Editorial

Monday, December 23, 2024
Peopleరుతు పవనాలు అంటే అతడే గుర్తొస్తాడు!

రుతు పవనాలు అంటే అతడే గుర్తొస్తాడు!

ఛాయాచిత్ర ప్రపంచంలో ఎందరో ఉండవచ్చు. కానీ రుతు పవనాలు అంటే మనకు గుర్తుకు వచ్చేది స్టీవ్ మ్యాకరీయే. వారి ‘మాన్ సూన్’ సిరీస్ గురించి, దానికి ప్రేరణ ఇచ్చిన ఫోటోగ్రాఫర్ గురించి నేటి పరిచయం తెలుపుకు ప్రత్యేకం.

కందుకూరి రమేష్ బాబు

ముందుగా ఈ చిత్రం చూడండి. స్టీవ్ మ్యాకరీ తన ‘మాన్ సూన్ (రుతు పవనాలు) ’ సిరీస్ లోని ఒకానొక శక్తివంతమైన  ఛాయాచిత్రం ఇది.

ఈ ఫోటో ఆ వృద్దుడి ఎదురీతను మాత్రమే కాదు, ఎప్పటికీ నిలిచిపోయే సామాన్యుడి జీవశక్తికి ప్రతీకగానూ చూడవచ్చు. ఎన్ని కష్టనష్టాలు ఎదురైనప్పటికీ తనలోని చెరగని మానవత ప్రతిబింబం ఈ చిత్రం. పెదవులపై వీడని దరహాసానికి సజీవ దర్పణం.

అది కేరళ ఐనా, భారతం అయినా, మానవాళి ఉన్నంత వరకూ అవిశ్రాంతమైన జీవన సమరంలో సామాన్యుడి బతుకు నేర్పును చెప్పకనే చెప్పే అపురూప ఛాయ చిత్రం ఇది. దీన్ని తీసింది సుప్రసిద్ధ ఫోటోగ్రాఫర్ స్టీవ్ మ్యాకరీ.

అమెరికాకు చెందిన 71 సంవత్సరాల ఈ ఫోటో జర్నలిస్టు పరిచయం ప్రతి వర్షాకాలంలో ఒక అందమైన మట్టి పరిమళం వంటి జ్ఞాపకం. ఒక ముసురు కూడా. ఎందుకో చదవండి.

 

ఆకుపచ్చ కళ్ళ ఈ ఆఫ్ఘన్ బాలిక గుర్తుండే ఉంటుంది. దీన్ని చిత్రించిన వ్యక్తే స్టీవ్ మ్యాకరీ అని మీకు తెలుసు. కుట్టు మిషను మోస్తున్న తాతను తీసింది కూడా ఆయనే.

వారు సమరాన్ని, నిత్య జీవన సమరాన్ని చిత్రిక పట్టిన చరిత్రకారుడు. ఎన్నో వ్యయ ప్రయాసలకు గురై, రహస్యంగా సరిహద్దులు దాటి, మనిషి జీవితాన్ని అతడి ఆక్రమిత స్వభావాన్ని, అంగీకరించడానికి వల్లకాని చేదు నిజాలను బయట పెట్టిన మహనీయ ఛాయా చిత్రకారుల్లో స్టీవ్ మ్యాకరీకి చరిత్రలో మహత్తర స్థానం ఉంటుంది.

అయన యుద్ధం మధ్య తీసిన చిత్రాలు ఎంత ప్రసిద్దమో సామాన్యుడి నిత్య జీవన సమరంలో తీసిన చిత్రాలు కూడా అంతే ప్రసిద్ధం. ఒకానొక యుద్ద వాతావరణాన్ని అవి ఎంతో హృద్యంగా ప్రతిఫలిస్తయి.

శాంతి కోసం యుద్దాన్ని చిత్రించడం ఒక అనివార్యత. ఆ పనిని ఒక యుద్దంలా పెట్టుకొన్న ఫోటో జర్నలిస్టు అయన. అంతేకాదు, ప్రళయ బీబత్సాన్ని చూపి అందులోంచి మనిషి బయటపడాలన్న అభిలాషను అయన ఎంతో సహజంగా వ్యక్తపరుస్తారు. అందుకోసం అయన అనేక దేశాలు తిరుగుతుంటాడు. అక్కడ అవిశ్రాంతంగా చిత్రించి మానవాళికి, సుఖశాంతుల జీవనానికి ప్రేరణగా గొప్ప సందేశం పలుకుతాడు.

