్మ నన్ను లైబ్రరీ అంతా వెతికిచ్చింది రోజులు గుర్తున్నాయి. ప్రతి సారి ‘తెల్ల కాకులు’ పుస్తకం తీసుకురా అని ఆమె చెప్పడం, అది దొరకకపోవడం, చివరకు ఓ మూడు సంవత్సరాల క్రితం అనుకుంటా మా సూర్యనారాయణ అంకుల్ ఇంట్లో దొరికీంది ఆ పుస్తకం. ఎన్నో సార్లు లైబ్రరీలో తెల్ల కాకుల కోసం వెతకడం వలన ఆ పుస్తకం పేరు గుర్తుండి పోయిది. అప్పట్లో ఆ రచయిత్రి పేరు కూడా అమ్మకు తెలియదు. పరిమళా సోమేశ్వర్ అనే రచయిత్రి ఆ నవల రాసారని ఆ పుస్తకాన్ని ఇటీవలే సంపాదించాక తెలిసింది. ప్రేమ వివాహాలు, కులాంతర వివాహాలను ప్రోత్సహిస్తూ రాసిన నవల అది. ప్రోగ్రెసివ్ భావజాలం ఉన్న వ్యక్తులు ఇంటికి వస్తూ పుస్తకాలను ప్రస్తావిస్తూ ఉండడం వలన ఎవరో ఈ పుస్తకం గురించి అమ్మకు చెప్పి ఉంటారు. దీని కోసం మెట్టుగుడ లోని ఆ చిన్న లైబ్రరీలోని ప్రతి పుస్తకాన్ని తెరిచి చూసి వెతికిన గుర్తు మాత్రం ఇంకా ఉంది.

‘ఆరు సారా కథల’ నుంచి ‘అమ్మ’ దాకా…

ఇప్పటికి ఓ మూడు వేల పుస్తకాల దాకా చదివి ఉంటాను. ఇవి నేను ఉద్యోగంలోకి వచ్చిన తరువాత నేను కట్టుకున్న లెక్కలు. కాని ఆలోచిస్తే ఈ పుస్తక పఠనం వెనుక నా చిన్నప్పటి వాతావరణ ప్రభావం ఉందని ఖచ్చితంగా అనిపిస్తుంది. చాలా పాత నవలల ప్రసక్తి వస్తే ఇవి స్కూలు రోజుల్లోనే చదివానన్నది గుర్తుకు వస్తుంది. కొన్ని అసలు అర్ధం అయేవి కావు కాని ఆ చదవడం బావుండేది. రావిశాస్త్రీ గారి ‘ఆరు సారా కథలు’ గ్రీన్ కలర్ అట్టపై ఎర్ర బాటిల్ల బొమ్మతో ఉండేది. అది నాకు ఓ ముక్క కూడా అర్ధం కాలేదు కాని పుస్తకం పేరు గుర్తుండి పోయింది.

ఇక మా మల్లయ్య అంకుల్ నాకు చదవమని హై స్కూల్ లో ఇచ్చిన తాపి ధర్మారావు ‘దేవాలయాలపై బూతు బొమ్మలెందుకు’ దొంగతనంగా చదివాను కొంత అర్ధం అయి కొంత కాకుండా.

పుస్తకం మొత్తం చదివాక లభించే ఒక వింత తృప్తి మాత్రం మొదటి సారి అనుభవించింది ఆ పుస్తకం తోటే.

ఎనిమిదవ తరగతిలో నేను చదివిన పెద్ద పుస్త్కం గోర్కీ ‘అమ్మ’. తెల్ల రెంగు బౌండ్ అట్టపై ఎర్ర రంగున్న చెట్టూ బొమ్మ. ఆ పుస్తకం చదవడానికి కారణం, ఇది టెస్ట్ బుక్స్లో పెట్టుకుని చదవవలసిన అవసరం లేకపోవడం. పెద్దగా అర్ధం కాలేదు. కాని పుస్తకం మొత్తం చదివాక లభించే ఒక వింత తృప్తి మాత్రం మొదటి సారి అనుభవించింది ఆ పుస్తకం తోటే.

ఎప్పటికీ ఆరాధన…

ఇంట్లో పార్టీ సాహిత్యం తప్పితే గోపీచంద్, తిలక్, బుచ్చిబాబు, అడవి బాపిరాజు, విశ్వనాధ, కొడవటిగంటీ కుటుంబరావు గార్ల సాహిత్యం ఉండేది కాదు. అందువలన మొన్న మొన్నటి దాకా కూడా ఈ రచయితలతో నాకు పరిచయం లేదు. కాలేజీకి వచ్చేసరికి ఇంగ్లీషు, ఆ తరువాత హిందీ వైపుకి మనసు మళ్ళింది. మళ్ళీ తెలుగు పుస్తకాలను సీరియస్ గా తీసుకున్నది రెండు దశాబ్దాల తరువాతే. హిందీ పరీక్షల కోసం చదువుతున్నప్పుడు పరిచయం అయ్యారు ‘ప్రేమ్ చంద్’ నేను ఎప్పటికీ ఆరాధించే ఏకైక రచయిత ఈయన.

