Editorial

Wednesday, January 22, 2025
కథనాలువిను తెలంగాణ -9 : ఇది ‘అనాధ తెలంగాణ’ గురించి!

విను తెలంగాణ -9 : ఇది ‘అనాధ తెలంగాణ’ గురించి!

రాష్ట్రంలో మీ దగ్గరున్న ఏ పాఠశాలనైనా సందర్శించండి. అనాధల పాలసీ గురించి సరే, ముందు వారి తండ్రుల మరణానికి గల కారణాలేమిటో ఆ పిల్లలను అడగండి. విచ్చలవిడిగా పెంచిన బెల్టు షాపులు, అందుకు కారణమైన మద్యం పాలసీ ఎంత మందిని బలి తీసుకుందో తెలిసి వస్తుంది. అంతేకాదు, నిశ్శబ్ధంగా ఒక అనాధ తెలంగాణ అన్నది ఎట్లా మెల్లగా విస్తృతమవుతున్నదో తెలిసి భవిష్యత్తు పట్ల కలవరానికి గురవుతాం.

కందుకూరి రమేష్ బాబు

ఉమ్మడి పాలమూరు జిల్లాలైన మహబూబ్ నగర్, కల్వకుర్తి, గద్వాల, వనపర్తి, నారాయణపేట్ జిల్లాల్లో క్షేత్ర పర్యటన చేస్తుంటే, దారి పొడవునా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పలు గురుకుల పాఠశాలలను సందర్శిస్తూ ఉంటే పిల్లలకు మంచి విద్య అందుతున్నదని సంతోషించే లోపు మరోవంక ఒక విచారకరమైన పరిస్థితి కూడా మనసును కలచి వేసినది. అదేమిటీ అంటే నలభై ఏండ్ల లోపున్న ఆ విధ్యార్థినీ విద్యార్థుల తండ్రులు మరణించి ఉండటం. ఆ మరణాలకు ముఖ్యకారణం యాక్సిడెంట్ లుగా నమోదవడం. అందుకు కారణం మద్యం అని, తాగి డ్రైవ్ చేయడం వల్ల ఆయా పిల్లల తండ్రులు అర్ధాయుస్సులోనే మరణించడంగా తెలిసి విచారం కలుగుతున్నది.

ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ, బాలికల గురుకుల పాఠశాలలు – దేన్నయినా సందర్శించండి. ప్రవేశ పరీక్ష ద్వారా ప్రధానంగా అక్కడ అడ్మిషన్లు ఇవ్వడం చూస్తారు. దీనికి అదనంగా ప్రతి పాఠశాలో ఇద్దరిని తల్లిదండ్రులు లేని కారణంగా చేర్చుకోవడం ఒక పద్దతిగా ఉందని గ్రహిస్తారు. అట్లా రెండు వందల మంది చదువుతున్న పాఠశాలల్లో ఇరవై మంది దాక ఇలా అనాధ పిల్లలుంటే అందులో వారి తండ్రులు పది మంది దాకా యాక్సిడెంట్ల కారణంగానే చనిపోయి ఉండటం గమనించవచ్చు. అందుకు కారణం మద్యం సేవించడం అని పిల్లలు చెబుతున్నారు.

చిత్రమేమిటంటే, గురుకుల పాఠశాలల్లో ఇలా తరగతికి ఇద్దరు అనాధ పిల్లలను చేర్చుకున్న పాఠశాలల్లోనే కాదు, కస్తూర్భా గాంధీ విద్యాలయాల్లోనైతే ఈ ధోరణి ఇంకా బాగా బోహపడుతుంది. అక్కడ నూటికి యాభై శాతం ప్రవేశాలు అనాధ పిల్లలవే ఉంటాయి. అందులో చదివే వారితో మాట్లాడితే ఈ పరిస్థితి మరింత స్పష్టమైంది. యాభై మందిలో ఇరవై ఐదుకు పైగా యాక్సిడెంట్లు కారణంగా చనిపోవడమే కన్పిస్తోంది. ఇలాంటి మరణాలన్నీ గత ఆరేళ్ల నుంచి ఎక్కువగా జరుగుతున్నట్లు కూడా తెలుస్తోంది.

