Editorial

Wednesday, January 22, 2025
ఆనందంమనసు పొరల్లో : పంచుకోవడంలో అనందం తెలుపు - పి.జ్యోతి కాల‌మ్‌

మనసు పొరల్లో : పంచుకోవడంలో అనందం తెలుపు – పి.జ్యోతి కాల‌మ్‌

rolu rokalu

నా గత కాలపు రోజుల్లో ఎన్నో పంచుకునే వాళ్లం. ఇచ్చి పుచ్చుకునే వాళ్ళం. తిండి, బట్ట, నీళ్ళూ. పని, ఆలోచనలు, అనుభవాలు, ఇవన్నీ కలిసి పంచుకోవడం ఏంతో సహజంగా జరిగేది. ఈ రోజుల్లో అన్ని రకాల సొకర్యాలు అనుభవిస్తున్నా ఆ పంచుకునే ఆనందం మాత్రం ఎక్కడా కనిపించట్లేదు. అందుకే ఆ పాత రోజులు మనసు పోరల్లోంచి గుర్తుకొస్తున్నాయ్.

పి.జ్యోతి

చిన్నతనపు జ్ఞాపకాలను ఇప్పటి జీవితంతో పోల్చి చూసుకుంటే ఒక విషయం ప్రతి సారి బాధిస్తూ ఉంటుంది. ఆ రోజులలో స్త్రీలు ఎక్కువ సమయం ఇంట్లో గడిపినప్పటికీ వారి జీవితంలో చాలా భాగం సామూహికంగా గడిచేది. ఏ మంచి కాని చెడు కాని నలుగురి మధ్యనే గడిచిపోయేది. ఇలా అప్పట్లో అందరి జీవితాలుండేవో లేదో నాకు తెలియదు కాని నా చిన్నతనపు రోజుల్లో చాలా సంగతులు అలాగే గడిచేవి. స్త్రీలు అనేక విషయాలు ఇతరులతో పంచుకోవడం, అందరూ కలిసి సమయాన్ని గడపడం జరిగేది. ఇప్పుడు చాలా మటుకు స్త్రీలు ఇళ్ళల్లో ఉండట్లేదు. గదులను దాటి మన జీవితాలు సమాజంలోకి చొచ్చుకు వచ్చాయి. కాని అప్పటి రోజులతో పోలిస్తే వ్యక్తిగతంగా ఇప్పుడే మనుష్యులు ఒకరితో ఒకరు దూరం అయినట్లు అనిపిస్తుంది. ఎవరికి వాళ్లం ఒంటరిగా జీవిస్తున్నాం. ఆ పంచుకోవడం, ఇచ్చిపుచ్చుకోవడం చాలా తక్కువ అయి పోయాయి. ఈ విషయంగా కొన్ని నా గతకాలపు జ్ఞాపకాలు చెప్తాను.

కుండలోని సంకటి ముద్ద

మా అమ్మ నాన్న గారిద్దరూ కూడా ఒంగోలు దగ్గర కొప్పోలు అనే ఊరికి చెందిన వాళ్ళు. ఆ ఊరిలో వారికి ఆవకాయ పచ్చడి అన్నది తెలియదు. మా అమ్మమ్మ వాళ్ల ఇంట్లో గోంగూర, చింతకాయ తప్ప మరో పచ్చడి వారికి తెలియదు. నేను హై స్కూలుకు వచ్చే దాకా టమాటా, కేబేజీ లాంటి కూరలు కూడా ఆ ఇంట్లో పెద్దవారికి తెలియవు. ఇప్పుడు అన్ని ప్రాంతల వాళ్ళకి అన్ని రకాల పచ్చళ్ళూ తెలుసు కాని ఆవకాయ తెలియని ఇల్లు అప్పట్లో మా తాతగారిది. పెద్ద కుండలో చింతకాయలు, గొంగూర ఉప్పూ కారంలో దంచి పెట్టుకునేవాళ్ళు. రాత్రి పూట జొన్నలు దంచి ఆ పిండిని ఓ బట్టలో మూట కట్టి పెట్టుకుని పడుకునేవారు. ప్రొద్దున్నే లేచి ఆ పిండి ఒండేవాళ్ళూ. అది జొన్న సంకటి. మేం ఆ ఊరెళ్ళిన రోజుల్లో ప్రొద్దునే అ జొన్న సంకటి ముద్ద పెద్ద అంచున్న పళ్ళేలలో వేసి ఇచ్చేవారు.