కథ కున్న శక్తి ఏంటో నాకు పరిచయం చేసి సాహిత్యాన్ని సీరియస్ గా అధ్యయనం చేయాలనే తపనను కలిగించిన రచయిత మాత్రం హిందీ రచయిత ప్రేమ్ చంద్.

వీరి నేను చదవకపోయినట్లయితే సీరియస్ సాహిత్యం వైపుకు అస్సలు వచ్చేదాన్ని కాదు. డిగ్రీకి వచ్చేసరికే వీరి పుస్తకాలు గోదాన్, గబన్, కర్మభూమి, రంగ్ భూమి, నిర్మలా, సేవా సదన్, ప్రతిజ్ఞ లాంటి నవలలతో పాటు మాన్ సరోవర్ కథా సంకలనంలోని ఎనిమిది భాగాలూ పూర్తి చెయడం నేను సాధించిన గొప్ప పఠనా విజయం.

ఆ ఇద్దరు…

సాహితంలో ఇద్దరు వ్యక్తులను ఇప్పటికీ భక్తితో గుర్తు చెసుకుంటాను. ఒకరు హిందీ కవి కబీర్, రెండవ వారు ప్రేంచంద్.

ఒక వ్యక్తికి ఒకే ప్రాంగణంలో రెండు సమాధులుండడం కూడా ప్రపంచంలో మరో చోట కనిపించదేమో.

కబీర్ పై నాకు ఎంత భక్తి అంటే గోరఖ్పూర్ వెళ్ళినప్పుడు మగహర్ అనే ప్రదేశంలో వారి సమాధి ఉందని తెలుసుకుని వెళ్ళాను. అయితే ఏ హీందూ ముస్లింలను కలపాలని నిత్యం ఆయన పరితపించారో అదే జనం ఆయన మరణం తరువాత హిందూ పద్దతిలో ఓ సమాధి, ముస్లిం పద్దతిలో మరో సమాధిని ఒకే ప్రాంగణంలో కట్టి ఆయనకు పూజలు చేయడం చూడడం ప్రజల మూఢత్వాన్ని, మత మౌడ్యాన్ని, మూర్ఖత్వాన్ని నాకు పరిచయం చేసిన మొదటి సంఘటన.

ఆశ, కోరిక తగ్గి పుస్తకాలపై ప్రేమ!

ఇప్పుడు పుస్తకలను కొనడం ఓ అలవాటుగా మారిపోయింది. ప్రతి రోజు కనీసం ఓ వంద పేజీలు, మరీ బిజీగా ఉంటే ఓ యాభై పేజీలన్నా చదవకపోతే తోచనంతగా పుస్తక పఠనం నాకు వ్యసనంగా మారింది.

మనుష్యులపై ఆశ, కోరిక తగ్గిపోయి, పుస్తకాలపై ప్రేమ ఎక్కువవుతూ ఉంది.

మనుష్యులపై ఆశ, కోరిక తగ్గిపోయి, పుస్తకాలపై ప్రేమ ఎక్కువవుతూ ఉంది. ఒంటరితనాన్ని కోరి ఇష్టపూర్వకంగా ఆహ్వానించి జీవిస్తున్న ఈ సమయంలో నా బలం, ప్రేమ, ఆలంబన పుస్తకం తరువాత సినిమా. ఎందరో జీవితం నుంచి తప్పుకున్నా నాకు నిత్యం ఉత్సాహాన్ని, శక్తిని ఇస్తున్నవి పుస్తకాలే.

రచయిత్రి పి. జ్యోతి హిందీ ఉపన్యాసకులు. చక్కటి సమీక్షకురాలు. హైదరాబాద్ లో పుస్తకాల పట్ల అభిరుచి పెంచడంలో విశేషంగా కృషి చేస్తున్న spreading Lights నిర్వాహకురాలు కూడా. పుస్తకం, సినిమా తనకు రెండు కళ్ళు. ప్రపంచానికి గవాక్షాలు. తెలుపు కోసం రాస్తున్న ఈ శీర్షికలో తాను మొదటిసారిగా అంతర్ముఖంలోకి చూసుకుంటున్నారు. జీవితాన్నే పుస్తకంగా అనుభవాలనే చలన చిత్రంగా ఎంచి సరళమూ, నిరాడంబరమూ, సామాన్యమూ ఐన జ్ఞాపకాలను ఆత్మీయంగా పంచుకుంటున్నారు. ఈ శీర్షికలో మొదటి వ్యాసం మనసు పొరల్లో. రెండో వారం చిన్ననాటి చిరుతిళ్లు. మూడో వారం చిన్ననాటి సంగతులు. నాలుగో వారం పంచుకోవడంలో అనందం. ఐదో వారం ఒంగోలు గిత్తలు ….మా తాత. మీరు చదువుతున్నది ఆరో వారం జ్ఞాపకాలు.

అన్నట్టు, ఇటీవలే వీరు రచించన దిలీప్ కుమార్ సినిమనసు పొరల్లోమాల సమగ్ర పరిచయ పుస్తకం కోసం ఈ లింక్ క్లిక్ చేసి తెప్పించుకోవచ్చు.

More articles

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article