ఈ వృద్దుడు వరదల్లో కుట్టు మిషను మోసుకుంటూ పోవడం అలాంటి కరుణ బీబత్స రస శాంతమూర్తి మత్వమే. దీన్ని తాను గుజరాత్ లోని పోరుబందర్ లో తీశారు. ఇది నేషనల్ జాగ్రఫీ ముఖ చిత్రంగా ప్రచురితం అయింది.

ఈ చిత్రం అచ్చయ్యాక సదరు కుట్టు మిషను కంపెనీ ఆ వృద్దుడికి ఒక కొత్త మిషను అందించడం కానుక కూడా అనలేం. చిన్న ఔదార్యం.

చిత్రమేమిటంటే ఆ వృద్దుడి మాదిరే అయన కూడా ఆ వరదల్లో ఒక శరణార్థి వలే ఎదురీది పని చేయడం. అందుకే తాను పడిన శ్రమ వృధా పోలేదు. అందుకు ఉదాహరణ ఇప్పటికీ ఎవరో ఒకరు ఆ ఛాయ చిత్రాన్ని షేర్ చేసుకొంటూ ఉండటమే. కాగా, అయన ఈ చిత్రాలన్నిటికీ ప్రేరణ ‘మాన్ సూన్’ ప్రాజెక్ట్. దాని గురించి చెప్పాలి.

స్టీవ్ మ్యాకరీ భారతదేశానికి వచ్చి ఇక్కడి రుతు పనవానాలు మొదలయ్యే కేరళ నుంచి వర్షం, అందలి మానవుడు చిక్కుకున్న స్థితి గతులను చిత్రించడం ఒక గొప్ప చారిత్రక విప్లవమే, వర్షాకాలానికి సంభందించి, ఛాయా చిత్రకళకు సంబంధించి. ఈ చిత్రాలను వారు 1983లో తీయడంతో మాన్ సూన్ అన్నది చెరగని ఛాయగా పదిలమవడం కాదనలేని వాస్తవం. ముందు ఆ చిత్రాలు చూడండి.

చిత్రమేమిటంటే, ఈ మాన్ సూన్ ప్రాజెక్టుకు స్ఫూర్తి తన పదకొండవ ఏట పడిందీ అంటే ఆశ్చర్యంగా ఉంటుంది గానీ నిజం. అందుకు ప్రేరణ అతడి బాల్యంలో ముద్ర పడ్డ కొన్ని చిత్రాలంటే చిత్రంగా ఉంటుంది గాని నిజం వాటిని తీసింది ప్రసిద్ద మ్యాగ్నం ఏజెన్సీ చిత్రకారుడు బ్రెన్ బ్రాక్ (Brian Brake). వారు లైఫ్ మ్యాగజైన్ కోసం వచ్చి మనదేశంలో కొన్ని చిత్రాలు తీసారు. ‘ది గ్రేట్ లైఫ్ గివింగ్ మాన్ సూన్’ పేరిట వారు తీసిన చిత్రాల్లో ఒకటి ఆ పత్రిక ముఖ చిత్రంగా ప్రచురితమైంది.

కాగా, ఆ అమ్మాయి ఎవరో కాదు, తర్వాత నటిగా పేరు తెచ్చుకున్న అపర్ణా దాస్ గుప్తా

ఈ రెండు చిత్రాలు చూడండి. ఇవే చిన్నప్పుడు స్టీవ్ మ్యాకరీని ప్రభావితం చేశాయి. తాను పెద్దయ్యాక ఫోటోగ్రాఫర్ కావాలని, అయ్యాక భారతదేశం వచ్చి మరోసారి తనదైన శైలోలో ‘మాన్ సూన్’ చిత్రాలు తీయాలని ఆ నాడే తాను సంకల్పించుకోవడం నిజంగానే ఒక చిత్రమైన కథ.

