ఇన్ని సాధించినా ఆయనకు పద్మశ్రీ మాత్రం ఇచ్చి సరిపెట్టారు. 2001లో హఠాత్తుగా గుర్తొచ్చి అర్జున ఇవ్వబోతే అతను వద్దన్నాడు. భారత రత్న కదా ఇవ్వాలి.
సి. వెంకటేష్
భాగ్ మిల్ఖా భాగ్…బతికినన్నాళ్ళూ అతను పరిగెత్తుతూనే ఉన్నాడు. బతకడం కోసమే కదా పరుగు నేర్చాడు. దేశ విభజనప్పటి హింసాకాండలో తల్లితండ్రులను కోల్పోయి ప్రాణాలు దక్కించుకోడానికి ఢిల్లీకి పరిగెత్తాడు. కాలే కడుపు కోసం చిన్న చిన్న దొంగతనాలు చేసినప్పుడు పోలీసులకు దొరక్కుండా పిక్కబలం ప్రదర్శించాడు. ఒక గ్లాసుడు పాలు ఎక్కువ దొరుకుతాయనటే మళ్ళీ పరుగందుకున్నాడు. డేశానికి పతకాల పంట పండించడం కోసం దౌడుతీశాడు. ముదిమి వయసులో కూడా అలవాటులో పొరపాటుగా పరిగెత్తుతూనే ఉన్నాడు. కానీ తొంభైఒక్క సంవత్సరాల వయసులో పిక్కల్లో బలం తగ్గిందేమో, కొరోనా రక్కసికి దూరంగా మాత్రం పరిగెత్తలేకపోయాడు. ఆ మహమ్మారితో చివరి నిముషం దాకా పోరాడి వీరమరణం పొందాడు.
మిల్ఖా సింగ్ ఒక లెజెండ్, గ్రేటెస్ట్ – ఇవేమీ కాదు. అప్పుడప్పుడే మొగ్గ తొడిగిన స్వతంత్ర భారతావనికి అతనొక స్పూర్తి, మార్గదర్శి. క్రీడారంగంలో హీరోలకు మొహం వాసిన రోజుల్లో క్రికెట్, హాకీల కవతల మనకు దొరికిన ఒక మేలిమి ముత్యం. “ఆ రేసులో మిల్ఖా ఏంచేశాడో తెలుసా” అంటూ తమ తాతలు, తండ్రులు చెప్పిన కథలు వింటూ నిన్నటి తరం వారు పెరిగారు. ఇప్పుడైతే సూపర్ మేన్లూ, స్పైడర్ మేన్లూ, ఎవెంజర్స్ ఉన్నారు కానీ అప్పటి వారికి మిల్ఖానే సూపర్ హీరో. రైలు కన్నా వేగంగా పరిగెత్తగల ఫ్లయింగ్ సిఖ్. అథ్లెటిక్ ట్రాక్‌పై అగ్గి రాజేసే యోధానుయోధుడు.
ఇప్పుడైతే సూపర్ మేన్లూ, స్పైడర్ మేన్లూ, ఎవెంజర్స్ ఉన్నారు కానీ అప్పటి వారికి మిల్ఖానే సూపర్ హీరో.
ఆర్మీలో చేరేవరకు అథ్లెటిక్స్ అంటే ఎంటో తెలియదు అతనికి. రేసులో ముందు వరసలో నిలిస్తే ఒక గ్లాసు పాలు ఎక్కువ దొరుకుతాయంటే సై అన్నాడు. పాకిస్తానీ పంజాబ్‌లో పుట్టినా కూడా అలా మన సికందరాబాద్ ఇ.ఎం.ఇ సెంటర్లో అథ్లెట్‌గా మిల్ఖా రూపుదిద్దుకున్నాడు. సరైన సదుపాయాలు, సుశిక్షుతులైన కోచ్‌లు లేని ఆరోజుల్లో నిరంతర సాధనతో ప్రపంచ స్థాయి అథ్లెట్‌గా ఎదగగలిగాడు. అతను సాధన చేస్తూ చేస్తూ పడిపోతే తోటి రన్నర్లు భుజాల మీద మోసుకొచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి.
పరుగుకు ఎప్పటికీ చిరునామా అతనే.
పరుగుపందాల్లో ప్రపంచ స్థాయిలో ఎన్నో తిరుగులేని విజయాలు మన ఫ్లయింగ్ సిఖ్ ఖాతాలో ఉన్నాయి. 1958లో కామన్‌వెల్త్ క్రీడల్లో గోల్డ్ మెడల్ గెలవడం, 1960 రోమ్ ఒలింపిక్స్‌లో కేవలం సెకనులో వందో వంతు తేడాలో పతకం మిస్సవ్వడం, ఆసియా క్రీడల్లో నాలుగు సార్లు స్వర్ణాలు సాధించడం, పాకిస్తానీ స్ప్రింటర్ ఖాలిక్‌ను వారి గడ్డపైనే ఓడించడం – ఇలాంటి అతని విజయగాధలు మనకు తెలిసినవే. ఫరాన్ అఖ్తర్ సినిమాలో కూడా చూశాం. అతనికి ఫ్లయింగ్ సిఖ్ అని నామకరణం చేసింది అప్పటి పాక్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్ అని కూడా మనకు తెలుసు. రోమ్ ఒలింపిక్స్ నాటి అతని 400 మీటర్ల జాతీయ రికార్డు 38 సంవత్సరాల పాటు చెక్కుచెదరకుండా నిలిచింది. ఇన్ని సాధించినా ఆయనకు పద్మశ్రీ మాత్రం ఇచ్చి సరిపెట్టారు. 2001లో హఠాత్తుగా గుర్తొచ్చి అర్జున ఇవ్వబోతే అతను వద్దన్నాడు. భారత రత్న కదా ఇవ్వాలి.
ఒక్క టాబ్లెట్ కూడా వేసుకొని ఎరుగను, తలనొప్పి వచ్చినా బూట్లు తొడుక్కుని జాగింగ్‌కు పోతాను అన్న ఆ పరుగు వీరుడి మాటలు మొన్నటిదాకా వాట్సాప్‌లో చక్కర్లు కొట్టాయి. ఇప్పుడు మిల్ఖా మన మధ్యన ఉన్నా లేకున్నా పరుగుకు ఎప్పటికీ చిరునామా అతనే.
తెలుగు జర్నలిజంలో క్రీడా విశ్లేషణకు గౌరవం, హుందా తెచ్చిన సీనియర్ క్రీడా పాత్రికేయులు సి.వెంకటేష్. జాతీయంగా, అంతర్జాతీయంగా టెలివిజన్ వ్యాఖ్యాతగా రాణించిన తొలితరం కామెంటేటర్ కూడా. వారు BITS AND PIECES, SECOND IINNINGS, క్రీడాభిరామం- పేరిట వ్యాసాల పుస్తకాలు వెలువరించారు. అలాగే, సికె నాయుడు ఆత్మకథ, సచిన్ పై SUCH A 100 అన్న గ్రంధాన్ని కూడా వెలువరించారు. ‘YOURS SPORTINGLY’ ప్రతివారం తెలుపు పాఠకులకు వారందించే క్రీడా స్ఫూర్తి.
చాలా బాగా రాశారు.
అభినందనలు వెంకటేష్.