Editorial

Wednesday, January 22, 2025
ఆనందంమనసు పొరల్లో : చిన్ననాటి చిరుతిళ్లు – పి.జ్యోతి

మనసు పొరల్లో : చిన్ననాటి చిరుతిళ్లు – పి.జ్యోతి

నా చిన్నతనంలో నేను చాలా ఇష్టపడే ఆహార పదార్ధాలను ఇప్పుడు నలుగురుకి చెప్తుంటే అందరూ వింతగా చూడడం అలవాటయ్యింది. కానీ, ఎందుకో నాకు ఆ నాటి చిన్నతనపు ఆహారపు రుచులలో దొరికిన తృప్తి ఇప్పుడు లభించట్లేదు.

పి.జ్యోతి

మనం ఇష్టపడే ఆహారం కూడా మన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తంది అంటుంది ఇప్పటి ఆదునిక యుగం. ఎన్నో ఫుడ్ ఔట్లేట్లు ప్రతి రోజు పుట్టికొస్తూనే ఉన్నాయి. చిన్నప్పుడు మేము వినని ఆహార పదార్ధాలు ఇప్పుడు మార్కెట్ నిండా కనిపిస్తున్నాయి. వాటి చాటున మరుగున పడిపోతున్నాయి ఆ నాటి సాంప్రదాయ రుచులు. ఆహారంపై ఇప్పుడు ప్రతి కుటుంబం చేస్తున్న ఖర్చు కూడా చాలా పెరిగింది. అది అత్యవసరంగా కూడా భావిస్తుంది నేటి తరం. ఆర్ధికంగా ఈ తరం కొంచెం పుంజుకోవడం వల్లనేమో కాని మార్కెట్ ఆహరంపై మోజు విపరీతంగా పెరిగింది.

నా చిన్నతనంలో నేను చాలా ఇష్టపడే ఆహార పదార్ధాలను ఇప్పుడు నలుగురుకి చెప్తుంటే అందరూ వింతగా చూడడం అలవాటయ్యింది. అదేంటో గాని నాకు ఇప్పటికీ ఈ వివిధ రుచులు దేశ విదేశాల ఆహరాలు పెద్దగ్గా మనసును ఆకట్టుకోవట్లేదు. అవకాశం ఎన్ని విధాలుగా పురిగిల్పినా ఏదో ఒక సారి ఆ హోటల్ రుచులు ఆస్వాదించాలని ప్రయత్నిస్తానేమో కాని, అకలి తీరి కాస్త కొత్తదనం రుచి చూసిన ఫీలింగ్ తప్ప, తృప్తి అన్నది ఎందుకో నాకు ఆ నాటి చిన్నతనపు ఆహారపు రుచులలో దొరికినట్లు ఇప్పుడు లభించట్లేదు. చాలా మంది అన్నట్లు నేను రెండు దశాబ్దాల వెనుకే ఉండిపోయానేమో!

అలా అని నేనేదో గొప్ప పిండి వంటలు చేసుకోగలిగిన కుటుంబంలో పెరిగిన వ్యక్తిని కాను. ‘సమోసా’ నేను రుచు చూసింది నాకు పద్నాలుగేళ్ళు నిండిన తరువాతే. ఇక బేకరీ ఐటమ్స్ లో ఇంటర్ లో అనుకుంటా ఒక ప్రెండ్ తనకు ‘పేస్ట్రీ’ అంటే చాలా ఇష్టం అని చెప్పినప్పుడు నాకు కాల్గెట్ టుత్ పేస్ట్ గుర్తుకు వచ్చింది. పేస్ట్ కూడా తింటారా అని అడగబోయి నాకే అనుమానం వచ్చి ఊరుకున్నా. తరువాత ఆ ‘పెస్ట్రీ’ ఏంటో బేకరీకి వెళ్లి చూసి “కేకు ముక్క కదా ఇది. దీని పేరు ‘పేస్ట్రీ’ నా” అని ఆశ్చర్యపోవడం గుర్తు. మొదటి సారి ‘పేస్ట్రీ’ చూసిందే రేల్వే డిగ్రీ కాలేజి ఎదురుగా ఉన్న తాజ్ బేకరీలో… ఇంటర్ మీడియట్ రోజుల్లో. కడుపునిండా అన్నం తిని స్కూలుకు వెళ్ళి తిరిగి రావడం ఎప్పుడన్నా పుల్ల ఐస్ క్రీమ్ తప్ప నాకు తెలిసిన బైట తిండి అప్పటి దాకా ఏం లేదు. కాని తీండి విషయంలో నేను చాలా ఎంజాయ్ చేసానని చెప్పగలను. కాకపోతే నా రుచులు చాలా మందికి వింతగా కనిపించవచ్చు. ఎమైనా నిజం చెప్పాలంటే నాకు ఇప్పటికీ ఆ పాత రుచులే ఇష్టం. ఇప్పటికీ అవే నా ఫేవరెట్ ఫుడ్స్……

మేము తాతా అవ్వ అంటూ ఆ కొట్లోనే మా చిన్నతనపు చిరుతిల్లను కొనుక్కునే వారం.

