ఐఎఎస్ పదవికి రాజీనామా చేసిన సిద్ధిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి తెలంగాణ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించనున్నారు. వారికి గతంలోనే ఎంపి పదవి ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ కుదరలేదు. తాజాగా ముఖ్యమంత్రి ఆయనకు ఎం ఎల్ సి పదవి ఖరారు చేయనున్నట్టు తెలుస్తోంది. క్యాబినెట్ లోకి తీసుకొని తెలంగాణా రాష్ట్రాభివృద్దికి అంబాసిడర్ గా చేయనున్నరనీ భోదపడుతోంది.
కందుకూరి రమేష్ బాబు
పి.వెంకట్రామిరెడ్డిది పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం ఇందుర్తి గ్రామం. అయన 2007 బ్యాచ్ లో ఐ ఎ ఎస్ కు ప్రమోట్ ఐన అధికారి. వారు ముఖ్యమంత్రికే కాదు, అటు కెటీఅర్ కు ఇటు హరీష్ రావుకు కూడా సన్నిహితులే. ముగ్గురికీ సన్నిహితుడే కాకుండా ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ తో పాటు సిద్ధిపేటను, అంతకుముందు సిరిసిల్ల జిల్లా అభివృద్దిలోనూ అయన కీలకంగా పనిచేశారు.
అవినీతి మరక లేని ఈ ఐఎఎస్ అధికారి ముఖ్యమంత్రికి అత్యంత విశ్వసనీయ వ్యక్తి. సిఎం ఆలోచనలను క్షేత్ర స్థాయిలో సమర్థవంతంగా అమలు చేసిన ఉన్నతాధికారి. ఆర్థికంగానూ బలమైన వ్యక్తి. కేసిఆర్ ఒక పబ్లిక్ మీటింగ్ లో “గొప్పవాడు, దండివాడు, మొండివాడు”గానూ అభినందనలు అందుకున్న వ్యక్తి.
నిజానికి అయన పదవీ కాలం మరొక పది నెలలే ఉన్నది. వచ్చే ఏడు సెప్టెంబర్ లో ఎలాగు అయన పదవీ విరమణ చేయవలసిందే. ఆ లోగా పార్టీలో చేరడం, పదవి స్వీకరించడం అన్ని విధాల ఆయనకూ ప్రభుత్వానికి కలిసి వస్తుందనే ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిస్తోంది.
వాస్తవానికి ఆయనకు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సిద్ధిపేట జిల్లాలోని ఎదో ఒక నియోజకవర్గం నుంచి ఖచ్చితంగా శాసన సభకు పోటీ చేసే అభ్యర్థే. కాకపోతే ఇటీవల ఆయనపై వచ్చిన విమర్శల నేపథ్యంలో ఆయన్ని పార్టీలోకి తీసుకొని పదవి ఇచ్చి క్యాబినెట్ లో మంత్రి పదవి కట్టబెట్టడం రాజకీయంగా తనకెంత ముఖ్యమో కేసిఆర్ బాహాటంగా చాటదల్చుకున్నట్టు ఉన్నది.
ప్రభుత్వం వైఖరిని విస్పష్టంగా చాటిన వైనం
ఇటీవలి వారి ప్రకటనలు అందరికీ తెలిసిందే. వరి విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని, షాపులను క్లోజ్ చేస్తామని, కోర్టులు కూడా తనను అడ్డుకోలేవని అయన అనడం బయట వివాదాస్పదంగా మారినప్పటికీ, కోర్టులు కూడా ఆయన వైఖరిని తప్పు పట్టినప్పటికీ అది ప్రభుత్వ వైఖరిని చాటడంలో శక్తివంతంగా పనిచేసిందని మరువరాదు. బహుశ ఈ సమయంలోనే వెంకట్రామిరెడ్డిని పదవితో అలంకరించడం సమంజసం అని కేసిఆర్ భావిస్తున్నట్టు ఉంది.