ఇంత పాష్ గా ప్లేట్ లో తినేవాళ్ళు కాదు. కాని కాస్త సంకటి గట్టిగా ఒక పెద్ద కంచంలో పెట్టి ఇచ్చేవారు

ఆ ముద్ద మధ్యన చిన్నగా గుంట చేసి అందులో వెన్నపూస వేసే వాళ్ళు. సంకటి వేడికి అది కరిగేది. పక్కన గోంగూర పచ్చడి ముద్ద. దానితో పాటు పప్పు చారు. చారుకు పోపు పెట్టి అప్పుడు ఇంట్లో ఉన్న కరివేపాకు చెట్టు నుండి ఆకు కోసుకొచ్చి వేసేవాళ్ళు. ఆ వంట చేసే పద్దతి చూడడం నాకు చాలా ఇష్టంగా ఉండేది. పళ్ళేల్లు పట్టుకుని నుంఛుంటే కుండలోనించి సంకటిని ముద్దగా తీసి వేసేవాళ్ళు అందరికి. ఇక బియ్యం… నేను హై స్కూలుకు వచ్చే దాకా ఆ ఇంట్లో ఎర్రగానే ఉండేవి. ఆ అన్నం తినడం కష్టం అని మా కోసం తెల్ల బియ్యపు అన్నం వండేవాళ్ళూ. కాని ఎక్కువగా అందరూ ఎర్ర బియ్యపు అన్నమే తినేవాళ్ళూ. ఇక కూరలంటే దోసకాయ, సొరకాయ, పొట్లకాయ, బీరకాయ. ఎప్పుడన్నా వంకాయ. సంక్రాంతి పండగకు వంకాయ కూర స్పెషల్ గా చేసేవారంటే, ఆ కాయగూర ఎంత అపురూపమో చూడండి. ఇప్పటికీ సంక్రాంతికి ఇంట్లో వంకాయ కూర చేసుకోవడం అలవాటు. ఈ తిండి తిని మా తాతగారు నూరు సంవత్సరాలపైగా బ్రతికితే మా అమ్మమ్మ లిద్దరూ తొంభై ఏళ్ళ దాకా జీవించారు. ఇంట్లో ఎవరికీ బీపీలు షుగర్లు లేవు. అమ్మ వాళ్ల తరానికి కూడా డెభ్భై ఏళ్లు వచ్చేదాకా బీ పీ లేదు.

మూడు అడుగుల రోలు, రోకళ్ళూ…

rolu rokalu

రాత్రి పొలం నుండి వచ్చి వేన్నీళ్ళ స్నానం చేసి అన్నం తిని అప్పుడు రోకళ్ళూ తీసేవాళ్ళూ ఊరిలో. చాలా పెద్ద రోళ్ళూ ప్రతి ఇంట్లో ఉండేవి. మా ఇంట్లో మూడు అడుగుల రోలు ఉన్నట్లు గుర్తు. రోకళ్ళు చాలా పొడవుగా ఉండేవి.

 ఆ రోళ్ళతో ఆడవాళ్ళూ కలిసి పిండి దంచుతుంటే వచ్చే చప్పుళ్ళూ చాలా రిధమిక్ గా ఉండేవి.

ఇక సాయంత్రం చుట్టు పక్కల ఆడవాళ్ళు కూడా కలిసి పోటు వేయడంలో సహాయం చేసే వాళ్ళూ. మినిమం ముగ్గురు ఆడవాళ్ళూ రోటి చుట్టూ నిలబడి పోటు వేసేవాళ్ళూ. ఒకరి రోకలి మరొకరికి తగిలేది కాదు. అప్పుడే కబుర్లు చెప్పుకునే వాళ్ళూ. కష్టపడుతున్నట్లు కాక ఏదో సరదా కబుర్లు చెప్పుకున్నంత హాయిగా ఉండేది. సంక్రాంతి సమయంలో అరిసెల పిండికి ఇలాగే పోటు వేసుకుని ప్రతి ఇంటివాళ్ళూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ పని చేసుకునే వాళ్ళూ. నేను కాలేజి చదువు పూర్తి చేసుకునేదాకా ఇంచు మించు ఇలాంటి వాతావరణమే ఉండేది. ఆ రోళ్ళతో ఆడవాళ్ళూ కలిసి పిండి దంచుతుంటే వచ్చే చప్పుళ్ళూ చాలా రిధమిక్ గా ఉండేవి.

నేను ఇంటర్ లో ఉండగా తాతగారు చనిపోయారు. ఆయన ఊరంతటికీ పెద్దవారు. వారి పెద్ద దినం రోజున ఊరివాళ్లంతా కలిసి వంట చేయడం నాకింకా గుర్తు ఉంది. ఆడవాళ్ళు కూరలు కోయడం, పప్పులు శుభ్రం చేయడం లాంటి పనులు చేస్తే మగవారు పెద్ద గాడి పొయ్యిలు తవ్వి, చాలా పెద్ద గిన్నెలలో వంట చేసారు. వడ్డించడం దగ్గర నుండి ప్రతి పని ఊరి వాళ్ళంతా పంచుకుని చేసారు. అదే ఆఖరి ఊరి బంతి అనుకుంటా. అంటే ఊరిలో అందరూ కలిసి వండుకున్న అతి ముఖ్యమైన దినం.

సామూహికం – ఆత్మీయం

ఊరందరి భోజనానికి మగవారు ఇలా గాడి పొయ్యిలు తవ్వి వంట చేసేవారు

ఇప్పుడు ఆ ఊరిలోనూ కేటరింగులు వచ్చేశాయి. కాని ఆ కలిసి పని చేసుకోవడంలో ఉండే ఆ దగ్గరితనం ఇచ్చిన అనుభవం మర్చిపోలేనిది.

