Editorial

Wednesday, January 22, 2025
కాల‌మ్‌మనసు పొరల్లో : ఆయన లేని లోటు బాధిస్తోంది – పి. జ్యోతి తెలుపు

మనసు పొరల్లో : ఆయన లేని లోటు బాధిస్తోంది – పి. జ్యోతి తెలుపు

గొప్ప ప్రతిభ ఉన్న వ్యక్తుల కన్నా అతి సామాన్యమైన వ్యక్తిత్వమే మిన్న.

పి.జ్యోతి

మనం కొన్ని భ్రమలకు లోబడి కొన్ని అభిప్రాయాలను ఏర్పరుచుకుంటాం. ఈ భ్రమలు ఏర్పడడానికి కారణం చాలా సార్లు పై పై విషయాలను చూసి అవే నిజాలని మనం నమ్మడం. జీవితపు లోతు, మనుష్యుల స్వభావాన్ని లోతుగా పరిశీలించిన కొద్దీ మన భ్రమలు తొలగిపోతూ సత్యాలు అవగతం అవుతూ ఉంటాయి. ఇవి మన ఆలోచనలలో చాలా మార్పు తీసుకొస్తాయి. “నాది నాది అనుకున్నది నీది కాదురా… నీవు రాయన్నది ఒకనాటికి రత్నమౌనురా” లాంటి వాక్యాలు ఒకప్పుడు అర్ధం కాకపోయినా రైమింగ్ కోసమే పాడుకున్నా వాటి అర్ధం తెలిసేకొద్ది జీవితం అనుభవాలతో నిండి ఉంటుంది. అనుభవాలను మించిన గురువు మరొకరు ఉండరు.

నా జీవితానుభవాలు నన్ను చాలా భ్రమల నుండి దూరం చేసాయి. ఓ మనిషిని చుడగానే అతని ఆకృతి, వేషధారణ, మాట్లాడే విధానం మొదట ఆకర్షిస్తాయి అందరిని. ఆ ఆకర్షణల నుండి దూరం అవ్వాలంటే కొన్ని అనుభవాలు తప్పని సరి. నేను ఇరవై సంవత్సరాల దాకా భ్రమలతోనే జీవించాను. కాని తరువాత జీవితం అంతా ఆ భ్రమల పొరలు ఒకొక్కటిగా తొలగిపోవడమే. ఇది కాస్త నా జీవితంలో ఎక్కువగానే జరిగింది. ఎప్పుడూ ఏ విషయంలో భ్రమకు గురి అయినా చాలా త్వరగా నిజం ముందుకు వచ్చి నన్ను ఇబ్బంది పెట్టేది. అందులో కొన్ని నాకు చాలా గొప్ప పాఠాలు నేర్పించాయి.

1996 మార్చ్ 30న అసిస్టేంట్ టిచర్ గా రైల్వే స్కూల్ లో ఉద్యోగం లో చేరాను. అప్పుడు మా ప్రిన్సిపల్ రమేష్ బాబు గారు. చాలా సామాన్యమైన వ్యక్తి. సన్నగా బక్క పలచగా కొంచెం ఎత్తు పళ్ళతో ఉండే ఈయన క్రింద నేను మొదట ఉద్యోగం చేసాను. ఆ తరువాత చాలా మంది దగ్గర పని చేసాను. రమేష్ బాబు గారికి హంగులు ఆర్భాటాలు తెలియదు. సాదా సీదాగా ఉంటూ అధికారం చెలాయించడం చేతకాని ఈయన అంటే స్టాప్ కి ఒకరకమైన చులకన భావం ఉండేది. అప్పట్లో మా స్టాప్ అంతా ఎవరికి వారు ఐన్స్టీన్లమని నమ్మి పని చేసేవాళ్ళు. స్కూలులో చేరేటప్పటికే నాకు వివాహం అయింది. ఆ తరువాత ఓ సంవత్సరానికి వితంతువు అన్న స్టేటస్ వచ్చింది. ఈయన నాతో చాలా పని చేయించేవారు. స్కూలులో చేరిన నెలకే స్కౌట్ ట్రేనింగ్ కని గుంతకల్ పంపించారు. ఆ తరువాత స్కూల్ కి సంబంధించిన చాలా పనులలో నేను భాగం అయేదాన్ని. అప్పట్లో ఇంకా స్కూలుకి కంప్యూటర్లు రాలేదు. అప్పుడప్పుడూ రెమింగ్టన్ టైప్ మిషన్ మీద ఆఫీసుకు పంపవలసిన లెటర్లు కూడా టైప్ చేసేదాన్ని. ఆర్ ఆర్ బీ పరిక్షలు ప్రతి ఆదివారం జరిగేవి. తప్పకుండా ఆ పరిక్షలకు హాజరయి ఆఫీసు పని చేసే దాన్ని. స్పోర్ట్స్, కల్చరల్ ఆక్టివిటీలు కూడా ఓ ముఖ్యమైన భాగంలా ఉండేవి. అన్నిటికీ నాతో తాను పని చేయించుకునే వారు.

ఈయనను గమనించిన తరువాతే టాలెంట్, పని చేసే సత్తా ఉన్న వ్యక్తి ఎన్ని లోపాలున్నా ఎలా జీవితంలో గెలవగలడో నేను స్వయంగా చూసి నేర్చుకున్నాను.

రమేష్ బాబు గారి చుట్టూ కొంతమంది సీనియర్ సర్లు ఉండేవాళ్ళు. అందులో పేరుకు తగ్గట్టు చాణక్యులు అనే తెలుగు మాస్టారు ఉండేవారు. ఈయన అద్బుతమైన టీచర్. చాలా టాలెంట్ ఉన్న వ్యక్తి. ఎప్పుడూ క్లాసుకు వెళ్ళి పాఠాలు చెప్పరు. కాని పదిహేను రోజులు పిల్లలకు పాఠాలు చెప్పారా, వాళ్ళకి ఎనభై మార్కులకు తక్కువ రావు. అంత బాగా క్లాసును తీసుకోగల సత్తా ఉన్న మనిషి. స్కూలుకి సంబంధించిన ప్రతి విషయంలో ఆయన జోక్యం ఉండేది. స్కూలులో చీమ కూడా ఈయనకు తెలియకుండా కదిలేది కాదు. ఓ వంద మంది కలిసి గుంపుగా వచ్చి గొడవ చేసినా, వాళ్లతో పది నిముషాలు మాట్లాడి దండం పెట్టించుకోగల టాలెంట్ ఆయనది. ఆ స్కూలు పరంగా మాత్రం, ఆయన చాలా లాభం పొందారు. అలాగే అవసరం వచ్చినప్పుడు అంత పనీ చేసేవారు కూడా. ఒక్క పైసా జేబులోది ఖర్చు కాకుండా ఈయన సర్వీసంతా దాటేశారంటే ఆయన తెలివి అర్ధం చేసుకోవచ్చు. ఆ స్కూలుకు ఆయన అంతే ఉపయోగపడ్డారు కూడా. ఈయనను గమనించిన తరువాతే టాలెంట్, పని చేసే సత్తా ఉన్న వ్యక్తి ఎన్ని లోపాలున్నా ఎలా జీవితంలో గెలవగలడో నేను స్వయంగా చూసి నేర్చుకున్నాను.

