Editorial

Wednesday, January 22, 2025
ఇంటర్వ్యూలు"నేనొక అనంతాన్ని" - ఆర్ ఎస్.ప్రవీణ్ కుమార్ తెలుపు

“నేనొక అనంతాన్ని” – ఆర్ ఎస్.ప్రవీణ్ కుమార్ తెలుపు

ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఐపిఎస్ సర్వీస్ కు రాజీనామా చేసిన నేపథ్యంలో, చాలా స్పష్టంగా ఇకముందు సామాజిక న్యాయం కోసం పని చేస్తానని ప్రకటించిన సందర్భంలో తన జీవన ప్రస్థానం సంక్షిప్తంగా తెలుసుకోవడం చాలా మందికి ఉత్తేజం. కొందరికి అవగాహన.  ఆరేళ్ళ క్రితం రాసిన ఈ సవివరమైన కథనం అందుకు గొప్పగా దోహదపడుతుందని మరోసారి తెలపడం.

ప్రవీణ్ కుమార్ ఖాకీ యూనిఫాం నిదానంగా తొలగి ఒక తెల్లటి దుస్తుల్లోకి మారిన భావన. అవి కూడా నిదానంగా నీలం రంగును సంతరించుకుని అంబేద్కర్ త్యాగాలవల్లే కదా ఇవ్వాళ మేం ఇంతటి స్థాయికి వచ్చామన్న స్పృహలో తనంతట తాను స్థిరపరడటం ఇదంతా జరగవలసిందే అన్నట్టు జరిగిపోయింది, ముందే అని ఇప్పుడు బోధపడుతోంది.

కందుకూరి రమేష్ బాబు 

పల్చని కళ్లద్దాలతో ఒకవైపు మేధావిగాను, మరోవైపు ఒక సోల్జర్‌లానూ కనిపించే ప్రవీణ్ కుమార్ అంటే తెలియని వారుండరు. కరడు గట్టిన పోలీసు అధికారిగా ఆయన కరీంనగర్ జిల్లా వారికే కాదు, తెలుగు ప్రజలందరికీ తెలుసు. మడిమ తిప్పని కార్యశీలిగానూ అందరికీ గుర్తే. రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో అనేక సంస్కరణలను అవలంబిస్తూ అణగారిన వర్గాల్లో ఆత్మవిశ్వాసాన్ని ఒక ఎవరెస్ట్‌వలే రేకెత్తించిన సార్ అతడు. ఆయన్ని కలిస్తే “నా గురించి రాయడానికేముంది?” అని సున్నితంగా తిరస్కరించే ప్రయత్నం చేశారు. కానీ, తప్పదంటే నిదానంగా తన అంతరంగాన్ని తెరిచి చూపారు.

ఆయన మూడు గంటలకు పైగా సమయాన్ని పంచుకున్నారు. ఆ కొద్దిసేపట్లోనే ఆయనేమిటో తెలిపే ఎన్నో విస్తృతమైన అంశాలను కలబోసుకున్నారు. సారాంశంలో ఆయన మూడు విధాలుగా వ్యక్తమయ్యారు. తొలి అంకంలో ఒక కనపడని ఒక ఖాకీ యూనిఫాం లీలగా ద్యోతకమైంది. అయితే, నక్సలైట్ల అణచివేతలో కఠినమైన ప్రయోగం చేసిన పోలీస్ అధికారి ఆయన. ‘మా ఊరికి రండి’ అన్న ఆయన కార్యక్రమం గానీ, ‘సిరి వెలుగులు’ అన్న కార్యక్రమం గానీ ఒక సాహసకృత్యం.

కానీ, అదంతా గతం. మాట్లాడుతుంటే ఆ ఖాకీ యూనిఫాం లీలగా మాయమై తెల్ల దుస్తులతో కూడిన ఒక వైద్యుడు కనబడ్డాడు. అతను వెటర్నరీ డాక్టరు కూడా. వైద్యం చేయలేదు గానీ వెంటనే ఐ.పి.ఎస్‌కి సెలక్ట్ అయ్యారు. ఆ తెలుపు మర్మం ఏమిటీ అంటే ఏ బాధ్యత తీసుకున్నా మనసా వాచా కర్మణా నిమగ్నం కావడంలోని చిత్తశుద్ధి తాలూకుది.

