Editorial

Monday, December 23, 2024
కథనాలుకవి సమయం : ‘పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా’

కవి సమయం : ‘పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా’

Photos : KRB

గద్దర్ తెలంగాణ ప్రధానంగా రాసిన పాటల్లో ‘పొడుస్తున్న పొద్దుమీద’ చాలా విశిష్టమైనది. ఆ పాట గురించి కొన్నేళ్ళక్రితం గద్దర్ తో మాట్లాడి రాసిన ఈ లోతైన విశ్లేషణ వారి సృజన లోకం, అవిశ్రాంత కార్యక్రమం  ‘ఎప్పటికీ యుద్ధమే’ అని చాటుతుంది. ఆయన అంటారు, ‘యుద్ధానికి వెళ్లేముందు ‘శంఖం’ ఊదుతామే! అంట్లాంటి ‘విప్లవశంఖం’ ఈ పాట” అని.

ఇది విస్తృత వ్యాసం. చదివితే ఎన్నో విషయాలు. పాట పూర్వపరలతో సహా తన వెన్నులో ఇరుక్కున్న తూటా గురించి కూడా.

 కందుకూరి రమేష్ బాబు

Kandukuri Ramesh Babu

తెలంగాణ ఉద్యమం మళ్ళీ మొదలైన తరుణంలో భువనగిరిలో (1996) జరిగిన సదస్సుకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ సభ తిరిగి ప్రజాస్వామిక ఆకాంక్షలతో కూడిన తెలంగాణ కోసం ప్రభావశీలమైన ప్రయత్నం చేసింది. అనంతరం వరంగల్ సదస్సు. ఈ రెండు సదస్సుల్లోనూ గద్దర్ పాట విప్లవ సందేశాన్ని ఇస్తూనే సిసలైన తెలంగాణ వారసత్వ పోరు గీతికలను రచించేలా చేశాయి. అందులో ‘అమ్మా తెలంగాణమా…ఆకలి కేకల గానమా’ ఒకటి. ఇది గద్దర్ భువనగిరి సదస్సుకు హైదరాబాద్ నుంచి వెళుతూ రాశిండు. దాశరథి ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అన్నట్టు, ఇందులో కవి గద్దర్ కూడా ‘అంతటి’ తెలంగాణా వర్తమానంలో ‘ఆకలి కేకల గానాన్ని’ వినిపించే దుస్థితికి వచ్చిన వైనాన్ని ఆలపిస్తడు. మరొకటి ‘దగాపడ్డ మా తెలంగాణమా…’ అన్న పాట. అది ఇంకోసారి రాశిండు. ఇందులో తీరొక్క రీతుల్ల మన వైభవం దెబ్బతిన్న రీతిని కళ్ళకు కడతడు. ఈ రెండే కాక నిర్దిష్టంగా తెలంగాణా అంశం చుట్టూ మరికొన్ని పాటలు రాసినప్పటికీ 2011లో తెలంగాణా ఉద్యమం ఉధ్రుతి మీద ఉండగా ఎత్తుకున్న పాట ‘పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా…’ అన్నదే. ఇది అశేష ప్రజారాసుల ఉద్యమ ఆలాపగీతం అయింది. పాట వినబడంగనే శిశువు నుంచి ముసలి వరకు ఆడిపాడే స్థాయికి తెచ్చింది. చిత్రమేమిటంటే ఇది శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘జై బోలో తెలంగాణా’ అన్న సినిమా కోసం రాసిన పాట.