 

ఆ కథ సఫలం కావడం, స్టీవ్ మ్యాకరీ మన దగ్గరికి రావడం, ఎన్నో చిత్రాలు తీయడం అంతా కూడా ఒక లైఫ్. ఇట్లా లైఫ్ మ్యాగజైన్ ఫోటో ఎస్సేలతో ఎందరినో అనేక విధాల ప్రభావితం చేయడం కూడా ఒక విశేషం.

ఆ రెండు చిత్రాలను చూసి స్టీవ్ మ్యకరీ మరింత లోతుగా, విస్తారంగా పని చేసి మన భారతదేశం వానా వరదల్లో ఎలా బతుకు జీవుడా అని తల్లడిల్లిందో, మరెలా ఎదురీదినదో అపురూపంగా చిత్రించి పెట్టడం నిజంగానే విశేషం.

మరో ఆసక్తి కరమైన విషయం కూడా ఇక్కడే చెప్పాలి. ఈ కుట్టు మిషను ఫోటో జనసామాన్యంపై ఎంత ప్రభావం చూపిందో చెప్పలేము. ప్రపంచ వ్యాప్తంగా ఎందరినో ఆకర్షించింది. మన హైదరాబాద్ మల్కాజిగిరి లోని ఒక చిరు వ్యాపారిని కూడా. అవును. అతడు దీన్ని దక్కన్ క్రానికల్ పత్రికలో పడితే తీసి ఒక అట్ట ముక్కకు అతికించి దుఖానంలో పెట్టుకున్నాడంటే నమ్ముతారా?


జిందగీ ఇమేజెస్ గ్రూప్ లో పవన్ కుమార్ అనే యువకుడు ఈ ఫోటో పెట్టాక దాన్ని గమనించిన ఈ వ్యాసకర్త అతడి దగ్గరకెళ్ళి మరిన్ని ఫోటోలు తీసి కొన్ని వివరాలు సంపాదించమని కోరడం, ఆ అబ్బాయి వాటిని తీసి పంపడం మేలైనది. ఇప్పుడు ఆ ఫోటోలను మీతో పంచుకుంటున్నాను.

కాగా, మల్కాజిగిరిలోని ఆ సదరు దుఖాన యజమాని టైలరింగ్ సామాను అమ్ముతాడు. తన చిరు వ్యాపారానికి ఈ చిత్రం ఒక వాణిజ్య ప్రకటన వంటిదే అని చెప్పడం విశేషం. ఈ చిత్రం వ్యాపారానికే కాదు, తన దృష్టిలో మానవుడి జీవన వ్యాపారంలో ఒక మేలైన ఛాయగా దాని అతడు గ్రహించడం నిజంగానే ఒక విశేషం.

ఇట్లా, జీవితాన్ని అందలి అటుపోటులను ధీరోదాత్తతతో ఎదుర్కొనే ప్రస్థానంలో కుట్టు మిషను మోసుకుపోయే ఈ తాత చిత్రం ఒక అపురూప జ్ఞాపకం. వర్షం మధ్య జీవిత్తాన్ని చిత్రించడం మరో చిరస్మరణీయ జ్ఞాపకం. ఇలాంటి చిత్రాలను ఎవరు మాత్రం మరచిపోతారు!

అందుకే వర్షం అంటే స్టీవ్ మ్యాకరీ గుర్తొస్తారు. రుతు పవనం ఆయనే సదా ఛాయగా మెదులుతారు. వారికి హృదయపూర్వక అభివందనాలు.

 

More articles

2 COMMENTS

  1. అద్భుతమైన వ్యాసం. ఫోటోగ్రాఫర్ పేరుకన్నా ఆయన తీసిన చిత్రాలు మైండ్ లో fast గా register అయిపోయాయి. మాన్ సూన్ ఫోటోగ్రఫీ చేయాలనిపిస్తోంది చదివాక. Thank you so much for the beautiful story.

  2. చక్కటి దృశ్యాలను రికార్డు చేసిన స్టీవ్ మ్యాకరీకి అభినందనలు. అలాగే ఆయన గురించి కందుకూరి రమేష్ బాబు రాసిన వ్యాసం ఆకట్టుకుంది. రమేష్ బాబు కూడా స్వతహాగా ఫోటోగ్రాఫర్. అందువల్లే యింతటి అద్భుతమైన రచనను చదివే అదృష్టం కలిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article