ఆ రోజు తరువాత మా ఇంట్లో చాలా ఫంక్షన్లు జరిగాయి కాని ఆ సొషల్ ఫీల్ వచ్చిన మరో సందర్భం లేదు.

ఆడవాళ్ళేవ్వరికీ మేకప్పులు లేవు. పని చెసుకుంటూ ఒకరినొకరు పలకరించుకుంటూ సందడిగా ఇల్లంతా తిరిగడం నాకు గుర్తు. అన్ని చేతులూ పని చేసేవే. ఖాళీగా కూర్చున్న ఒక్క మనిషి ఆ రోజు కనపడలేదు. మా చేత కూడా గ్లాసులు పెట్టించడం, నెయ్యి వడ్డీంచడం, దోసకాయలు తరగడం లాంటి పనులు చేయించారు. చుట్టు పక్కల ఊరి వాళ్లంత కలిసి ఓ వెయ్యి దాకా వచ్చి ఉంటారు. ఆ రోజు తరువాత మా ఇంట్లో చాలా ఫంక్షన్లు జరిగాయి, చీర మడతలు నలగకుండా, చీర కుచ్చిళ్ళు చెదరకుండా, ఇస్త్రీ బట్టలు పాడవకుండా. కాని ఆ సొషల్ ఫీల్ వచ్చిన మరో సందర్భం లేదు. ఆ వాతావరణం చూడని వారికి చెప్పినా బహుశా ఆ కమ్యునల్ ఫీల్ అర్ధం కాకపోవచ్చు.

ఆవకాయ అన్నం

హైదరాబాద్ వచ్చేదాక మా వాళ్లకి ఆవకాయ పచ్చడి తెలిదు. అది బ్రాహ్మణుల పచ్చడిగా అనుకునేవాళ్ళట. ఇక్కడ రైల్వే క్వార్టర్స్ లో ఒకరిని చూసి ఒకరు పచ్చడి పెట్టుకోవడం నేర్చుకున్నారు. ఒక సరదా ఉండేది ఈ పచ్చడి సీజన్ లో…అందరూ కలిసి ఒక ఇంట్లో పచ్చడి పెట్టుకోవడం. ఎవరిదో చేయి మంచిదని వారిని పిలిపించి పచ్చడి కలుపుకోవడం ఒక పండగలా ఉండేది. మా అమ్మకు ఇంటి క్రింద ఉన్న తమిళ ఆంటీ విశాల అని ఇంకో ప్రెండు ఉండేది. పచ్చడికి అమ్మ అన్నీ సిద్దం చేస్తే ఈవిడే వచ్చి కలిపి పెట్టేది. అదో పెద్ద స్టేటస్ లా ఫీల్ అయ్యేవాళ్ళు ఈ పచ్చడి కలిపేవాళ్ళంతా కూడా. మేము రాము, పెట్టము లాంటి మాటలు వచ్చేవే కావు. అడగడం తప్పు. ఆ ఇంటికి వెళ్ళిపోయి సహాయం చేసే వాళ్ళు.

ఇక పచ్చడి తిరగ కలిపే రోజు పండగే పండగ, పచ్చడి కలిపి, జాడిలలో సర్దుతుంటే, కాస్త గిన్నెలలో ఉంచమని గోల పెట్టేవారు.

మా ఇంటికి కుడి పక్కన రెండవ ఇంట్లో నాన్నగారి ప్రెండ్ వెంకోజి అంకుల్ ఉండేవారు. ఇద్దరూ ఒకే ఆఫీసులో పని చేసేవారు. ఆయన భార్య పేరు ప్రభావతి. నేను చాలా ఎక్కువగా ఇతరుల ఇంట్లో గడిపాను అంటే అది ఈ ఆంటి అంకుల్ దగ్గరే. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు వాళ్ళింటికి వెళ్ళిపోయే దాన్ని వెంకోజి అంకుల్ కి ఆవకాయ అంటే చాలా ఇష్టం. పచ్చడి కలుపుతుంటే పావుకిలో ముక్కలు కారం ఉప్పుతో కలిపి అన్నంలో పెట్టుకుని తినేవారు. ఆయన ఇంట్లో లేని టైములో పచ్చడి పెట్టుకోవాలని ఆంటీ ప్రయత్నించేది. సరే ఇక పచ్చడి తిరగ కలిపే రోజు పండగే పండగ, పచ్చడి కలిపి, జాడిలలో సర్దుతుంటే, కాస్త గిన్నెలలో ఉంచమని గోల పెట్టేవారు. ఆ పచ్చడి కలపడం, అన్నం వండడం ఒకే సారి జరగాలి. ఇక ఆ అన్నం కుక్కర్ ఈ పెద్ద గిన్నెలో దిమ్మరించి, నెయ్యి వేసి ఆ తిరగకలిపిన పచ్చడి అన్నంతో కలిపి తాను తింటూ అక్కడ ఉన్న అందరికీ పెట్టేవారు. నేను చేయి చాపడంలో ముందుండేదాన్ని. ఇద్దరం ఎంత బాగా ఎంజాయ్ చేసేవాళ్లమో.

