Editorial

Monday, December 23, 2024
కాల‌మ్‌మనసు పొరల్లో : ఒంగోలు గిత్తలు ....మా తాత – పి.జ్యోతి ధారావాహిక

మనసు పొరల్లో : ఒంగోలు గిత్తలు ….మా తాత – పి.జ్యోతి ధారావాహిక

రాముడూ, శబరి అంటూ కథలు చెప్పగా విన్నాను. ఆ శబరి ఎంగిలి ఆ రాముడు తినడం నేను చూడలేదు. కాని ఓ మనిషి – రెండు ఎడ్లు కలిసి కూర్చుని గడ్డి నమలడం నేను చూసిన అత్యద్భుతమైన విషయం. నేలపై కూర్చున్న ఆ ఎడ్లు, నులక మంచం పై కూర్చున్న ఆ తాత ముగ్గురు ముఖాలలో కనపడ్డ ఆ తృప్తి నా మదిలో సదా నిలిచిపోయే దృశ్యం.

పి.జ్యోతి

పాత రోజులను ఆ నాటి మనుష్యులను తలచుకోవడం అంటే అది కేవలం బాల్యంలోని తీపిని గుర్తుకు తెచ్చుకోవడం మాత్రమే కాదు, అంతరించిపోతున్న కొన్ని గుణాలను, అడుగంటుతున్న నమ్మకాలను నిలుపుకునే ప్రయత్నం కూడా.

నిజానికి మనిషి ప్రాధమిక అవసరాలు ఎప్పుడూ ఒకటే. వాటిలో మార్పు ఏ తరంలోనూ జరగదు. కాని మానవ జీవన విధానంలో ప్రాధాన్యతలు మారుతూ ఉన్నాయి. మనిషి ఆలోచనా పరిధి విస్తారం అవవలసిన సమయంలో కుచించుకు పోతూ, ఇదేమని ప్రశ్నిస్తే ఈ మార్పు సాధారణమని, అవసరమని, ప్రామాణికం అని మనుషులు వాదించడం కనిపిస్తూ ఉంటుంది. ‘నా’ కోసం మాత్రమే జీవించడం అన్నది తెలివైన పనిగా భావించేవారి సంఖ్య ఎక్కువ అవుతుంది. ఎప్పుడైనా ఏదైనా సామూహక కార్యక్రమం చేయాలనుకున్నా అది అవసరమా, అది చేస్తే ఎవరికి ఎంత లాభం అసలు మనమెందుకు ఆ పనులలో పాలు పంచుకోవాలి అనే వాదనలు ఎక్కువ అవుతున్నాయి. కానీ నా జ్ఞాపకాల్లో ‘మన’ కోసం జీవించిన వారు పదే పదే గుర్తొస్తారు.   అంతేకాదు, అమ్మాయిల పరిధి విషయంలో కూడా నా జ్ఞాపకాల్లో అనేక విషయాలు గతంలోని సాహసాలను గుర్తు చేస్తాయి.

నేను ఇప్పటి నేనులా మారడానికి నా జీవితంలో నేను చూసిన వ్యక్తుల ప్రభావం నాపై ఎక్కువ అనిపిస్తూ ఉంటుంది. అవి చిన్న సంఘటనలే కావచ్చు, అతి సాధారణమైన విషయాలే కావచ్చు కాని వాటి ప్రభావం మాత్రం నాపై అనంతం.

ఒకప్పుడు ఆడపిల్లలను ఇంటి నుంచి బైటికి వెళ్తుంటే ఏదీ చూడకుండా, దేనినీ పట్టించుకోకుండా తల వంచుకునే ఇంటికి తిరిగి రమ్మని చెప్పేవారు. అది స్త్రీ మర్యాద అనేవారు. ఎవరికి ఏమైనా మనం తల ఎత్తకూడదు. ఏది చూసినా పెదవి విప్పకూడదు. అసలు మనకు అవసరం అయితే తప్ప ఏ పని చేయకూడదు. ఏది చేసినా అది ‘నాకు’ అవసరమా అన్న ఆలోచన మనసులో ఎప్పుడు మెదులుతూ ఉండాలి. ఇలా జీవించడమే సగటు మర్యాద. ఇలాంటి వాదనలప్పుడే నాకు ఆ నాటి మనుషులు గుర్తుకు వస్తూ ఊంటారు. నాతో పాటు ఇలాంటి అనుభవాల మధ్య జీవించిన వారు కూడా ప్రస్తుత పరిస్థితులకు తమను తాము అనుకూలంగా మార్చుకుంటూ తమ జీవిత పరిధులను పరిమితం చేసుకుని జీవించడం చూస్తున్నప్పుడు కూడా ఆ పని చేయలేని చేతకానితనం నన్ను ఇబ్బంది పాలు చేస్తూ ఉంటుంది. ఆ ఇబ్బందిని తట్టుకోవడానికి కూడా ఈ జ్ఞాపకాలు నాకు స్పూర్తినిస్తాయి.

ఇప్పటి స్టేషను పైన ఒంగోలు గిత్త – మా తాత కొట్టమూ…

ఒంగోలు ప్రాంతపు ఎడ్ల గురించి కొందరయినా వినే ఉంటారు వీటిని గిత్తలు అని కూడా సంబోధిస్తారు. ఇప్పుడు కూడా ఒంగోలు స్టేషన్ పై ఈ గిత్త బొమ్మ కనిపిస్తుంది. ఒంగోలు గిత్తలకు ప్రపంచంలోనే గొప్ప పేరు ఉంది.

ఒంగోలు గిత్త ఇప్పటి స్టేషను పైన. ఇవి ఒంగోలు ప్రాంతానికే గర్వకారణంగా ఉండేవి

తాత కొసం కొష్టం దగ్గరకు వెళ్ళాను. అక్కడ ఎండు గడ్డి పరిచిన చోట రాజసంతో రెండు ఎడ్లు కూర్చుని గడ్డి మేస్తున్నాయి. అవి ఎంత ఎత్తుగా అద్భుతంగా కనిపించాయంటే వాటిని వర్ణించడానికి భాష చాలదు నాకు.