కొత్త ‘పొడుపు’ కోసం

2011 లో ‘జై బోలో తెలంగాణా’ సినిమా విడులైంది మొదలు ఇప్పటికీ ఈ పాట ప్రజలకు గొప్ప ఊపునిస్తది. ‘యూ ట్యూబ్’ లో బహుళ ఆదరణ పొందిన పాటల్లో ఇది చాలాకాలం పాటు నంబర్ వన్ అంటే అతిశయోక్తి కాదు. 5 నిమిషాలా 51 సెకండ్ల నిడివి గల ఈ పాట నిజానికి ఉద్యమ గీతమైనప్పటికీ ప్రభుత్వం నంది పురస్కారం ప్రకటించడం అంటే అప్పటికే పాలకులు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఇక అనివార్యమే అని గుర్తించినట్టు అయింది. చాలా సరళమైన పదాలు, చిన్న చిన్న మాటలతో, గతంలో గద్దర్ పాటలో వినని సరికొత్త డిక్షన్ తో కూడిన ఈ పాట ‘భలె భలె’ …అంటూనే తెలంగాణా నడిచి వచ్చిన సంక్లిష్టమైన దారులను తెలియజెబుతుంది. త్యాగాలను కీర్తిస్తుంది. ఒక కొత్త ‘పొడుపు’ కోసం, ప్రజలంతా ఎదిరి చూస్తున్న ‘నూతన ఉషోదయం’ కోసం అన్నట్టు ప్రారంభమై మహోత్తేజాన్ని కలిగిస్తూ ఆర్ద్రంగా ముగుస్తుంది. ఒక కొత్త ‘కాలం’ సాకారమైన వేళ ఈ పాట మహాత్మ్యం గురించి స్వయంగా గద్దర్ చెప్పింది వినవలసిందే.

తానంటాడు, “తెలంగాణా సాధనలో అవకాశవాద ఎన్నికల ఎత్తుగడ ఉంది. అదే సమయంలో ఉద్యమ ఎత్తుగడలూ ఉన్నయ్. ఈ రెంటివల్ల వచ్చిందే నేటి తెలంగాణ రాష్ట్రం. అయితే, నాది ఏ పంథానో అందరికీ తెలిసిందే. అందుకే యుద్ధానికి వెళ్లేముందు ‘శంఖం’ ఊదుతామే! అంట్లాంటి ‘విప్లవశంఖం’ ఈ పాట” అన్నారాయన. “దర్శకుడు శంకర్ ఈ పాటలో నాలుగైదు లైన్లు తొలగించాడు గానీ లేకపోతే ఇంకా బలమైన పాటగా ఉండేది” అంటూ “అందులో ‘అడవి తల్లి గుండెలోన రగల్ జెండా రాగమా…’, ‘సింగరేణి ఘనుల్లో పేలుతున్న శబ్ధమా…’ అని కూడా ఉంటుంది” అని వివరించారు గద్దర్. ఇట్లా – ఈ పాట తనదైన జెండాను, ఎజెండాను సమున్నతంగా నిలిపిన గేయంగా ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోతుంది.

పాట ఎత్తుగడే ‘సూర్యుడు’

పాట ప్రారంభంలోనే ‘అదిగో ఆ కొండల నడుమ తొంగి చూసే ఎర్రని భగవంతుడేవరు’ అని ప్రశ్నిస్తాడు గద్దర్. విప్లవ శక్తులని సూర్యుడితో పోలుస్తూ పొడుస్తున్న పొద్దుతో కాలం నడుస్తున్న వైనాన్ని చెబుతూ, ప్రజా చేతనను , విప్లవోన్ముఖమైన ప్రజా రాశులను స్పురణలోకి తెస్తూ ఆ పాట ఎత్తుకుంటాడు. ‘సూర్యుడిని ముద్దాడిన భూతల్లి చిన్నారి బిడ్డకు జన్మనిచ్చింది’ అంటూ ఈ కొత్త శిశువుకు కారణం భూమి ఇరుసుగా సూర్యుడి తేజంగా జనించిన మేలవింపేనని నొక్కి చెబుతూ సాగుతాడు కవి. ‘నువ్వు త్యాగాల తల్లివి’ అని కీర్తిస్తూ కైగడుతాడు గద్దర్.

చిదిమేసిన పువ్వులను, త్యాగాల గుర్తులను గుర్తు చేస్తూ ‘మా భూములు మావేనని మర్లబడ్డ గానాన్ని’ యాదిలోకి తెస్తడు. ఇక్కడ కవి ఉపయోగించిన ‘తిరగ బడటమూ’, ‘మర్ల బడటమూ’ అన్న పదాలు  కాన్షియస్ గా వాడటాన్ని బట్టి ‘ఈ పొడిచే పొద్దు’ వెనకాల సుధీర్గమైన పోరాటం ఉన్నదని, అది వ్యక్తులుగాను, సంఘటితంగానూ సాగిందీ అన్న చారిత్రిక సత్యాన్ని తెలియజేస్తాడు.