అటు పిమ్మట అ తెలుపు క్రమేణా నీలం రంగును సంతరించుకుంటుంటే తాను అణగారిన వర్గాలకు ఒక గొప్ప భరోసా నిచ్చే ఒక ఆశాజ్యోతిగా మారిన నేటి సందర్భం, మారుతున్న కాలానికి తగ్గ మార్పులను జోడించుకుంటూ వెళుతున్న ఒక అంబేద్కరైట్‌గా కానరావడం ఒక విశేషం.

అదే ఆయన నిండు వ్యక్తిత్వానికి భూమికగా శోభిల్లడం ఒక ప్రత్యేకత. అయితే, “ఇదంతా రూపాంతరమా?” అంటే “కాద”నే అన్నారాయన. ఒక వికాసంగా వారు వ్యక్తమయ్యారు.

హార్వర్డ్ యూనివర్సిటీలో పబ్లిక్ అడ్మినిస్టేషన్ చదవడం అన్నది ఒక ప్రధాన అంకం ఏమీ కాకపోవచ్చు. దాన్ని మాత్రమే కొలమానంగా తీసుకుంటే అంతకు ముందు తాను ఐ.పి.ఎస్. ఆఫీసర్ వేరు. ఆ చదువు పూర్తయ్యాక గురుకుల సంక్షేమశాఖ సెక్రటరీ కావడం వేరు అనిపిస్తుంది.

చిన్ననాటి నుంచీ నాకు పుస్తకాలు చదవడం ఇష్టం. మనుషులను వినడమూ ఇష్టం. అట్లే, పరిస్థితులను అవగాహన చేసుకోవడమూ ఒక అభ్యాసం. అందువల్లే నా ప్రయాణంలో అత్యంత కీలకంగా చెప్పే అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీలో పబ్లిక్ అడ్మినిస్టేషన్ చదవడం అన్నది ఒక ప్రధాన అంకం ఏమీ కాకపోవచ్చు. దాన్ని మాత్రమే కొలమానంగా తీసుకుంటే అంతకు ముందు తాను ఐ.పి.ఎస్. ఆఫీసర్ వేరు. ఆ చదువు పూర్తయ్యాక గురుకుల సంక్షేమశాఖ సెక్రటరీ కావడం వేరు అనిపిస్తుంది. కానీ, “నేను మారలేదు. నాలో వికాసం ఉండవచ్చు” అంటూ ప్రారంభించారాయన.

తనతో మాట్లాడుతుంటే ఒక విషయం మాత్రం స్పష్టమైంది. తాను ఏ పని చేసినా అది ఉద్యమంలా చేయడం! అందుకు కారణం ఉంది. ఒకటి, తాను వెట్టిచాకిరి చేసిన తల్లిదండ్రుల నుంచి వచ్చినవాడు. అదృష్టవశాత్తూ తల్లిదండ్రులిద్దరూ తర్వాత చదువుకుని ఉపాధ్యాయులుగా పనిచేశారు. ఆ లెక్కన తాను తొలి తరం దళిత విద్యావంతుడే కాదు, మలితరం విద్యావంతుడు కూడా. అందువల్లే ఉద్యమంగా పనిచేయడం వెనుకాల అణచివేతను చూసిన అనుభవం ఉంది. అణచివేత నుంచి వికసించిన మాతృమూర్తుల ప్రేరణా ఉంది. ఆ రెంటి అనుభవం నుంచి ఎదిగి వచ్చిన ఒక యువకుడూ ఉన్నాడు. అందువల్లే తనలో ఉద్యోగం అన్నది ఉద్యమంగా కావడం ఒక అవసరంగానూ ఉండటం మనం గమనిస్తాం.

మాటల్లో -తనతో మాట్లాడుతూ ఉంటే -ఒక అంబేద్కర్‌ని, మరొక ఎస్.ఆర్.శంకరన్‌ని కలిసినట్టు, వాళ్ల విజన్‌ను అందిపుచ్చుకున్నట్టే అనిపిస్తుంది. మారుతున్న కాలానికి తగ్గ మార్పులను జోడించుకుంటూ వెళుతున్న ఒక దీక్షాదక్షుడిని చూసిన సంతోషమే కలిగింది. గతం గతః అనుకోవడం నిజంగా తెలంగాణ సాకారమైన వేళ ఒక అవసరం కూడానూ.