అప్పట్లో రైతుల ఇంట ఒక ఎడ్ల జత తప్పకుండా ఉండేది మా ఇంట్లో కూడా మంచి బలిష్టమైన ఎడ్లు ఉండేవి. మా తాతగారు వాటి దగ్గరే ఎక్కువ సమయం గడిపేవారు. చాలా బలంగా పెద్ద గంగ డోలుతో మెడకు కట్టిన గంటలతో పెద్ద పెద్ద కళ్ళతో అవి భలే ముచ్చటగా ఉండేవి. ఇంట్లో రాజభోగాలు అనుభవించేవి. మా ఇంటికి కుడి వైపున ఉన్న కొష్టంలో వాటికి ప్రత్యేకమైన స్థలం ఉండేది. మా తాతగారు వాటితోనే ఎక్కువ సమయం గడిపేవారు. అప్పట్లొ పొలంలో కొంత మేరను వీటికి గడ్డి కోసమే వదిలేసేవారట. ఈ ఎడ్లకు గడ్డి వేస్తున్నప్పుడు మా తాతను నేను చూసిన దృశ్యం నా మనసులో ఇంకా అలానే గుర్తుండిపోయింది. బాగా పెరిగిన గడ్డిని వీటికి మేతగా వేసేవారు. రైలు దిగి బస్సు పట్టుకుని ఊరు చేరిన తరువాత ఇంట్లోకి వెళ్లి తాత గురించి అడిగితే ఆ కొష్టంలో ఉన్నాడు అనే జవాబు వచ్చేది. చాలా చిన్నప్పుడు గౌను వేసుకున్న నేను (పది సంవత్సరాలకే గౌన్లౌ బంద్ మాకు. సో అప్పడు చిన్న దాన్నే) తాత కొసం కొష్టం దగ్గరకు వెళ్ళాను. అక్కడ ఎండు గడ్డి పరిచిన చోట రాజసంతో రెండు ఎడ్లు కూర్చుని గడ్డి మేస్తున్నాయి. అవి ఎంత ఎత్తుగా అద్భుతంగా కనిపించాయంటే వాటిని వర్ణించడానికి భాష చాలదు నాకు. అవి ఎంత పెద్దవి అంటే, వాటి మద్య మా తాతగారు కనిపించలేదు. అవి వాటి ముందు వేసిన పచ్చ గడ్డి మేస్తున్నాయి. వాటి మధ్యన అంత పెద్ద ఎత్తున్న మా తాతగారు కూడా చిన్నగా కనిపిస్తున్నారు. ఆయన కూడా ఆ గడ్డి నములుతున్నారు. మనుషులు గడ్డి తినడం ప్రత్యక్షంగా చూడడం అదే మొదటిసారి. దగ్గరకు వెళ్ళి నువ్వేందుకు గడ్డి తింటున్నావు తాతా అంటే నవ్వుతూ ఆ గడ్డి వెనుక ఉన్న తెల్లని బొడుపుని నా నోట్లో పెట్టారు. అది తీయగా ఉంది. గడ్డి వెనుక భాగాన ఉన్న ఆ తెల్లని బొడుపుని తాను తింటూ గడ్డి ఆ ఎడ్ల నోటికి అందిస్తున్నారు మా తాత గారు. ఆ గడ్డి మూడు అడుగుల పొడవున ఉంది.

గడ్డి నమిలిన తాత – ముఖాలలో ఎంత తృప్తి…

ఎడ్ల మధ్యన చనిపోవాలని ఊరు చేరిన మా తాతగారు

రాముడూ, శబరి అంటూ కథలు చెప్పగా విన్నాను. ఆ శబరి ఎంగిలి ఆ రాముడు తినడం నేను చూడలేదు కాని ఓ మనిషి – రెండు ఎడ్లు కలిసి కూర్చుని గడ్డి నమలడం నేను చూసిన అత్యద్భుతమైన విషయం. నేలపై కూర్చున్న ఆ ఎడ్లు, నులక మంచం పై కూర్చున్న ఆ తాత ముగ్గురు ముఖాలలో ఒక తృప్తి నా మదిలో నిలిచిపోయిన దృశ్యం.

ఊరు వెళడానికి ఆయన పట్టు పడుతూ చెప్పిన మరో మాట, నాకు ఎడ్లు గుర్తుకు వస్తున్నాయి. వాటి మధ్యనే చనిపోతాను అని. ఆయన మరణించిన తరువాత ఆ ఎడ్లు లేవు… ఆ వ్యవసాయమూ లేదు. ఆ ప్రేమలూ లేవు.

తాత గారి వయసు అప్పటికే చాలా ఎక్కువ. ఆయన కర్రపోటున నడవడమే నాకు గుర్తు. ఆయన బ్రతికి ఉన్న రోజులను ఊరికి సంబంధించిన విషయాలను గుర్తు తెచ్చుకుంటే ఈ దృశ్యమే నాలో జ్ఞాపకంగా మిగిలిపోయింది. తరువాత ఆయన చివరి రోజుల్లో మా ఇంట్లో కొన్నాళ్లు ఉన్నారు. తనకి అవి చివరి రోజులు అని ఆయనకు అర్ధం అయి ఇంట్లో ఎవరికీ ఇష్టం లేకపోయినా ఊరు వెళతానని పట్టుబట్టి వెళ్ళిపోయారు. చూసే కూతురు దగ్గర ఉండే కన్నా తనకు సరిగ్గా జరగదని తెలిసినా కొడుకు దగ్గరకే వెళ్ళి ఇంటి వారెవ్వరికీ చెడ్డపేరు రాకుండా చూడాలని ఆయన పడిన తాపత్రయం నాకిప్పటికి అంతు పట్టదు. కాని ఊరు వెళడానికి ఆయన పట్టు పడుతూ చెప్పిన మరో మాట, నాకు ఎడ్లు గుర్తుకు వస్తున్నాయి. వాటి మధ్యనే చనిపోతాను అని. ఆయన మరణించిన తరువాత ఆ ఎడ్లు లేవు… ఆ వ్యవసాయమూ లేదు. ఆ ప్రేమలూ లేవు.

ఇంటి ఎడ్లతో మా పెదనాన్నగారు – తాతగారు చెప్పిన సంగతి…

ఆ ఎడ్లను పట్టుకుని ఆయన తీయించుకున్న ఫోటోని ఆ తరువాతి తరం భద్ర పరచలేకపోయింది. కాని మా పెదనాన్న గారు ఎడ్లతో దిగిన ఓ ఫోటో ఇక్కడ పంచుకుంటున్నాను. ఎడ్లతో ఆనాటి రైతు కుటుంబాలకున్న అనుబంధం మనుషుల మధ్యన కూడా ఇప్పుడు కనపడదు. మా తాతగారి మెడలో ఆ వెండి కంటే, ముక్కుకు వెండి ముక్కెర తలకు పాగా తరువాత మా ఇంట్లో మరెవ్వరూ ఆచరించని, అంతరించిపోయిన ఓ సాంప్రదాయం.