కన్నీళ్ళు నిండుకున్న తెలంగాణ మోములో రెండు కండ్లుగా మారిన ప్రాధాన్యాలను ప్రస్తావిస్తూ ముందు ‘భూమి’ గురించి చెబుతడు. తర్వాత ‘నీళ్ళ’ గురించి చెబుతడు. గోదారి, కృష్ణమ్మలను, ప్రజల జీవనాధారాన్ని ప్రస్తావిస్తూ ‘ మా నీళ్ళు… భలే.. భలే.. భలే.. మా నీళ్ళు మాకేనని కత్తుల కోలాటమా…కన్నీటి గానమా’ అని ‘నీళ్ళు మళ్ళిన వర్తమానాన్ని’ ప్రశ్నిస్తున్న ప్రజలతో పాటను మమేకం చేస్తాడు. రేపటి పొడిచే పొద్దులోన ప్రజలంతా తృప్తిదిరా ఆనందించే, కన్నీటితో పరవశమొందే స్థితినీ కళ్ళకు కడుతడు.

‘అదిగో ఆ ప్రకృతిని చూడు…అలా అలుముకుంటుంది…అదిగో పావురాల జంట…నేనప్పుడూ విడిపోనంటది ..పువ్వులు పుప్పొడిలా పవిత్ర బంధమా…పరమాత్ముని రూపమా…’ అంటూ ప్రేమను, విడిపోనంటున్న ప్రేమను (ఆ సినిమాలో ఆంధ్ర పిల్ల తెలంగాణా పిలగాడితో ప్రేమలో పడుతుంది. ఆ జంటను చూపిస్తూ) ‘విడిపోయి కలిసుందాం’ అన్న సినిమా సందేశానికి తగ్గ చరణాలతో గద్దర్ ఈ పాటను ఒక్కసారి భౌతిక అస్గ్తిత్వాన్ని గుర్తు చేస్తూనే అదే అనువుగా పారమాత్మిక స్థితిని, అలౌకిక ఆనందాన్ని పొందే విధానంగ మలుస్తడు. పాటను అట్లా మహత్తరంగా ఆవిష్కరిస్తడు.

గడిచిన తెలంగాణ పీడనను, అణచివేతను చెప్పడానికి, ‘మన భూమిని, నీళ్ళను, ప్రాణాల్ని, సర్వస్వాన్ని చెరబట్టిన’ ఒక్కొక్కరినీ ‘రాజులు, దొరలూ, వలస దొరలూ…’ అంటూ పరపీడనకు గురి చేసిన వారందరినీ ఎండగడుతడు. ‘దొరవారి గదుల్లో నలిగిపోయిన న్యాయమా’ అంటూ తెలంగాణాలో స్థానీయ ఆధిపత్యాలను ప్రస్తావిస్తూనే ‘ఆంధ్ర వలస పాలనకు ఆరిపోయిన దీపమా’ అంటూ స్వయంగా ఉద్యమంలో తూటాలు తీసుకున్న గద్దర్, ఎంతో మందిని బలైపోవడానికి కారణమైన రాజ్యహింసను వేలెత్తి చూపుతూ గొప్ప ఆర్ద్ర గీతంగా ఈ చరణాలను కన్నీటి ఉలితో చెక్కుతడు.

ఉగ్ర నరసింహుడు

ఆఖరుగా ‘మా పాలన మాకేనని మండుతున్న గోళమా’ అంటూ మరోసారి ఇంతెత్తున ఎగిరి ఉగ్ర నరసింహుణ్ణి గుర్తు చేస్తూ అసాధారణమైన ఉత్తేజాన్ని పంచుతూ ఆ వెంటనే తగ్గి ‘అమర వీరుల స్వప్నమా… అమర వీరుల స్వప్నమా…’ అని గొంతు జీరబోతుండగా ఒక విషాద విలాపంతో త్యాగాధనులకు నీరాజనం పలుకుతూ పాటను నిలిపివేస్తడు.