పార్టీకు మద్దతుగా నిలిచినందుకు…
వెంకట్రామిరెడ్డి దుబ్బాక ఉప ఎన్నిక సమయంలో టీఆర్ ఎస్ పార్టీకి అనుకూలంగా పని చేస్తున్నారన్న విమర్శ రావడంతో వారిని ఎన్నికల కమిషన్ సంగారెడ్డికి ట్రాన్స్ ఫర్ చేసింది. ఐతే ఈ ఎన్నికలు అయ్యాక ముఖ్యమంత్రి తిరిగి వారికి అదే సిద్దిపేటకు పోస్టింగ్ ఇవ్వడంతో పాటు మెదక్ జిల్లా కలెక్టర్ గా అదనపు విధులు అప్పగించ్దమూ తెలిసిందే. దీంతో కలెక్టర్ గా ఉండి కూడా ఇటు పార్టీకి ఇటు ప్రభుత్వానికి అయన నిర్ద్వంద సేవలకు వారిని పార్టీలో చేర్చుకోవడం సముచిత గౌరవం కాబోలు.
కాళ్ళు మొక్కి ఆశీర్వాదం పొందిన సాహసం
ఇటీవలే కొత్తగా నిర్మించిన సిద్ధిపేట జిల్లా కలెక్టరేట్ ప్రారంభ సమయంలో ముఖ్యమంత్రి వారిని కుర్చిదాక సాదరంగా తీసుకువచ్చి కూచోబెట్టడం చూశాం. అనంతరం వెంకట్రామిరెడ్డి లేచి ముఖ్యమంత్రి కాళ్ళు మొక్కడమూ చూశాం. ఇది అనేక విధాలా విమర్శలకు తావ్వివ్వడం తెలిసిందే. ముఖ్యమంత్రిని ప్రసన్నం చేసుకోవాలన్న వారి చర్య వల్ల తమ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారని ఉన్నతాధీకారులు అతడి చర్యకు నోచ్చుకోగా ప్రజలు, నెటిజన్లు బాహాటంగా ఆయన్ని విమర్శించడం తెలిసిందే. ఐతే, శుభ సందర్భాల్లో తనకంటే పెద్దవారి కాళ్ళు మొక్కి ఆశీర్వాదం తీసుకోవడంలో తప్పేమీ లేదని, నిజానికి ఆ రోజు ఫాదర్స్ డే కూడా కావడంతో తండ్రి వంటి కేసిఆర్ నుంచి ఆశీస్సులు తీసుకున్నానని వారు సమర్థించుకున్నారు. ఈ విషయాన్ని ఇంతకన్నా ఎక్కువ చూడరాదని విన్నవించుకున్నారు కూడా. నిజానికి నేటి వారి రాజీనామా, ఎం ఎల్ సి అవకాశం -ఇవన్నీ ఆకస్మిక నిర్ణయం కాదని, ఈ పరిణామాలన్నీ ఆయన నేరుగా ప్రభుత్వంలో భాగస్వామ్యం వహించడానికి ముందస్తు ఆశీర్వదాలే అని వీటన్నిటి బట్టి ఎవరికైనా బోధపడుతుంది.
ఆలస్యం కిందే లెక్క
ఐతే, రాష్ట సాధకులూ ఐన ముఖ్యమంత్రి రాష్ట్ర అభివృద్దిలో కీలకంగా ఉన్న ఒక జిల్లా కలెక్టరు ఇద్దరూ నిజానికి ఎప్పటి నుంచో సన్నిహితంగా పని చేయడం తెలిసిందే. ముఖ్యంగా ముఖ్యమంత్రి నియోజక వర్గం అభివృద్దిలోనూ కీలకంగా ఉండటం మనకు తెలిసిందే. ఆ ఆత్మీయత కారణంగా వారి కాళ్ళు మొక్కడం వంటి విషయం పెద్ద విషయంగా కాదు కూడా. అధికారిగా వారికీ ప్రోటోకాల్ అడ్డు వచ్చినా పాదాలు తాకిన వెంకట్రామి రెడ్డి నేడు రాజీనామా చేసిన అనంతరం మాట్లాడుతూ రాష్ట్రాభివృద్దిలో తాను కేసిఆర్ వెంట ఉంటానని చ్చేప్పడంలో విశేషం ఏమీ లేదు.