రమేష్ బాబు గారికి డ్రైవింగ్ వచ్చేది కాదు. ఆయనకు స్కూటర్ లేదు. చాణక్యులు గారు స్కూటర్ పైనే వచ్చేవారు. ప్రతి రోజు ఏదో ఓ విషయనికి స్కూలు పని కోసం రైల్వే ఆఫీసుకి వెళ్ళే అవసరం వచ్చేది. చాణక్యులు గారు తన బండి మీద రమేష్ బాబు గారిని తీసుకెళ్ళేవారు. ఆయన బండి స్కూలు నుండి బైలుదేరిందంటే ఖచ్చితంగా పెట్రోల్ బంక్ వద్దకు వెళ్ళి ఆగేది. అక్కడ ఫుల్ టాంక్ కొట్టించుకుని ఆయన పది అడుగుల దూరంలో ఉన్న రైల్ నిలయం ఆఫీసుకు రమేష్ బాబు గారిని తీసుకెళ్ళేవారు. మరో రెండు రోజుల తరువాత మళ్ళీ ఆఫీసుకు వెళ్ళాలంటే ఆ బండి మళ్ళీ పెట్రోల్ బంక్ దగ్గర ఆగకుండా వెళ్ళేది కాదు. ఆ బండిలో పెట్రోలుకి డబ్బు ఇచ్చేది రమేష్ బాబు గారే. రమేష్ బాబు గారు ట్రాన్స్పర్ అయి స్కూలు వదిలి వెళ్ళేదాకా చాణక్యులు గారి బండి నిండుగా ఉండేది.

ఒక్క బాగుతో ఇద్దరు ఆడవాళ్ళని రెండు కుటుంబాల వాళ్లని సంతోషపెట్టదలచా” అని ఆయన అన్నప్పుడు చుక్కలు కనిపించడం అంటే ఎంటో అప్పుడు తెలిసింది.

చాణక్యులు గారి గురించి నేను మర్చిపోలేని ఓ సంఘటన చెబుతాను. ఓ సారి నేను ఆయన కొందరు పిల్లలతో స్కూలు తరుపున డిల్లీకి కాంపుకు వెళ్ళాం. ట్రైన్ లో ఆయన నాతో ఓ సగం రోజు ఖాళీ ఉంటుంది మనకు, షాపింగ్ చేద్దాం ఢిల్లీ లో అన్నారు. జేబు నుండి పైసా తీయని ఆయన అలా అడిగే సరికి, నేను ఏం కొనుక్కోవాలండీ అని అడిగాను. ఆయన మా ఆవిడకు ఓ లేడీస్ హాండ్ బాగ్ కొనాలనుకుంటున్నా అన్నారు. ఆయన భార్య ఇల్లు దాటి బైటకు వచ్చేది కాదు. చాలా అమాయకమైన మనిషి. ఆయనకు ఇద్దరు కొడుకులు ఓ కూతురు. సరే అండి అలాగే కొందాం అన్నా. అంతటితో ఊరుకోకుండా ఆయన ఓ ఇరవై ఇరవై అయిదు సంవత్సరాల వయసున్న ఆడపిల్ల టేస్ట్ లో కొనాలి అన్నారు. నాకు నవ్వు వచ్చింది. ఆంటీ కోసం అంత లెటేస్ట్ బాగ్ కొంటున్నారా అని నవ్వుతూనే అడిగా. సీరియస్ గా చూస్తూ ఆయన దానికో స్ట్రాటేజీ ఉంది అన్నారు. నాకు అర్ధం కాలేదు. వివరంగా చెప్పండి అంటే ఆయన నాకు చెప్పిన విషయం విని బుర్ర తిరిగిపోయింది. “నా కూతురికి పెళ్ళి అయింది. ఆమెకు నాన్న డిల్లీకి వెళ్ళారని ఏదో తీసుకురావాలనే కోరిక ఉంటుంది కదా. ఇంటికి వెళ్ళగానే హక్కుగా ఏం తెచ్చావని అడుగుతుంది. నేను ఆమెకు సరిపోయే బాగ్ కొని నా భార్యకు ఇస్తాననమాట. ఇది చిన్న పిల్లల బ్యాగండి అని నా భార్య అనేస్తుంది. అవునా నేను ముసలి పంతుల్ని నాకేం తెలుసు? డిల్లీ వెళ్ళాను కదా నీకేదన్నా తేవాలని అనిపించి తెచ్చాను అని చెప్తా. దానికామే మురిసిపోయి, పర్లేదు లెండి. మీకు తెలీదు కదా. ఈ బాగు మీరు తెచ్చారని చెప్పి అమ్మాయికి ఇస్తాను అంటుంది. అమ్మాయికి ఇస్తుంది. నాన్న నా కోసం తెచ్చారని అమ్మాయి సంతోషిస్తుంది. ఆమె అత్తగారు సంతోషిస్తారు. ఒక్క బాగుతో ఇద్దరు ఆడవాళ్ళని రెండు కుటుంబాల వాళ్లని సంతోషపెట్టదలచా” అని ఆయన అన్నప్పుడు చుక్కలు కనిపించడం అంటే ఎంటో అప్పుడు తెలిసింది. ఈయనకు అప్పటి లేటెస్ట్ పాషన్ల నుండి అన్నిటి పట్ల అవగాహన ఉంది, భార్య దగ్గర అంత అమాయకంగా ప్రవర్తించే నేర్పరి కూడా. ఇది నేను ఇప్పటికీ మరచిపోలేని పాఠం. ఔరా ఇదే కదా లౌక్యం అంటే అని మొదటి సారి నోరు తెరుచుకుని ఆయనను చూస్తూ ఉండిపోయా. అంత తెలివి గల వ్యక్తి ఆయన. ఆయన ప్రతి పనిని ఇదే స్ట్రాటజీతో చేసేవాళ్ళు. జేబులోంచి పైసా తీయకుండా గ్రాండ్ గా రిటైర్మెంట్ పార్టీ చేసుకున్న ;అపర చాణక్యుడు’ ఆయన.

ఆయన పట్ల నాకు ప్రేమ అభిమానం కలగడానికి మరో కారణం… భర్తను పోగొట్టుకుని మెంటల్ షాక్ కు గురైన నన్ను చూడడానికి ఆయన ప్రతి రోజు హస్పిటల్ కి రావడం.

స్కూలులో నేను చాలా ప్రేమించిన వ్యక్తి ఈయన. ఆయన అతి తెలివి నాకు నచ్చేది కాదు. కాని ఆయనలోని ఎనర్జీని నేను చాలా ఇష్టపడేదాన్ని. నాకన్నా ముప్పై సంవత్సరాలు పెద్దవారు ఆయన. నా వయసువారితో పోటీ పడి పని చేసే వారు. ఆయన తరువాత అంత ఎనర్జీ ఉన్న వ్యక్తిని నా సర్వీసులో ఇప్పటిదాకా చూడలేదు. ఎక్కడ ఏ కాస్త లాభం వస్తుందన్నా వదలకుండా దాన్ని పిండి పట్టుకోవడం ఆయనకు తెలిసినట్లుగా మరెవరికీ తెలీదు. ఆయన పట్ల నాకు ప్రేమ అభిమానం కలగడానికి మరో కారణం కూడా ఉంది. భర్తను పోగొట్టుకుని మెంటల్ షాక్ కు గురై ఓ పది రోజులు హాస్పిటల్ లో స్పృహ లేకుండా పడి ఉన్న నన్ను చూడడానికి ఆయన ప్రతి రోజు హస్పిటల్ కి వచ్చేవారు. స్పృహలో లేని నన్ను చూసి లేపి మాట్లాడిస్తూ నా దగ్గర ఉన్న వాళ్ళకి ధైర్యం చెప్పి వెళ్ళేవారు. ఇక హాస్పిటల్ నుంచి నేను ఇంటికి వచ్చిన మరుసటి రోజే బండి వేసుకుని ఆయన మధ్యాహ్నం మా ఇంటికి వచ్చారు. ఏంటీ ఇంట్లో ఉండి చేసేది, పద నాతో స్కూలుకి అని స్వయంగా నన్ను స్కూలుకి తీసుకువెళ్ళారు. ఇక మరుసటి రోజు నుండి నేను స్కూలుకు వెళ్లడం జరిగింది. పిచ్చ పిచ్చగ పని ఇచ్చి నన్ను టోటల్ గా ఎంగేజ్ చేసారు ప్రత్యక్షంగా చాణక్యులు గారు, పరోక్షంగా రమేష్ బాబు గారు. ఆయనతో మాట్లాడడానికి కొందరు భయపడ్డా నేను మాత్రం చాలా చనువుగా ఆయన దగ్గర ఉండేదాన్ని. ఆయన చేసే కొన్ని పనులను ఆయన మొహం మీదే విమర్శించేదాన్ని, ఖండించేదాన్ని. ఇన్ని మంచి గుణాల మధ్య ఆయనలో నాకు అస్సలు నచ్చనికి ఆయన లోభి గుణం. అన్ని మంచితనాలను ఆ గుణం డామినేట్ చేసేది.