ఒక్క మాటలో ఇదొక ఉద్విగ్న ఉత్తేజ మహోగ్ర సందేశాన్ని వినిపించే గేయం. అదే సమయంలో ప్రేమ, కరుణలు నిండుగా మూర్తీభవించిన గానం. ‘విడిపోయి కలిసుందాం’ అని చాటిన కొత్త పొద్దు పొడుపు ఆహ్వానం.

మలిదశ ఉద్యమంలో పీడన గురించి రాసిన గద్దర్ పాత పాటలతో పోలిస్తే ఇది నూతన గేయం. క్రాంతి దర్శనం. ఇందులో సంబురం ఉంది. సంతోషం ఉంది. విడిపోవడంలోని విషాదమూ ఉంది. ఒక్క మాటలో పాపులర్ మీడయం ఐన సినిమా మధ్యమం ద్వార కోట్లాది ప్రజల చెంతకు వెళ్లి అలా అందర్నీ కన్విన్స్ చేసిన, మలిదశ ఉద్యమంలో అతి కీలకమైన విభజన గేయం ఇది. విప్లవ గేయం ఇది. తెలంగాణా త్రికాల చిత్రకగా గతం, వర్తమానం, భవితల కూర్పు ఇది.

‘జై బోలో తెలంగాణా’ చిత్రం దర్శకుడు శంకర్ ను ఈ పాట గురించి స్పందన అడిగినప్పుడు “ఈ పాటలో తనను ఆకట్టుకున్నది ప్రేమతత్వం” అని చెప్పిండు. ఒకటని కాదు, పరిశీలిస్తే చాలా ఉన్నాయని చెబుతూ, “చరిత్ర, స్ఫూర్తి, గతం, వర్తమానం, భవిశ్వత్తు, వీటన్నిటినీ మించి మానవీయ కోణం, ప్రేమతత్వం, చైతన్యం ఉంది” అని వివరించిండు.

“నిజానికి ఈ సినిమా రెగ్యులర్ ప్రేమ కథ కాదు. ఒక ప్రాంతపు ప్రేమని రిప్రజెంట్ చేసేలా హీరో, హీరోయిన్లు ఉంటారు. అట్లా రెండు ప్రాంతాల గుర్తింపు, అస్తిత్వం, ప్రేమ, గౌరవాలతో కూడిన అంశం ఇతివృత్తంగా వచ్చిన సినిమా. మరీ ముఖ్యంగా ఈ పాట కూడా ప్రేమికులు చావు బతుకుల్లో ఉండగా ‘ప్రాంతాలుగా విడిపోయి మనుషులుగా బతికుండ’మని చెప్పే క్రమంలో వస్తుంది. సరిగ్గా అదే సమయంలో తెలంగాణ తల్లి కోమాలోకి వెళ్ళే ఉద్విగ పరిస్థితి ఉంటుంది. అపుడు గద్దరన్న ఎంటరై ఆడుతడు, పాడుతాడు” అని ఉత్తేజంగా చెప్పిండు శంకర్.

నిజంగానే ‘స్క్రీన్ కిల్చిడ్వే’

తమిళంలో ఒక మాట ఉంది. ‘స్క్రీన్ కిల్చిడ్వే’ అని. కథా రచయిత, దర్శకులు, సాంకేతిక సిబ్బంది కలిసి డిస్కస్ చేసుకుంటున్నప్పుడు , ఒక ఉద్వేగభరితమైన దృశ్యం చేయాల్సి వచ్చినప్పుడు, అది తప్పకుండా ‘అదిరిపోతుంది’ అని చెప్పుకునేటప్పుడు ‘తెర చిరుగుతుంది’ అన్న అర్థంలో ఆ పదం వాడుతారు. అప్పటిదాకా కేవలం చర్చల్లోనే ఆ పదం విన్నాను. కానీ ‘జైబోలో తెలంగాణ’ సినిమా ద్వారా గద్దరన్న తెరమీదికి ప్రవిశించగానే అంతకు మించిన ఉద్వేగం, ఉత్తేజం. దాంతో ‘స్క్రీన్ కిల్చిడ్వే’ అంటే ఏమిటో కళ్ళారా చూసిన. ఎన్నో దియేటర్లలో చూసిన” అని నిజంగానే ఉద్వేగంగా చెప్పిండు శంకరన్న.