తాత కొట్టు ఇదే సైజులో,ఇదే రంగులో అచ్చంగా ఇలాగే ఉండేది. అందులోనే ముప్పై సంవత్సరాలు పైగా కాపురం చేసింది ఆ జంట.

మా రోజుల్లో ఐదు పైసలు, పది పైసల బిల్లలు ఉండేవి. ఒకటీ రెండు పైసలు కూడా నాకు మాటలు సరిగ్గా రానప్పుడు నడిచేవి అనుకుంటా. నా చిన్నతనంలో రెండు పైసలు పెట్టి పిప్పరమెంట్లు కొనుక్కున్న రోజులు నాకు లీలగా గుర్తు. సరే నాకై నేను మొదట చేసిన ట్రాంసాక్షణ్ ఐదు పైసల బిల్లలతో. చేతిలో ఐదు పైసలుంటే అప్పట్లో మేము కోటీశ్వరులం అన్న ఫీలింగ్ ఉండేది. మా రైల్వే క్వార్టర్ పక్కన ఒక తాత అవ్వ ఒక బంకు నడిపేవారు. ఆ బంకులో పిప్పరమెంట్లు, తేగలు, బిస్కట్లు, సాయంత్రం పూట బొమ్మిడి చాపలు అమ్మేవారు. ఆ తాత తెల్ల పంచె చొక్కా తలపాగాతో ఉంటే, తెలంగాణ చీర కట్టులో ఆ అవ్వ ఊండేది. క్వార్ట్వస్ పక్కన ఉన్న హనుమాన్ గుడికి కాస్త ఇవతల చెక్కలతో కట్టిన ఒక బంకు ఉండేది. ఇద్దరు మనుష్యులు కూర్చున్నంత స్థలం మాత్రమే ఉంటుంది అందులో. ఆ బంకుని కర్రలతో కాస్త భూమి నుండి పైకి లేపి కట్టారు. క్రింద కూర్చుని భోజనం చేస్తే పైన ఎత్తున కూర్చుని సరుకులు అమ్మేవాళ్ళూ.

అంటే ఆ తాత అవ్వలకు ఆ బంకే ఇల్లు. స్నానం, నిద్ర అంతా బైట గుడికి ఎడమ ప్రకన ఉన్న అరుగుల మీద జరిగిపోయేవి. వర్షం పడుతుంటే ఆ బంకు క్రిందే పడుకునే వాళ్లు. ఇప్పుడు ఇంత పెద్ద కొంపలోనే స్పేస్ లేదు అనుకునే స్థాయికి చేరాక కూడా నాకు ఆ తాత అవ్వలు గుర్తుకు వస్తూనే ఉంటారు. ఆ మట్టి ఇంట్లో కూడా ఆ తాత తెల్లటి తెలుపు వస్త్రాలనే ధరించేవాడు. టినోపాల్ తెలుపు అది. అవ్వ అక్కడే ఒక రాయి మీద ఆ బట్టలు ఉతికేది. పెద్ద కుంకుమ బొట్టుతో, కొప్పుతో ఎంత శుభ్రంగా ఉండేవాళ్లంటే బట్టలపై ఒక చిన్న మరక కనిపించేది కాదు.

సాయంత్రం అయేసరికి వాళ్ళు ఆ బొంకు వద్దకు బొమ్మిడి చాపల కోసం వచ్చేవారు. తాత ఆ చేపలను క్రిందకు వేలాడదీసి ఒక తాడుతో కట్టేవాడు.

టెన్త్ తరువాత మేము ఆ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయాక కూడా కొన్ని సంవత్సరాలు వాళ్ళు అక్కడే ఉన్నారని ముందు తాత, తరువాత రెండు సంవత్సరాలకు అవ్వ అక్కడే చనిపోయారని తరువాత తెలిసింది. వాళ్ళకి పిల్లలు లేరు. మేము తాతా అవ్వ అంటూ ఆ కొట్లోనే మా చిన్నతనపు చిరుతిల్లను కొనుక్కునే వారం. ఆ బంకుకు అటుపక్క వీధి అంతా చిన్న చిన్న ఇళ్ళ వాళ్ళు. సాయంత్రం అయేసరికి వాళ్ళు ఆ బొంకు వద్దకు బొమ్మిడి చాపల కోసం వచ్చేవారు. తాత ఆ చేపలను క్రిందకు వేలాడదీసి ఒక తాడుతో కట్టేవాడు.