వెంకోజీ అంకుల్

నాన్నగారికి మేం చిన్నగున్నప్పటినుండి కూడా మమ్మల్ని దగ్గరకు తీయడం తెలిసేది కాదు. ఎప్పుడూ ఆయన దగ్గర మేం అన్నం తిన్నది లేదు. కాని ఈ అంకుల్ ఎన్ని సార్లు నాకు అన్నం కలిపి పెట్టేవారో. ఆయన భోజనం చేస్తున్నప్పుడు నేను వెళ్ళానంటే ఆయన కంచంలో ముద్ద కలిపి పెట్టకుండా ఉండేవారు కాదు. ఇప్పటికీ ఆవకాయ తిరగకలపే పని చేస్తున్న ప్రతి సారి అంకుల్ గుర్తుకు వస్తూనే ఉంటారు.

చూసేవాళ్ళేమనుకున్నా గానీ, ఆవకాయ తింటే చేయంతా తిరగాల్సిందే. మా అంకుల్ గుర్తుకు రావాల్సిందే.

మా కుటుంబాల మధ్య క్రమంగా వచ్చే పరిస్థితులలో మార్పు కారణంగా దూరం పెరిగినా, కొన్ని సంవత్సరాల క్రితం అంకుల్ చనిపోయినా ఆ చిన్న నాటి నుండి ఈ రోజు దాకా ప్రతి సంవత్సరం అంటే ఈ నలభై సంవత్సరాలుగా ఆవకాయ తిరగ కలిపిన ప్రతి సారి అన్నం ఆ పచ్చడి గిన్నెలో వేసుకుని కలుపుకుని ఒక్కదాన్ని తినడం నాకు అలవాటు. ఇప్పుడు నా చుట్టూ ఉన్న అందరూ హై క్లాస్లోకి చేరిపోయారు. అందువలన ఈ అలవాటుకు ఎవరూ నాకు తోడు రారు కాని, అంకుల్ పెడుతున్నట్లుగానే ఫీల్ అయి ఇప్పటికీ ఓ ముద్ద అలా తినడం నాకు ఇష్టం. నాకు ఊహ తెలిసిన తరువాత ఓ పరాయి వ్యక్తిగా నాకు ముద్దలు కలిపి పెట్టిన మొదటి వ్యక్తి, ఆఖరి వ్యక్తి కూడా వెంకోజీ అంకులే. ఆ తరువాత అంతా స్పూన్లే,….. స్టీలువి, వెండివి. కాని ఆ గోరు ముద్దలు మాత్రం దొరకలేదు. అంకుల్ అన్నం అందరిలా చేతి వేళ్లతో కలుపుకునేవారు కాదు. అరచేయితో అన్నాన్ని నలిపి ముద్ధలు చేసేవాళ్ళూ. ఆయన చేతి ముద్దలు తిన్న ప్రభావమో ఏమో మామూలుగా అన్నం అరచేయికి అంటకుండా తినే నేను ఆవకాయ కలుపుకుంటే అలాగే అరచేయి తో అన్నాన్ని నలుపుతూ పెద్ద పెద్ద ముద్దలు చేసుకుని తినడం అలవాటయ్యింది. అన్నం కంచంలో ఆవకాయ పెడేతే నిద్ర మత్తులో కూడా అన్నం అరచేయి మధ్యన నలుపుకోవడం నాకు అలవాటు. చేతివేళ్ళతో నాజూకుగా కలుపుకుంటే అస్సలు రుచి అనిపించదబ్బా…….. చూసేవాళ్ళేమనుకున్నా గానీ, ఆవకాయ తింటే చేయంతా తిరగాల్సిందే. మా అంకుల్ గుర్తుకు రావాల్సిందే.

చిన్న జీతాలు, చిన్న జీవితాలు

అమ్మ మా ఇంట్లో అందరికీ ఒక మంచి అలవాటు చేసింది. మూడు పూటలా కడుపు పట్టేటంత తిండి అందరం తింటాం. మధ్యలో ఎన్ని విధాల టెంప్ట్ చేసినా స్నాక్స్ అనో చిరుతళ్ళు అనో అస్సలు తినలేం. అందువలనే కాబోలు దిట్టంగా తిన్నా ఎవరికీ ఊబకాయ సమస్య లేదు ఇప్పటి దాకా. ఏవరికీ చిరుతిళ్ళూ అలవాటు లేదు. ఆఖరికి ఇప్పుడు ఆమె చేతిలో పెరిగిన మా అబ్బాయికి కూడా మూడు పూటలా శుభ్రంగా అన్నం తినడం తప్ప ఈ స్నాక్స్ గోల తెలియదు. అప్పట్లో చిన్న జీతాలు, చిన్న జీవితాలు. ఇంటికి ఎవరన్నా వచ్చి పిల్లలం అని ఏదో కొనిస్తే తప్ప ఆ చిరుతిళ్ళ పేర్లు కూడా తెలియదు. రిచ్ ఫుడ్ అస్సలు తెలియదు. ఇది చాలా అదృష్టం అని ఈ మధ్యనే అర్ధం అయింది.