తెలంగాణాలో ఇంట్లాంటి విషాద పరిస్థితులు రాష్ట్రం ఏర్పాటయ్యాక రెండవ దశ నుంచి మరింత పెరుగుతున్నాయని, మధ్య ఏరులై పారుతుండగా చూస్తుండగానే వందలు, వేలాది పిల్లలు తండ్రి లేని పిల్లలుగా మారిపోయిన వైనం చాప కింద నీరులాగా మనల్ని ముంచి వేసిందని, అది అత్యంత ప్రమాదకర స్థితికి దారి తీస్తుందని గుర్తించాలి.

మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, పిల్లల తండ్రులు మరణించారు గానీ వారి తాతలు ఇంకా బ్రతికే ఉడటం.

పదో తరగతి చదువుతున్న కొత్తకోటకు చెందిన గూరకొండ వంశీక తండ్రి యాక్సిడెంట్ తో చనిపోయాడు. మధుగని శివాని తండ్రి అట్లే యాక్సిడెంట్ తో చనిపోయాడు. వనపర్తికి చెందిన ఎ. గగనశ్రీ తండ్రి యాక్సిడెంటే. నెల్ల నందిని తండ్రి కూడా యాక్సిదేంటే. ఇట్లా ఇన్ని యాక్సిడెంట్లు ఎలా జరుగుతున్నాయి అని పిల్లలనే కాదు, పోలీసు అధికారులను కూడా అడిగి చూడండి. వాటి వెనకాల కారణం మద్యం సేవించి బండ్లు నడపడం అని అర్థమవుతుంది.

నిజానికి ఒక్క ఉమ్మడి పాలమూరు లోనే కాదు, రాష్ట వ్యాప్తంగా మొత్తం ప్రభుత్వం పాఠశాలలు, గురుకుల విద్యాలయాలు, నవోదయా విద్యాలయాలు, మోడల్స్ స్కూల్స్, ప్రైవేట్ పాఠశాలలతో కలిపి గనుక అధ్యయనం చేస్తే, పిల్లల ద్వారా తల్లిదండ్రుల మరణాలకు గల కారణాలను పోల్చుకుంటే మద్యం ద్వారా జరుగుతున్న మరణాలు వేలాదిగా ఉండటం ఎవరినైనా కలచివేస్తుంది.

కాగా, యాక్సిడెంట్లు ద్వారా కాకుండా మృతుల ఇతరత్రా మరణాలకు కారణం తంబాకు, గుట్కా సేవించడం ద్వారా క్యాన్సర్ బారిన పడటం అత్యధికంగా ఉంది. ఆ తర్వాత గుండె జబ్బుల కింద చనిపోయే వారు ఉంటున్నారు. ఇవి కాకుండా కరెంట్ షాక్ కు గురై చనిపోతున్న కేబుల్ ఆపరేటర్లు కూడా అధికంగా కనిపిస్తున్నారు. కానీ, అత్యధిక మృతులకు కారణం యాక్సిడెంట్లు అనే తెలుస్తోంది. వారంతా మద్యానికి బానిసగా మారడం కనిపిస్తోంది.

మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, పిల్లల తండ్రులు మరణించారు గానీ వారి తాతలు ఇంకా బ్రతికే ఉడటం. తండ్రులతో పోలిస్తే ఆ తరం ఆరోగ్యంగానే ఉండటం విశేషంగా చెప్పుకోవాలి. అదే సమయంలో తండ్రులను కోల్పాయారు గానీ ఈ పిల్లలకు, అదృష్టవశాత్తూ తల్లులు బ్రతికే ఉన్నారు. శ్రామిక కులాలకు చెందిన వారే ఐనప్పటికీ ఈ తల్లులు మద్యానికి బానిస కాకపోవడం మన అదృష్టం.