ఆ వాసనలు పీల్చి ఇంటికి వచ్చి ఆమ్మను అవి వండు అంటే, మనం అవి తినం అని ఓ పెద్ద బిల్డప్పు ఇచ్చేది. పైగా నేను ఆ చేపలు తినాలని అనుకుంటున్నానని అదో పెద్ద జోకులా నవ్వేవారు విన్నవాళ్ళూ.

ఆ వాసన అప్పట్లో నాకు చాలా సుపర్ గా ఉండేది. మా ఇంట్లో ఆ ఎండిన బొమ్మిడాలు వండేవాళ్ళూ కాదు. ఆ ఇళ్ళలోని స్త్రీలు ఇంటి ముందు పొయ్యిలు పెట్టుకుని అక్కడే ఆ చేపలు వండుకుని కంచాలలో అన్నం పెట్టుకుని బైట అరుగుల మీదకు చేరి అన్నాలు తినేవారు. ఆ వాసనలు పీల్చి ఇంటికి వచ్చి ఆమ్మను అవి వండు అంటే, మనం అవి తినం అని ఓ పెద్ద బిల్డప్పు ఇచ్చేది. పైగా నేను ఆ చేపలు తినాలని అనుకుంటున్నానని అదో పెద్ద జోకులా నవ్వేవారు విన్నవాళ్ళూ. ఆ నవ్వులు విన్నాక అదేదో తక్కువ రకం తిండేమో అనుకుని నోరు మూసుకుని ఉండిపోయేదాన్ని. ఆ కోరిక అలా మనసులోనె పెట్టేసుకున్నాను. ఇప్పటి దాకా ఆ ఎండు బొమ్మిడాలు తినలేదు. తరువాత కొన్నేళ్ళకు తెలిసింది మనం తినకూడదు అనే స్టేటస్ కి కారణం పావలా ఇచ్చి అవి కొనాలంటే అదో అనవసరపు ఖర్చు అనే స్థితిలో మేం ఉన్నామని! కేవలం నా ఒక్క దానికోసం పావలా ఖర్చు చేసే కన్నా దాన్ని ఇంటివారందరికీ కూర కోసం ఖర్చు పెడితే ఒక రోజు గడుస్తుందనే మా అమ్మ ఆలోచన అలా స్టేటస్ రూపంలో కవరప్ అయిందంతే. అదీ కాక మా యింట్లో మా చెల్లి రూపంలో ఒక విలన్ ఉండేది. ఆమెకు పుట్తినప్పటి నుండే నీచు పడదు. ఇంట్లో నాన్ వెజ్ వండితే ఆమెకు ఆ వాసనే పడేది కాదు. బలవంతంగా పెట్టబోతే వాంతులు చేసుకునేది. ఇక ఆ రెండు గదుల ఇంట్లో ఆ బొమ్మిడి చేపలు వండే పరిస్థితి లేదు కదా. సో ఆ కోరిక అలాగే ఉండిపోయింది. తరువాత కాకినాడ నుండి కూడా రొయ్యలు తెప్పించుకుని తినే స్థితికి వచ్చాక కూడా ఏంటో ఆ బొమ్మిడి చాపల వాసన ఇంకా వెంటాడుతూనే ఉంది. ఏ టైగర్ ప్రాణ్ ల కూర కూడా ఆ వాసన ముందు దిగదుడుపే.

కాకపోతే ఆరోజు ఇంటికి వచ్చేవారికి, ఈ నాడు ఇంటికి వచ్చే వారికి మధ్య ఆలోచనల స్థాయిలో చాలా భేధాలున్నాయి. ఆ వ్యక్తులు ఇప్పుడెక్కడ.