నాకు ఉహ తెలిసే సరికే తాతగారు పెద్దవారయిపోయారు. మాకు బంధువయిన మరో తాతగారి ముఖత విన్న మరో సంగతి ఇక్కడ పంచుకోవాలి.

కొప్పోలు గ్రామానికి ఓ మంచినీళ్ళ చెరువు ఉంది. దీన్ని పెద్ద చెరువు అని ఇప్పటికీ పిలుస్తారు. ఇది మా ఇంటికి ఎడమపక్కన ఉంది అనుకుంటే కుడి పక్కన మరో చెరువు ఉండేది. ఇది కేవలం బర్రెగొడ్లను కడగడానికి వాడేవారు. పెద్ద చెరువు నీళ్ళే ఊరందరికీ ఆధారం. అప్పట్లో మునిసిపల్ కనెక్షన్లు లేనప్పుడు కావడితో నీళ్ళు తీసుకొచ్చి నింపడం మగవారి పని. స్త్రీలు బిందెలతో, మగవాళ్ళూ కావిడ్లలో ఇంటికి నీళ్ళు తెచ్చేవారు. సాయంత్రం అంతా నీళ్ళూ తెచ్చుకోవడంతోనే గడిచేది. పొలం పనులు లేని ఎండా కాలంలో ఊర్లో వాళ్ళంతా మంచాలు తీసుకువెళ్ళి నీళ్ళు తక్కువయిన చెరువులో వాటిని వేసుకుని రాత్రి మెలుకువ ఉండగలిగినంత సేపు చెరువు పూడిక తీసేవారట. అలసిపోతే ఆ చెరువు నీళ్ళ మధ్యనే మంచాళ్ళపై పడుకుని తెల్లవారు జామున ఇంటికి వచ్చేవారట. ఇది నీ పని నా పని అని అనుకోకుండా, సాయంత్రం పూట అందరు తలో చేయి వేసి ఆ చెరువు పూడిక తీసేవారట.

ఆ చెరువుని చూసి ఇలా ఎన్ని ఊర్లల్లో ప్రాకృతిక వనరులు అంతరించిపోతున్నాయో అన్న బాధ కలుగుతుంది. ఆ నాటి సామూహిక పనులు, మన ఊరు అన్న అభిమానం ఇప్పుడు ఎవరిలోనూ కనపడదు.

ఊరిలో మంచికి చెడుకు ఆ చెరువే ఆధారం, నిండా నీళ్ళతో కళకళలాడుతూ ఉండేది అది. ఇప్పుడు పాచి పట్టి పనికి రాకుండా పోయిన ఆ చెరువును చూస్తే ఆ నాటి సామూహిక పనులు గుర్తుకు వస్తాయి. నేనిది కంటితో చూడలేదు. నాకు ఉహ తెలిసే సరికే ఈ సాంప్రదాయం అడుగంటిపోయింది. కాని ఇది మా తాతగారి హయాంలో జరిగిన పనిగా ఊరిలో బంధువులు చెప్పగా విన్న మాట. ఇప్పుడు పనికి రాని ఆ చెరువుని, తిరనాలలో తెప్పపై దేవున్ని ఆ చెరువులో ఊరేగించాలనుకున్నా తెప్ప కదలనంతగా నాచు పేరుకుపోయిన ఆ చెరువుని చూసి ఇలా ఎన్ని ఊర్లల్లో ప్రాకృతిక వనరులు అంతరించిపోతున్నాయో అన్న బాధ కలుగుతుంది. ఆ నాటి సామూహిక పనులు, మన ఊరు అన్న అభిమానం ఇప్పుడు ఎవరిలోనూ కనపడదు.

తాతగారి చుట్ట – కుడితిలోని నీళ్ళు …

ఇక ఊరిలో అప్పట్లో పంచుకోవడం చాలా బాగా ఉండేది. ఒకరి ఇంటి నుండి పాలు మరొకరింటికి, కూరగాయలు అంటే సొరకాయ, గోంగూర అన్నీ ఒకరింటికి మరొకరు ఇచ్చుకునేవాళ్ళు. తాతగారు అంటే గుర్తుకు వచ్చేది ఆయన తాగే చుట్ట. ఆ ప్రాంతంలో పండే అతి పెద్ద పంట పొగాకు. అక్కడ పండిన పొగాకు నల్లగా పొడవుగా ఉండేది. దాన్ని అప్పటికప్పుడు చుట్టుకుని చుట్టగా మార్చి తాగేవారు ఆయన. ఆయన దగ్గరకు ఎవరు వచ్చినా నడుమున కట్టుకున్న సంచిలోంచి ఈ పొగాకు వారికిచ్చి వారితో పాటు పొగ పీల్చి ఆయన మాట్లాడడం నాకు లీలగా గుర్తు.

ఆ కుడితి తొట్టు ఇంటి బైటే ఉన్నా ఎందుకో ఇప్పుడున్నని దోమలు అప్పుడు ఉన్నట్లు గుర్తు లేదు.

ఇంట్లో కొన్ని బర్రెగొడ్లు ఉండేవి. అవి మేసి ఇంటికి వచ్చే సమయానికి కుడితి తోట్టి నిండుగా ఉండాలి. ఆ కుడితి తొట్లో మిగిలిన అన్నం, పాడయిన పళ్ళు ఇవన్నీ వేసి ఉంచేవాళ్ళు. బర్రెగొడ్లు ఇంటికి వస్తున్నాయంటే ముందు ఆ తొట్టి నింపి కుడితిని క్రింద నుండి పైకి కలిపేవారు. ఈ కుడితి తొట్టిలోని నీళ్ళను చేతితోనే కలిపేవారు. గొడ్లకు నీళ్లు తాపడం చాలా ఓపిగ్గా చేసేవాళ్ళూ. ఆ కుడితి తొట్టు ఇంటి బైటే ఉన్నా ఎందుకో ఇప్పుడున్నని దోమలు అప్పుడు ఉన్నట్లు గుర్తు లేదు. మంచాలేసుకుని బైటే ఆ కుడితి తొట్టుకి కాస్త దూరంలో అందరం పడుకునే వాళ్ళం. జంతువులన్నీ ఇంట్లో ఓ భాగంగా ఉండేవి తప్ప, వాటి కడుపు నింపకుండా ఇంట్లో మనుష్యులు భోజనాలు చేసేవాళ్ళు కారు. కొన్ని సార్లు కుండలో అన్నాన్ని అలాగే కుడితి తొట్లో బోర్లించి కలిపి బర్రెగొడ్లకు తాపించిన రోజులు కూడా గుర్తే.

