హైదరాబాద్ ధూల్ పేటలో పుట్టి పెరిగిన ఈ చిత్రకారుడు నగరం తన కడుపులో దాచుకున్న సంస్కృతి సంప్రదాయాలనే కాదు, ఆషాడ మాసంలో నెత్తి మీద పెట్టుకునే బోనాలనూ చిత్రీకరించి పాత నగరం ఆత్మను స్థిరంగా అవిష్కరిస్తున్నాడు. భాగ్యనగరం శోభను యాది చేస్తున్నాడు.
కందుకూరి రమేష్ బాబు
అయన చిత్రాలు పాత బస్తీ ప్రతిబింబాలు. చార్ మినార్ ల సమ్మేళనాలు. పేదల బస్తీల జీవన సందోహాలు. బిర్యానీ కబాబ్ ల విందు విలాసాలు. రిక్షా, అటో ప్రయాణాల ఉల్లాసాలు. పాత బడని బృంద గానాలు. మాసిపోని జీవన బాంధవ్యాలు. గాఢమైన వర్ణ సంచయాలు. భాగ్యనగరం బోనాలు. మొహర్రం… పీరీల అలాయ్ బాలాయ్ లు….
నిజానికి కేఫ్టేరియాలో టీ తాగడానికి, ఇరానీ కేఫ్ లో చాయ్ తాగడానికి ఎంత తేడా ఉంటుంది? అదీ ఇతడి చిత్రకళా ఆతిథ్యం. గమనించండి. మనుషుల చెంతకు, పరిసరాల మధ్యకు, తీరుబాటుతో కూడిన జీవన మధురిమకు ఆహ్వానం పలుకు, అతడి చిత్రాలు.
గల్లి చిన్నది, గరీబోడి కథ పెద్దది అని గానం చేసిన గోరటి వెంకన్న మాదిరి ఈ చిత్రకారుడూ గాఢమైన వాడే. తాను ఆడి పాడేది కావ్వాసుపై, పసుపు, ఆకుపచ్చలు ప్రధానంగా కానవచ్చే వేప మండల, పసుపు కొమ్ముల వర్ణ సమ్మేళనాలతో. అందుకే అతడి చిత్రాల దర్శనం – పట్నం ఒడిలో సేదతీరడం. అది భాగ్యనగరం పునర్దర్శనమే.
తాను పుట్టి పెరిగిన ధూల్ పేట మొదలు తన పరిసర ప్రపంచం నుంచి వస్తువును గైకొన్న అక్షయ్ ఆనంద్ ఒక రకంగా తెలంగాణ ఆత్మను నగరంలో వ్యక్తం చేసే అరుదైన కళాకారుడిగా ఎదిగాడు.
తాను పుట్టి పెరిగిన ధూల్ పేట మొదలు తన పరిసర ప్రపంచం నుంచి వస్తువును గైకొన్న అక్షయ్ ఆనంద్ ఒక రకంగా తెలంగాణ ఆత్మను నగరంలో వ్యక్తం చేసే అరుదైన కళాకారుడిగా ఎదిగాడు. ఇందుకు కవిత దేవస్కర్ , లక్ష్మాగౌడ్ ల వద్ద పొందిన శిక్షణ తనకు తోడవగా తనదైన శైలిని అయన ఎంత సృజనాత్మకంగా మెరుగులు దుద్దుకున్నాడూ అంటే అతడిని కళ ఆక్రమించుకోవడం కాకుండా తానే ఆ కళలో నిండిపోయి ఫక్తు హైదరబదీగా – మాట, నడత, చిత్రం – ఒకే మాదిరిగా మలుచుకున్నాడు.
అత్యంత సాధారణమే అసాధారణం అవుతుందనడానికి ఆయన రేఖా లావణ్యమే ఉదాహరణ. అది సాధారణ జీవితాన్ని అలవోకగా చెప్పడానికి వీలుండేలా తన వస్తు వైవిధ్యాన్ని ఆసక్తిగా ఆవిష్కరించేలా రూపు దాల్చడం విశేషం. శైలికి తగ్గ మాదిరే తన వస్తువు ఉన్నట్టు, అది నగర జీవనంలో సహజంగా ఇమిడి పోయి వివిధ కులాలు, మతాల ప్రజానీకం, వారి ఆట పాటలు, ముఖ్యంగా వారి జీవన వ్యాపారాన్ని పరి పరి విధాలుగా ఆవిష్కరించేలా ఎదగడం విశేషం.
నగరంలోని వివిధ వీధులు, బజార్లు, ఇండ్లు, దుఖానాలు మొదలు ఇతడి బొమ్మల్లో పండుగ ఒక ప్రత్యేకంగా దర్శనమిస్తుంది. అది దైనందిన జీవితంలో సంబురంగా ఉంటుంది.