కానీ, ప్రారంభం చిన్నదే. ఇది చిన్న ఇంటర్వ్యూనే. ఎందుకూ? అన్న ప్రశ్న కోసం. అవును. ఆయన పోలీసు ఆఫీసర్. కానీ, ఇప్పుడు సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల విద్యాలయాల (TSWREIS) కార్యదర్శి. ఇలా ఎందుకయ్యారూ? అన్నదే ప్రశ్న. తాను ఐ.పి.ఎస్ అధికారి. కానీ, పనితీరంతానూ ఒక ఐ.ఎ.ఎస్ అధికారిగా ఉంటుంది. ఎందుకీ పరిణామం అన్నది ఆ ప్రశ్న.

ఈ పోలీసు ఉన్నతాధికారి తనంతట తాను అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డిని అడిగి మరీ సంక్షేమ శాఖా కార్యదర్శిగా పనిచేయడానికి పూనుకోవడానికి కారణం ఏమిటీ? అన్నది అసలు సిసలు ప్రశ్న. ఆ ఒక్కటి తెలిస్తే చాలని ఈ వారం ఓపెన్. కానీ, ఆయన మరికొన్ని చెప్పడమే ఈ కథనం ఉద్దేశ్యం.

నేను 2011లో ఒక ఏడాదిపాటు హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విద్యార్థిగా వెళ్లాను. అంతే. అక్కడి నుంచి తిరిగి వచ్చాక నేను వేరు. అంతకుముందరి నేను వేరు. అయితే నా దృక్పథంలో మార్పు అని కాదు. నా జీవితమే విశాలమైంది అని ఆగారాయన.

అది తెలంగాణ ఉద్యమం ఉధృతంగా ఉన్న సమయం. 2009. ఉస్మానియా క్యాంపస్‌కి స్పెషల్ ఆఫీసర్‌గా ప్రవీణ్ కుమార్‌కి పోస్టింగ్ ఇచ్చారు. అదంతా అట్టుడుకుతున్న సమయం. విద్యార్థులు తెలంగాణ కోసం చావో రేవో తేల్చుకుంటున్న దశ. ముళ్ల కంచెలు. భాష్ప వాయు గోళాలు దినచర్యలో మామూలు విషయాలు అయిన కాలం. అంతకుమించి కేసీఆర్ దీక్షకు దిగిన సందర్భం. వారిని అరెస్ట్ చేసి ఖమ్మం తరలించిన ఉద్రిక్త సమయం కూడా.

అంతటి ఘర్షణాత్మక సమయంలో ప్రవీణ్ కుమార్ ఆర్ట్స్ కాలేజీ బాధ్యతలో ఉన్నారు. తాను అక్కడ ఉన్నారన్నట్టేగానీ, రానున్న కాలంలో, తెలంగాణ పునర్నిర్మాణంలో ఒక సరికొత్త భూమికను పోషించనున్నట్టు ఎవరికీ తోచలేదు. ఎవరూ ఊహించని చిత్రం అది. నిజానికి తాను పోలీస్ అధికారి కావడం పట్ల ఎన్నడూ కించిత్తయినా విచారించింది లేదట. ఐ.ఎ.ఎస్. రాలేదని కూడా ఒక్క క్షణం బాధపడ్డదీ లేదట. అంతేకాదు, కఠినమైన ప్రయోగాలతో తన కెరియర్ సాగడం పట్ల కూడా, వెనక్కి తిరిగి చూసుకుంటూ కూడానూ ఎటువంటి రిగ్రెట్స్ లేవని తాను అన్నారు. అటువంటిది ఆయన పోలీసు యూనిఫాం మరి కొన్నేళ్లలో వదిలేయబోవడానికి ఆర్ట్స్ కాలేజీయే వేదిక కావడం యాదృచ్ఛికం కావచ్చు. ఆ సంగతే తాను వెల్లడించారు.