సరే ఇక ఆదివారం పూట ఒక స్టీల్ బాక్స్ ఇచ్చి ఒక కిలోమీటరు దూరంలో ఉన్న చికెన్ షాప్ నుండి పావుకిలో కూర పట్టుకురమ్మని నేను కొంచెం పెద్దయిన తరువాత మా అమ్మ పంపేది. ఆ షాప్ అంకుల్ మాకు ఫామిలీ ప్రెండ్. అప్పట్లో చాలా మంది ఇలాంటి ఫామిలి ప్రెండ్స్ ఉండేవారు. నన్ను చూసి బైటే ఉండమని చెప్పి లోపలికి వెళ్ళి బాక్స్ నింపి ఇచ్చేవారు. ఆ పావుకిలో కూరని అతను కొట్టి ఇస్తే, కీమా లెవల్లో కత్తిపీటతో ముక్కలు కోసి అందులో నానా రకాల కూరలు కలిపి మా అమ్మ పది మందికి సరిపడా ఒండేది. ఇంట్లో వాళ్లు మైనస్ మా చెల్లెలు నలుగురే. మిగతా వారంతా ఇంటికి వచ్చే గెస్ట్లు, మా అన్న ప్రెండ్సు. అదంతా ఎర్రజెండా జోలెల బాచ్. ఆ ఎర్ర జెండా వెనక వెళ్ళక ముందు సండే చికెన్ తీసుకువచ్చే పని తనదే. ఈ రోజుకీ ఇంటికి బాచీలను తెచ్చి తినిపించే కార్యక్రమం ఆయన నిర్విఘ్నంగా నడిపిస్తున్నారు. కాకపోతే ఆరోజు ఇంటికి వచ్చేవారికి, ఈ నాడు ఇంటికి వచ్చే వారికి మధ్య ఆలోచనల స్థాయిలో చాలా భేధాలున్నాయి. ఆ వ్యక్తులు ఇప్పుడెక్కడ. సన్నగా పీలగా ఉండి టిలు తాగుతూ సాహిత్యం, రాజకీయం, సినిమా, మనుష్యుల గురించి ఆ నాడు వాళ్లంతా మాట్లాడేవారు. ఇప్పడు అందరూ, మాట్లాడేది ఆస్తులు, పంపకాలు, వ్యాపారాలు. నేనింకా ఆనాటి సాదా సీదా మనుష్యుల కోసం వెతుక్కుంటూ ఉండిపోయాను. సరే.. ఇక ఏదో కారణంతో హైదరాబాద్ వచ్చే మా ఊరి వాళ్ళు కొందరు ఇంట్లో ఉండేవాళ్ళు. వాళ్ళందరికీ ఆ కూర సరిపోయేది. ఇప్పుడు రెండు కేజిలు తెచ్చినా ఇంట్లో వారికే సరిపోవట్లేదు అది వేరే సంగతి.

నా భాషలో ఇవి గొట్టాలు

ఇక మా తాత కొట్టులో గొట్టాలుండేవి. ఎల్లో రౌండ్స్ అంటారు అంతా. అది నా ఫేవరెట్ పుడ్. ఐదు పైసలిస్తే ఐదు గొట్టాలు ఇచ్చేవాడు తాత. అది చాలా కాస్టలీ అంటా నాకు తెలీదు. ఏడ్చీ, మొత్తుకుంటే తప్ప అమ్మ ఆ ఐదు పైసలు రాల్చేది కాదు. ఎప్పుడొ ఒక సారి ఇచ్చినప్పుడు ఇక పండగే, అది తీసుకుని తాత కొట్టు దగ్గరకు పోయి ఐదు గొట్టాలు కొనుక్కుని వేళ్ళకు తొడుక్కుని ఇంటి మేడ పైకి ఎక్కి అక్కడ ఓ మూల కూచుకు ఆకాశంలో వెళ్తున్న మబ్బులవైపు చూసుకుని గిల్లి గిల్లి ఆ గొట్టాలు గంట సేపు తింటుంటే స్వర్గం అంచుల్లో నిలబడి ఉన్నట్లుండేది. ఆకాశంలో మారుతున్న మబ్బుల ఆకారాలలో ఏవో చిత్రాలు కనిపించేవి. మేడ మీద ఆ మూల స్థలంలో కాస్త నీడలో కూర్చుని ఎన్ని గంటలు నా చిన్నతనాన్ని గడిపానో!

చేతి వేళ్ళకు ఐదు గొట్టాలను తగిలించుకుని ఒక్కదాన్ని ఉన్నప్పుడు తినడం ఇంకా నా అలవాటు.

ఆ ఎల్లో రౌండ్స్ ఇప్పడు కూడా ఇంట్లో తప్పకుండా ఉంటాయి. గిన్నెడు వేయించుకుని తింటూ ఉంటా అప్పుడప్పుడు. చేతి వేళ్ళకు ఐదు గొట్టాలను తగిలించుకుని ఒక్కదాన్ని ఉన్నప్పుడు తినడం ఇంకా నా అలవాటు. కాకపోతే చూసిన వారికి నా మతి భ్రమించిందేమో అనిపిస్తుందని, వారి కోసం ఒంటరిగా ఉన్నప్పుడే ఈ పని చేస్తూ ఉంటాను.