ఇట్లా – ఈ పాట మన కాలం పాట. ‘భూమి, నీళ్ళు, వనరులు, స్వయం పాలన, పరిష్కారాల’ గురించిన ఒక అసామాన్యమైన కవి తలంపు పాట.

తూటాతో లేచిన పాట

పాట సరే, తూటా గురించి కూడా ఇక్కడ చెప్పుకోవాలి. అవును మరి, సరిగ్గా ఈ సంబాషణ జరిగే నాటికి ఆయనపై హత్యాయత్నం జరిగి పదిహేడేళ్ళు ఐంది. (వారు చనిపోయేటప్పటికి 25 ఏళ్ళు ) ‘గ్రీన్ టైగర్స్’ దాడి అనంతరం నెల రోజుల వ్యవధిలోనే లేచిన ఈ ప్రజాకవి ‘ననుగన్న తల్లులారా..తెలుగుతల్లి పల్లెలారా…’ అంటూ ‘పాటనై వస్తున్నానమ్మో’ అని పునరంకితమై కూడా పదిహేడేళ్ళు అవుతున్నది. ‘చంపుకున్నా మీ దయ….సాదుకున్నా మీ దయ’ అని అప్పుడు అన్నడు. అది తన అత్మబలమో లేక ప్రజల అశీర్వాద బలమో, ఆయన నిజంగానే బతికిండు. అదృష్టం ఏమిటంటే, జనం పాటపై తూటాల వర్షం కురువడానికీ తెలంగాణ ఉద్యమాన్ని రగులుస్తున్న వారిలో తాను ముఖ్యులని అందరికీ తెలుసు. భువనగిరి సదస్సులో ఆయన పాటెత్తుకోవడం ప్రభుత్వాన్ని భయాందోళనలకు గురి చేసిందనే చెప్పాలి. చివరకు సకల జనుల స్వప్నమైన తెలంగాణా రాష్ట్రం సాకారం అవనే అయింది. ఒక ప్రజాస్వామిక ఆకాంక్ష దిశలో ఒక పెద్ద ముందడుగు పడనే పడ్డది. ఇందులో తాను క్రియాశీలం అని చెప్పక తప్పదు. అతడిపై దాడి జరగడానికి ఏ కారణమైతే ఉండిందో ఆ కారణం నిజంగానే నెరవేరింది. మలిదశ ఉద్యమంలో గద్దర్ కీలకంగా మారిండు. ఆడిండు పాడిండు. బహుశా ఆ నాడు మళ్ళీ పుట్టినంత పనైన గద్దర్ కు తన వెన్నెముకను ఆనుకున్న తూటా నిజంగానే ఎస్కార్ట్ అయింది. తనకు అది బుల్లె ప్రూఫ్ అయిందనే చెప్పాలి. తూటాతో లేచిన పాట గద్దర్. బహుశా అందువల్లే కావచ్చు, ‘పొడుస్తున్న పొద్దు’ పాట కూడా అట్లా లేస్తది. ఊపెస్తది.