నే చూసిన చివరి నాటకం – లామాఖాన్ లో  స్క్రీనింగ్ లూ..

ఇలా కూర్చుని స్టేజీ డ్రామా చూసేది ఊరంతా

ఊరిలో ఉన్న రెండు దేవాలయాలకు రెండు సార్లు తిరనాళ్ళు నిర్వహించేవాళ్ళూ. తిరనాళ్లప్పుడు సాయంత్రాలు నాటకాలు వేసేవాళ్ళు. రోడ్డు పక్కన బస్సు వెళ్ళేటంత స్థలం ఉంచి స్టేజీ కట్టేవాళ్ళూ. ఆ స్టేజీ మీద వేసిన కొన్ని నాటకాలు నేను చూసాను. రాత్రి పూట అన్నాలు తిని దిళ్ళూ తీసుకుని వెళ్ళి మొదటీ వరుసలో కూర్చుని నాటకాలు చూసేవాళ్ళం. సత్య హరిశ్చంద్ర, చింతామణీ, బాలనాగమ్మ, పాతాళభైరవి నాటకాలు అలా చూసినవే. ఇక సాంఘిక నాటకాలలో హీరో హీరోయిన్లకు డ్యూయెట్లు పెట్టేవారు. తరువాత ఓ వాంప్ పాత్ర కూడా ఉండేది. అప్పట్లో పాపులర్ ఏ. ఎన్. ఆర్., ఎన్.టీ ఆర్ హిట్ పాటలకు వాళ్ళూ డాన్స్లు వేస్తుంటే వన్స్ మోర్లు, అని మరో సారి ఆ డాన్స్ రిపీట్ చేయమని ఆడియన్స్ గోల గోల చేసేవాళ్ళూ. ఊరంతా కలిసి ఎంజాయ్ చేసిన ఆ విధానం ఇప్పుడు ఐమాక్సలలో కనిపించగలదా… నేను హై స్కూలుకి వచ్చేసరికి నాటకం పాతపడి అడపాతడపా నాటకాలు వేస్తున్నా, సినిమా మోజు ఊరంతా పెరిగింది. ఊరికి మధ్యలో తెర కట్టి సినిమాలు వేసే వాళ్ళూ. అలా లవకుశ, పెళ్ళి సందడి, శ్రీ కృష్టార్జున యుద్దం లాంటి సినిమాలు చూసాను.

అలా ఊరి మధ్యన ఓపిగ్గా నాటకాన్ని సినిమాను చూసినప్పుడు కలిగిన ఆనందం ఇప్పటి నా సినిమా పిచ్చికి పడిన పునాది అన్నది నా నమ్మకం.

తాత గారు చనిపోయిన తరువాత ఆయన పెద్ద దినం రోజున మా కుటుంబం వేయించిన నాటికమే నేను ఆ ఊరిలో చూసిన చివరి నాటకం. తరువాత తెర కట్టి సినిమా చూపించే అవసరం టీ.వీ పుణ్యమా అని ఊరి పెద్దలకు కలగలేదు. కాని అలా ఊరి మధ్యన ఓపిగ్గా నాటకాన్ని సినిమాను చూసినప్పుడు కలిగిన ఆనందం ఇప్పటి నా సినిమా పిచ్చికి పడిన పునాది అన్నది నా నమ్మకం. ఇప్పటికీ సినిమా అన్నా, నాటకం అన్నా నాకు చాలా ఇష్టం. అలా ఓపెన్ ఎయిర్ లో చూడాలని కోరిక. అందుకని లామాఖాన్ లో ఆ మధ్య సినీఫైల్స్ వారి ఫిలిం స్క్రీనింగ్ లకు కొన్నాళ్ళు ఓపిగ్గా వెళ్ళేదాన్ని. నేనుందుకు అన్ని కిలోమీటర్లు ప్రయాణం చేసి ఆ సినిమాలు చూడడానికి వెళ్ళేదాన్నో ఎవరికీ అర్ధం అయేది కాదు. నా చిన్నప్పటి ఊరి ఫీల్ ని వెతుక్కుంటున్నానని చెప్తే అర్ధం కాదుగా ఎవరికీ. అక్కడి వాతావరణం లో నాకు ఆ నాచురల్ ఫీల్ కలగలేదు అందుకని కొన్నాళ్లకు మానేసాను. కాని మా ఊరి తరువాత నేను చూసిన ఓపెన్ ఎయర్ స్క్రీనింగ్లు అక్కడే.

ఊరంతా ఒక మాటన నిలబడే వినోద కార్యక్రమాలలో తమ వంతుగా పనులు చేసేవారన్నది జ్ఞాపకాలలో మిగిలిపోయింది.

ఊరి మధ్యన చూసిన తెర మీద సినిమా.

ఈ తెర కట్టీన సినిమాల తరువాత ఒక రెండు సార్లు రికార్డు డాన్సుల ప్రోగ్రాములు మా ఊరిలో చూసాను కాని అప్పటికే అవి అసభ్యంగా మారడంతో, చూసేవాళ్లలో పెద్దవాళ్ళేవరూ లేకపోవడంతో ఆ అనందం కలగలేదు.

ఆ ఊరి నాటకాలను కూడా అందరు కలిసి తలా కాస్త డబ్బులు వేసుకుని వేసేవారట. మా మామయ్య విలన్ వేషాలు వేస్తే ఆయన స్నేహితుడు హీరో వేషం వేసేవారని. రిహార్సల్ కు ఓ ప్రదేశం ఎన్నుకుని ఒకరింట్లో భోజనాలు కానిచ్చేవారని ఇలా ఊరంతా ఒక మాటన నిలబడే వినోద కార్యక్రమాలలో తమ వంతుగా పనులు చేసేవారన్నది జ్ఞాపకాలలో మిగిలిపోయింది. ఇప్పుడు ఊరిలో అలా కలిసిమెలిసి కార్యక్రమాలు జరుపుకునే పద్దతిలో చాలా మార్పు వచ్చింది.