ఆయన రిటైర్మంట్ కి ముందు భద్రాచలం వెళ్ళిన సాయి రాం అనే మా స్కూల్ అబ్బాయి ఒకడు గోదావరి నదిలో మునిగి చనిపోయాడు. స్పోర్ట్స్ కాంప్ కు వెళ్ళిన నలుగురి పిల్లలలో ఈ అబ్బయి ఒకడు. చాలా టెన్షన్ నిండి ఉన్న సమయం అది. స్కూలులో హేమా హేమీలయిన మగమహారాజులెవ్వరూ ఈ సమయంలో స్కూలులో నిలబడి సమస్య ఎలా పరిష్కరించాలా అని ఆలోచించడానికి కూడా ముందుకు రాని సమయంలో, రైల్వే ఆఫీసర్ ఇచ్చిన ఓ వాన్ తో వచ్చిన డ్రైవర్ ఖమ్మం హాస్పీటల్ మార్చురి నుంచి ఆ అబ్బాయి శవం తీసుకురావడానికి ఒంటరిగా వెళ్ళనని గొడవ చేస్తే అప్పటికప్పుడు ఆ బండి ఎక్కి పద నేనూ నీతో వస్తా అని బైలుదేరిన వ్యక్తి చాణక్యులు గారు. కాని ఏం లాభం, ఆయనపై నమ్మకం పెట్టుకున్న సందర్భాలలో తన స్వంత లాభమే తప్ప మరొకరి మనోభావాలను లెక్కచేయని ఆయన గుణం ఇన్ని మంచి పనులు చేసిన చాణక్యులు గారిని నేను దూరం పెట్టడానికి కారణం అయింది.

ఆయనకు ఇది తెలియకపోయినా క్షమాపణ చెప్పి నాతో ఆయన వెతికించాలనుకున్న షీట్ నా గది నుండే బైటికి వచ్చిందని చెప్పినప్పుడు ఆయన ఒక చిరునవ్వు నవ్వి ‘జాగత్త జ్యోతి’ అన్న ఒక్క మాటతో చాలా చెప్పారు.

స్కూలు నుండి ఆయనకు అవసరం అయిన ప్రతి వస్తువును ఆయన హస్తగతం చేసుకునేవారు. ఓ సారి ఓ పెద్ద డెకాలం షీటు స్కూలులో మిస్ అయింది. లాబ్ పనికనుకుంటా కొన్ని డెకాలం షీట్స్ రైల్వే వర్కర్లు తీసుకొచ్చి పని చేసారు. అందులో ఓ పెద్ద షీట్ సింగల్ పీస్ ది మిస్ అయ్యింది. రమేష్ బాబు గారు అంతా వెతికించారు. నేను కూడా వెతికా. ఎక్కడా దొరకలేదు. అంత త్వరగా అది గేటు ఎలా దాటి వెళ్ళిందా అని మేము అనుకునేవాళ్ళం. అప్పట్లో స్కూలు లైబ్రరీ నా చేతుల్లో ఉండేది. ఓ నెల రోజుల తరువాత లైబ్రరీలో కూర్చుని ఉన్న నా దగ్గరకు ఓ సార్ కొంత మంది పిల్లలతో వచ్చారు. చాలా దర్జాగా లైబ్రరీలో ఓ అలమారాను జరిపి దాని వెనుక ఉన్న డెకాలం షీట్ తీసుకుని వెళ్ళిపోయారు. నేను వెతుకుతున్న ఆ షీట్ నా రూం నుండే నేను కూర్చునే టేబుల్ వెనుక ఉన్న అలమార వెనుక నుండి బైటకు ఎలా వచ్చిందో నాకు తెలియలేదు. ఆ లైబ్రరి అంతకు ముందు చాణక్యులు గారు చూసేవారు. అది నాకు హాండోవర్ చేసుకునే సమయంలో ఓ తాళం ఆయన వద్ద ఉండేది. నా రూం ఎవరూ వెతకరని నా రూంలో దాన్ని దాచిపెట్టిన ఘనుడు ఆయన. ఆయనకు సహాయం చేసిన మరో సార్ ఇందులో పాత్రధారి. మొదటి సారి నాకు ఫ్యూజులు ఎగిరిపోయిన ఫీలింగ్. అవమానంగా అనిపించిన సందర్భం కూడా. రమేష్ బాబు గారి దగ్గరకు వెళ్లి ఆయనకు ఇది తెలియకపోయినా క్షమాపణ చెప్పి నాతో ఆయన వెతికించాలనుకున్న షీట్ నా గది నుండే బైటికి వచ్చిందని చెప్పినప్పుడు ఆయన ఒక చిరునవ్వు నవ్వి ‘జాగత్త జ్యోతి’ అన్న ఒక్క మాటతో చాలా చెప్పారు. తరువాత ఆయన స్వయంగా లైబ్రరీ తాళం మార్పించారు. నేను నమ్మిన వ్యక్తి, నేను ప్రేమించిన వ్యక్తి ఇలా నా నమ్మకాన్ని వాడుకున్నారని తెలిసి గాయపడిన క్షణం అది. ఎందుకంటే ఆ షీట్ కోసం నేను వెతుకుతూ చాణక్యులు గారి ముందే చాలా సార్లు అటూ ఇటూ తిరిగాను. ఇది చాలా చిన్న విషయం కావచ్చు. కాని మనం ప్రేమించిన మనుష్యులు మనలను ఓ వస్తువుగా చూస్తున్నారని తెలిస్తే, అందరూ దాన్ని తేలికగా తీసుకోలేరు కదా. నేను ఈ విషయాన్ని తేలికగా తీసుకోలేకపోయాను. తరువాత కూడా చాణక్యులు గారు నాతో ప్రేమగానే ఉండేవారు. నాకు మేలు కలిగేటట్లుగానే ప్రవర్తించేవాళ్ళూ. కాని ఏదో తెగిపోయిన ఫీలింగ్. అయినా ఆయనపై ప్రేమ ఎంత ఉండేదంటే – కష్టపడి క్షమించాను అతన్ని.