నాకు చిన్నప్పటి నుంచీ చదవడం ఇష్టం. చదవడం అంటే ఇష్టం అనేకంటే ప్రాణం అనాలి. అయితే, నా అభిరుచి తెలిసిన వాళ్లు చాలామందే ఉన్నారు. ఉద్యమ సమయలో నేను డ్యూటీలో ఉండగానే ఉదయం ఒక తీరు, సాయంత్రం ఒక తీరు ఉండేది అక్కడ పరిస్థితి. భాష్పవాయు గోళాలు ఉదయం అయితే సాయంత్రం మళ్లీ విద్యార్థులతో కలిసి చాయలు తాగడం మామూలే. అట్లా నేను మరికొందరు మిత్రులం ఆర్ట్స్ కాలేజీ వద్ద ముచ్చట్లలో నిమగ్నమయ్యే వాళ్లం. ఉదయం ఉద్యమం. సాయంత్రాలు చదువు సంధ్యల గురించి చర్చలు, అభిప్రాయాలు షేర్ చేసుకోవడాలు. అప్పుడు వైస్ చాన్సలర్ కావచ్చు, కంచ ఐలయ్య వంటి ప్రొఫెసర్లు కావచ్చు, పేర్లెందుకుగానీ చాలామందితో ఇంటరాక్ట్ అయ్యేవాడిని.

సడెన్‌గా ఒకరన్నారు. నీకు పుస్తకాలు చదవడం ఇష్టం కదా. ఇక్కడే ఆగిపోకుండా మరిన్ని ఉన్నత చదువుల కోసం ప్రయత్నించవచ్చు కదా అని. మరొకరన్నారు. చదివితే ప్రపంచంలోని అత్యుత్తమ విశ్వవిద్యాలయంలో చదవాలి అని! చాలా క్యాజువల్‌గా అందిన ఆ సూచన ఫలితంగా నేను 2011లో ఒక ఏడాదిపాటు హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విద్యార్థిగా వెళ్లాను. అంతే. అక్కడి నుంచి తిరిగి వచ్చాక నేను వేరు. అంతకుముందరి నేను వేరు. అయితే నా దృక్పథంలో మార్పు అని కాదు. నా జీవితమే విశాలమైంది అని ఆగారాయన.

నాలో ఉన్న శక్తి అమేయమని, అజేయమని, ప్రపంచాన్ని మార్చడానికి పనికొచ్చే ఇంధనం ఏదో నాలో నిభిడీకృతమై ఉందని స్పురణకు వచ్చింది.

అత్యుత్తమ విశ్వవిద్యాలయంలోకి వెళ్లాక నేనొక విశ్వమానవుడిని అని అర్థమైంది. నా క్లాస్‌మేట్స్‌లో కొందరు ప్రపంచ కుబేరులున్నారు. ప్రపంచాన్ని తమ వ్యాపార సామ్రాజ్యంతో విస్తరిస్తున్న యువ రాజులున్నారు. నిస్సహాయతను దరిచేరనీయని విజువల్లీ చాలెంజ్డ్ పీపుల్ ఉన్నారు. కొందరు కాబోయే దేశాధ్యక్షులున్నారు. మరి నేనెవరిని? ఆ ప్రశ్నకు సమాధానం అక్కడే దొరికింది. నాలో ఉన్న శక్తి అమేయమని, అజేయమని, ప్రపంచాన్ని మార్చడానికి పనికొచ్చే ఇంధనం ఏదో నాలో నిభిడీకృతమై ఉందని స్పురణకు వచ్చింది. అక్కడి ప్రొఫెసర్లు అలాంటి వారు. ముఖ్యంగా ప్రొ.రొనాల్డ్ హైఫిట్జ్ వంటివారి ప్రభావం నాపై చాలా ఉంది. వారివల్ల నేను మరింత ఓపెన్ అయ్యాను. ముడుచుకున్న నన్ను వికసింపజేసిన విశ్వవిద్యాలయం హార్వర్డ్.

అక్కడ నేను గ్రహించింది ఒకటే. పరిమిత స్థాయి కార్యాచరణ నుంచి విశ్వజనీనం కావాలని! అయితే, ఎలా కావాలో తెలియజెప్పింది మాత్రం మా పిల్లలే అని చెప్పి ఆగారాయన.

ఆశ్చర్యంగా అనిపించింది గానీ అది తనకే ఒక ఓపెనింగ్. అప్పటిదాకా, ఇండియాలో లేదా మన రాష్ట్రంలో ఉన్నప్పుడు తన భార్య లక్ష్మీబాయి…ఆవిడ మార్కెటింగ్ శాఖలో అడిషనల్ డైరెక్టర్. అంత పెద్ద బాధ్యతలో ఉండి కూడా ఇతను పోలీసు విధుల్లో నిరంతరం నిమగ్నమై ఉంటే తానే కుటుంబాన్ని చూసుకునేది. అలాగే పిల్లలు. పుణీత్, స్వేచ్ఛలు. తండ్రిగా వీళ్లకు తాను సమయం ఇచ్చింది తక్కువే. వాళ్ల ఆలనా పాలనా చూసుకోవడం అంటే ఏదో చూసుకోవడం అన్నట్టేగానీ అంతా తల్లి బాధ్యతగానే ఉండేది.