మురళి అంకుల్

నాన్నగారి స్నేహితుడు మురళి అని ఒక మార్వాడి అంకుల్ ఉండేవారు. ఈయన మోండా మార్కెట్ లో ఒక రేషన్ షాప్ లో పని చేసేవారు. జేబులో ఎప్పుడు కూడా ఇలాచీ, ఎండు ద్రాక్షా జీడిపప్పు పలుకులు వేసుకుని ఇంటికి వచ్చేవారు. ఆయన లాల్చీ పంచె వేసుకునేవారు. ఆయన ఇంటికి వచ్చి అమ్మ చేతి టీ తాగి వెళ్ళడం అలవాటు. వీళ్ళంతా నాన్నగారున్నా లెకపోయినా ఇంటికి వచ్చేవాళ్ళూ. అరలీటర్ పాలతో రోజంతా టీ పెడుతూనే ఉండేది మా అమ్మ. ఇది నేను ఎప్పటికీ తెలుసుకోలేని రహస్యం. చిన్న చిన్న స్టీల్ గ్లాసులలో ఆ టీ తాగి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయేవారు.

జేబులు తడిమి హక్కుగా నాది ఇది అని లాక్కోవడం అన్నది నా జీవితంలో మరే వ్యక్తి దగ్గరా జరగలేదు.

మార్వాడి అంకుల్ వచ్చారంటే ఆయన కుర్తా జేబులో చేయి పోనిచ్చి అందినన్ని జీడిపప్పు, ద్రాక్షలు తీసుకుని తినడంలో గొప్ప ఆనందం ఉండేది. అలా అని ఆయన జేబులో ఓ నాలుగైదు పలుకులు కన్నా ఎక్కువ ఉండేవి కావు. అవి వెతికి తీసుకుని తినడం చాలా బావుండేది. అప్పట్లో ఇంట్లో జీడిపప్పులు బాదంలు ఉండే సీన్ లేదు. ఇలా ఆయన జేబులో చేయి పెట్టి వెతుక్కోవడంలో ఒక దగ్గరతనం ఉండేది. నేను కాలేజీ రోజులకు వచ్చేదాకా ఈ పని చేసేదాన్ని. తరువాత కూడా సరదాగా ఆయన వస్తే జేబులో చేయిపెడ్తే ఆయన నవ్వుతూ ఉండేవారు. ఈ రోజు దాకా కూడా నేను నాకై నేనుగా మరెప్పుడు ఏవరి జేబులోనూ చేయి పెట్టీ ఏమీ తీసుకోలేదు. అది ఇంటి వాళ్ళు కావచ్చు. బైట వాళ్ళు కావచ్చు, జేబులు తడిమి హక్కుగా నాది ఇది అని లాక్కోవడం అన్నది నా జీవితంలో మరే వ్యక్తి దగ్గరా జరగలేదు. ఇప్పుడు అన్ని రకాల డ్రై ఫూట్శ్ తెచ్చుకోగలిగి ఉన్నా స్వీట్లలోనో వంటలోనో కాక చిన్నతనం గుర్తు చేసుకుంటూ ఓ రెండు పలుకులు పచ్చివి తినడం అలవాటు. కొన్ని జ్ఞాపకాలు అలా మిగిలిపోతాయంతే.

కాలనీలో చీరల వాళ్ళు

అప్పట్లో చీరలను మూటలలో కట్టుకుని సైకిల్ తొక్కుకుంటూ చీరల వాళ్ళు కాలనీ లోకి వచ్చేవాళ్ళూ. ఈ చీరలు కొనడం ఓ పెద్ద పండగ. మగవాళ్ళంతా ఆఫీసులకు వెళ్ళాక సమయం చూసుకుని ఖచ్చితంగా పది తరువాత ఈ చీరలవాళ్ళు వచ్చేవాళ్ళూ. ఒక ఇంట్లో మూట విప్పి అందరూ ఆడవాళ్ళూ అక్కడ కలిసేవాళ్ళూ. ఎక్కువగా ఆ మూట మా ఇంట్లో దిగేది. ఇక అ చీరల సెలక్షణ్ ఒక అద్భుతంగా అనిపించేది మా పిల్లలకు కూడా.

ఒకే డిజైను చీరను వేరే రంగులలో సరదాగా అందరూ కొనుక్కునేవారు. ఒకరి దగ్గర డబ్బు లేకపోతే ఇంకొకరు సర్దేవాళ్ళూ. కాని ఈర్షా, అసూయలు, అసంతృప్తులు అస్సలు ఉండేవి కావు.