నిజానికి అయన అధికారిగా ఎన్నడూ వ్యవహరించలేదని సన్నిహితంగా చూసిన వారికి తెలిసిందే. తాను చేయదలుచుకున్నది చేసుకుంటూ వెళ్ళిన వెంకట్రామిరెడ్డి నేడు పార్టీలో చేరి పదవి పొందనుండటం నిజానికి ఆలస్యం కిందే లెక్క.
తగిన సమాధానం ఉంది
అతడిని పార్టీలోకి చేర్చుకొని ఎం ఎల్ సి చేసి క్యాబినెట్ లోకి తీసుకొవడమే కాక ముఖ్యమంత్రి వారికి కీలకమైన పోర్ట్ ఫోలియా ఇస్తారని కూడా తెలుస్తోంది. ఐతే, ఉద్యమ కారుల కన్నా ఒక ప్రభుత్వ అధికారికి ఇంత ప్రాధాన్యం ఏమిటన్న ప్రశ్నకు తగిన సమాధానం కేసిఆర్ దగ్గర ఉన్నది. అదేమిటంటే కేసిఆర్ పట్ల వినయ విధేయతలు. తన ఆలోచనలను ఆరు నూరైనా కార్యరూపంలోకి తేగల సమర్థత. ఈ లక్షణాలకు తోడు రానున్న రోజుల్లో ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్ళే ఒక అంబాసిడర్ వంటి పాత్ర. వాస్తవానికి అయన ఇప్పుడున్న మంత్రులకన్నా బేషుగ్గా పని చేయగలరన్న విశ్వాసం కేసిఆర్ కి ఉన్నది. అంతేకాదు, తాను సిద్దిపేట జిల్లలో చేసిన పనుల చెప్పినా చాలు, యావత్ తెలంగాణ ఎంత అభివృద్ధి చెందిందో సమాజానికి తెలుస్తుందన్నది కూడా ముఖ్యమంత్రి వ్యూహంగా పరిశీలకులు భావిస్తున్నారు.
ప్రతిభావంతుడు
నిజానికి వెంకట్రామి రెడ్డిపై విమర్శలు ఎలా ఉన్నా అవినీతికి తావులేని అధికారిగా ఆయనకు మంచి పేరున్నది. అనుకున్నది అనుకున్నట్టు చేయగల దిట్ట అని వారిని ఎరిగిన వారు చేబుతారు. ఎటువంటి శషబిషలు లేకుండా ముక్కు సూటిగా వ్యవహరిస్తారని కూడా అంటారు. మొదటి నుంచి అయన అధికారిగా కాకుండా ఒక మంత్రి గానే వ్యవహరించి పని చేయడం సిరిసిల్ల, సిద్ధిపేట ప్రజలకు తెలిసిందే. కాబట్టి అయన రాజకీయ ప్రవేశం పట్ల అక్కడి ప్రజనీకానికి ఎటువంటి ఆశ్చర్యం లేదు.
తాను స్వచ్ఛందంగా పదవికి రాజీనామా చేశాక అయన మాట్లాడుతూ ఈ ఏడేళ్ళ కాలంలో చేసిన పని తనకు గతంతో పోలిస్తే ఏంతో ఉందని చెప్పడం గమనార్హం. అంతేకాదు, తాను ముఖ్యమంత్రి మార్గదర్శకత్వంలో ఏ పదవి ఇచ్చినా పని చేస్తాననడం విశేషం. కాబట్టి సిద్ధిపేట, సిరిసిల్ల రెండు కళ్ళుగా ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్, టీ ఆర్ ఎస్ వర్కింగ్ ప్రేసిడెంట్ కేటీఆర్, ఆర్థిక శాఖా మంత్రి హరీష్ రావు అండదండలతో అయన అతి త్వరలో తెలంగాణ మంత్రిగా మన ముందుకు వస్తారనే అనుకోవచ్చు.
ఈ అధికారి మీద భూముల కబ్జా ఆరోపణలు కాంగ్రెస్, బిజేపి వాళ్ళు చేస్తున్నరు. ఆ విషయం పై కూడా ఈ వార్తలో ప్రస్తావిస్తే బాగుండేది.