అన్నిటికీ మించి తానొక కొత్త ప్రపంచంలోకి వెళ్లడం, పిల్లలూ మరొక కొత్త ప్రపంచంలో చదువుకుంటూ ఉండటం, ఆ క్రమంలో ఇద్దర్నీ వేర్వేరు స్థాయిల్లో బడి ఒకటి కలిపింది. అదే తర్వాత తనలో ఒక గురుకుల కార్యదర్శిని చేయడం ఒక అనూహ్యమైన ఓపెనింగ్.

కానీ, ఎప్పుడైతే తాను హార్వర్డ్ వెళ్లాడో, వెళుతూ వెళుతూ భార్యాపిల్లల్ని కూడా తీసుకెళ్లాడో. పిల్లల్ని అక్కడి పాఠశాలల్లో వేశాడో, వేసి, తానూ విద్యార్థిగా హార్వర్డ్‌కి వెళుతున్నాడో – ఒక వికాసం మొదలైంది. పిల్లలు అక్కడి పాఠశాల విద్యనభ్యసిస్తూ ఉండటం. తాను విశ్వవిద్యాలయంలో ఎదుగుతూ ఉండటం- ఒక రకంగా విద్యార్థి అన్న అంశం తనలో నిదానంగా సరికొత్త మనిషిని ఆవిష్కరించింది.

అంతేకాదు, పిల్లలను సరికొత్తగా చూడటం, ఒక తండ్రిగా వారిని సన్నిహితంగా గమనించడమూ మొదలైంది. యధాలాపంగా తండ్రి బాధ్యత చూసుకోవడం నుంచి, వారి మనోభావాలను పంచుకోవడం నుంచి ఒక్కపరి గురుతర బాధ్యతలోకి వెళ్లడమూ మొదలైంది. అలా ప్రారంభమైంది. అన్నిటికీ మించి తానొక కొత్త ప్రపంచంలోకి వెళ్లడం, పిల్లలూ మరొక కొత్త ప్రపంచంలో చదువుకుంటూ ఉండటం, ఆ క్రమంలో ఇద్దర్నీ వేర్వేరు స్థాయిల్లో బడి ఒకటి కలిపింది. అదే తర్వాత తనలో ఒక గురుకుల కార్యదర్శిని చేయడం ఒక అనూహ్యమైన ఓపెనింగ్.

ఆ మాట అంగీకరించారు కూడా.

తెరుచుకున్న లోకాలంటే ఇదే. అవును. మొదటిసారిగా నేను ఒక తండ్రిలా, ఒక ఫ్రెండ్‌లా, ఒక స్టూడెంట్‌లా వాళ్లతో షేర్ చేసుకుంటూ ఉంటే ఎన్నో విషయాలు. అవన్నీ అర్థమవుతున్న కొద్దీ ఒకానొక అవశ్యమైన చర్య వేగవంతం కావడం మొదలైందనాలి. అవును. తాను అత్యుత్తమ విశ్వవిద్యాలయంలో మేల్కొనడం జరిగింది. మరోవంక పిల్లలు అత్యుత్తమ విద్యను పొందుతూ ఉండగా, మన దగ్గర ఉన్నప్పుడు పిల్లలు ఏమేమి మిస్ అవుతున్నారో తనకు తెలిసి రాసాగింది. అన్నిటికన్నా మిన్న, అణగారిన వర్గాల లక్షలాది పిల్లలు కనీస వసతులు, సౌకర్యాలే లేకుండా బడిలో నీరసిల్లుతున్న దృశ్యాలు తనను ఒక్కపరి నిద్రలేపాయి. దాంతో ప్రవీణ్ కుమార్ ఖాకీ యూనిఫాం నిదానంగా తొలగి ఒక తెల్లటి దుస్తుల్లోకి మారిన భావన. అవి కూడా నిదానంగా నీలం రంగును సంతరించుకుని అంబేద్కర్ త్యాగాలవల్లే కదా ఇవ్వాళ మేం ఇంతటి స్థాయికి వచ్చామన్న స్పృహలోకి తనను స్థిరపరచడం. అంతా జరగవలసిందే అన్నట్టు జరిగిపోయింది.

డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ ఒక మార్గదర్శి. గురుకుల సంక్షేమ హాస్టళ్లలో అంబేద్కర్, జ్యోతిబాపూలే. సావిత్రీబాయి పూలేల పటాలను మాత్రమే కాదు, వారి ప్రేరణనూ ప్రవేశపెట్టి పిల్లల్ని ఉన్నత కలల్ని కనేలా ప్రోత్సహిస్తున్న ప్రయోగశీలి.

అంతే. అక్కడే డిసైడ్ అయిపోయారు ప్రవీణ్ కుమార్. ఇక తన కార్యరంగం శాంతిభద్రతలు కాదని! సంక్షేమం అని. సంక్షేమ హాస్టల్లో, గురుకులాల్లో ఉన్న పిల్లలవైపు మనసు పోయింది. వారంతా తన పిల్లల వలే, అటు తర్వాత ఎదిగివచ్చాక తనవలే హార్వర్డ్ దాకా వచ్చి చదువుకునే మనుషులు కావాలి. విశ్వస్థాయిలో తమ ప్రతిభను ప్రదర్శించి అభినందనలు అందుకునే మేటి తరంగా ఎదగాలి.
ఇక ఆగలేదు. చదువు పూర్తవగానే ఇండియా రావడం. హైదరాబాద్‌లో తమ డిజిపిని కలవడం, ఆయన నవ్వడం. గురుకుల సంక్షేమ శాఖకు సెక్రటరీగా వెళతావా? అక్కడంతా డెస్క్ పని వుంటుంది. మనకేం పని? అని ఆయన అడగడం. ఈయన ఒప్పించడం. అటు తర్వాత అప్పటి ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్లడం. ఆయన పెద్దగా నవ్వడం. కానీ అర్థం చేసుకోవడం. తర్వాత కథ మనకు తెలిసిందే.

ఇప్పుడు డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ ఒక మార్గదర్శి. గురుకుల సంక్షేమ హాస్టళ్లలో అంబేద్కర్, జ్యోతిబాపూలే. సావిత్రీబాయి పూలేల పటాలను మాత్రమే కాదు, వారి ప్రేరణనూ ప్రవేశపెట్టి పిల్లల్ని ఉన్నత కలల్ని కనేలా ప్రోత్సహిస్తున్న ప్రయోగశీలి.

ఈ మాటలు పెద్దగా అనిపించవచ్చు గాక. కానీ, లక్షా ఇరవై వేలమంది విద్యార్థులు. ఐదారువేల మంది ఉపాధ్యాయ సిబ్బంది ఉన్న వన్‌మ్యాన్ ఆర్మీ ఆయన. చిత్తశుద్ధి మెండుగా గల వ్యక్తి. ఇప్పటికీ బుల్లెట్ ప్రూఫ్ వెహికిల్‌లో తన కార్యాలయానికి వెళతారు. తన తలకట్టు మారలేదు. అదే గుండు. పోలీస్‌లానే ఉంటారు. కానీ తలమానికమైన సేవలో నిమగ్నమైండు.

ఇదీ తొలి ప్రశ్నకు లేదా ఆయన చెప్పిన కథనం. ఇలా- అమెరికానుంచి తెలంగాణకు తిరిగి వచ్చాక తాను పిల్లల కోడైపోవడం నిజంగానే ఒక అందమైన ఓపెనింగ్. ఇదీ విద్యా విషయమై ఒక చిత్రమైన మార్పుకు నాంది పలికిన చారిత్రక సందర్భం. ఒక కాలం పునర్నిర్మాణంలో మనుషులను ఎంతగా మారుస్తుందో చెప్పే కథ కూడా.

ఇక రెండో అంకం మరో opening.

ఆయన రావడం వరకు ఒక కథ. వచ్చిన తర్వాత మరొక కథ అనాలి.

అవును మరి. తాను గురుకులాలకు సెక్రెటరీగా వచ్చేదాకా ఆ బాధ్యత తీరు వేరు. తాను వచ్చిన తర్వాత తీరు పూర్తిగా వేరు. ఆయన పని విధానం కొత్తగా ఉంది. కొత్తగా అనేకంటే రాడికల్‌గా ఉందనాలి. అయితే, ముందే తానన్నట్టు, ఉద్యోగాన్ని ఉద్యమంగా చేయడం తన నైజం. అయితే, ఆ నైజానికి కారణం ఉంది. అది తన రక్తంలో ఉంది.