అయితే గద్దర్ విస్తృతి పెద్దదే. దాన్ని సూక్ష్మంగా చెప్పుకుంటే, తాను చిన్న నాటి నుంచే సింగర్. యువకుడిగా ఉన్నపుడు అల్లూరి సీతారామరాజు బుర్రకథ చెప్పడం మొదలు ఎమర్జెన్సీ ముందు తెలంగాణా ఉద్యమం వెనుక పట్టు పట్టినపుడు చెన్నారెడ్డి ద్రోహం గురించి గొల్లసుద్దుల ఒగ్గు కథా చెప్పిండట. ఆనాటి నుంచి మలిదశ ఉద్యమం మొదలవడానికి ముందే తాను నిర్దిష్టంగా తెలంగాణ పీడనను, వైభవాన్ని రంగరించి పాటలెన్నో రాసిండు. అయితే, ‘అవన్నీ ఒకెత్తూ, ఈ పాట ఒకెత్తు’ అన్నప్పుడు ‘నిజమే, ఈ పాట చరిత్ర – ప్రకృతి చలన సూత్రాలను పట్టుకుని రాసింది’ అన్నాడు గద్దర్. ‘అందుకే అంత ఊపు’ అని వివరించిండు. ‘నిజానికి ఈ పాట పల్లవే దాని గొప్పతనం’ అంటూ ‘పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా’ అన్న పల్లవి ‘కాలంతో పాటు నడిచే వాడిదే చరిత్ర’ అని స్పష్టం చేసిందని వివరించిండు. కాగా, ఈ పల్లవితోనే తాను ఒక పాట గతంలో రాశిండట. ‘ఓరుగల్లు గుండెలల్ల ఎగురుతున్న జెండాలా’ అంటూ సాగే ఆ పాటలో తెలంగాణా జిల్లాలన్నీ వస్తయని, అయితే, సినిమాకు మళ్ళీ ఈ పాట రాసినప్పుడు ఉద్యమ ఉధృతిని గుర్తించి అందుకు తగ్గ ఆయుధాన్ని అందించేలా పాట ను మలిచినట్లు చెప్పిండు.

గొప్ప సంబురాన్ని పంచె ఈ పాట ప్రజల్లోకి అంతగా చొచ్చుకుని పోవడానికి కారణం ఏమై ఉంటుందో చెప్పమని కోరినప్పుడు తాను మూడు ముక్కల్లో ఈ పాట విశిష్టతను ఇట్ల చెప్పిండు.

పాట నిర్మాణం

“ఒకటి మాట. అవును, మాట. మొత్తంగా ఈ పాట చిన్న చిన్న మాటల్లోనే ఉంటది. అది తెలంగాణ మాట. రాగయుక్తమైన మాట. ‘అదిగో చూడు…ఆ కొండల్లో’ అనంగనే అది మాట. కానీ దాన్ని రాగమయం చేసిన.” అన్నడు.

“మాట తర్వాత శబ్దం” అంటూ “దాన్ని పేల్చిన” అన్నడు. “అవును, ‘భలే …భలే…భలే..హ!’ అనంగానే ఒక తూటా పేలినట్టు భూమి ఆకాశం మధ్య విస్తరించే ఒక మహా శబ్దాన్ని సృష్టించడం. ఆ పని చేయడం వల్లే ఈ పాట ప్రజల్లో ఉప్పొంగడానికి కారణమైందీ” అన్న విషయాన్ని తెలిపాడు.

“మూడోది చలన సూత్రం. అవును. పల్లవే అంతానూ. ‘పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా’ అన్న. అ మాట నిరంతర తెలంగాణా ఉద్యమ చరిత్ర చెప్పకనే చేబుతున్నది. కాలంతో సాగిన చరిత్రగా అదెక్కడా ఆగని విషయాన్ని స్పురింపజేస్తుంది. ఆ చలన సూత్రం చెప్పిన. అదే ఈ పాట విశిష్టత’ అన్నడు.

“ఈ మూడూ – ప్రకృతి చలన సూత్రంతో మిళితమై చెప్పిన. ప్రతి చలనంలో మార్పు ఉన్నది. మార్పులో అభివృద్ధి… వికాసం..అది కొనసాగుతుంది. స్టాగ్నేట్ కాకుండా కాలంతో పాటు మారుతూనే ఉంటుంది. అందుకే ‘పొడుస్తున్న పొద్దు’ ప్రతీకతో ఈ పాట రాసినట్లు వివరించిండు.

“ఇంకో మాటా చెప్పాలి. ఈ మూడింటితో పాటూ మరో విషయాన్నీ ప్రస్తావించుకోవాలి. తాను రాశాడు. పాడాడు. ఆడాడు. అయితే, ఈ పాటను రాయడం, ఆడటమే కాదు, కవి స్వయంగా ఉద్యమంలో పాల్దోనడం, పార్టనర్ కావడం వల్ల ప్రజల్లో ఒక విశ్వాసం. ‘అరె ఇదిరా పాటంటే’ అన్న నమ్మకం. దాంతో ప్రజల్లో అంతులేని విశ్వాసంతో కూడిన అభిమానం. అవన్నీ ఈ పాటను లేపినయి. ప్రజలు ఆడిపాడేలా చేస్తున్నయి” అని ప్రజల పట్ల గౌరవాభిమానాలతో సంతృప్తిగా చెప్పిండు.