నగరంలోని వివిధ వీధులు, బజార్లు, ఇండ్లు, దుఖానాలు మొదలు ఇతడి బొమ్మల్లో పండుగ ఒక ప్రత్యేకంగా దర్శనమిస్తుంది. అది దైనందిన జీవితంలో సంబురంగా ఉంటుంది. అలాగే ఆయా పండుగలతో కూడి హైదరాబాద్ సంస్కృతిని అత్మీయంగా చెప్పేందుకు దోహదపడుతుంది. తన చిత్రాల్లో కమాన్లు, మినార్లు, ఆర్చీలు, వాటి ఆర్కిటెక్చర్ సోయగం ఎంతో అందమైన ఈస్తటిక్స్ గా రూపొంది అక్షయ్ బొమ్మలని విశేషంగా మర్చివేయడం గమనార్హం.
అతడికి హైదరాబాదే ప్రపంచం. అది నిజంగానే భాగ్యనగరంగా శోభిల్లడం తన ప్రత్యేకత.
ఆటోలు, ఇరానీ కేఫులు, జుమ్మేరాత్ బజార్లతో పాటు, ముందే చెప్పినట్టు – వివిధ పండుగలు, పబ్బాలే కాదు, అందలి క్రతువులను కూడా తన చిత్రాల్లో అయన ముఖ్యంగా చిత్రిస్తాడు.
అతడికి హైదరాబాదే ప్రపంచం. అది నిజంగానే భాగ్యనగరంగా శోభిల్లడం తన ప్రత్యేకత
భిన్న కులాలు, మతాల మధ్య శాంతియుత సహజీవనం, నిరుపేదల నిర్మల హృదయాల జీవన సంబురం, తీరొక్క రీతిలో సాగే బహుజన సాంస్కృతిక ఛాయలు, బలమైన మానవీయ సంబంధాలతో కూడిన పట్టణం అతడి కళా ప్రపంచంలో విశిష్టత. ఈ ప్రస్థానాన్ని అక్షయ్ ఆనంద్ సింగ్ సెలెబ్రేట్ చేసినట్లుగా మరొకరు చేయడం మనం చూడలేదు. అందుకే బోనాల సందర్భంగా ఈ చిత్రకారుడి ప్రత్యేకత గురించి అభినందనగా తెలుపడం ఒక పండుగలో పండుగే.
అన్నట్టు, అక్షయ్ ఆనంద్ ఒక రకంగా ‘గతం’లో జీవించే చిత్రకారులు అని పొరబడే ప్రమాదం ఉంది. నిదానంగా సాగిపోయే నిన్నటి జీవితం, వేగంగా మరలిపోతున్న నేటి వర్తమానం మధ్య అతడు నిన్న మొన్నటిని చిత్రిస్తున్న కళాకారుడిగానే పలువురు చూస్తారు. అతడు చిత్రిస్తున్న పట్టణ జీవితాన్ని మెమరీస్ గా, ఒక నాస్టాల్జియాగానే చూస్తారు. కానీ ప్రపంచీకరణ వేగంలో తనని తాను నిమ్మళంగా కాపాడుకుంటున్న పాతబస్తీ మాదిరి, కరోనా మహమ్మారి మధ్య సైతం సాగిపోతున్న బోనాల వలే అతడి చిత్రం నిత్య నూతనం. స్థిరం, శాశ్వతం అనే చెప్పాలి.
ప్రపంచీకరణ వేగంలో తనని తాను నిమ్మళంగా కాపాడుకుంటున్న పాతబస్తీ మాదిరి, కరోనా మహమ్మారి మధ్య సైతం సాగిపోతున్న బోనాల వలే అతడి చిత్రం నిత్య నూతనం. స్థిరం, శాశ్వతం అనే చెప్పాలి.
అతడి చిత్తమూ చిత్రమూ జానపదం కావడం కారణంగా వందలాది ఏండ్లుగా నిలిచి నిత్య నూతనంగా జనం మధ్య ఆకర్షిస్తున్న చార్ మినార్ వలే, ఆ పక్కనే ఉన్న ఇరానీ హోటల్ మాదిరి, అక్కడికి వచ్చే దేశవిదేశీ పర్యాటకుల మాదిరి అతడు పక్క పక్కనే మసిలే శతాబ్దాల వంటి చిత్రకారుడు. ఒక ప్రసిద్ద కళాకారుడు అన్నట్టు, Centuries live together అన్న మాట అతడి చిత్రకళకూ వర్తిస్తుంది. అందుకే తనని కాలదోషం పట్టని సాంస్కృతిక చిత్రకారుడనడం, ఎన్నడూ పాతబడని మన భాగ్యనగర రాయబారిగా వారిని ఎంచడం, అక్షరం వలే క్షయం కానిదే అక్షయ్ ఆనంద్ సింగ్ కి చిత్రకళా వైభవం అంటూ శుభాకాంక్షలు తెలుపడం. అభినందనలు.
అందుకే తనని కాలదోషం పట్టని సాంస్కృతిక చిత్రకారుడనడం, ఎన్నడూ పాతబడని మన భాగ్యనగర రాయబారిగా వారిని ఎంచడం, అక్షరం వలే క్షయం కానిదే అక్షయ్ ఆనంద్ సింగ్ కి చిత్రకళా వైభవం అంటూ శుభాకాంక్షలు తెలుపడం. అభినందనలు.
Very good write up to the well deserving Artist Akshay Anand Singh.