న్యూట్రిన్ చాక్లెట్…

ఇప్పుడు కాడ్బెరీలు, సెలెబ్రేషణ్స్ లాంటి చాక్లెట్లు చాలా వస్తున్నాయి. అప్పట్లో నాకు తెలిసిన చాక్లెట్, ఆకు పచ్చ కాగితంలో చుట్టబడి ఉన్న న్యూట్రిన్ టాఫీ. మా క్వార్టర్స్ లో చివరి ఇంట్లో క్రింద ఒక ముస్లిం పరివారం ఉండేది. ముస్లిం అంకుల్ అని పిలిచే వాళ్ళం. నేను ఐదు ఆరో  తరగతికి వచ్చే దాకా వీళ్ళే మెయిన్ రోడ్ కు క్రింద రెండు రోడ్లు కలిసే చోట ఒక పాన్ షాన్ నడిపే వాళ్ళు. తరువాత వాళ్ళూ ఆ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. అక్కడే మొదటి సారి ఈ చాక్లెట్లు తిన్నాను. అది ఇప్పటికీ నా ఫేవరేట్. ఇప్పటికీ అన్ని బ్రాండ్ల మధ్య అది వెతుక్కుంటూ ఉంటాను. ఒక్కసారి ఎప్పుడో పది సంవత్సరాల క్రితం అవి ఏదో టూర్లో దొరికాయి. నాకు ఇప్పటికీ ఫేవరేట్ చాక్లెట్ ఇదే. గ్రీన్ పేపర్లో చుట్టిన బ్రౌన్ కలర్ చాక్లెట్ కనీసం అరగంట చీకేవాళ్లం.

తిమ్మిరి బిల్లలు

ఇక అతి పెద్ద లగ్జరీ, తిమ్మిరి బిల్లలు అనే చెప్పాలి. ఆరెంజ్ కలర్ లో దానిమ్మ తొనలలా ఉండే ఈ పిప్పరమెంట్లు నా ఆల్ టైం ఫేవరేట్. సూపర్ మార్కెట్లలో ఇప్పటికీ నేను అతి ఇష్టంగా కొనుక్కునే వస్తువు ఇది. వేసవి సెలవుల్లో ఒక రెండు బిల్లలను జేబులో వేసుకుని రోజంతా గడిపేదాన్ని. ఇప్పటి రోజుల్లోలా గుప్పెడు గుప్పెడు కొనుక్కుని జేబులు నింపుకునే సీన్ ఆ రోజుల్లో లేదు.

ప్యాలాల ముద్ద

ఇక అప్పట్లో మరో తీయ్యటి జ్ఞాపకం మరమరాల ఉండలు. నా అదృష్టానికి అవి ఇప్పటికీ దొరుకుతున్నాయి. కొంచెం చిన్న సైజులో ఈ మరమరాల ఉండలు, పల్లీల ఉండలు మా తాత పెద్ద డబ్బాలలో పోసి ఎదురుగుండా పెట్టుకుని అమ్మేవాడు. అతని కొట్లో పల్లీల ఉండలకు చాలా గిరాకీ ఉండేది. కాని నాకు మురమురాల ఉండలంటే చాలా ఇష్టంగా ఉండేది.

ఎంత గొప్ప ఫుడ్ ఐటమ్ ఎదురుగా ఉన్నా చలించను కాని, ఈ మురమురాల ఉండలు చూస్తే ఇక అన్నీ మరచిపోవడం నా బలహీనత.

ఈ వయసులో కూడా వాటిని చూడగానే నోరు ఊరడం మొదలవుతుంది. ఎంత గొప్ప ఫుడ్ ఐటమ్ ఎదురుగా ఉన్నా చలించను కాని, ఈ మురమురాల ఉండలు చూస్తే ఇక అన్నీ మరచిపోవడం నా బలహీనత. ఎంత ముఖ్యమైన పనైనా వీటిని నోట్ళో వేసుకున్న తరువాతే. మా తాత కొట్లో చిరు తిండ్ల రుచి ఇప్పటికీ మేయింటేన్ అవుతున్నది ఈ ఒక్క పదార్ధం లోనే.

సీక్రెట్ స్నాక్

ఇక సెలవులలో ఒక సీక్రెట్ స్నాక్ చేసుకునే వాళ్లం. కొంత చింతపండు, ఉప్పు, బెల్లం, జిలకర్ర దొంగతనంగా సేకరించి రోట్లో వేసుకుని దంచేవాళ్లం. రోట్లో దంచుతుంటే ఇంట్లో తెలిసిపోతుందనుకుంటే పైన మేడ మీద మా సీక్రెట్ ప్లేస్ లో నేల మీదే ఇవన్నీ కలబోసి ఒక పెద్ద రాయితో దంచేవాళ్ళం క్రింద చప్పుడు రాకుండా అనమాట. ఇలా దంచడం వలన మెత్తగా నలిగెవి కావు కాని అన్నీ కలిసి ఒక కచ్చా పచ్చా పెస్ట్ గా మారేవి. దాన్ని కుడి చేతి బొటన వేలికి గోరింటాకు పెట్టుకున్నట్లు పెట్టుకుని చీకుతుంటే ఉంటుంది………ఆ మజాయే వేరు.

