Editorial

Monday, December 23, 2024
ARTSఇతడే... నవ్వించే ఆ సింపుల్ కార్టూనిస్ట్ - పైడి శ్రీనివాస్

ఇతడే… నవ్వించే ఆ సింపుల్ కార్టూనిస్ట్ – పైడి శ్రీనివాస్

పైడి శ్రీనివాస్ కార్టూన్లు చూడని వారుండరు. ఇటీవల వారి కార్టూన్లు సోషల్ మీడియాలో చక్కెరలు కొట్టడం మీరు చూసే ఉంటారు. సింపుల్ గా ఉండి హాయిగా నవ్వించే వారి కార్టూన్లలో వైరల్ అయినవే లెక్కకు మిక్కిలి అంటే అతిశయోక్తి కాదు.

బుల్లెట్ బండి పాట సమయంలో వేసిన కార్టూన్ కావొచ్చు… అంతకు ముందు శ్రీదేవి మరణంపై మీడియా చేసిన ‘అతి’ గురించి కావొచ్చు, వారి కార్టూన్లలో వ్యంగం, హాస్యం ‘తగుమోతదు’ అనాలి. చురక ‘అవసరమైనంతే ‘ అని చెప్పాలి. ఈ విశిష్ట కార్టూనిస్టు సంక్షిప్త పరిచయం ఒక అభినందన. అభిరుచితో కూడిన అస్వాదన.

సీతారామారావు కొడాలి

పైడి శ్రీనివాస్ పుట్టింది, చదువుకున్నదీ, ప్రస్తుతం ఉంటున్నది వరంగలే. బి.ఎ, బి.సి.జె చేశారు. ఇరవై ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. అంతకు ముందు నుంచే – అంటే 1990 నుంచి కార్టూన్లు వేస్తున్నారు. వార్త, ఈ టీవీ 2, సాక్షి టీవీలో పనిచేశారు.ప్రస్తుతం వారు ఫీలాన్స్ జర్నలిస్టుగా పని చేస్తూ కార్టూనిస్టుగా మనల్ని అలరిస్తున్నారు.

“పైడి శ్రీనివాస్ సమకాలీన అంశాలపై చురకలు వేస్తూ కార్టూన్లు వేయడమే కాకుండా, ఫక్కున నవ్వించేటట్లు చేస్తాడు. డ్రాయింగ్స్ కూడా చాలా సింపుల్ గా ఉండటమే కాకుండా అర్థవంతంగా ఉంటాయి” – ప్రసిద్ద వరప్రసాద్.

చదువుకునే రోజుల్లో వ్యాస రచన పోటీలలో, చిత్రకళలో వీరికే ప్రధమ బహుమతి లభించేది. హైస్కూల్ లో వున్నప్పుడు ఆంధ్రభూమి వారపత్రికలో మల్లిక్ కార్టూన్లు చూసి ప్రేరణ పొందారు. ఆ తరువాత తనకీ కార్టూన్లు వేయాలనే కోరిక కలిగి సాధన చేస్తుండేవారు. అయితే పత్రికలకి ఎలా పంపాలో తెలిసేదికాదు. ఆ సమయంలో వరంగల్‌ పాలిటెక్నిక్‌ హాస్టల్‌లో ఉంటున్న జిందమ్ రామ్మోహన్ గారిని కలిశారు. ఆయన కార్టూన్లు ఎలా వేయాలో కొన్ని సూచనలు చేశారు. అలా తన మొదటి కార్టూన్ 1990 లో జాగృతిలో వచ్చింది.

“అద్భుతమైన టైమింగ్ తో కార్టూన్స్ వేస్తుంటారు” అని మంజీత అన్న కవయిత్రి అన్నారు.