మిస్సవుతున్న కామ్రెడ్ షిప్ – ‘మనం’ నుంచి ‘నేను’

ఇక నగరంలో మా జీవితం ఆ పల్లె జీవితానికి భిన్నంగా ఏం ఉండేది కాదు. అప్పట్లో నాన్నగారు కమ్యునిస్టు పార్టితో కలిసి పనిచేస్తూ ఉండేవారు. టెలిగ్రాఫ్ ఆఫీసులో పని చేస్తూ ఆయనకో బాచ్ ఉండేది. చేసేది చిన్న ఉద్యోగమైనా టేలిగ్రాఫ్ స్టాఫ్ వెల్ఫేర్ సొసైటి అని పెట్టి ప్రతి సంవత్సరం రైల్ నిలయం ఆడిటోరియంలో ప్రజా నాట్యమండలి అద్వర్యంలో కార్యక్రమాలు నడిపించేవారు. మొదటి సారి “జజ్జనకరి జనారే” అన్న పాటను నేను స్టేజి మీద కళాకారులు పాడుతూ ఆడుతుండగా చూసినది ప్రైమరీ క్లాస్లో నాన్నగారు ఆర్గనైజ్ చేసిన కార్యక్రమంలోనే. ఎర్ర జెండాలు పట్టుకుని వాళ్ళు పాడే పాటలు బాగా నచ్చేవి. అలాగే అక్కడ నాటకాలు జరిగేవి. గద్దర్ లాంటి కళాకారులు ఆ కార్యక్రమాలలో ఉండేవాళ్ళని, అప్పట్లో కమ్యునిస్టు నాయకులు, ఇంటికి వస్తూ ఉండేవారని గుర్తు. ఈ ప్రభావంతో రాజకీయ పాఠశాలలలో చేరిన అన్నయ్యతో ఇళ్ళంతా మనుషులతో నిండి ఉండేది.

ఆ ఎర్ర సిద్దాంతాల ఆచరణ లోపాల కారణంగా ఆ దారి నుండి ఇప్పుడు తప్పుకున్నా ఆ సిద్దాంతాల వెనుక ఉన్న కామ్రేడ్ షిప్ విలువ నాకు బాగా తెలుసు.

నాన్నగారి ప్రోగ్రాములకు ఇంటి ముందున్న గ్రౌండులో తాళ్ళూ కట్టి, ఉడికించిన మైదా తాళ్ళకు పూసి జండాలు కట్టేవాళ్ళం. వీటిని తరువాత తీసుకెళ్ళి రైల్వే ఆడిటోరియం చూట్టూ కట్టేవారు.

నాకు అప్పట్లో ఒక బంగారపు గొలుసు చేయించారు ఇంట్లో. దానికి లాకెట్టు పైన సుత్తీ కొడవలి గుర్తు ఉండేది. ఈ చైను అప్పట్లో చాలా మంది పెళ్ళిళ్ళు చేసింది. డబ్బు కావలసిన ప్రతి సారి దీన్ని ఎవరో మార్వాడి దగ్గర తాకట్టు పెట్టి డబ్బు తీసుకువచ్చి స్నేహితులకు సహాయం చేసేవారు నాన్నగారు. ఇప్పుడు బంగారం పై స్తుతీ కోడవలి గుర్తు ఉండడాన్ని అతి పెద్ద తప్పుగా నేనే విమర్శిస్తాను కాని ఆ రోజుల్లో ఇంట్లో మరొక డిజైన్ మా వాళ్ళకి పసి పిల్ల చెయిన్లోకి కూడా దొరకలేదంటే ఇంట్లో ఆ విప్లవ భావజాలం ఎంత ఉండేదో అర్ధం చేసుకోవచ్చు.

ఆ సామూహిక చర్చలు, కలిసి తినడాలు, కలిసి జీవించిన రోజులు మళ్ళీ రావు. అప్పట్లొ అంతా ‘మనం’ గా ఉండేది. ఆ మనం “నేను” లోకి ఎప్పుడు ఎందుకు మారిందో అర్ధం కాదు.

ఆ ఎర్ర సిద్దాంతాల ఆచరణ లోపాల కారణంగా ఆ దారి నుండి ఇప్పుడు తప్పుకున్నా ఆ సిద్దాంతాల వెనుక ఉన్న కామ్రేడ్ షిప్ విలువ నాకు బాగా తెలుసు. అ సిద్దాంతాన్ని ఆచరణలో చూపిన విధానాన్ని, దాన్ని పట్టుకుని పైకి ఎదిగిన పెద్ద వాళ్లని ఇప్పుడు చూస్తున్నాను. కాని ఆ ఆశయాలను నిస్వార్ధంగా నమ్మి ఆచరించిన వాళ్లలో ఉండే సహోదర ప్రేమను కూడా అనుభవించిన కారణంగా ఆ కామ్రెడ్ షిప్ ని ఇప్పుడు మిస్ అవుతున్నాను. ఆ సామూహిక చర్చలు, కలిసి తినడాలు, కలిసి జీవించిన రోజులు మళ్ళీ రావు. అప్పట్లొ అంతా ‘మనం’ గా ఉండేది. ఆ మనం “నేను” లోకి ఎప్పుడు ఎందుకు మారిందో అర్ధం కాదు. ఇప్పుడు ఎన్ని కార్యక్రమాలు, ఎన్.జీ.వోలతో పనులు చేస్తున్నా అప్పటి ‘మన’ అనే భావాన్ని మరో సారి అనుభవించాలని తపిస్తాను. కాని ఎక్కడో సోషలిస్టీక్ భావజాలంతో వచ్చిన ఆ ‘మన’ అన్న ఫీలింగ్ మరే సమూహంలో నాకు కనిపించలేదు. అలా అని ఆ భావజాలాన్ని ఇప్పటి వ్యక్తుల సమక్షంలో గుడ్డిగా ఆచరించనూలేను.