ఇక హెచ్. ఎమ్.లు మారి స్కూలులో చాలా మార్పులు జరిగాయి. ఆ తరువాత వచ్చిన హెచ్. ఎమ్ తో నాకు కొన్ని విభేదాలు వచ్చాయి. నన్ను ఒంటరిని చేసి నా కాన్పిడెన్స్ దెబ్బతీయాలనుకునే ఈ హెచ్ ఎమ్ దగ్గర నేను చాలా చాలా ఇబ్బంది పడ్డాను. ఆ సమయంలో చాణక్యులు గారి నుండి కొంత సహాయ సహకారం ఆశించాను. కాని రిటైర్మెంట్ కి దగ్గరగా ఉన్న ఆయన, అడ్మినిస్ట్రేషన్ దగ్గర మంచిగా ఉంటూ తన పబ్బం గడుపుకునే మార్గాన్ని ఎంచుకున్నారు. తాను ఇబ్బంది పడకూడదని నాకు చాలా అవసరం అయిన సమయంలో ఆయన నాకు దూరం జరిగారు. అసలు అంత లౌక్యంగా ప్రవర్తించే అవసరం అప్పుడు ఆయనకు లేదు. పైగా నాకు జరుగుతున్నది అన్యాయం అని నా దగ్గర ఒప్పుకున్నారు కూడా. అయినా సీటులో ఉన్న మనిషికి కోపం తెప్పిస్తే ఏదో గొడవ చేసి ఇబ్బంది పెడుతుందని, దాని కన్నా నాతో దూరంగా ఉండడం నయమని ఆయన నన్ను నా పాటికి ఒంటరిగా వదిలేసి లౌక్యాన్ని ప్రదర్శించారు.

మీరు చేస్తున్నదేమిటీ అని అడిగినప్పుడు అయన చిరునవ్వుతో కృష్ణ పరమాత్ముడు అర్జునిడికి గీతోపదేశం చేస్తున్నట్లు “ ఆ రోజు అప్పటి అవసరార్ధం అలా అన్నాను, ఈ రోజు ఇప్పటి అవసరార్ధం ఇలా అంటున్నాను” అంటూ తప్పుకున్నారు.

మొదటి సారి మనుష్యులు మన దగ్గర చూపే మంచితనంలోని ప్రయారిటీస్ అర్ధం అయిన సమయం అది. నాకు అప్పటి దాకా మనవాళ్ళు అంటే మన వాళ్ళే. కాని మనవాళ్ళూ కొన్ని సందర్భాలలోనే మన వాళ్ళని, ఎంతటి మంచివాళ్ళు కూడా తమకు నష్టం కలగదు అనుకున్నంతవరకే మంచివారిగా, మనవారిగా ఉంటారని చాణక్యులు గారితో స్నేహం నాకు నేర్పించింది. ఆయన చేసిన తప్పులను సరి చేయడానికి స్కూల్ లైబ్రరీ భాద్యత తీసుకున్న నేను ఆయన సరైన సమయంలో నా పక్కన నిలబడకపోవడంతో చాలా ఇబ్బంది పడ్డాను. అక్కడ నేను పెద్దగా నష్టపోయిందేమీ లేదు. లైబ్రరీ లో పోయిన పుస్తకాలకి (అవి ఎక్కడున్నాయో నాకు అప్పటికి తెలిసినా) డబ్బు కట్టి బైటకు వచ్చాను. డబ్బు కట్టకుండా తప్పించుకోవచ్చు. కాని దీనికి నేను మా హెచ్. ఎం ముందు చేతులు కట్టుకుని నిలబడాలి. అది నాకు ఇష్టం లేదు. అప్పుడు డిపార్టమెంట్ కి డబ్బు కట్టి ఆ చాప్టర్ క్లోజ్ చేసాను. దానికి ముందు చాణక్యులు గారిని “మీరు ఏం చేస్తున్నారో మీకు తెలుస్తుందా… ఆ రోజు మీరు చెప్పినదేమిటీ? ఇప్పుడు మీరు చేస్తున్నదేమిటీ అని అడిగినప్పుడు అయన చిరునవ్వుతో కృష్ణ పరమాత్ముడు అర్జునిడికి గీతోపదేశం చేస్తున్నట్లు “ ఆ రోజు అప్పటి అవసరార్ధం అలా అన్నాను, ఈ రోజు ఇప్పటి అవసరార్ధం ఇలా అంటున్నాను” అంటూ తప్పుకున్నారు. ఆయన చెప్పిన మరో సంగతి “పెద్ద పెద్ద తుఫానులు వచ్చినప్పుడు పెద్ద పెద్ద వటవృక్షాలు పెళపెళమని నేలరాలిపోతాయి అవి తల వంచవు కాబట్టి. కాని గడ్డిపరక చిరుగాలికే తలవంచి కలకాలం నిలిచి ఉంటుంది. తెలివిగలవాడు గడ్డిపరకగానే ఉండిపోతాడు. నీలా వట వృక్షంలా మారాలని అనుకోడు” అని.

అప్పటికి వయసు ఇచ్చిన ఆలోచన ఆ తెలుగు మాస్టారి మంచితనంలోకి లోతుగా చూసే అవకాశాన్ని నాకు ఇచ్చింది. అది నా జీవితంలో టూ టాలెంటేడ్ అంటూ నేను అడ్మైర్ చేసే వ్యక్తి నుండి నేను నేర్చుకున్న ఓ పాఠం.

చాణక్యులు గారిని వారి అన్ని బలహీనతలతో పాటు నేను నిజంగానే ప్రేమించాను అందువలన ఆయన చేసిన గాయం నన్ను చాలా బాధించింది.

ఓ సారి నాకు, చాణక్యులు గారికి స్కౌట్స్ అండ్ గైడ్స్ తరుపున బంగ్లాదేశ్ వెళ్ళే చాన్స్ వచ్చింది. అన్నీ రెడిగా ఉన్నాయి. కాని చాణక్యులు గారికి ఆర్గనైజర్ గోవిందరాజుల గారికి క్లాష్ వచ్చింది. ఈయనతో ఆ పక్కవారు అన్యాయంగా ప్రవర్తిస్తున్నారని నాకూ అనిపించింది. సూట్ కేస్ లు సర్ధుకుని సిద్దంగా ఉన్న నేను ఆయనను కలవడానికి ఇంటికి వెళ్ళాను. నేను ప్రయాణం చేయను. నాకు అవమానం జరిగింది. అంటూ ఈయన ఆగిపోయారు. ‘మీరు వెళ్ళకపోతే నేను వెళ్ళను, మీకు అవమానం జరిగితే నాకు జరిగినట్లే కదా’ అంటూ నేను ట్రిప్ మానుకున్నాను. అందువలన నాతో వారు అలాగే ప్రవర్తిస్తారు అనే ఇమెచ్యూర్డ్ ఆలోచన నాలో ఉండేది. కాని నాకు అలాంటి తోడు అవసరం వచ్చినప్పుడు పెద్ద మనిషిగా దగ్గర నిలవవలసిన సమయంలో ఆయన కేవలం కొంత అసౌకర్యానికి గురి అవుతానేమో అన్న ఆలోచనతో నా పక్కన నిలబడకుండా నన్ను ఒంటరిని చేయడం, “ఇది నీ యుద్దం నీవే చేసుకో” అని నన్ను వదిలివేయడం నేను మర్చిపోలేని విషయం. ఇప్పుడయితే అది నా కారెక్టర్, ఇది ఆయన కారెక్టర్ అని చాలా తేలికగా తీసుకుంటాను. కాని అప్పట్లో ఇతరుల నుండి కొన్ని expectations ఉండేవి. అందుకే నాకు ఆయన పై చాలా కోపం వచ్చింది. కాని ఇప్పుడు ఆ అనుభవంతో ఎదిగిన తరువాతే చాలా మంది దగ్గర జాగ్రత్తగా ఉండగలిగాను అని తెలుసుకున్నాక, ఆయన మీద కోపం అభావంగా మారిపోయింది.

