శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా దివంగత శ్రీ కాపు రాజయ్య చిత్రాల్లో ప్రసిద్ది చెందిన రాధాకృష్ణుల చిత్రం మరోసారి తెలుపు. దర్శనం.
కందుకూరి రమేష్ బాబు
ఏప్రిల్ 7, 1925లో సిద్ధిపేటలో జన్మించిన కాపు రాజయ్య తెలంగాణ గర్వించదగిన చిత్రాకారులు. తెలుగు ప్రజలు గుండెల్లో పెట్టుకోదగిన నిండు మనిషి. వారు హైదరాబాదు లోని ప్రభుత్వ కళాశాల నుండి చిత్రకళలో డిప్లోమా పొందాడు. ఆ తర్వాత కళాకారునిగా డ్రాయింగ్‌లో మద్రాసు ప్రభుత్వ డిప్లమా కూడా పొందారు. లలితా కళా అకాడమీ ద్వారా ఆయన చెకోస్లోవికియా, హంగేరి, రుమేనియా, బల్గేరియా దేశాల్లో ప్రదర్శనలు పెట్టారు. జెఎన్‌టియు ఆయనను గౌరవ డాక్టరేట్ ద్వారా గౌరవించింది. నిరుపేద కుటుంబంలో పుట్టిన ఆయన కళారంగంలో అత్యున్నత స్థాయికి చేరుకోవడం విశేషం. వారు సిద్దిపేటలో 1963 లో లలితకళా సమితిని స్థాపించారు. ఆయన ఏ బొమ్మ గీసినా సజీవ లక్షణం ఉట్టిపడేది. వాటిల్లో గోపికా కృష్ణ, రాధా కృష్ణుల చిత్రాలను జన్మాష్టమి సంధర్భంగా చూడటం ఒక మంచి స్మృతి. సంప్రదాయం.
వారు చిత్రించిన బతుకమ్మ, బోనాలు తెలంగాణ అస్త్విత్వానికి చెరిగిపోని గురుతులు. అలాగే జానపద చిత్తాన్ని అపురూపంగా సాక్షాత్కరించే వడ్డెర మహిళ, ఎల్లమ్మ జోగి, పంటపొలాలు, వసంతకేళి, కోలాటం వంటి ఎన్నో అద్భుతమైన కళాఖండాలు మరపురాని చిత్రరాజాలు. ఇవి కాకుండా గోపికా కృష్ణ, రాధా కృష్ణుల చిత్రాలు సదా చిరస్మరణీయమైనవే.
శ్రీ రాజయ్య తండ్రి రాఘవులు సిద్ధిపేటలో చిన్నపాటి వ్యాపారిగా ఉండేవారు. రాఘవులుకు వారు మూడో సంతానం. ఆయనకు ముందు ఇద్దరు ఆడపిల్లలు జన్మించారు. చిన్న వయస్సులోనే తండ్రి మరణించడంతో ఆయన తీవ్రమైన ఇబ్బందుల పాలయ్యారు. కాపు రాజయ్య కుటుంబాన్ని తండ్రి మిత్రుడు మార్క చంద్రయ్య ఆదుకున్నారు. ఆరవ స్టాండర్డులో ఉన్నప్పుడు ఆయన మొదటి చిత్ర ప్రదర్శన జరిగింది. కుబేరుడు అనే ఉపాధ్యాయుడు చిత్రకళలో కాపు రాజయ్యను ప్రోత్సహించారు. రాజయ్యకు దాదాపు 50 దాకా అవార్డులు వచ్చాయి. రాష్ట్రప్రభుత్వం ఆయనను 1966లో రజత పత్రంతో సత్కరించింది. 1969లో తామ్ర పత్రంతో సత్కరించింది. 1975లో ఆయనకు చిత్ర కళాప్రపూర్ణ సత్కారం లభించింది. ఆగష్టు 20, 2012లో వారు స్వర్గస్తులయ్యారు.
రాజయ్య నకాషి శైలి సంవిధానంలో వేసిన గోపికా కృష్ణ, వడ్డెర మహిళ, ఎల్లమ్మ జోగి, పంట పొలాలు, వసంత కేళి, కోలాటం తదితర చిత్రాలు కళాభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి అంటే అతిశయోక్తి కాదు.
శ్రీ కాపు రాజయ్య కళాకారుడిగా ఉన్నత శిఖరాలను అధిరోహించినప్పటికీ వారు తన పుట్టిన గడ్డను మరిచిపోలేదు. ఆయన సిద్ధిపేటలో సైకిల్‌పై తిరుగుతూ ఉండేవారు. రాజయ్య తొలి చిత్రాలు సంప్రదాయబద్దమైన, కాలపరీక్షకు నిలిచిన ప్రాచ్య విధానంలో, అంటే వాష్ పద్ధతిలో చిత్రించేవారు. ఆ తర్వాత నకాషీ చిత్రకారుల అద్భుతమైన టెక్నిక్ వారిని ముగ్ధుడ్ని చేయడంతో టెంపరా రంగుల వాడకాన్ని ప్రారంభించారు. నకాషీ చిత్రకారులంటే ఆయనకు ఎనలేని అభిమానం. ఇరవై ఏళ్ల పాటు 1950 నుంచి 1970 వరకు ఆయన టెంపరా చిత్రాలే వేశారంటే వారికి ఆ ప్రక్రియ ఎంత ఇష్టమో అర్థం చేసుకోవచ్చు.
రాజయ్య నకాషి శైలి సంవిధానంలో వేసిన గోపికా కృష్ణ, వడ్డెర మహిళ, ఎల్లమ్మ జోగి, పంట పొలాలు, వసంత కేళి, కోలాటం తదితర చిత్రాలు కళాభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి అంటే అతిశయోక్తి కాదు.
Good artical…Ramesh anna.