ఒకనాటి పిల్లలు తల్లులుగా పరిచర్యల్లో నిమగ్నవడం, వాటిని గమనించడం, అందులో కొన్ని అమ్మ ప్రదర్శన కోసం ఎంపిక చేస్తున్నప్పుడు పొందిన ఈ కొత్త అనుభూతి నన్ను తరతరాలుగా మానవత్వంలో అవిచ్చిన్నంగా సాగుతున్న కథను పసిప్రాయం నుంచి చూడమని ఉపదేశించినట్లు అనిపించింది.
కందుకూరి రమేష్ బాబు
‘అమ్మ’ ప్రదర్శన కోసం చిత్రాల ఎంపిక చేస్తూ ఉండగా సుమారు పదమూడేళ్ళ నా ఫోటోగ్రఫీ మలిదశ వ్యాసంగంలో ఎందరో తల్లుల చిత్రాలు కనిపించాయి. వాటిని ఒకటొకటిగా చూస్తూ ఉంటే ఒక విశేషం గమనించాను. గొప్ప ఆశ్చర్యం కలిగించే అవగాహనా మెదిలింది. అదొక ఆవిష్కరణ అనే అనుకుంటాను.
ఎందరో పిల్లలు ఈ దశాబ్దంలో తల్లులయ్యారు. ఆ తల్లులు తమ బిడ్డలను ఎత్తుకొని చిరునవ్వులు చిందిస్తుండగా అనేక చిత్రాలు తీశాను కూడా. అవి చూడగా చూడగా ఒకటి తట్టింది. ఇప్పటి ప్రతి ఒక్క తల్లీ ఒకనాడు పాపాయి కదా అని!
ముఖ్యంగా ‘వెన్నెల’. ఆ అమ్మాయి చిన్నప్పటి ఫోటోలు నా మొదటి హార్డ్ డిస్క్ లో చూశాను. మొదటి ఫోటో అదే. ఆ బిడ్డనే ఏడో హార్డ్ డిస్క్ లో తల్లి అయి చంకలో బిడ్డతో ఉన్న ఫోటోలు కనిపించడం చూశాను. ఎంత వైచిత్రి.
వెన్నెల ఒక్క అమ్మాయి అనే కాదు, ఎందరో అమ్మాయిలు తల్లులుగా ఉన్న చిత్రాలు కానవస్తుంటే నేనే అపురూపంగా ఆ చిత్రాలను పరికించసాగాను.
చూడగా చూడగా మరో చిత్రంలో బాలింతను ఒక తల్లి హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకెలుతున్న ఒక చిత్రం చూశాను. అందులో ఆ తల్లి తన మనవరాలిని ఎత్తుకుని నవ్వుతూ…తన కూతురుని, ఆ కూతురి ఒడిలో బిడ్డను ఆనందంగా చూస్తూ ఉండే ఆ ఛాయ. దాన్ని చూస్తుంటే నాకు ఆ చిత్రంలో ఒకేసారి ఇద్దరు బిడ్డలు కన్పించారు. ఇద్దరు తల్లులు కనిపించారు. అంతేకాదు, ఒడిలోని బిడ్డలు కూడా ఒకనాడు తల్లులు అవుతారు కదా అనిపించి సమస్త స్త్రీ లోకం తల్లి అనిపించింది. అదే సమయంలో అందరూ విశ్వంలో బిడ్డలు కదా అనిపించి ఆ తల్లులిద్దరి సంతోషాన్ని తల్లులుగా బిడ్డలుగా విభిన్నంగా పరికించాను. ఎంతో అద్బుతంగా అన్పించింది. అప్పటి నుంచి బయట ప్రతి స్త్రీలో ఇవి గమనంలోకి రావడం మొదలైంది.
జీవన దశల్లో కొనసాగే ఈ పరిణామం వేరు వేరు సమయాలలో సందర్భాల్లో తీసిన చిత్రాల్లో కన్పిస్తుంటే చిన్నప్పటి బాల్యం స్థానంలో పెద్దరికం వచ్చి చేరగా నాటి పిల్లల నేడు తల్ల్లులుగా మారి వారి ఆలనా లాలన పాలనల్లో పడిపోవడం ఎంపిక చేస్తున్న చిత్రాల్లో అనేకంగా గమనించసాగాను.
ఈ ప్రత్యేక అనుభూతి కారణంగానే నాకు ప్రతి మనిషిలో వయోభేదాలు లేకుండా సంతోష ఛాయ సుస్థిరంగా కానవస్తుందని మరొకసారి అవగతమైంది.
ఒకనాటి పిల్లలు తల్లులుగా పరిచర్యల్లో నిమగ్నవడం, వాటిని గమనించడం, అందులో కొన్ని అమ్మ ప్రదర్శన కోసం ఎంపిక చేస్తున్నప్పుడు పొందిన ఈ కొత్త అనుభూతి నన్ను తరతరాలుగా మానవత్వంలో అవిచ్చిన్నంగా సాగుతున్న కథను పసిప్రాయం నుంచి చూడమని ఉపదేశించినట్లు అనిపించింది. అందరూ పిల్లలే అన్న నమ్మికతో ఉండేలా సైతం భరోసానిచ్చింది.
దాంతో వృద్దులను కూడా వాళ్ళు ఒకనాటి పిల్లలు అన్న భావన వల్ల, వాళ్ళ బాల్య కౌమార యవ్వన దశలను కూడా గమనించడం, ఒక్క స్త్రీలే కాదు, మొత్తం మనుషులను వారి జీవితంలోని ఆన్ని దశల్లో బాల్యం తాలూకు నిర్మలత్వంతో గమనించడం ఇప్పుడు ఒక అలవాటుగా మారింది.
ఈ ప్రత్యేక అనుభూతి కారణంగానే నాకు ప్రతి మనిషిలో వయోభేదాలు లేకుండా సంతోష ఛాయ సుస్థిరంగా కానవస్తుందని మరొకసారి అవగతమైంది.
కందుకూరి రమేష్ బాబు తాజా ప్రదర్శన ‘అమ్మ’ మణికొండ లోని సామాన్యశాస్త్రం గ్యాలరీలో ప్రతి రోజూ ఉదయం పదకొండున్నర నుంచి రాత్రి ఎనిమిది దాక సంక్రాంతి వరకు చూడవచ్చు. ఆదివారం మధ్యాహ్నం రెండు నుంచి. ప్రవేశం ఉచితం. గ్యాలరీ మ్యాపు కోసం ఈ లింక్ క్లిక్ చేయండి. ఫోన్ – 9948077893