ఈ సంఘటన తరువాత ఆయనతో మళ్ళి స్నేహాన్ని నేను కొనసాగించలేదు. రిటైర్ అయిన తరువాత ఆయన తిరిగి ఆ స్నేహం కోసం చాలా ప్రయత్నించినా ఆయనకు దూరంగానే ఉన్నాను. శతృవులు చేసిన గాయాల కన్నా మన అనుకున్న వాళ్ళూ, మనం ప్రేమించిన వాళ్ళు చేసే గాయాలు మనలను చాలా బాదిస్తాయి. చాణక్యులు గారిని వారి అన్ని బలహీనతలతో పాటు నేను నిజంగానే ప్రేమించాను అందువలన ఆయన చేసిన గాయం నన్ను చాలా బాధించింది.

టాలెంటెడ్ వ్యక్తులతో పరిచయాలు పెరిగాక కూడా వారి టాలెంట్ చూసి వారితో స్నేహం చేసి దగ్గరయి మెస్మరయిజ్ అయే అభిమానుల కోవలోకి నేను చేరకపోవడాని కారణం సోమయాజులు గారి స్నేహం నేర్పించిన పాఠం.

ఈ అనుభవం తరువాత నేను రైల్వే దాటి బైట ఎన్.జీ.వో లతో పని చేయడం మొదలెట్టాను. ఇక ఎప్పుడూ టాలెంట్ ఉన్న వ్యక్తులకు వారి టాలేంట్ పట్ల ఆడ్మిరేషన్తో దగ్గర అవ్వాలని నేను ప్రయత్నించలేదు. ఈ నిర్ణయం నన్ను చాలా ఉపద్రవాల నుండి నన్ను రక్షించింది. ఈ రోజు మనతో ప్రేమగా ఉన్న వాళ్ళు మరో సందర్భంలో కూడా అలాగే ఉంటారన్న విషయాన్ని నేను నమ్మడం మానేసాను. మనుషులు వారి ప్రయారిటీస్ బట్టే ఇతరులకు ప్రేమను అందిస్తారనే విషయాన్ని నేను ఆ తరువాత మర్చిపోలేదు. అందువలన అన్ని రకల జాగ్రత్తలు తీసుకుంటూ ఒంటరిగా నా సమస్యలు నేను పరిష్కరించుకునేదాన్ని. ఇవాళ ఎవరన్నా సహాయంగా వస్తే సరే. రేపు వాళ్ళు మనతో వస్తారన్న ఆశతో మాత్రం ఎప్పుడూ ఉండకూడదు అన్న పద్దతిలోనే నేను పనులు చేసుకోవడం మొదలెట్టాను. సాహితీ ప్రపంచంలో గొప్పవారు అనబడే టాలెంటెడ్ వ్యక్తులతో పరిచయాలు పెరిగాక కూడా వారి టాలెంట్ చూసి వారితో స్నేహం చేసి దగ్గరయి మెస్మరయిజ్ అయే అభిమానుల కోవలోకి నేను చేరకపోవడాని కారణం చాణక్యులు గారి స్నేహం నేర్పించిన పాఠం.

మనుషులు అవకాశవాదులని, సందర్భం అవసరం బట్టే వారిలోని మంచితనం స్థాయి కూడా మారుతూ ఉంటుదని నేను తెలుసుకున్న విషయం నాకు తరువాత చాలా ఉపయోగపడింది. ఇది నిజమని ఎన్నో అనుభవాలు నిరూపించాయి కూడా. కాని అవేవి ఆ తరువాత నన్ను బాధించలేకపోయాయి. నేను అటువంటి అనుభవాలకు సిద్దంగా నన్ను నేను తయారు చేసుకుని ఉండేదాన్ని. టాలెంట్ వేరు, వ్యక్తిత్వం వేరు. ఆకర్షణీయంగా ప్రవర్తించేవాళ్ళు, అతి ప్రేమగా మనతో మెసిలేవాళ్ళూ, కొన్ని సార్లు మనకు ఉపయోగపడిన వాళ్ళు కూడా ఆ తరువాత అన్ని సందర్భాలలో మనతో కలిసి నడవరు అన్నది నేను చాలా సందర్భాలలో తెలుసుకున్న సత్యం.

ఆ అనుభవం తరువాత నాకు మొదట గుర్తుకు వచ్చిన వ్యక్తి మా రమేష్ బాబు గారు. ఆయన ఆ లైబ్రరీని నాకు ఇస్తూ ..ఎవరినీ నమ్మకు చివరకు ఇబ్బంది పడతావు అన్న మాటలు నాకు వినిపించాయి. చాలా సందర్భాలలో చాణక్యులు గారి మాటల ఆకర్షణలో పడి నేను రమేష్ బాబు గారు ప్రేమగా ఇచ్చిన చిన్న చిన్న సలహాలను ఆయన చాదస్తపు పలుకులుగా తీసుకున్నాను. కాని నేను పూర్తిగా ఇలాంటి వ్యక్తుల మధ్య నష్టపోకుండా నాకే తెలియకుండా ఆయన నన్ను కాపాడుతూ ఉన్నారని నాకు ఎప్పటికో గాని అర్ధం కాలేదు.

మంచి మనసున్న అతి సామాన్యుడు –  మా రమేష్ బాబు సర్

స్కూల్ లో లైబ్రరీ చూసే టిచరుకు అదనంగా ఓ వంద రూపాయలు వచ్చేవి. లైబ్రరీ నాకు మార్చిన తరువాత కూడా ఇది నాకు తెలియదు. నేను పట్టించుకోలేదు. కాని ఓ రెండు నెలల తరువాత రమేష్ బాబు గారు నా పే స్లిప్ చూసి అనుమానం వచ్చి తానే పూనుకుని ఆ వంద నాకు వచ్చేలా చేసారు. అంటే ఆ డబ్బు అప్పటి దాకా చాణక్యులు గారి జీతంలోనే వస్తూ ఉండేది. నాకు ఈ రూల్ సంగతి ఎవరూ చెప్పలేదు. నేను డబ్బు విషయాలలో ఎప్పుడూ అంత ఆసక్తి చూపలేదు. రమేష్ బాబు గారు పట్టించుకోకపోతే ఆ సంగతి నాకు ఎప్పటికో కాని తెలిసేది కాదు. రమేష్ బాబు గారు ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోయేటప్పుడు నన్ను లైబ్రరీ లెక్కలు చూడమన్నారు. చాలా పుస్తకాలు కనిపించకుండా పోయాయని ఆయనకు చెప్పాను. ఆవి మెల్లిగా ఒకో సంవత్సరం రైట్ ఆఫ్ చేయించమని ఆయన చెప్పారు. అది అవసరం అని, అవి ఎప్పటికీ తిరిగి రావని ఆయన చెప్పారు. నేను ఆ విషయాన్ని నిర్లక్ష్యం చేసాను. మన చాణక్యులు సార్ ఉన్నారు కదా ఆయన చూస్తారు, సమయం వచ్చినప్పుడు సహాయం చేస్తారు అన్న భావం నాలో ఉండేది అనమాట!

రమేష్ బాబు గారు స్కూలు నుండి ట్రాన్స్పర్ అయి వెళ్ళిపోతునప్పుడు ఓ ఆఫీసరు గారికి రొమీలా థాపర్ పుస్తకాలు రెండు ఆయన ఇచ్చి ఉన్నారు అని రికార్డు చూసి గుర్తు చేసాను. “పర్లేదు సర్ ఆ మిసింగ్ పుస్తకాల లిస్ట్ లో కలిపి ఉంచుతాను. తరువాత చూద్దాం” అన్నాను ఆయన మౌనంగా నా మాట విని నేను ఒక్కదాన్ని ఉన్నప్పుడు నా దగ్గరకు వచ్చి జేబులోనుండి ఐదు వందల రూపాయలు తీసి నాకు ఇచ్చి ఆ పుస్తకాలు కొని అలమారలో పెట్టు. నా పేరు దగ్గర రెడ్ మార్క్ నాకు ఇష్టం లేదు. ఎదో మానేజ్ చేయడం నాకు ఇష్టం ఉండదు. నా వల్ల ఎవరూ ఇబ్బంది పడకూడదు, నీవు కూడా…. అని చెప్పి నాకు ఆ డబ్బు ఇచ్చి వెళ్ళారు. అంత ఖచ్చితంగా స్కూల్ వస్తువుకు డబ్బు కట్టిన ఏకైక వ్యక్తి ఆయన మాత్రమే.