కళ కళలాడుతున్న మొహాలతో ఆడవాళ్లంతా ఆ మూట చూట్టూ చేరడం, చీరలు సెలక్ట్ చేసుకోవడం. చివరకు బేరం చేయడం. నేను హై స్కూలుకు వచ్చేదాకా అమ్మ ట్రేడ్ మార్క్ ధర యాభై రూపాయలు. అంతకన్నా ఖరీదైన చీర ఆమె ఎప్పుడూ కొనలేదు. కాని అవి ఎంత అద్భుతమైన రంగుల్ళో డిజైన్లలోనో ఉండేవి. ఒకే డిజైను చీరను వేరే రంగులలో సరదాగా అందరూ కొనుక్కునేవారు. ఒకరి దగ్గర డబ్బు లేకపోతే ఇంకొకరు సర్దేవాళ్ళూ. కాని ఈర్షా, అసూయలు, అసంతృప్తులు అస్సలు ఉండేవి కావు. ఇప్పుడు ఒకటే రోజు వేలు ఖర్చు పెట్టి చీరలు కొన్నా ఎందుకో ముఖంలో ముటముటలు అసంతృప్తిలే కనిపిస్తాయి చాలా మంది స్త్రీలలో… ఒక కొత్త చీర అమ్మ కొందంటే ఇంట్లో అందరికీ అదో పెద్ద అచీవ్మెంట్ గా ఉండేది. ఎంత మంది ఆ చీరను పట్టుకుని చూసేవాళ్ళో.

బియ్యం చెరగడం

ఇలాగే కూర్చుని బియ్యం బాగు చేసుకునే వాళ్ళం

నాకు ఈ రోజులలో అస్సలు కనిపించని మరో దృశ్యం. బియ్యం, ఉప్పు, పప్పులను బాగు చేసుకోవడం. ఆ రోజుల్లో అంత చిన్న ఇళ్ళల్లో ఉంటూ కూడా సంవత్సరానికి సరిపడా పప్పు బియ్యం నిల్వ చేసుకునేవారు. వీటిని ఏరుకుని, చెరుక్కుని బాగు చేసుకుని అప్పుడు డ్రమ్ములలో సర్ధుకునేవాళ్ళూ. మా యింట్లో బియ్యం బాగు చేసుకోవడం కూడా ఒక పండగ లాగుండేది. ఆ చిన్న వరండాలో బియ్యం మధ్యలో కుప్పలా పోసి దాని చుట్టూ అందరూ కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ బియ్యం ఏరుకుంటూ చెరుక్కునేవళ్ళూ. చుట్టు పక్కనున్న అంటీలు కూడా వారిళ్ళల్లో పని ముగించుకుని ఇక్కడ చేరేవాళ్ళూ.

కొన్ని సందర్భాలలో అన్నయ్య స్నేహితులు వస్తే వాళ్ళని కూడా ఆ బియ్యం దగ్గర కూచోబెట్టేది అమ్మ.

నా జీవితంలో మొదటి సినిమా కబుర్లు, మొదటి సాహిత్యం కబుర్లు నేను ఇక్కడే…ఈ బియ్యం ఏరేవారి మధ్య కూర్చునే విన్నాను. కొన్ని సందర్భాలలో అన్నయ్య స్నేహితులు వస్తే వాళ్ళని కూడా ఆ బియ్యం దగ్గర కూచోబెట్టేది అమ్మ. ఇక ఎవరికి తోచిన టాపిక్ వాళ్ళు మాట్లాడేవాళ్ళు. రంగనాయకమ్మ నవల్ల నుండి ఆంద్రభూమి సీరియళ్ళూ, శోభన్ బాబు సినిమాలు, యద్దనపూడి కొత్త నవల్ల వరకు చర్చ సాగేది.

తమిళ మామి పొదుపు పాఠాలు

ఇంట్లో పాటించే పొదుపు చాలా వింతగా ఉండేది. అమ్మకు క్రొత్తగా ఈ ఊరు వచ్చినప్పుడు ఒక తమిళ మామితో పరిచయం ఏర్పడింది. ఆమె దగ్గరే తాను పొదుపు పాఠాలు నేర్చుకున్నాని ఆమె చెప్పేది. వారి మధ్య ఎంత స్నెహం అంటే ఆ అమ్మమ్మ వాళ్ళూ హైదరాబాద్ వదిలి కంచి పక్కన ఎదో ఊరులో సెటిల్ అయితే ఆ అమ్మమ్మ చివరి రోజుల్లో ఉందని అమ్మ తో పాటు మేము ఆ ఊరికి వెళ్ళి వాళ్ళింట్లో ఒక రోజు గడిపి రావడం నాకు గుర్తు. ఆ రోజుల్లో అనుబంధాలు అలా ఊండేవి. సరే అప్పటి స్త్రీలు ఒకరితో ఒకరు ఎంత తోడుగా ఉండేవాళ్ళొ ఎన్ని విషయాలు పంచుకునేవాళ్ళంటే సొంత తల్లి తండ్రుల కన్నా ఈ పొరుగింటీ స్త్రీల దగ్గర వాళ్ళూ నేర్చుకున్న విషయాలు చాలా ఉండేవి.

ఆ అమ్మమ్మ అమ్మకు నేర్పిన ఓ పొదుపు పాఠం ఇప్పుడు చెబితే అందరూ నవ్వుతారేమో కాని ఇది ఏ బడ్జెట్ పాఠాలకు సాటి రానిది.