ఆర్ట్స్  కాలేజ్ బస్ స్టాండ్ పక్కన…

నేను ఆ పరిస్థితులలో పెరగకపోయి ఉన్నట్లయితే ఈ సినిమా, పుస్తక విశ్లేషణలు చేసే స్థాయికి చేరేదాన్ని కాదని నాకు అనిపిస్తూ ఉంటుంది. “ఆకాశం ఎందుకో పచ్చబడ్డదీ” అన్న పాట విని ఆకాశం ఎలా పచ్చబడుతుంది అని ఓ గంట చర్చ పెట్టుకునే వాతావరణం, యద్దనపూడి ‘సెక్రటరీ’ నుంచి మేరి టైలర్ “భారత దేశంలో నా జైలు జీవితం” పుస్తకాల దాకా కలిసిపోయి ఉన్న ఇంట్లో పెరిగినప్పుడు ఆ ప్రభావం మనపై పడకుండా ఉంటుందా.

ఊర్లో మా తాతగారి ఇంట్లో కొన్ని నాటకాల పుస్తకాలు ఉండేవి. నాటకాలు వేయాలనుకుంటే అ పుస్తకాలను సేకరించి పెట్టుకునే వారట. ఇంటి లోగిట్లో ఉన్న పెద్ద అరుగు మీద నేను కూర్చుని ఆ నాటక పుస్తకాలను కూడబలుక్కుని చదవడం గుర్తు. అయితే ఆ ఇంట్లో మా మామయ్య ఒక్కడే ఆ నాటక పుస్తకాలు చదివేవారనుకుంటా. మిగతా ఎవరికీ చదువు రాదు. ఆ చిన్ని చిన్ని పుస్తకాలు ఆ రోజుల్లో కష్టపడి చదివేదాన్ని. నాటకంలో పాత్ర పేరు చెప్పి ఆ తరువాత ఆ పేరు పక్కన పుస్తకంలో వచ్చే డైలాగ్ … ఈ శైలి నాకు చాలా ఇష్టంగా ఉండేది.

కొన్నాళ్ళకి ఆ బుజ్జి లైబ్రరీ లో బుల్లి పుస్తకాలు అయిపోతే పెద్ద పుస్తకాలకు అద్దె ఎక్కువ అయితే ఓ బుక్ తీసుకుని బస్ స్టాండ్ లో కూర్చుని ఓ రెండు కథలు చదివి తిరిగి ఇచ్చే పని కొన్ని రోజులు చేసిన గుర్తు.

ఇక సెలవుల్లో ఇక్కడ హిందీ క్లాసులకు అమ్మ పంపేది. ఈ క్లాసులను ఓ హిందీ టీచర్ చెప్పేవారు. ఆమె ముందు నామాలగుండులో తరువాత పెళ్ళి చేసుకుని వారాసిగుడా కి అంటే కాస్త దూరానికి మారారు. ఆమె ఇంటికి వెళ్ళాలంటే చిలకలగుడా వరకు నడిచి బస్ ఎక్కి ఆర్ట్శ్ కాలేజ్ స్టాప్ దగ్గర దిగి ఒక వీధి పొడవునా నడివాల్సి వచ్చేది. ఎండలో అంత దూరం ఇంటి నుండి నడక వద్దని అమ్మ బస్సులో వెళ్ళమని డబ్బులు ఇచ్చేది. ఇవి ఒక్క వైపుకే వచ్చేవి. అంటే క్లాసుకు వెళ్ళేటప్పుడు బసెక్కి వచ్చేటప్పుడు ఇంటికి నడిచి రావాలి. బస్సు టికెట్టూ ముప్పై పైసలు. నా చేతిలో పైసలు పడేది అప్పుడే.

రోజు ముప్పై పైసలు అంటే అదో పెద్ద లగ్జరీ. రాయల్ ట్రీట్మెంట్. ఆర్ట్స్  కాలేజ్ బస్ స్టాండ్ పక్కన ఓ అద్దె పుస్తకాల షాపు ఉండేది. అందులో బ్లాక్ అండ్ వైట్ ప్రింట్ లో జానపద కథల చిన్ని పుస్తకాలు ఉండేవి. అద్దె పదిహేను పైసలు. కాని ఒక్క పుస్తకమే ఇచ్చేవారు. అందుకని ఓ పుస్తకం తీసుకుని బస్ స్టాండ్ లో కూర్చిని చదివి తిరిగి ఇచ్చేసి మరో పుస్తకం తీసుకుని ఇంటికి వచ్చేదాన్ని. ఇంట్లో చెబితే తంతారని బస్సులో వెళ్ళానని అబద్దం చెప్పి ఆ టికెట్ డబ్బులతో ఇలా పుస్తకాలు చదువుకునేదాన్ని. కొన్నాళ్ళకి ఆ బుజ్జి లైబ్రరీ లో బుల్లి పుస్తకాలు అయిపోతే పెద్ద పుస్తకాలకు అద్దె ఎక్కువ అయితే ఓ బుక్ తీసుకుని బస్ స్టాండ్ లో కూర్చుని ఓ రెండు కథలు చదివి తిరిగి ఇచ్చే పని కొన్ని రోజులు చేసిన గుర్తు. ఆ అర్ట్శ్ కాలేజీ బస్ స్టాండ్ ఇప్పుడు లేదు. ఆ చుట్టూ తాటి చెట్లు చాలా వరకు మాయమయ్యాయి. ఈ మధ్యలో ఓ సారి అటు వెళ్ళినప్పుడూ ఎక్కడో దూరంగా ఓ తాటి చెట్టు కనిపించింది. అప్పట్లో ఆ తాటి చెట్ల నడుమ ఉన్న బస్ స్టాండ్ లో కూర్చుని పుస్తకం చదువుతంటే హిల్ స్టేషన్ లో ఉన్న ఫీల్ వచ్చేది.