ఇప్పుడు తన తరం వచ్చింది. తన సంపూర్ణ శక్తియుక్తులతో ఒక సామాజిక విప్లవాన్ని తనంతట తాను స్వీకరించాలని దీక్ష పొందిన తరం. అది కూడానూ ఉద్యోగ బాధ్యతలను యజ్ఞంలా నిర్వహించాలని నడుం కట్టిన సాహసి తాను.

తుంగభద్ర నదికి అటు అమ్మ- ప్రేమమ్మ. తనది కర్నూలు జిల్లా పారుమంచాల. ఇటు నాన్న- సవారన్న. తనది ఆలంపూర్. వారిద్దరూ దళితులే. కానీ, ఏటికి ఎదురీదిన వాళ్లు. ఎదురీది కొన్ని విలువలు ప్రతిక్షేపించిన వాళ్లు. ఇప్పుడు తన తరం వచ్చింది. తన సంపూర్ణ శక్తియుక్తులతో ఒక సామాజిక విప్లవాన్ని తనంతట తాను స్వీకరించాలని దీక్ష పొందిన తరం. అది కూడానూ ఉద్యోగ బాధ్యతలను యజ్ఞంలా నిర్వహించాలని నడుం కట్టిన సాహసి తాను. తన తరం కానిది లేదన్న విశ్వాసం మెండుగా గల యువతరం కూడా తను. అందుకే ఆయన తనలోకి తాను చూసుకుని, కాస్త ఉద్వేగంగానే అయినా స్థిరంగా ఈ మాటలు చెప్పారు.

“మార్చాలని వుంటుంది నాకు. నేనొచ్చిన బ్యాగ్రౌండ్ ఒక కారణం. నాకున్న అవగాహన మరో కారణం. కసి అని మీరంటారు. కాంక్ష అని నేనంటాను. వాటితో నా పని నేను చేసుకుంటూ వెళతాను” అని స్థిరంగా చెప్పారు. అయితే, తాను దళిత కుటుంబం నుంచే వచ్చారు. కానీ, ఆ పదం వాడటానికి ఆయన అస్సలు ఇష్టపడరు. దళిత అన్న పదం అణచివేతనే చెబుతుందంటారు.

నేను మా సంక్షేమ గురుకులాలకు ఒక కొత్త లోగోను తయారు చేయించాను. అది ఇన్ఫినిటీ. అనంతం. అందులో ఒక మనిషిని ప్రతిష్టించాను అని ఉల్లాసంగా అన్నారాయన. అందులో తన దృష్టి ఉంది. దూరదృష్టీ ఉంది. పిల్లల్ని బహుముఖ ప్రజ్ఞావంతులుగా ఎదిగించడమూ ఉంది.

తొలుత హరిజన. అది పాతది. ఇప్పుడు దళిత. ఇది కొత్తది. కానీ, దళిత అన్న పదం కూడా నా దృష్టిలో అణచివేతనే సూచిస్తున్నది. దానర్థం బ్రోకెన్ కనుక అని అన్నారాయన. విభజితులమైన వాళ్లుగా, ధ్వంసమైన వాళ్లుగా మేం ఎందుకుండాలని నేనడుగుతాను! ఎందుకు మమ్మల్ని పీడితులుగా, మిమ్మల్ని పీడకులుగా చూడాలీ అంటాను. ఆ పదాన్నే వాడకూడదనిపిస్తుంది. అందుకే నేను మా సంక్షేమ గురుకులాలకు ఒక కొత్త లోగోను తయారు చేయించాను. అది ఇన్ఫినిటీ. అనంతం. అందులో ఒక మనిషిని ప్రతిష్టించాను అని ఉల్లాసంగా అన్నారాయన. అందులో తన దృష్టి ఉంది. దూరదృష్టీ ఉంది. పిల్లల్ని బహుముఖ ప్రజ్ఞావంతులుగా ఎదిగించడమూ ఉంది. ఎవరెస్ట్‌ను అధిరోహించిన పూర్ణ, ఆనంద్‌లూ అందులో ఉన్నారు. అందుకే గర్వంగా అన్నారాయన. ఆ సింబల్ చూస్తే నిజంగా గర్వంగా ఉంటుంది. కారణం ఉంది. ఒక కొత్త ప్రతీక అవసరాన్ని నేను గట్టిగా ఫీలయ్యాను. ఒక ఇన్ఫినిటీ పిల్లల్లో సాక్షాత్కారం కావాలని తపిస్తున్నాను అన్నారాయన.