నేను మిస్సింగ్ పుస్తకాల లిస్ట్ తయారు చేస్తున్నప్పుడు నాకు అర్ధం అయింది ఆయన నీతి నిజాయితి. ఇది చాలా చిన్న విషయం కాని ఏ మాత్రం ఆకర్షణ లేని ఆయన, అందరూ చేతకాని వాడు అని బాహాటంగా చెప్పుకునే ఆయన నాకు జరగబోయే నష్టాన్ని ఊహించి తన వంతుగా నాకు సహాయం చేసారని అర్ధం అయినప్పుడు ఆయన పట్ల నాకు కలిగిన భావం మాటలలో చెప్పలేను. ఆయన చెప్పిన మాట “డబ్బు ముఖ్యం కాదు జ్యోతి. మనం కక్కూర్తి పడ్డాం అన్న పేరు మాత్రం మనకు వద్దు”. ఇది నేను ఈ రోజుకీ పాటించే సూక్తి. డబ్బు మిగుల్చుకోవడానికి మన నమ్మకాలను, వ్యక్తిత్వాన్ని కుదువ పెట్టడం అనవసరం అని ఈ చిన్న విషయంతో పాఠంలా బోధించారు రమేష్ బాబు గారు.

ఏమ్మా లేటయింది అని ఆమెను ఈయన అడిగితే, “తల స్నానం చేసి వచ్చా. లేటయ్యింది ఇలాగే అప్పుడప్పుడూ అవుతుంది” అని ఆమె బదులిచ్చినప్పుడు ఆమెని కంట్రోల్ చేయలేని ఆయన మెతకతనాన్ని విమర్శించిన వాళ్ళలో నేనూ ఉన్నాను.

రమేష్ బాబు గారి మంచితనం కారణంగా స్టాప్ చాలా అడ్వాన్టేజ్ తీసుకునేవారు. ఆయనకు అది తెలుసు. ఆయన గొప్ప అడ్మినిస్ట్రేటర్ కాదని అందరం అనుకునేవాళ్ళం. స్కూల్ అసెంబ్లీ అయ్యాక ఆయన అక్కడే స్టాప్ ని స్టేజీ వద్దకు పిలిచి కొన్ని గైడ్లైన్స్ ఇచ్చేవారు. నేను దానికి రచ్చబండ మీటింగ్ అని పెరు పెట్టి పైకే ఆయనతో అనేదాన్ని. ఆయన దాన్నీ ఎంజాయ్ చేసేవారు. ఓ టీచర్ లేటుగా వచ్చినప్పుడు, ఏమ్మా లేటయింది అని ఆమెను ఈయన అడిగితే, “తల స్నానం చేసి వచ్చా. లేటయ్యింది ఇలాగే అప్పుడప్పుడూ అవుతుంది” అని ఆమె బదులిచ్చినప్పుడు ఆమెని కంట్రోల్ చేయలేని ఆయన మెతకతనాన్ని విమర్శించిన వాళ్ళలో నేనూ ఉన్నాను. తరువాత మరో చోట క్రికెట్ చూడాలని ఆయన్ని దబాయించి ఇంటికి వెళ్ళిన స్టాప్ గురించి నాకు తెలుసు. కాని ఎక్కడా అకడమిక్ రిజల్ట్ మాత్రం పడిపోలేదు. ఏ పనీ ఆగలేదు.

ఇతరులు ఆయన్ని లెక్కలేనట్లు చూస్తుంటే నేను మాత్రం ఆయనతో వారిని కంట్రోల్ చేయలేక పోతున్నారని విమర్శించేదాన్ని. దాన్ని ఆయన నవ్వుతూ వినేవారు. సమాధానం చెప్పేవారు కాదు. సార్ పక్క స్కూల్ హెడ్ లు లాగా మీకు పవర్ఫుల్గా ఉండడం రాదు అని అనేదాన్ని, అవునా అంటూ నవ్వేవారు. స్కూల్ తరువాత ఆయన ఒక్కడే కూర్చుని చాలా పని చేసేవారు. కొన్ని సార్లు మేం కలిసి పని చేయవలసి వచ్చేది. అప్పుడు ఐదు దాటిందంటే, సర్ ఇక చేయను కడుపులో మంటలు మొదలయ్యాయి. తినాలి అంటే నవ్వుతూ అక్కడున్న అందరికీ సమోసాలు, టీ తెప్పించి ఇప్పించేవారు. చాలా సార్లు ఆయన ప్లేటులో సమోసా మిగిలించకుండా తిని నాకు ఆకలి ఎక్కువ అని నవ్వినప్పుడు చిరునవ్వు నవ్వేవారు. అది చూసి అప్పుడు పని చేస్తున్న మిగతా టీచర్లు అంతా ఆయన గురించి నాతో చెబుతున్నప్పుడు “మీ డాడీ” అంటూ వెక్కిరించేవాళ్ళూ. నేను నిజంగానే ఆయన వద్ద ఆ దగ్గరితనాన్ని అనుభవించాను.

అలా అని నాకేమీ ప్రత్యేకమైన ప్రివిలేజిస్ ఆయన ఇవ్వలేదు. అందరికన్నా ఎక్కువ పని చేయించుకునేవారు. కాని ఇతరుల దగ్గర “ఆ అమ్మాయి బాగా పని చేస్తుందయ్యా” అని చెప్పేవారు. ఆ మాట మనకు ఉద్యోగం చేసే దగ్గర ఎంత అవసరమో నాకు మిగతా ప్రిన్సిపల్స్ దగ్గర పని చేస్తున్నపుడు అర్ధం అయ్యేది. అదే పని సంవత్సరాల నుండి చేస్తునే ఉన్నాను. ఆయన దగ్గర మాత్రమే అది పనిలా, కొందరి దగ్గర చాకిరిలా ఎందుకు అనిపించేదో మాత్రం ఇప్పుడు స్పష్టంగా చెప్పగలను.

నేను ప్రొద్దుటి పూట త్వరగా నిద్ర లేచేదాన్ని కాదు. స్కూలుకి దగ్గరగానే ఉండేవాళ్ళం అందరం కూడా. ఏదైన ఈవెంట్ ఉన్నప్పుడు ఆయన ప్రొద్దున ఆరుగంటలకు ఫోన్ చేస్తే, సర్ నిద్రపోతున్నా అని ఠక్కున పెట్టేసేదాన్ని. ఓ సారి నేను ఏడుకు ముందు నిద్ర లేవను సర్ అని చెప్పినప్పుడు ఆయన నవ్వేసి అప్పటి నుండి నాతో రాత్రుల్లు మాట్లాడేవారు అవసరం అనుకుంటే. కొన్ని సందర్భాలలో ప్రొద్దున ఆరు గంటలకి డ్యూటికి వెళ్ళవలసి వచ్చేది. ముఖ్యంగా నేషనల్ ఫెస్టీవల్స్ టైంలో. అప్పుడు అయిదింటికి నన్ను నిద్రలేపడానికి ఫోన్ చేసేవారు ఆయన. అమ్మ ఫోన్ ఎత్తితే లేపండమ్మా స్టేడియం కు వెళ్ళాలి అని చెప్పేవారు. ఒక సారి పనిలోకి దిగితే నేను అది పూర్తి చేసేదాకా లేచేదాన్ని కాదు. తిరిగి ఇక చాల్లే అని నన్ను ఇంటికి పంపించేది కూడా ఆయనే.