పుస్తకాలే కాదు, మిర్చీ బజ్జీలూ – ఆ చిరుతిళ్ళు…

అంతే కాదు ఇంటికి త్వరగా వెళ్లాల్సిన సమయంలో ఆ బస్సు టికెట్ డబ్బులు మిగిల్చుకుని నడుచుకుంటూ వెళ్లి శ్రీదేవి మెటర్నిటీ హాస్పిటల్ ఎదురుగా ఉన్న మిర్చీ బండి దగ్గర మిరప కాయ బజ్జీలు కొనుకుని అవి గిల్లుకుని తింటూ ఇల్లు చేరడం గుర్తు. నాకు ఈ రోజుకు మిగిలి ఉన్న ఒకే ఒక అలవాటు ఇలా బండి మీద చేసిన బజ్జీలు తినడం. నిజం చెప్పాలంటే ఆ రుచి నాకు ఇప్పటి స్టార్ హోటల్ తిళ్ళల్లో కూడా రాదు. ఇలా బస్ టికేట్ ఓ వైపుకే తీసుకోవడం, పుస్తకాలు ఎక్కడో కూర్చుని చదువుకోవడం, చిరు తిళ్ళ కోసం ఈ టికెట్ పైసలు దాచుకుని, నడుచుకుంటూ వెళ్ళడం చేస్తున్నప్పుడు కూడా యింట్లో ఎందరో భోజననికి వచ్చేవారు. ఎవరో ఒకరు అతిధులుగా ఇంట్లో ఉండిపోయేవారు. కాని అలా పిల్లలను సర్దుకొమ్మని, ఇతరుల కోసం ఖర్చు చేయడం తప్పని, ఆ ఖర్చు తగ్గిస్తే పిల్లలకి చాలా కొనివ్వవచ్చనే ఆలోచన ఇంట్లో ఎవరికీ వచ్చేది కాదు. మాకేం తక్కువ అన్నట్లుగానే అందరం గడిపేవాళ్లం. ఇప్పటి ప్లాన్డ్ కుటుంబాలను చూస్తుంటే వాళ్ల ఆలోచనలను వింటుంటే ఆశ్చర్యం వేస్తుంది.

పిల్లలకు అవసరం అయినంత మేరకే ఖర్చు పెడుతూ ఇతరులను సంవత్సరాలుగా ఫోషించిన మా కుటుంబం ఈ తరానికి అర్ధం అవుతుందా అనిపించింది

పేళ్ళి చేసుకున్న కొత్త జంటలు డబుల్ బెడ్ రూం ఫ్లాట్ లేకుండా ఓపెన్ హాల్ ఉండాలని కోరి ఇళ్ళు అద్దెకు తీసుకుంటున్నారట. రెండో రూం ఉంటే ఇంటికి వచ్చే అత్తా మామలను తప్పించుకోలేం అని, ఎవరైనా మరో రూం లేదని తెలిస్తే ఎక్కువ రోజులు తమతో ఉండరని ఆ సమస్య దానికదే పరిష్కారమవుతుందని, మనమేం చెప్పకుండానే ఊరి నుండి వచ్చిన వాళ్ళు మరో పడక గది లేదని వెళ్ళిపోతారని ఈ మధ్య నాకు చెప్పిన ఓ ఇరవై ఐదేళ్ళ తెలివైన సాప్ట్ వేర్ ఎంప్లాయి మాటలు విని, పిల్లలకు అవసరం అయినంత మేరకే ఖర్చు పెడుతూ ఇతరులను సంవత్సరాలుగా ఫోషించిన మా కుటుంబం ఈ తరానికి అర్ధం అవుతుందా అనిపించింది. రెండు రూముల్లో ఎంత మంది సర్దుకునేవాళ్ళూ? కాని ఎంతో ఆనందంగా ఉండేవాళ్ళం. మా నాన్న ఇంకా సంపాదిస్తే బావుండు నేను కారులో వెళ్ళేదాన్ని అనే ఆలోచనలను ఇంట్లో ఎవరికీ లేకుండా పెంచగలగడం వాళ్ల గొప్పా లేక ఆ కాల మహిమా అన్నది నాకు మాత్రం తెలీదు.

మా నాన్నగారితో చాలా విషయాలలో ఈ రోజు గట్టిగా విభేదిస్తాను కాని వారిలో ఉన్న కమిట్ మెంట్ నాకు ఇప్పటి వ్యక్తులలో కనపడదు. ఆ రోజు నుండి కూడా ఆ సిద్దాంతాలపై ఆయనకు ఇంకా నమ్మకం మిగిలే ఉంది.

నాన్న సాహసం – ఇప్పటికీ తేల్చుకోలేని స్థితి…

ఐదు సంవత్సరాల క్రితం అనుకుంటా బుక్ ఎగ్జిబిషన్ కి ఓ సారి ఆయన్ని తీసుకుని వెళ్లాను. ఉస్మానియా యూనివర్సిటీ పిల్లలు బుక్ స్టాల్ పెట్టిన సంవత్సరం అది. ఆ స్టాల్ లో ఎర్ర రంగున్న పుస్తకాలను చూసి ఆయన అందులోకి దూరారు. అప్పటీకి డెభ్భై అయిదు సంవత్సరాలు ఆయనకు. పుస్తకాల రేట్లు చూసి అవి కొనకుండా పేరు నోట్ చేసుకుని వచ్చే అలవాటు ఆయనది. ఆయన వయసులో ఉన్నప్పటి రేట్లలో ఇప్పుడు ఏం దొరుకుతాయి కాబట్టి. సరే… ఆ స్టాల్ లో నా స్టూడేంట్ల వయసున్న పిల్లలున్నారు. ఈయనను చూసి నమస్తే అంకుల్ అని లేచి నిలబడ్డప్పుడు ఆయనకీ నాకు వారెవరో, మా యిద్దరిలో ఎవరిని పలకరిస్తున్నారో అర్ధం కాలేదు. కాని వాళ్ళే అంకుల్ బుక్స్ కావాలా అని ప్రేమగా పిలిచి ఆయనను పలకరిస్తుంటే నాకు అర్ధం కాక ఈయన మీకు తెలుసా అని అడిగా. వాళ్ళు నవ్వుతూ ఈ అంకుల్ లాల్ బహాదుర్ స్టేడియం లో మీటింగ్ కి వచ్చి మాతో పాటు అరెస్ట్ అయ్యారు కదా. పోలీసులు ఈయనను వెళ్ళిపోమన్నా జీపు ఎక్కి కూర్చున్నారు అని ఆ రోజు అని చెప్పినప్పుడు నాకు అర్ధం కాలేదు.

ఇది ఆ తండ్రీ కొడుకులు మెయింటేన్ చేసుకున్న సీక్రెట్లలో ఒకటి. ఇంట్లో ఎవరికీ ఇది తెలియదు. చింత చచ్చినా పులుపు చావని ఆయన ఎర్ర భావజాలం చూసి గర్వపడాలో, నవ్వాలో, గేలి చేయాలో తెలియలేదు.