నిజానికి వర్తమాన తెలంగాణ ఎలా ఉందో తెలియాలంటే రైతులను కలవాలి. రేపటి భవిత ఎలా ఉండబోతుందో తెలియాలంటే పిల్లలను కలవాలన్న ఆలోచన నిజంగా ప్రయోజనకారిగానే మారింది. పాఠశాలలు నిజంగా సూక్ష్మదర్శినిలు. కాకపోతే వాటి ఆధారంగా మనం జాగురూకత పెంచుకోవాలి. తగిన ప్రణాళికలు రచించుకోవాలి.

కాగా, ఒక మంచి పరిణామం ఏమిటంటే, ప్రస్తుత బిఆర్ ఎస్ ప్రభుత్వం ఎన్నికలకు కొన్ని మసాల ముందే అనాథల పాలసీ ఒకటి రూపొందించే యోచన చేసి, కొంత కసరత్తు చేసింది కూడా. మీరూ ఆ వార్తలు చూసే ఉంటారు. రేపు ఎన్నికల అనంతరం తిరిగి బిఆర్ ఎస్ ప్రభుత్వం గనుక ఏర్పడితే తక్షణం చేయవలసింది బెల్టు షాపుల తగ్గింపు. లేనట్టయితే అనాథల పాలసీ ద్వారా వారి పిల్లల సంక్షేమం కోసం చేసే ప్రయత్నం ఎలా ఉన్నా కొత్తగా మృతుల బారిన పడే వారి సంఖ్య రోజు రోజుకూ పెరగడం ఖాయం. అది తర్వాత పరిష్కరించుకోలేని వైఫల్యమే అవుతుందని గమనించాలి.

ఏమైనా, మద్యం ఆదాయం ద్వారానే పాలనను నుసయాసం చేసుకున్న బిఆర్ ఎస్ ప్రభుత్వం పిల్లల భవితవ్యాన్ని ఫణంగా పెడుతూనే యధేచ్చగా అటు మద్యం పాలసీని కొనసాగిస్తూ ఇటు అనాధల పాలసీని అద్భుతంగా అమలు చేయాలని యోచించడంలో అర్థం లేదు. అది ఆత్మవంచన కిందకే వస్తుంది. కావున రేపు బిఆర్ ఎస్ పార్టీ తిరిగి పాలనా పగ్గాలు చేపట్టినా లేదా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా తక్షణం మద్యం విధానాన్ని సవరించుకోవాలని ప్రజలుగా మనం డిమాండ్ చేయవలసిందే. పిల్లల భవితను కాపాడుకోవలసిందే. లేదంటే ఒక ‘అనాధ తెలంగాణ’ పెద్ద ఎత్తున మన భవితను సమూలంగా బెంబేలు పెట్టిస్తుంది. అదే గనుక జరిగితే, ఇప్పటిదాకా చేసిన అభివృద్ధి ఎందుకూ పనికిరాదు. సాధించుకున్న తెలంగాణకు కూడా అర్థం లేదు.

విను తెలంగాణ – 8 : ఎజెండాలో లేని పాలమూరు బడి పిల్లలు!

విను తెలంగాణ -7: గొర్రె ప్రవేశించిన వైనం…

విను తెలంగాణ -6 : నమస్తే – ఫక్తు రాజకీయ ఉచిత పత్రిక!

విను తెలంగాణ – 5 : ఆ దేవుడు మతిమరిస్తే బాగుండు!

విను తెలంగాణ -4 : రెహమాన్ విజిటింగ్ కార్డు: చేనుకు కట్టే చీరలు అమ్మబడును…

విను తెలంగాణ -3: వలస కూలీల ‘గునుగు కూర’ గురించి విన్నారా?

విను తెలంగాణ 2 : పామరుల జ్ఞానం విను, చాటు – అదే ‘పల్లె సృజన’

విను తెలంగాణ 1 : బడి అంటే చదువు మాత్రమే కాదు!

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article