నాన్నా.. మీరు కలలు గన్న సమాజం ఎప్పటికి వస్తుందో తెలియదు. చీమలుగా మీరు నిర్మించిన పుట్టల లాంటి ఉద్యమంలో అనకొండలు చేరాయి.. అయినా ఇవి తాత్కాలికం… వేగుచుక్కలకు మరణం వుండదు..
పి. చంద్రశేఖర అజాద్
మా తండ్రి పమిడి ముక్కల లక్ష్మణరావు మరణించి నేటితో అరవై సంవత్సరాలు పూర్తి అయ్యాయి. ఉద్యోగాలను, మున్సబు పదవిని తిరస్కరించి కమ్యూనిస్టు ఉద్యమం లోకి వెళ్ళారు…మోటూరు హనుమంతరావు గారి సహచరుడు ఆత్మీయ మిత్రుడు… తెలంగాణా పోరాట సమయంలో ఆరు సంవత్సరాలు కడలూరు జైల్లో వున్నారు. ఎ.కె.గోపాలన్ లాంటి యోధులు జైలు జీవితంలో వారి సహచరులు. తర్వాత నేను రెండో అక్క. జెన్నీ తమ్ముడు రాజశేఖర్ పుట్టాం… ముందు అన్నయ్య వటూటిన్, పెద్దక్క ప్రతిభ పుట్టారు. వాళ్ళిద్దరూ 1998 లో వెళ్ళిపోయారు…అమ్మ 2014లో చనిపోయారు.
నాన్న మరణం నాటికి పార్టీ ఇంకా చీలలేదు…నా పేరు చంద్రశేఖర అజాద్ అని పెట్టారు..రాజశేఖర్ అని తమ్ముడికి పేరు ఎందుకు పెట్టారు అని ఆలోచించాను. తెలుగు లో తొలి నవల రాజశేఖర చరిత్ర అంటారు. అంటే తన సంతానంలో ఒకరు రచయిత కావాలనుకున్నారు. మా పేర్లు గమనిస్తే నాన్న హృదయం తెలుస్తుంది…మా కుటుంబం లో రచయిత గా నేను మారాను. ఆయన కన్న కలలు అన్నీ కలలు గానే మిగిలాయి. డెభై అయిదు రూపాయల తో మా అందరినీ ఎలా పెంచిందో మా అమ్మ ఇప్పటికీ ఆశ్చర్యం. మాకు అనంతమైన పేదరికం తెలుసు…రెండున్నర వంతుల బతుకు కనీస జీవితం కోసం చేసే పోరాటంతో సరిపోయింది. ఆయన పేరు గుంటూరులో సి, పి,యమ్.ఆఫీస్ కి పెట్టారు…అదో నివాళి…
ఇన్ని దశాబ్దాల తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే అన్నీ విషాద అనుభవాలే… ఇలా మిగిలాం…
ఆనాటి వారసత్వం కొనసాగిస్తున్న వారు అతి కొద్ది మంది…వారే వెలుగు దారులు… సాహిత్యంలో, కమ్యూనిస్టు పార్టీల్లో ఇప్పుడు దళారులదే రాజ్యం.. ఇప్పుడు పోరాడవలసింది అలాంటి ప్రమాదకర శక్తులు మీద కూడా …
ఆనాటి వారసత్వం కొనసాగిస్తున్న వారు అతి కొద్ది మంది. వారే వెలుగు దారులు. సాహిత్యంలో, కమ్యూనిస్టు పార్టీల్లో ఇప్పుడు దళారులదే రాజ్యం. ఇప్పుడు పోరాడవలసింది అలాంటి ప్రమాదకర శక్తులు మీద కూడా… ప్రాణాలను, కుటుంబాలను త్యాగం చేసింది ఇలాంటి ద్రోహుల కోసమా అనుకున్నప్పుడు కన్నీళ్ళు వస్తాయి…మాలో ఎవరూ కమ్యూనిస్టులు కాలేదు.. సానుభూతి పరులంగా వున్నాం… మాకు చేతనయింది చేశాం.. రచయితగా జనాన్ని మోసం చేసే రచనలు నేను చేయలేదు. ఎన్ని అవసరాలు వచ్చినా… చదువు కున్నది తక్కువ… జీవితానుభవం ఇప్పటికీ నా రచనలకు మూలం.
నాన్నా.. మీరు కలలు గన్న సమాజం ఎప్పటికి వస్తుందో తెలియదు. చీమలుగా మీరు నిర్మించిన పుట్టల లాంటి ఉద్యమంలో అనకొండలు చేరాయి. అయినా ఇవి తాత్కాలికం. వేగుచుక్కలకు మరణం వుండదు.
మాకు జన్మనిచ్చిన మీకు, అమ్మ విజయలక్ష్మి కి వందనాలు.
- చంద్రశేఖర అజాద్, రాజశేఖర్, జెన్నీ.
ప్రముఖ రచయిత, నటులు పి. చంద్రశేఖర అజాద్ స్వల్ప పరిచయం కోసం ఇక్కడ చూడండి.