ఇప్పటికీ మా ఇంట్లో ఉన్న సోల అరసోలలు…. గిద్దె అంటే చాలా చిన్నది. కంది పప్పుకు దాన్ని ఉపయోగిస్తాం…

ఇంట్లో అందరికీ పప్పు వండుతున్నప్పుడు ఓ గిద్దెతో పప్పు కొలుచుకుని తీసుకోవడం అలవాటు. ఆ గిద్దె (గుండ్రంగా ఉండే ఓ చిన్న కొలత గిన్నె) లో పప్పు నిండుగా తీసుకుని, తల కొట్టీ తీస్తే అంటే ఆ గిద్దె పై నిండుగా ఉన్న పప్పు ని మరో చిన్న గిన్నెలో ఒంపుకుంటే ఓ స్పూన్ పప్పు ఆ రెండో గెన్నెలో పడిపోతుంది. ఆ స్పూన్ పప్పు లేకపోవడంతో ఆ రోజు వంటలో ఎవరికీ పప్పు తక్కువ అవదు. కాని ప్రతి రోజు ఆ తలకొట్టూడు పప్పుని స్పూన్ స్పూన్ గా మరో గిన్నలోకి తీసుకుంటే నెలాఖరున రెండు రోజులకు ఇంటిల్లిపాదీకి రెందు గిద్దెల పప్పు మిగులుతుంది. అంటే రోజు మిగిల్చిన ఆ స్పూన్ పప్పు దినుసులు నెలలో చివరి రెండు రోజులకు ఇంటికి సరిపడా వంటకు వస్తాయి. రెండు రోజుల పప్పు ఖర్చు తగ్గుతుంది.

ఇప్పటికీ అన్నానికి బియ్యం తీస్తున్నా, పప్పు ఒండడానికి కంది పప్పు డబ్బాలోనుండి తీసుకుంటున్నా కొన్ని గింజెలు ఆ గిన్నెలో రాల్చడం నాకు అలవాటి.

ఈ రోజులలో కిచెన్ మెనేజ్ చేస్తున్న వారికి ఈ కిటుకు చెబితే నవ్వి పారేస్తారు. కాని ఇది చాలా పెద్ద మేనేజ్ మేంట్ పాఠం అన్నది అర్ధం చెసుకుంటేనే తెలుస్తుంది. ఇలాంటి విషయాలను ఒకరితో ఒకరు పంచుకుంటూ ఎంత హాయిగా రోజులు గడిపారో ఆ రోజుల్లో వాళ్ళూ అనిపిస్తుంది. ఇప్పుడు పొదుపు పాఠాల అవసరం లేదేమో కాని ఆ పొదుపు కారణంగా నేర్చుకున్న విలువలు లేకపోవడం వలన జీవితాలలో పెరిగిన అనవసరపు ఖర్చులను చూసిన తరువాత స్త్రీలలో ఈ పంచుకునే గుణం వారిని ఎన్ని విధాలుగా వారిని కలిపి ఉంచిందో అర్ధం చేసుకోవచ్చు.

ఇప్పటికీ అన్నానికి బియ్యం తీస్తున్నా, పప్పు ఒండడానికి కంది పప్పు డబ్బాలోనుండి తీసుకుంటున్నా కొన్ని గింజెలు ఆ గిన్నెలో రాల్చడం నాకు అలవాటి. పొదుపు చేయవలసిన అవసరం లేదు కాని నేను ఎక్కడ నుండి వచ్చానో మర్చిపోకుండా ఉండడానికి ఈ పని చేస్తూ ఉంటాను. భూమి మీద నిల్చుని ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. ఈ పొదుపు సూత్రం పాటిస్తుంటే.

ఓ దగ్గరితనం ఉండేది!

క్వార్టర్స్ లో ఒకరి పుస్తకాలు మరొకరం హాప్ రేట్ కి కొనుక్కుని దాచుకునేవాళ్ళం. అన్యువల్ ఎగ్జామ్స్ అప్పుడే మనకన్నా ముందున్న క్లాస్ వారి పుస్తకాలు నావి అని రిజర్వ్ చేసుకునేవాళ్ళం. అమ్మ చీరను చించుకుని లంగాలు కుట్టుంచుకుని అవి పాత చీరలయితే వాటిని నైట్ డ్రెస్ లుగా వేసుకునేవాళ్ళం. అమ్మ చీరను చించి రెండు ఓణీలుగా చేసుకుని డిగ్రీ రోజులలో కూడా వాటిని ఇంట్లో వేసుకునే దాన్ని. ఒకరి బట్టలు మరొకరు ఇలా వేసుకోవడంలో ఓ దగ్గరితనం ఫీల్ అయ్యేవాళ్ళం తప్ప చిన్నతనంగా ఎప్పుడు అనుకోలేదు. అందుకే ఇప్పటికీ నా ఆత్మీయులనిపించిన వారి ఓల్డ్ మోడల్ పట్టు చీరలు నా వార్డ్ రోబ్ లో వాళ్ళని గుర్తు చేస్తూ ఉంటాయి. ఒకరి బట్టలు మరొకరు ధరించడంలో ఆప్యాయత ఉంటుందనే ఈ రోజుకీ నేను నమ్ముతాను. పుట్టిన పిల్లలకు కూడా మరొకరి బట్టలు వేయకుండా పెంచుకోవడమే క్లాస్ అనుకునే వారు నాకు ఇప్పటికీ అర్ధం కారు. ప్రస్తుతం మరొకరి బట్టలు వేసుకోవడం తప్పనుకునే రోజులు కూడా వచ్చేసాయి. పంచుకోవడం, ఇచ్చి పుచ్చుకోవడం ఇప్పుడు చేతకాని పనులయి పోయినందుకు బాధ అనిపిస్తుంది.