ఏం పిల్లవమ్మా అర్ధరాత్రి తిరుగుతున్నావ్ అని దెబ్బలాడేవరు. ఆయనకు ఏడు గంటలంటే అర్ధరాత్రి మరి. అప్ప్పుడు చిరాకనిపించేది కాని అది కన్స్పర్న్ అని తరువాత అర్ధం అయింది.

స్కౌట్ కాంప్ ల వాతావరణం గురించి ఆయనకు తెలుసు కదా. ఆ కేంప్ లలో మాతో ఆయన వచ్చారంటే లేడీ టీచర్లున్న టేంట్ బైట రాత్రిల్లు మేము పని చేస్తుంటే కుర్చీ వేసుకుని కూర్చుని రెండయినా మూడయినా మాతో పాటే మౌనంగా కునికి పాట్లు పడేవారు. మళ్ళీ ప్రొద్దున నిద్ర లేచి వచ్చి టెంట్ బైట నుంచుని నిద్ర లేపేవారు. కాంప్లకు వెళ్ళిన టీచర్లను చులకనగా చూసే వాతావరణం ఉన్న చోట అయన అలా మాకు, ముఖ్యంగా ఆక్టివ్ గా ఉన్న ఓ ఎంగ్ సింగిల్ విమెన్ కు అండగా నిలబడేవారని నాకు చాలా కాలం తరువాత అర్ధమయింది.

ఆయన చాలా చాదస్తంగా మాట్లాడేవారు కూడా. ఎప్పుడన్నా ఏడు గంటలకు బైట కనిపించి నడిచి వెళ్తున్న ఆయనను చూసి బండి ఆపి సర్ రండి అంటే మొదట్లో సంకోచించినా తరువాత ఒకటి రెండు సార్లు బండి మీద కూర్చునేవారు. పైగా ఏం పిల్లవమ్మా అర్ధరాత్రి తిరుగుతున్నావ్ అని దెబ్బలాడేవరు. ఆయనకు ఏడు గంటలంటే అర్ధరాత్రి మరి. అప్ప్పుడు చిరాకనిపించేది కాని అది కన్స్పర్న్ అని తరువాత అర్ధం అయింది. నా గురించి అందరి దగ్గరా గర్వంగా చెప్పేవారు. సొంత కూతురి గురించి చెప్పినట్లు. ఇవన్ని ఆయన మా స్కూల్ నుండి వెళ్లిపోయిన తరువాత నాకు తెలిసిన సంగతులు. ముఖ్యంగా ఇతర హెచ్ ఎం. లను గమనించిన తరువాత అందరూ పిచ్చాయన అనుకున్న ఆయనలోని మంచితనం నాకు ఇంకా బాగా అర్ధం అయింది. ఆయన చాలా మంది టీచర్లతో అంతే భాద్యతగా, ప్రేమగా ఉండేవారని తరువాత తెలిసింది.

ఆయనకు నర్సింహులు అనే ఓ స్నేహితుడు ఉండేవారు. ఆయన మరణించిన తరువాత ఆ విషయాన్ని ఫోన్ చేసి నాకు చెప్పిన కొన్ని గంటలకే నర్వస్ అటాక్తో రమేష్ బాబు గారు మొదటిసారి మంచం పట్టారు. ఆయన జీవితంలో చేసిన ఆఖరి ఫోన్ కాల్ నాకే అని తరువత ఓ సీనియర్ టీచర్ చెబితే తెలిసింది. ఆమె ఇంటి నుండే ఆ ఫోన్ ఆయన నాకు చేసారని, తరువాత ఇంటికి వెళ్ళిన గంటకే ఆయనను హాస్పిటల్ కు తీసుకువెళ్లారని ఆమె చెబితేనే నాకు తెలిసింది. ఆయనతో నేను కలిసి పని చేసిన రోజులలో, ఆయనని ప్రేమిస్తూనే ఈయన ఇలా కాకుండా కొంత అధికారంతొ, స్టైల్ గా ఉంటే బావుండు అని అనుకునేదాన్ని. ఆయనని వేరే హెచ్. హెమ్ లతో పోలుస్తూ ఏంటి బాబు ఈ మనిషి అనుకుంటూ ఆయనతో “సర్ కొంత డాబుగా ఉండండి” అని చెప్పేదాన్ని. కాని అన్నిటినీ ఓ నవ్వుతో కొట్టిపడేసేవారాయన. నేను రైల్వే బైట కొన్ని ఇతర కార్యక్రమాలను చేస్తున్నానని తెలిసి సంతోషించి అభినందించింది ముందుగా ఆయనే. ఓ కార్యక్రమానికి సర్ టీ అండ్ స్నాక్స్ ఇద్దామనుకుంటున్నా కొంత డబ్బు ఖర్చుఅవుతుంది అని మాటవరుసగా అంటే నవ్వి ఇంటికి వెళ్ళి ఆ పెద్ద కార్యక్రమానికి స్నాక్స్ కోసం డబ్బు పంపించారు. పైగా నేను ఇచ్చినట్లు అనౌస్న్మెంట్లు గట్రా చేస్తావేమో అలాంటివి చేయకు అని గట్టిగా వార్నింగ్వా ఇచ్చారు.

నేను నా ఇంటి మనుషుల నుండి కాకుండా ఇతరుల దగ్గర, నా సర్వీసు మొత్తంలో నా సొంత పని కోసం డబ్బు తీసుకుంది, ఆయన దగ్గర నుండి ఆ ఒక్క సందర్భంలో మాత్రమే. అది చిన్న మొత్తమే కాని ఎవరి దగ్గరా రూపాయి పుచ్చుకోని అహం నాది. ఆయన విషయంలో ఇప్పటికి అలా డబ్బు పుచ్చుకోవడం నా హక్కుగానే ఫీల్ అవుతాను. నేను చేసిన మొదటి వాలంటరీ కార్యక్రామానికి తోడ్పాటిచ్చి అలా నన్ను ఆశిర్వదించారాయన అనిపిస్తుంది.

అందరి ముందు “మేము ఒక్క టీం తెలుసా” లాంటి డైలాగులు విసర్లేదు. “ఈమె నా శిష్యురాలు” అంటూ ఎవరి దగ్గరా చెప్పుకోలేదు. కాని నాకు అవసరం ఉన్నప్పుడు, ఇబ్బంది పడుతున్నప్పుడు నా పక్కన నిలబడింది మాత్రం ఆయనే.

మా బాబు మొదటి పుట్టినరోజు సమయంలో చాలా గజిబిజిగా ఉండింది నా జీవితం. మా అన్నయ్య ఆ ఫంక్షణ్ చాలా గ్రాండ్ గా చేయాలని నిశ్చయించాడు. అప్పుడు మా నాన్నగారు రమేష్ బాబు సార్ని కలిసి ఈ ఫంక్షణ్ కు రమ్మని చెబుతూ బాబుతో కేక్ ఆయనే కట్ చేయించాలని చెప్పి వచ్చారు. ఆ ఫంక్షన్ కి భార్యా భర్తలిద్దరూ వచ్చి నిలబడి మా వాడితో కేక్ కట్ చేయించి నాకు అండగా నిలబడి ఓ ఒంటరి తల్లిగా మా స్టాప్ ముందు నాకు ఆయన ఇచ్చిన కాన్పిడెన్స్ నేను మరచిపోలేను. ఓ పక్కన రమేష్ బాబు గారు, ఆంటీ, మరో పక్క అమ్మ నాన్న గార్లు, అన్న వదినలు ఆ సీన్ ఇచ్చిన ఆత్మవిశ్మాసం ఈ రోజుకీ నన్ను నడిపిస్తుంది. ఇది కోట్లు సంపాదించిన వారికీ అందని ధైర్యం.