పాట ప్రాసంగికత

ఇదిట్లా ఉంటే, ఈ పాట ప్రాసంగికత అంత తొందరగా పోదనీ అనిపిస్తున్నది. ఎందుకంటే, ఇందులో తానే అన్నట్టు ఒక చలన సూత్రం ఉంది. మా నీళ్ళు, మా భూములు, మా వనరులు, మా పాలన అన్నీ కావాలన్న అకాక్ష ఉన్నది. “తెలంగాణా రాష్ట్ర పొద్దు పొడువు వేళ ఈ పాట ఆగిపోతుందా?” అంటే “ఆగదు” అనే అన్నడు గద్దర్. అయితే “ఈ పాట మారుతుంది” అన్నడు. “అర్థం కాలేదు” అంటే “ఉత్పత్తి నుంచి శబ్దం, అక్షరం, పదం, పాట పుట్టినట్టే. అట్లే – చరిత్రలో ఉత్పత్తి శక్తులు పోరాడి ఇంకేం సాధించుకుంటారో అవన్నీ జనం పాటలో ఉంటై. పాటను పదును పెడతరు” అన్నట్టు చెప్పిండు. తన పాటనే తాను పదును పెడుతున్న వైనాన్నీ చెప్పిండు.

“అవును. తెలంగాణ రాష్ట్రం వచ్చింది సరే. సాధించుకున్న దశ ముగిసింది, మంచిదే. ఇక పని మొదలుగావాలే. మరి ఇప్పటిదాకా నిర్మాణమే లేదు. అంతా దోపిడీ నిర్మాణమే. ఇంకా పునర్నిర్మాణం ఎక్కడ? అందుకే పాత పాటనే మళ్ళీ రాస్తున్న” అన్నడు.

“మనకేమి తెచ్చినాదొ లచ్చుమమ్మా…”

“పాత పాటను రాయడమా?” అంటే, అవును. ఇంకా గద్దర్ శకం ఒడవలేదు. ఇంకా తన పాత్ర ఉన్నది. నాడు తూటాలు తగిలినా బతికింది. అందుకే కావచ్చు. బహుశా అందువల్లే ‘పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా’ అన్న ఈ పాటకు ఇప్పటి భౌగోళిక తెలంగాణ సాక్షాత్కారం అవుతున్న కాలానికి మళ్ళీ కొనసాగింపును తానే రచిస్తున్నట్టు చెప్పి అప్పుడు ఆశ్చర్యపరిచిండు. నిర్మాణం అంటే ఇదే అన్నట్టు చెప్పిండు. ఆ నాడు తన తల్లిపై 1972లో రాసిన ‘సిరిమల్లె చెట్టుకింద లచ్చుమమ్మో…లచ్చుమమ్మా’ అన్న పాటను రివర్స్ లో రాస్తున్నట్టు చెప్పిండు.

“తెలంగాణా వచ్చింది లచ్చుమమ్మో లచ్చుమమ్మా… మనకేమి తెచ్చినాదొ లచ్చుమమ్మా…” అని రాస్తున్నట్టు చెప్పిండు,. చిత్రమేమిటంటే, ఇప్పుడు ‘పొడుస్తున్న పొద్దు’ పాట లచ్చుమమ్మకు ఆసరా అవుతున్నది. అను పల్లవి అవుతున్నదని కూడా నాడు తెలిపిండు.

ఈ వ్యాసం 06 ఏప్రిల్ 2014 నమస్తే తెలంగాణ బతుకమ్మ సంచికలో ’కవి సమయం’ శీర్షికన ప్రచురితమైంది.‘కవి సమయం’ మలిదశ తెలంగాణా ఉద్యమంలో అత్యంత ముఖ్యమైన కవి గాయకుల పాటలపై రాసిన కాలమ్. వ్యాసానికి వాడిన ఫోటోలు సినిమా తెరపై తీసినవి.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article