నీళ్ళు అమ్మడం కొనడం – పరమ అసహ్యమైన పని

నర్సరీలకు వెళ్ళి మొక్కలు తెచ్చుకోవడం ఆ రోజుల్లో మాకు తెలీదు. ఎవరింట్లో అన్నా కావలసిన మొక్క ఉంటే వారిని అడిగి ఓ కొమ్మ లేదా అంటు తెచ్చుకునే వాళ్లం. అలానే ఎన్నో పూలను పూయించుకున్నాం. ఇక ఇప్పటికీ మంచినీళ్ళు కొనాలంటే నాకు పరమ అసహ్యం. తప్పదు అనుకుంటే తప్ప నీళ్ళు కొనను. ఎక్కడ దాహం అనిపిస్తే అక్కడ ఆగి నీళ్ళు అడిగి తాగేవాళ్లం. ఇప్పుడు బేకరీలలో, చిన్న టిఫెన్ సెంటర్లలో కూడా ఎవరూ నీళ్ళూ ఉచితంగా ఇవ్వరు. ఇంటికి ఎవరు వచ్చినా నీళ్ళిచ్చి పంపే అలవాటు నాకింకా పోలేదు. కొరియర్ అతన్ని, పాలతన్ని కూడా నీళ్ళూ కావాలా అని అడిగితే నా తరువాతి తరం వింతగా చూస్తుంది నన్ను.

నిజం చెప్పాలంటే ఏ అంటూ సొంటు లేని ఆనందకరమైన జీవితాలను జీవించాం. ఈ సామాజిక జీవనంలోని ఆనందం ఇప్పటి తరానికి ఎలా చెప్పాలో మాత్రం అర్ధం కావట్లేదు!

నీళ్ళు అమ్మడం, కొనడం నేనింకా జీర్ణించుకోలేని పెద్ద మార్పు. ఆ బాధ తప్పించుకోవడానికి ప్రతి చోటకు ఓ బాటిల్ నీళ్లు తీసుకెళ్ళడం అలవాటు చేసుకుంటున్నాను. చిన్నప్పుడు ఎవరి తలుపు అన్నా సరే కొట్టి ఆంటీ నీళ్ళీయ్ అని దబాయించి అడిగి తాగిన ఆ రోజులెక్కడా… నీళ్ళు కొనుక్కుని తాగే ఈ రోజులెక్కడా……

నిజం చెప్పాలంటే ఏ అంటూ సొంటు లేని ఆనందకరమైన జీవితాలను జీవించాం. ఈ సామాజిక జీవనంలోని ఆనందం ఇప్పటి తరానికి ఎలా చెప్పాలో మాత్రం అర్ధం కావట్లేదు!

రచయిత్రి పి. జ్యోతి హిందీ ఉపన్యాసకులు. చక్కటి సమీక్షకురాలు. హైదరాబాద్ లో పుస్తకాల పట్ల అభిరుచి పెంచడంలో విశేషంగా కృషి చేస్తున్న spreading Lights నిర్వాహకురాలు కూడా. పుస్తకం, సినిమా తనకు రెండు కళ్ళు. ప్రపంచానికి గవాక్షాలు. తెలుపు కోసం రాస్తున్న ఈ శీర్షికలో తాను మొదటిసారిగా అంతర్ముఖంలోకి చూసుకుంటున్నారు. జీవితాన్నే పుస్తకంగా అనుభవాలనే చలన చిత్రంగా ఎంచి సరళమూ, నిరాడంబరమూ, సామాన్యమూ ఐన జ్ఞాపకాలను ఆత్మీయంగా పంచుకుంటున్నారు. ఈ శీర్షికలో మొదటి వ్యాసం మనసు పొరల్లో. రెండో వారం చిన్ననాటి చిరుతిళ్లు. మూడో వారం చిన్ననాటి సంగతులు. మీరు చదువుతున్నది నాలుగో వారం జ్ఞాపకాలు.

అన్నట్టు, ఇటీవలే వీరు రచించన దిలీప్ కుమార్ సినిమనసు పొరల్లోమాల సమగ్ర పరిచయ పుస్తకం కోసం ఈ లింక్ క్లిక్ చేసి తెప్పించుకోవచ్చు.

 

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article