చదువుకునే రోజుల్లో తమ ఇంటికి సమీపంలోనే ఉన్న ప్రాంతీయ గ్రంధాలయానికి తరచుగా వెళ్తూ అన్ని పత్రికలు, పుస్తకాలు చదివేవారు. ఆ విధంగా వివిధ పత్రికల్లో వచ్చే కార్టూన్లను శ్రద్దగా పరిశేలించేవారు. ఆంధ్రభూమి వారపత్రిక, వార్త దినపత్రిక చెలి పేజీలో వంద వరకు జోక్స్‌ రాశారు. వార్త దినపత్రిక వరంగల్ ఎడిషన్లో కొన్నాళ్ళు రిపోర్టర్‌గా పనిచేశారు. అక్కడ డెస్క్‌ బాధ్యుల్లో ఒకరైన శంకర్‌రావ్ శెంకేసి గారు ప్రతివారం జిల్లా అనుబంధంలో తన కార్టూన్లు ప్రచురించడంతో ఆయనకు ఎంతో ప్రోత్సహం లభించింది.

“పైడి శ్రీనివాస్ గారి కార్టూన్లలో ఒక వ్యంగ్యం ఎప్పుడూ దోబూచులాడుతూ ఉంటుంది. వార్తను వ్యాఖ్యగా రాసి కార్టూన్ వేస్తే అది నవ్వు పుట్టించదు. కానీ, శ్రీనివాస్ గారి కార్టూన్లలో అంతర్లీనంగా వార్త ఉన్నా దాని పరిణామాలపైన వ్యాఖ్య ఉండడం వలన హాస్యం పండుతుంది”  -ప్రభాకర్ జైని

పైడి శ్రినివాస్ 2003లో ఈనాడు జర్నలిజం స్కూల్‌ లో శిక్షణ పూర్తి చేసుకుని ఈటీవీ 2 లో సబ్‌ ఎడిటర్‌గా చేరారు. ఉద్యోగంలో చేరకా పత్రికలకి కార్టూన్లు వేయటం కుదరలేదు. అయినా రోజూ కార్టూన్లు, బొమ్మలు ప్రాక్టీస్‌ చేయడం ఆపలేదు.

2018లో బాలీవుడ్‌ హీరోయిన్‌ శ్రీదేవి మరణం పై న్యూస్‌ ఛానల్స్‌ రిపోర్టర్లు చేసిన ‘అతి’ మీకు గుర్తుండే ఉంటంది. ఆ అంశపై వేసిన పైడి శ్రీనివాస్ కార్టూన్ ఇదే…

2018లో బాలీవుడ్‌ హీరోయిన్‌ శ్రీదేవి మరణం పై న్యూస్‌ ఛానల్స్‌ రిపోర్టర్లు చేసిన ‘అతి’ మీకు గుర్తుండే ఉంటంది. ఆ అంశపై తాను ఒక కార్టూన్ వేసి ఫేస్‌బుక్‌లో పోస్టు చేస్తే అది విపరీతంగా వైరల్ అయ్యింది. ఇక అప్పటినుంచి రెగ్యులర్‌గా కార్టూన్లు వేసి ఫేసుబుక్‌లో పోస్టు చేయడం ప్రారంభించారు.

“శ్రీనివాస్ గారి సునిశిత హాస్యంలో వ్యoగ్యపు చెణుకులు మహా చురుగ్గా ఉంటాయి” – దీప్తి శ్రీ

2018లో తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ తెలుగు మహాసభలలో ఏర్పాటు చేసిన కార్టూన్ ప్రదర్శనలో వీరి కార్టూన్ కూడా వుంది. ఆ సందర్భంగా అనేక మంది కార్టూనిస్టులని కలుసుకునే అవకాశం తనకు కలిగింది. అది కూడా వారికి మంచి ప్రేరణగా నిలిచింది. అలాగే, అంతకుముందు ఈ టీవీ 2 లో పనిచేసేటప్పుడు రామోజీఫిలిం సిటీలో ఈనాడు కార్టూనిస్టు శ్రీధర్ గారిని కలవడం కూడా తనకు ఏంతో ఉపకరించింది. తాను వేసిన కార్టూన్లు చూసి ఆయన కొన్ని సూచనలు చేయడంతో అది తన పనితనానికి మెరుగులు అద్దినట్లయింది.

“అర్భాటం లేకుండా సింపుల్ గీతలతో చక్కగా ఉండటమే ఈయన కార్టూన్లు లోని ప్రత్యేకత” – అప్పారావ్ తలటం

కార్టూనిస్టు శ్రీమతి సునీల గారు ఫోటో షాప్ లో కొన్ని మెళకువలు చెబుతూ తనకోసం ప్రత్యేకంగా ఒక వీడియో రూపొందించి పంపించారు. అప్పటినించీ వీరు ఫోటో షాప్ లో కార్టూన్లు వేస్తున్నారు.