ఇప్పటి ఫటాఫట్

ఇది వేసవి సెలవుల్లో నా ఫేవరెట్ టైం పాస్. ఇక అది చీక్కుంటూ ఊర్లో సోదంతా చెప్పుకుంటూ ఉండడం ఎంత బావుండేదో! ఇవన్నీ మళ్ళి ఆకాశం వైపు చూస్తూ తింటుంటే సూపర్ ఫీల్ వచ్చేది.

తరువాత ఇంచుమించు ఆ రుచి వచ్చేలా ఫటాపట్ అనే గోలీలను అమ్ముతారని తెలుసుకుని ఇప్పటికీ సూపర్ మార్కెట్లలో వెతుక్కుంటూ ఉంటాను. ఆ చింతపండు రుచి లేకపోయినా ఇవీ గమ్మత్తుగా ఉంటాయి. కొన్ని కాటేజ్ ఎంపోరియంలలో, ఎక్జిబిషన్ లలో ఇవి దొరుకుతాయి అప్పటి రుచి దానికి ఉండదు కాని ఇదీ నేను ఇష్టంగా కొనుక్కునే మరో పదార్ధం.

ఐస్ క్రీమ్ లు…

ప్పుడు బ్రాండెడ్ ఐస్క్రీంలు చూస్తున్నాం కాని మాకు అవి అస్సలు తెలియదు. మా ఇంటికి దగ్గరలో ఒక ఐస్ క్రీం ఫాక్టరీ ఉండెది. నాన్నగారికి మురళి అని ఒక మార్వాడి మిత్రుడు ఉండేవారు. అలుగడ్డబావిలోని ఈ ఐస్ క్రీం ఫాక్టరీ ఎదురు గుండా ఆయన ఇల్లు ఉండేది. వారి పెద్ద కొడుకూ నేను ఏదైనా పని మీద అటు నడుచుకుంటూ వెళుతుంటే ఆ ఐస్ క్రీం ఫాక్టరీలోకి తీసుకుని వెళ్లి ఐస్ క్రీం కొనిపెట్టేవాడు. ఇంట్లో తెలిస్తే అమ్మ ఇచ్చే లెక్చరు భరించడం కష్టం కాబట్టి ఎవరికీ ఈ ఐస్ క్రీమ్ విషయం చెప్పేదాన్ని కాదు. ఒక సారి అందులోకి వెళ్ళి ఐస్ క్రీం తయారీ చూసాను. ఎవరి దగ్గరయినా ఇలా డబ్బు ఖర్చు పెట్టిస్తే అమ్మకు ఇష్టం ఉండేది కాదు. మాకు ఐస్ క్రీం కొనుక్కోవడానికి డబ్బులు ఇచ్చేవారు కాదు. పైగా జలుబు చేస్తుంది అనే ఒక సాకు ముందే ఉంటుంది. అందులో చిన్నప్పటి నుండి యుస్నోఫీలియా కౌంట్ నాకు చాలా ఎక్కువ. అందుకని ఐస్ క్రీం నిషిద్దం.

జ్ఞాపకాల పరిమళం

నాకు తెలిసి ఆ చిన్నతనంలో నేను తిన్న ఐస్ క్రీంలు మూడు రకాలు మాత్రమే. ఒకటి ఆరంజ్ కలర్ లో ఉండే పుల్ల ఐసు ధర ఐదు పైసలు. రెండవది పాల ఐస్ క్రీం ధర పదిహేను పైసలు. మాకు పెద్ద కాస్టలీ ఐస్ ఫ్రూట్ అది. అమ్మ అస్సలు దీనికి డబ్బులు ఇచ్చేది కాదు. ఇక హై స్కూల్ లో స్కూల్ బైట అమ్మే స్టార్ ఐస్ క్రీం. ఇది అప్పట్లో అర్ధరూపాయ్ ఖరీదు చేసేది. రుక్మిణి అని అప్పట్లో కాంగ్రెస్ మినిస్టర్ రాజనర్సింహ గారి కూతురు నా క్లాస్ మేట్. చాలా డబ్బులు తీసుకొచ్చేది. అందరికీ స్టార్ ఐస్ క్రీంలు కొనిచ్చేది. అప్పట్లో స్కూలికి కార్లో వచ్చే అతి తక్కువ మందిలో ఆమె ఒకరు. ఆ రోజుల తరువాత ఇప్పటికీ ఐస్ ప్రూట్ కొనుక్కున్నది లేదు.