అంతేకాదు, దళిత స్థానంలో మరొక పదాన్ని నేను మా గురుకులంలోకి ప్రవేశపెట్టాను. అణగారిన వర్గాల్లో గొప్ప ఆత్మవిశ్వాసాన్ని నెలకొల్పడానికి స్వేరో అన్న పదాన్ని కూడా ప్రవేశపెట్టాను. ఐయామ్ ఏ స్వేరో అని ఆగారాయన. మా సంక్షేమ హాస్టల్లోని లక్షా ఇరవై వేల మంది నేడు స్వేరోలు (Swaeroes). స్వేరో అంటే సోషల్ వెల్పేర్ అని అర్థం. అలాగే పంచభూతాల్లోని ఆకాశం, వాయువు అని కూడా. అనంతమైన శక్తికి ప్రేరణగా నిలిచే ఈ పదం నా కిష్టం. నేనొక స్వేరోను అన్నారాయన.

ఇట్లా కొత్తపదాలతో, సరికొత్త విశ్వాసంతో ఒక పెద్ద బెటాలియన్‌ని నడుపుతున్న వన్‌మ్యాన్ ఆర్మీ ఆయన. ఆయన ఆధ్వర్యంలో తెలుగు మీడియం ఇంగ్లీష్ కావడం ఒక్కటే కాదు, మరెన్నో విజయాలు మనందరికీ తెలిసినవే.

ఇట్లా కొత్తపదాలతో, సరికొత్త విశ్వాసంతో ఒక పెద్ద బెటాలియన్‌ని నడుపుతున్న వన్‌మ్యాన్ ఆర్మీ ఆయన. ఆయన ఆధ్వర్యంలో తెలుగు మీడియం ఇంగ్లీష్ కావడం ఒక్కటే కాదు, మరెన్నో విజయాలు మనందరికీ తెలిసినవే.

మనం ఎన్నడూ ఊహించని విజయాలను ఆవిష్కరిస్తూ పిల్లలు ముందుకు వెళ్లడం చూస్తున్నదే. అయితే. చివరగా ఆయన ఒక మాట అన్నారు. నా రెప్యుటేషన్‌ని ఫణంగా పెట్టి పూర్ణ, ఆనంద్‌లను ఎవరెస్ట్ శిఖరం అధిరోహించేలా చేశాను. ఎంతో రిస్క్ తీసుకున్నాను. తెలుసు నాకు. అణగారిన జాతుల విముక్తికోసం కొందరు త్యాగాలు చేయవలసి వస్తుందని తెలుసు. వాళ్లు ఓడిపోతే నేనూ ఓడిపోతానని తెలుసు. కానీ, అందులో మేం గెలిచాం. ప్రపంచానికి అణగారిన ప్రజలు దేన్నయినా అధిరోహిస్తారని గెలిచి చూపించాం. ఇది ఆరంభం. నా ముందు ఇంకెన్నో ఛాలెంజ్‌లున్నాయి. పిల్లల భవిష్యత్ పట్ల చాలా కలలున్నాయి.

గమ్మత్తేమిటంటే నాకు నేను సవాల్ విసురుకుంటూ నాతో పాటు నా పిల్లల్ని ఎదిగించే ప్రయాణం ఇది. ఇందులో నాకు భయాలూ ఉన్నాయి. కానీ, అంబేద్కర్ నా వెన్నంటి ఉన్నాడు. సావిత్రిబాయి పూలే వంటి మహనీయుల సాహసాలు నన్ను ఉత్తేజపరుస్తున్నాయి. నా భార్య, పిల్లలు, నా విద్యార్థులూ నాకు తోడుగా ఉన్నారు. గొప్పగా ఆలోచించే ముఖ్యమంత్రి మనకున్నారు. ఇంకేం కావాలి. నేనొక అనంతాన్ని. అందులో మనిషిని ప్రతిష్టించిన కార్యదర్శిని. ఆ సంగతి మాత్రం నాకు తెలిసిపోయింది అన్నారాయన, నమ్మకంగా.

ఈ వ్యాసం నమస్తే తెలంగాణ బతుకమ్మ సంచికలో Open Story పేరిట 6 September 2015న ప్రచురితం. 

 

More articles

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article