తనంతత తాను బతికిన కాలం అమ్మ కడుపులోనే. తల్లి పేగు తెంచుకుని భూమ్మీదకు వచ్చిన మరుసటి క్షణం నుంచి అతడు పరాయి. అందుకే ఈ వేదన.
కందుకూరి రమేష్ బాబు
అమ్మ ప్రదర్శన పెట్టే సమయంలో ఈ పదమూడేల్లలో తీసిన చిత్రాలు చూస్తూ ఉండగా ఒక రోజు సడెన్ గా తట్టింది. అది, తల్లి గర్భంలో ఉన్న మనిషి కాలం. ఒక జీవిగా మొదలై నవ మాసాల్లో నిండు రూపం సంతరించుకుని ఒక బిడ్డగా ఎదిగే కాలం. బహుశా ఆ కాలమే మానవుడి అత్యున్నత దశ అని. అదే స్వర్గమూ అనిపించింది. ఆ కాలమే మానవుడి తాలూకు అసలైన జీవిత కాలం అనీ మిగతాదంతా మృత్యువే అని అనిపించింది.
తల్లి పేగుతో అనుబంధం తొలగగానే అతడు ఒంటరి అయ్యాడు. ఏడుస్తూ కళ్ళు తెరిచాడు. ఇక పరాయి అయ్యాడు. పరాధీనతలో పడ్డాడు. అభద్రతలోకి నెట్టబడ్డాడు. అదే అతడిని నిలువనీయని నిరంతర బాధకు కారణం అనిపించింది.
అంతేకాదు, అతడి జీవించే ఈ భూమి స్వర్గం కాదు, నరకమూ కాదు. నిజానికి అది అతడి నిండు స్మశానమే అని.
గర్భంలో ఉన్నప్పుడు అతడి అధీనత పరాధీనతా అంతా కూడా తెలియనితనం. అంతేకాదు, నిర్భాయమూ, అలజడి లేని స్థితి కూడా. తనంతట తాను ఏమీ చేయనవసరం లేని ఆ అప్రయత్న కాలమే తాను తానుగా ఎదిగే అసలైన జీవితం అని, మిగతాదంతా మృత్యువే అనీ అనిపించింది.
ఇంకా ఇంకా ఇక్కడ మనిషిని చూస్తుంటే అనిపిస్తుంది, అతడి ప్రయత్నాలను చూస్తుంటే అవగత మవుతుంది, భూమ్మీద అతడికి ఎప్పటికీ శాంతి లేదని. ఇంకా కావాలి. ఇంకేక్కడికో చేరుకోవాలి. అదే రంది లేదా పిపాస.
తల్లి పేగు తెంచుకుని భూమ్మీదకు వచ్చిన మరుసటి క్షణం నుంచి అతడు పరాయి. ఒంటరి. ఫలితంగా బెంగ. బాధ. దుఖం, యాతన, ఎదురీత. ప్రయాస, అన్వేషణ. ఆవిష్కరణ కూడా. అదంతా మృత్యువు తాలూకు జంజాటమే. భీతే. అలా చూస్తే బ్రతుకుతున్న కాలమంతా మృత్యువు పండే కాలమే. క్రమేణా మరణం కమ్ముకునే కాలమే. తనంతత తాను బతికిన కాలం అమ్మ కడుపులోనే.
ఇంకా ఇంకా ఇక్కడ మనిషిని చూస్తుంటే అనిపిస్తుంది, అతడి ప్రయత్నాలను చూస్తుంటే అవగత మవుతుంది, భూమ్మీద అతడికి ఎప్పటికీ శాంతి లేదని. ఇంకా కావాలి. ఇంకేక్కడికో చేరుకోవాలి. అదే రంది లేదా పిపాస. ఒక నాణెం తాలూకు బొరుసు మృత్యువే. అమ్మ కడుపులో జీవించినది మాత్రమే బొమ్మ.
బహుశా విడివడ్డ చోటును ఎప్పటికే చేరుకోలేడు కనుకే మనిషికింత బాధ. చేరుకోవాల్సిన చోటు ఎన్నడూ చేరుకోలేనిది కాబట్టే అనుక్షణం వేదన. సదా ప్రయత్నం. అదే మృత్యువు నగ్న స్వరూపం.
చూడగా చూడగా అందుకే అనిపించింది అమ్మ గర్భం దాటాక అతడికి ఉన్నది మృత్యువు మాత్రమే అని. అమ్మతోటిదే సిసలైన జీవితం అని. బహుశా భూమ్మీద అతడు స్నేహం కోసం, ప్రేమ కోసం, అనుబంధం కోసం, సుఖం కోసం చేసే ప్రయత్నమంతా ఆ లోటు పూడ్చుకోవడానికే చేస్తున్న విశ్వ ప్రయత్నం కాబోలు. కానీ, ఆ అన్వేషణ ఎన్నటికీ పూర్తి కాదు, అందుకే అతడి అనుభంధాల పట్ల ఆరాటం. ఆ ప్రయత్నంలో పదే పదే విచారం అలుముకుంటుంది. ఎదో ఒక నిర్మాణంలో లీనం చేస్తున్నది. విలీనం చేస్తున్నదీ. ఇది మృత్యువే.
అమ్మ లేదా విశ్వం నుంచి విడివడ్డ మానవుడిగా వ్యక్తిగా ఏర్పడిన స్వతంత్రత తాలూకు వైఫల్యమే మన జీవితం అందుకే దాన్ని నేను మృత్యువు అన్నాను.
అందుకే అనిపించింది, ఈ కోటాను కోట్ల జీవరాసులున్న ఈ ధరణి, ఈ నేల – ఒక అనాది స్మశానం అని. అది మ్రత్తిక. మృత్యువు నెలవే అనీనూ. మనకే కాదు, సమస్త జీవ కోటికి.
అమ్మ లేదా విశ్వం నుంచి విడివడ్డ మానవుడిగా వ్యక్తిగా ఏర్పడిన స్వతంత్రత తాలూకు వైఫల్యమే మన జీవితం అందుకే దాన్ని నేను మృత్యువు అన్నాను.
ఈ రకంగానే మానవుడి సృజన అంతా కూడా మృత్యువు ఒడిలో సేద తీరే ప్రయత్నం అని, తాను చేసే విధ్వంసం అంతా కూడా భరించలేని ఈ వేదన తోటిదే అనీనూ.
అలా అని ఇది విషాదం కాదు. వాస్తవికత.
జీవితం మృత్యువు సొంత వాక్యమూ అని నాకన్పించింది.
చివరగా, తన ఒడి నుంచి అగమ్యమైన తావులోకి బిడ్డను వదలడానికి పడే పడరాని బాధే, చేసే విశ్వ ప్రయత్నమే తల్లి అనుభవించే లేబర్ పేన్స్ కావొచ్చు.
ఒక ప్రదర్శనలో ఉండగా జనించిన భావన ఇది.