తెలంగాణా ఉద్యమ సమయంలో ఎల్.బీ.స్టేడియం లో ఏదో మీటీంగ్ కి ఈయన వెళ్ళారని ఆ రోజు అక్కడున్న వారిని పోలీసులు అరెస్టు చేసారని, చంకలో గొడుగుతో నిలుచుని ఉన్న ఈయన వాళ్లతో నేనూ మీటింగే వచ్చా అని చెబితే ఆయనను అరెస్టు చేసారని తరువాత మా అన్నయ్య తన ఒకప్పటి పార్టీ మిత్రుడు ఇప్పుడు లాయర్ అయిన వెంకన్నతో స్టేషన్ కు వెళ్ళి ఈయనను ఇంటికి తీసుకువచ్చారని తెలిసింది. ఇది ఆ తండ్రీ కొడుకులు మెయింటేన్ చేసుకున్న సీక్రెట్లలో ఒకటి. ఇంట్లో ఎవరికీ ఇది తెలియదు. చింత చచ్చినా పులుపు చావని ఆయన ఎర్ర భావజాలం చూసి గర్వపడాలో, నవ్వాలో, గేలి చేయాలో తెలియలేదు. కాని చాలా సందర్భాలలో ఆఫీసులలో, సోషల్ వర్క్ కి సంబంధించిన కార్యక్రమాలలో, కొన్ని ఇతర పరిస్థితులలో కూడా నా చుట్టూ పెద్ద పెద్ద ప్రగల్బాలు పలికే మగవారు ఎప్పుడూ విపత్కర పరిస్థితులలో ముందు నిలబడి భాద్యత తీసుకోక, వెనక్కు తిరిగి పారిపోవడం చూసిన ప్రతి సారి నాకు నాన్న సాహసం గుర్తుకు వస్తూ ఉంటుంది. మరి ఈయనకు సరిగ్గా మాట్లాడడం కూడా చేత కాదు ప్రస్తుత పరిస్థుతులను బట్టి. కాని ఆ కమిట్మెంట్ ఎక్కడ నుండి వచ్చింది. రిటైర్ అయి అన్నిటి నుండి తప్పుకుని కూడా ఇప్పటికీ కమ్యునిస్టూ మానిఫెస్టో ను చదివిందే చదువుతూ గడిపే ఆయనలో ఉంది ఓపికా, లేక ఏం చేయలేక చేస్తున్న పనా అన్నది ఇప్పటికీ తేల్చుకోలేకపోతాను.

ఆయనలో నాకు కనిపించే పితృస్వామ్య భావజాల మూలాలను హర్షించలేను. కాని నేను చూసిన చాలా మంది పురుషులకన్నా వేయి రెట్లు నిబద్దతతో సామాజిక స్పృహతో జీవిస్తున్న వ్యక్తి మా నాన్న.

అలా అని ఆయనలో నాకు కనిపించే పితృస్వామ్య భావజాల మూలాలను హర్షించలేను. కాని నేను చూసిన చాలా మంది పురుషులకన్నా వేయి రెట్లు నిబద్దతతో సామాజిక స్పృహతో జీవిస్తున్న వ్యక్తి మా నాన్న. మన దగ్గరకు వచ్చిన వారికి లేదనకుండా కొన్ని సార్లు మనకు కష్టం అయినా సరే సహాయం చేయాలన్నది ఆయన ప్రిన్సిపల్. ఇంటి వారికి అది కష్టం కలిగించినా, శ్రమ కలిగిస్తున్నా తన దారిలో తాను నడుచుకుంటూ వెళ్లారు. అందుకే చాలా విషయాలలో ఆయన పట్ల నాకు కొన్ని ఫిర్యాదులున్నా ఈ స్థాయి కమిట్మెంట్ నేను ఇప్పటి దాకా నాకు పరిచయం అయిన వారెవ్వరిలోనూ చూడలేదని చెప్పగలను.

రచయిత్రి పి. జ్యోతి హిందీ ఉపన్యాసకులు. చక్కటి సమీక్షకురాలు. హైదరాబాద్ లో పుస్తకాల పట్ల అభిరుచి పెంచడంలో విశేషంగా కృషి చేస్తున్న spreading Lights నిర్వాహకురాలు కూడా. పుస్తకం, సినిమా తనకు రెండు కళ్ళు. ప్రపంచానికి గవాక్షాలు. తెలుపు కోసం రాస్తున్న ఈ శీర్షికలో తాను మొదటిసారిగా అంతర్ముఖంలోకి చూసుకుంటున్నారు. జీవితాన్నే పుస్తకంగా అనుభవాలనే చలన చిత్రంగా ఎంచి సరళమూ, నిరాడంబరమూ, సామాన్యమూ ఐన జ్ఞాపకాలను ఆత్మీయంగా పంచుకుంటున్నారు. ఈ శీర్షికలో మొదటి వ్యాసం మనసు పొరల్లో. రెండో వారం చిన్ననాటి చిరుతిళ్లు. మూడో వారం చిన్ననాటి సంగతులు. నాలుగో వారం పంచుకోవడంలో అనందం. మీరు చదువుతున్నది ఐదో వారం జ్ఞాపకాలు.

అన్నట్టు, ఇటీవలే వీరు రచించన దిలీప్ కుమార్ సినిమనసు పొరల్లోమాల సమగ్ర పరిచయ పుస్తకం కోసం ఈ లింక్ క్లిక్ చేసి తెప్పించుకోవచ్చు.

 

More articles

1 COMMENT

  1. చక్కటి భావ వ్యక్తీకరణ.
    నిష్పాక్షికంగా , నిష్కపటంగా, వ్రాస్తున్నారు.
    అభినందనలు.
    సమాజం నిరంతరం చలనశీలం.
    మార్కెట్ వినిమయ మాయాజాలం,
    సమాజాన్ని ముంచెత్తుతున్న సౌకర్యాల వెల్లువ ,
    మనిషి ప్రతిభ ( సామాజికం) కాకుండా , కేవలం వ్యక్తి ప్రతిభ అనే అహంభావ పూరిత ధోరణులు , మనిషిని ఆక్రమించుకున్నాయి.
    ఇలా వ్రాయడం వలన ప్రయోజనం ఏమంటే
    మనిషిలోని మానవతను మేల్కొల్పడం .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article