కార్టూన్‌లో రాసే వ్యాఖ్య విషయంలో తాను చాలా జాగ్రత్తలు తీసుకుంటాని చెప్పారు. తన కార్టూన్లు చాలా గ్రూపుల్లో చక్కర్లు కొడుతున్నాయని మిత్రులు ఫోన్‌ చేసి చెప్పినప్పుడు ఎంతో సంతోషంగా వుంటుందన్నారు.

“ఒక్క బొమ్మా నవ్వదు. కానీ మా పొట్టుబ్బా పడి పడి పైడి నవ్వులే!!” – బి.వి.ఎస్ ప్రసాద్.

ఉద్యోగపరంగా చూస్తే… సాక్షి టీవీలో ధర్మవరపు సుభ్రహ్మణ్యం గారు హోస్టుగా డింగ్ డాంగ్ పేరుతో ఐదేళ్లు నిర్విరామంగా ప్రసారమైన రాజకీయ వ్యంగ్య కార్యక్రమ రచయిత శ్రీనివాసుగారే. ఆ కార్యక్రమానికి రెండుసార్లు నేషనల్ టెలివిజన్ అవార్డు దక్కడం విశేషం. పాత్రికేయుడిగా సేవ్ గర్ల్ చైల్డ్‌ అంశంపై తాను రూపొందించిన ప్రోమోకు UNICEF వారి నుంచీ అంతర్జాతీయ అవార్డు లభించడం అయన వృత్తి జేవితంలో మరో సంతృప్తి.

పాత్రికేయుడిగా ఒకెత్తయితే, తన కార్టూన్ల ద్వారా రెండు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ ఎంతో మంది స్నేహితులను సంపాదించుకోగలగడం ఎంతో ఆనందం కలిగిస్తోందన్నారు పైడి శ్రీనివాస్‌.

శ్రీ సీతారామారావు కొడాలి ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణ సంస్థలో పదవీ విరమణ చేశారు. వారు విజయనగరం వాస్తవ్యులు. సాహిత్యం అభిరుచి. ‘రామారావ్’ పేరిట కార్టూన్లు కూడా వేస్తారు. సామాజిక మధ్యమమైన ఫేస్ బుక్ లో ఇప్పటికే వారు 122 కి పైగా కార్టూనిస్టుల పరిచయాలు అందించడం విశేషం. మరి, శ్రీ పైడి శ్రీనివాస్ ఫేసు బుక్ అకౌంట్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

 

More articles

7 COMMENTS

  1. సీనియర్, జూనియర్ కార్టూనిస్టులందరికీ ఇష్టమైన కార్టూనిస్ట్ పైడి శ్రీనివాస్ గారు.
    అలాగే చక్కటి టైమింగ్ తో తెలుగు ప్రజలనలరించే కార్టూనిస్టులలో ముందు వరసలో ఉన్నారు. వారు ఇలాగే మూడు పంచ్ లు, ఆరు నవ్వులతో ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలని ఆశిస్తున్నా.
    వరప్రసాద్, ఆర్టిస్ట్, కార్టూనిస్ట్. హైదరాబాద్

  2. పైడి గారి కార్టూన్లంటే సైలెంట్ గా ఉండే కేరక్టర్ లు వైలెంట్ గా ఉండే పంచులు.
    అంతేకాదు వైరల్ కూడా అలాగే అవుతాయి.
    ఎప్పటికప్పుడు సమయానుకూలంగా కార్టూన్ లు పేల్చే కార్టూనిస్ట్ లలో శ్రీ పైడి గారు ఒకరు.
    వారికి అభినందనలు.శ్రీ సీతారామారావు గారికి,శ్రీ రమేష్ బాబు గారి కి ధన్యవాదాలు

  3. అవును. చాలా వాట్సాప్ గ్రూప్ ల్లో పైడి శ్రీనివాస్ గారి కార్టూన్లు గత కొంత కాలంగా విరివిగా వైరల్ అవుతున్నవి.
    కార్టూన్లలో గల వీరి రైటప్ పాఠకులను విపరీతంగా నవ్విస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article