తన చిత్రాల్లో అంతర్లీనంగా వినిపించే సంగీతం శాంతి. అది తన ప్రయాణం యుద్ధమని తెలిసినందువల్లె!
నాలుగేళ్ల క్రితం. హైదరాబాద్ లో జరిగిన ఇండియన్ ఫోటో ఫెస్టివల్ (IPF) ఆరంభ ఉత్సవం అది. వారి చేతుల మీదుగానే ఉత్సవం ప్రారంభమైంది. తాను ప్రసంగిస్తూ తన జీవిత కాలంలో తీసిన ఎన్నో చరిత్రకెక్కిన ఛాయా చిత్రాలను చూపిస్తూ మాట్లాడారు.
రెజా డెగాటి చిట్ట చివరగా స్వేచ్చగా ఆనందంగా ఎగురూతూ ముందుకు వస్తున్న ఒక పాప చిత్రంతో తన ప్రజెంటేషన్ ముగించి డయాస్ దిగి కింది వచ్చారు.
వారు బయటకు కాస్త గాలి పీల్చుకునేదుకు అడుగులు వేస్తున్నారు. ఒకరు అడగనే అడిగారు…’సార్… మీ మొత్తం ఫోటోగ్రఫీ ప్రయాణం అంతా యుద్ధం మధ్య గడిచింది కదా. అంతా విధ్వంసం నడమే నడిచింది కదా! ఇంత ట్రామా అనుభవించినా ఎట్లా శాంతంగా ఉండగలుగుతున్నారు?’ అని విస్మయంగా అడిగారు.
అడిగిన వ్యక్తికి అయన ఏమి చెబుతారో అని శ్రద్దగా చెవోగ్గితే వారు చిన్నగా నవ్వి ‘రూమీ’ అనడం వినిపించింది.
ఇవతల వ్యక్తికి అందినట్లు లేదు.
‘కవిత్వం. కవిత్వం వింటాను. రూమీ నాతో ఉన్నాడు’ అని ముందుకు నడిచారాయన.
మెల్లగా ఆయన్ని అనుసరించాను. ఇదిగో ఇవి తెలుసుకున్నాను.
తన తండ్రి కారణంగా చిన్నప్పటి నుంచి కవులు, కళాకారుల సాంగత్యం ఇంటి పట్టునే ఆయనకు అందిందట. ఒక రకంగా అది విశ్వవిద్యాలయం మాదిరి భవిష్యత్తుకు కావాల్సిన తాత్విక నేపథ్యం ఇచ్చిందట. తండ్రే కాదు, తాత ముత్తాతల నుంచి వాళ్ళది పోరుబాటే కావడంతో రెజాను సహజంగానే సామాజిక కార్యాచరణను నిశితం చేసింది. ఒక్క మాటలో ఇరాన్ లో తమ పూర్వీకుల నుంచీ తన దాకా సకల ఆధిపత్యాలను వ్యతిరేకిస్తూ ప్రజాస్వామ్య విలువల కోసం నిలబడ్డ చరిత్ర వారిది.
“ఎప్పుడూ మా నాన్నఅనేవారు. కొన్నింటి కోసం నిలబడే సమయం వస్తుంది బిడ్డా.. అప్పుడు తప్పక నిలబడాలి రా ” అని.
“దాని నిగూడార్థం చిన్నప్పుడే నాకు అర్థం అయింది. నూనూగు మీసాలు రాక మునుపే తొలిసారి అరెస్ట్ అయ్యాను. తర్వాత 22 ఏళ్ళ వయసులో మరోసారి అరెస్టయి చిత్రవధ అనుభవించాను. ఇక ప్రవాస జీవితామూ అదో నరకం. ఇంతటి సమరశీల జీవన ప్రస్థానంలో నాకు తోడూ నీడా ‘రూమీ’ కావడంలో ఆశ్యర్యం ఏముంది?” వివరించారాయాన.