ఇప్పుడు చాలా అనుభవాల తరువాత చాలా మంది దగ్గర పని చేసిన తరువాత నేను అర్ధం చేసుకున్నది, ఆకర్షణంగా మాట్లాడుతూ విపరీతమైన టాలంట్ ఉన్న మా చాణక్యులు గారి లాంటి వారి కన్నా రమేష్ బాబు గారి లాంటి సామాన్యుల అండే నాకు ఉపయోగపడింది అని. చాణక్యులు గారిలా ఈయన పెద్ద పెద్ద మాటలు ఏనాడు మాట్లాడలేదు. ఆయనకు అంత ఆకర్షణంగా మాట్లాడడం రాదు కూడా. అందరి ముందు “మేము ఒక్క టీం తెలుసా” లాంటి డైలాగులు విసర్లేదు. “ఈమె నా శిష్యురాలు” అంటూ ఎవరి దగ్గరా చెప్పుకోలేదు. కాని నాకు అవసరం ఉన్నప్పుడు, ఇబ్బంది పడుతున్నప్పుడు నా పక్కన నిలబడింది మాత్రం ఆయనే. ఈయన హాండ్ రైటింగ్ అస్సలు బావుండేది కాదు. అసలు బావున్నది అన్న ఒక్క అంశం కూడా ఆయనలో ఉండేది కాదు. కాని ఆఫీసర్లు ఈయనను అడిగి రైల్వే పరీక్షలకు ప్రశ్నలను తయారు చేయించుకునే వారని, అయన పట్ల కొందరికి చాలా గౌరవం ఉండేదని. వాళ్ళూ ఈ ఆర్భాటాలు చేసే వారితో నవ్వుతూ మాట్లాడుతూ ఉన్నా చాలా కాన్పిడెన్షియల్ విషయాలు రమేష్ బాబు గారితో చేయించుకునేవాళ్ళని ఆయన స్కూల్ వదిలి వెళ్ళే దాకా నాకు తెలియదు.

“నేను నిన్ను నమ్ముతాను” అన్న భరోసా నాకు ఆయన మాటలో వినిపించేది. ఆయన లేని లోటు నాకీనాడు చాలా బాధిస్తుంది.

రమేష్ బాబు గారు మా స్కూల్ నుండి ట్రాన్స్ఫర్ అయి తిరిగి గుంతకల్ వెళ్ళి చివర్లో మళ్ళి ఇక్కడ జూనియర్ కాలేజిలో రిటైర్ అయ్యారు. తరువాత కొని సంవత్సరాలకు చనిపోయారు. ఆయన చనిపోయినప్పుడు నేను డిపార్ట్మెంట్ లో అనాధను అయ్యానన్నది అర్ధం అయింది. ఆయన ఉన్నప్పుడు కూడా నేనెప్పుడన్నా ఏ విషయం గురించి చెప్పబోయినా ఆయన నన్నే మందలించేవారు. అంతగా ఇన్వాల్వ్ అవద్దూ అని నాకే నచ్చచెప్పబోయేవారు. ఆయనపై చాలా కోపం వచ్చేది కూడా. కాని నేను నిరాశలో ఉన్నానన్నా ఏదైనా సమస్యలో ఉన్నానని తెలిసినా ఎలా తెలిసేదో ఆయనకి ఓ ఫోన్ చేసి “ఏంటీ ఎలా ఉన్నావ్” అని తప్పకుండా అడిగేవారు. నేను విషయం చెప్పకపోతే తరచి అడిగేవారు కాదు. కాసేపు మాట్లాడి ఫోన్ పెట్టేసేవాళ్ళూ. కాని ఎప్పుడూ “నేను నిన్ను నమ్ముతాను” అన్న భరోసా నాకు ఆయన మాటలో వినిపించేది.

ఆయన లేని లోటు నాకీనాడు చాలా బాధిస్తుంది. ఆయన కారణంగా సాదా సీదా మనుష్యుల పట్ల ప్రేమ చాలా పెరిగింది. పై హంగులు చూసి. ముఖ్యంగా ఆకర్షణీయమైన మాటలు నమ్మి ఎవరితో ప్రొఫెషనల్గా కూడా దగ్గర కాకూడదని నేను నేర్చుకుంది ఈ అనుభవాల తరువాతే.

రచయిత్రి పి. జ్యోతి హిందీ ఉపన్యాసకులు. చక్కటి సమీక్షకురాలు. హైదరాబాద్ లో పుస్తకాల పట్ల అభిరుచి పెంచడంలో విశేషంగా కృషి చేస్తున్న spreading Lights నిర్వాహకురాలు కూడా. పుస్తకం, సినిమా తనకు రెండు కళ్ళు. ప్రపంచానికి గవాక్షాలు. ఇటీవలే వీరు రచించన దిలీప్ కుమార్ సినిమాల సమగ్ర పరిచయ పుస్తకం కోసం ఈ లింక్ క్లిక్ చేసి తెప్పించుకోవచ్చు.

కాగా, తెలుపు కోసం రాస్తున్న ఈ శీర్షికలో తాను మొదటిసారిగా అంతర్ముఖంలోకి చూసుకుంటున్నారు. జీవితాన్నే పుస్తకంగా అనుభవాలనే చలన చిత్రంగా ఎంచి సరళమూ, నిరాడంబరమూ, సామాన్యమూ ఐన జ్ఞాపకాలను ఆత్మీయంగా పంచుకుంటున్నారు. ఈ శీర్షికలో మొదటి వ్యాసం మనసు పొరల్లో. రెండో వారం చిన్ననాటి చిరుతిళ్లు. మూడో వారం చిన్ననాటి సంగతులు. నాలుగో వారం పంచుకోవడంలో అనందం. ఐదో వారం ఒంగోలు గిత్తలు ….మా తాత. ఆరో వారం ‘చందమామ’తో మొదలు.  ఏడో వారం ఎవరు రౌడీలు? ఎవరు మర్యాదస్తులు??. ఎనిమిదో వారం నాకు తెలిసిన స్త్రీ వాది – My First Feminist. తొమ్మిదో వారం ఆ మూమెంట్ గోదావరి లాంటిదే. పదోవారం నేను వెతుకుతుంది గురు దత్ లాంటి స్పందించే హృదయాన్ని. పదకొండో వారం అవును. నా మేని ఛాయ నలుపు. పన్నెండో వారం ఇప్పుడు నేను ఎవరికీ కొరకరాని కొయ్యను. మీరు చదువుతున్నది పదమూడో వారం జ్ఞాపకాలు.

More articles

1 COMMENT

  1. అంత పాత సంఘటనలను అంత సూక్ష్మంగా అలా ఎలా గుర్తు పెట్టుకోగలరు మీరు? మీది ఒక విలక్షణమైన వ్యక్తిత్వం. మీ ఒంటరితనం మీరొక వరమైందని నాకు అనిపిస్తోంది.

    ఈ సృష్టిని మీరు ఏర్పరచుకున్న దృష్టికోణంతో మాత్రమే కాకుండా, మహర్షులు ప్రకటించిన కోణంలోనూ మీరు పరికించాలి.

    అలా చేయకపోతే మీకు 1D దృశ్యం మాత్రమే గోచరిస్తుంది. సత్యం ఒకటే, దానిని కాంచే కోణాలు అనేకం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article