నా జీవితంలో చాలా వస్తువులు ఏవో జ్ఞాపకాలతో నిండి ఉంటాయి. వాటిని చూస్తుంటే వాటి వెనుక ఓ కథ దానికి సంబంధించిన వ్యక్తులు మనసులో మెదులుతూనే ఉంటారు. ఐస్ క్రీం అంటే నాకు ఇప్పటికీ రుక్మిణీ, మురళీ అంకుల్ పెద్ద కోడుకు గుర్తుకు వస్తూ ఉంటుంది. ఆయన్ని పెద్దన్న అనేదాన్ని. అతని పేరు ఇప్పటికీ నాకు తెలీదు.

౩5 ఏళ్ల క్రితం నేను తిన్న ఆంచూర్

ఇక స్కూల్ రోజుల్లో బైట బుట్టలు పెట్టుకుని అమ్మే ఆంటీలు ‘ఆంచూర్’ అని అమ్మేవారు. చిక్కటి నీలం రంగులో ఉండే ఆ తొనలను ఇష్టంగా కొనుక్కుని తినేవాళ్ళం. ఇప్పుడు ఎక్కడా ఆ తొనలు కనిపించట్లేదు. కొన్ని సంవత్సరాల క్రితం నార్త్ టూర్లో ఒక చోట చూసాను కాని రుచిలో ఏదో తేడా ఉంది. నేను ఆ రోజులలో తిన్న ఆంచూర్ యం అయిపోయింది. ఇది జేబులో కాగితంలో చుట్టుకుని కొంచెం కొంచెంగా చీకి మళ్ళి కాగితంలో చుట్టి దాచుకునేవాళ్ళం. ఇది తిన్నాక నాలుక నేరెడు పళ్ళ రంగులోకి మారిపోయేది. అందుకని టిచర్లు ఇది తినే వారిని డర్టీ పీపుల్ అనే వాళ్ళూ. అయినా సరే ఇది స్కూలు అయిపోయే దాక నా ఫేవరెట్ ఫుడ్ ఐటంగా ఉండిపోయింది. అప్పట్లో అంత గొప్పగా ఇంగ్లీషు రాని నేను ఓ వింత జంతువులా ఊండేదాన్నేమో.

నవ్విపోదురుగాక నాకేమి చేటు అని నా కిష్టం వచ్చినట్లుగా ఉండే మొండితనం మాత్రం అప్పట్లోనే ఉండేది.

తలకి నూనె రాసుకుని బొట్టు పెట్టుకుని తలలో పూలతో, మోకాలు దిగిన గ్రీన్ అండ్ వైట్ యూనిఫాంతో, జేబులో ఆంచూర్, లేదా పిప్పరమెంట్లతో నిజంగా చిత్రంగా ఉండేదాన్నేమో. ఎక్కిరెంచేవాళ్ళకు బదులుగా కాస్త చదువులో మంచి మార్కులు వచ్చేవి కాని ఏమైనా ఆ రోజులంటే నాకు చాలా ఇష్టం. నవ్విపోదురుగాక నాకేమి చేటు అని నా కిష్టం వచ్చినట్లుగా ఉండే మొండితనం మాత్రం అప్పట్లోనే ఉండేది.

అప్పట్లో నేను తిన్న ఆంచూర్

ఈ మధ్య జూనియర్ కాలేజీ క్లాసులో ఒక రోజు పిల్లలను ఎంగేజ్ చేయాలని మీకు నచ్చిన చిరుతిళ్ల గురించి రాయమని ఒక వ్యాసం ఇచ్చాను. చాలా మంది అంకుల్ చిప్స్ అని మెక్డోనల్డ్స్ అని కంపెనీ పేర్లు, బ్రాండ్ల పేరుతో వ్యాసం రాసారు తప్ప, నాచురల్గా తిండిని ఎంజాయ్ చేస్తూ తిన్న సంఘటనలు, ఆ చిరు తిళ్ళ రుచి ఎవరూ చెప్పలేకపోయారు. నాకు నచ్చిన ఫుడ్ అంటూ కూడా అది తిన్న హోటల్ పేరో, అది దొరికే షాపు పేరులో ఉన్న దర్జా గురుంచి రాసారు తప్ప, ఆ తినే పదార్దపు రుచిని, అందులోని అనుభూతిని రాయలేకపోయారు. రాసే భాషా పరిజ్ఞానం లేదేమో అని వారిని ఆ విషయం పై మాట్లాడమంటే అసలు అదో ప్రాధ్యాన్యత లేని విషయంగా చూసారు. ముఖ్యంగా తిండి అంటే వ్యక్తిగత విషయంగా చెప్పుకున్నారు తప్ప, ఎవరితోనే ఎక్కడొ కలిసి కూర్చుని తిన్న విషయాన్ని ఒకరో ఇద్దరో తప్ప మరెవ్వరూ రాయలేకపోయారు.

ఆత్మకో రుచి…

తినడం అంటే గొప్పగా తినడం అనే ఆలోచనే ఉండిపోయింది వాళ్లల్లో. ముఖ్యంగా తినడంలోని సామాజిక కోణం ఎక్కడా ఎవరూ ఎక్స్ప్రెస్ చేయలేకపోయారు. ఎక్కడొ రుచి అన్న పదానికి అర్ధం కూడా మారిపోయిందేమో అనిపించింది. నాలిక మీద రుచి గ్రంధులను వీడిచి ఈ రుచి అన్నది మనసుకు చేరట్లేదేమో అనిపిస్తూ ఉంటుంది ఇప్పటి పిల్లలను పెద్దలను చూస్తుంటే.

పచ్చి మామిడి కాయ ముఖ్యంగా, తోతాపరి కాయ తొనలను ఉప్పూ కారం కలుపుని నలుగురు కలిసి తినడం, ఆవకాయ ముక్కను వర్షం పడుతున్నప్పుడు బైటకి చూస్తూ చీక్కుంటూ తినడం, పెరుగు అన్నంలో ఆవకాయ నంచుకుంటూ వెన్నెల రాత్రుల్లు బైట కూర్చుని తినడం, వీటి కన్నా ఆనందాలు తిండిలో ఏం ఉంటాయో నాకు అర్ధం కాదు!

నాలుగు గదుల మధ్య నేను నా పిల్లలు అన్న విధంగా ఆహారం తీసుకునేవాళ్లం కాదు. దానికి ఒక కమ్యూనల్ టచ్ ఉండేది. ఇప్పుడు అది మిస్ అవుతుందనిపిస్తుంది.

మా జ్ఞాపకాలలో తినడం ఒక ఔట్ డోర్ ఎక్స్పీరియన్స్. నాలుగు గదుల మధ్య నేను నా పిల్లలు అన్న విధంగా ఆహారం తీసుకునేవాళ్లం కాదు. దానికి ఒక కమ్యూనల్ టచ్ ఉండేది. ఇప్పుడు అది మిస్ అవుతుందనిపిస్తుంది. అందుకే అర కొర లైట్ల మధ్య గోలల మధ్య అనవసర మర్యాదలు చూపిస్తూ చేసే ఇప్పటి భోజనాలు నాకు చాలా అసౌకర్యంగా ఉంటాయి. పెద్ద హోటల్ లలో తిండి కన్నా రోడ్ సైడ్ ధాబాలలో తిండి ఇష్టపడే నాకు ఆ స్టార్ ఆంబియన్స్ అంటే చాలా చిరాకు.

జిహ్వకో రుచి అన్నట్టుగానే ఆత్మకో రుచి ఉంటుందేమో!

రచయిత్రి పి. జ్యోతి హిందీ ఉపన్యాసకులు. చక్కటి సమీక్షకురాలు. హైదరాబాద్ లో పుస్తకాల పట్ల అభిరుచి పెంచడంలో విశేషంగా కృషి చేస్తున్న spreading Lights నిర్వాహకురాలు కూడా. పుస్తకం, సినిమా తనకు రెండు కళ్ళు. ప్రపంచానికి గవాక్షాలు. తెలుపు కోసం రాస్తున్న ఈ శీర్షికలో తాను మొదటిసారిగా అంతర్ముఖంలోకి చూసుకుంటున్నారు. జీవితాన్నే పుస్తకంగా అనుభవాలనే చలన చిత్రంగా ఎంచి సరళమూ, నిరాడంబరమూ, సామాన్యమూ ఐన జ్ఞాపకాలను ఆత్మీయంగా పంచుకుంటున్నారు.

ఈ శీర్షికలో మొదటి వ్యాసం మనసు పొరల్లో. అన్నట్టు, ఇటీవలే వీరు రచించన దిలీప్ కుమార్ సినిమనసు పొరల్లోమాల సమగ్ర పరిచయ పుస్తకం కోసం ఈ లింక్ క్లిక్ చేసి తెప్పించుకోవచ్చు.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article