Editorial

Monday, December 23, 2024
ఆరోగ్యంమార్కెట్ ఆరోగ్యమే మన మహాభాగ్యం - భువనగిరి చంద్రశేఖర్

మార్కెట్ ఆరోగ్యమే మన మహాభాగ్యం – భువనగిరి చంద్రశేఖర్

 

మానవ హక్కుల నేత, న్యాయవాది శ్రీ భువనగిరి చంద్రశేఖర్ లేని లోటు అడుగడుగునా తెలుస్తూనే ఉంది. ముఖ్యంగా ఈ కరాళపు కరోనా కాలంలోవైరస్ ని మించి క్రూరంగా ప్రాణాంతకంగా తయారైన రాజకీయ, ఆర్థిక వ్యవస్థలని, అందలి ప్రజా వ్యతిరేక కోణాల్ని విశ్లేషించి, వివరించే వారి లోటును మిత్రులు గుర్తు  చేసుకుంటూనే ఉన్నారు. అల్లోపతీ వైద్య విధానం గురించి పదేళ్ల క్రితం సండే ఇండియన్ లో ప్రచురణకి చంద్ర శేఖర్ గారు పంపిన ఈ నోట్ తన వంటి మేధావుల ఆవశ్యకతని బలంగా తెలియజేబుతోంది. సీనియర్ జర్నలిస్టు నరేష్ నున్నాఫేస్ బుక్ లో దీన్ని పంచుకుని వారిని తలుచుకోవడంతో మరోసారి చంద్రశేఖర్ స్మృతులు, నేటి దుర్మార్గ వైద్య వ్యవస్థా ఆలోచనల్లోకి వచ్చింది.

‘ఆరోగ్యమే నా జన్మహక్కని చాటండి”

భువనగిరి చంద్రశేఖర్

‘ఏ ఆరోగ్యం ? ఆయుర్వేదం, ఆకుపసర్లు, యూనానీలతో వచ్చే ఆరోగ్యమా?’ కాదు. ‘హోమియోపతితో వచ్చే ఆరోగ్యమా?’ కానే కాదు. అల్లోపతీతో వచ్చే ఆరోగ్యమే మన హక్కు. ‘అలా అని రాజ్యాంగంలో రాసి ఉందా?’ లేదు. కానీ ఇప్పుడు రాజ్యాంగం మార్కెట్ రెండూ ఒకటే. జీవించే హక్కులో భాగమైన ఆరోగ్యంగా జీవించే హక్కు మాత్రం ఆల్లోపతి మార్కెట్టుదే. అన్ని 108 దారులూ అల్లోపతి ఆస్పత్రులకే.

ప్రతియేటా ఐరాస, ప్రపంచబ్యాంకులు తయారుచేసే మానవ అభివృద్ధి నివేదికలో మనదేశం వెనుకబడే ఉంటుంది. ఒక దశాబ్దం క్రితం అలాంటి నివేదికలో హెల్త్ ప్రొఫైల్ లో మనది 128వ స్థానం. ఇలాంటి నిచ్చెనమెట్ల సూచికల్లో అమెరికా, కెనడా, యూరోపియన్ దేశాలు మొదటి పది పదిహేను స్థానాలను ఆక్రమిస్తాయి. ఇక మన దేశం పై వత్తిడి పెరుగుతుంది. ఆ నిచ్చెనలో పైకి ఎగబాకేందుకు మనల్ని రుణగ్రస్తుల్ని చేస్తారు. విక్రమాదిత్యుడి సింహాసనం మెట్లదారిలో ఉన్న సాలభంజికల కథల చిక్కుముడులు విప్పితేనే మనల్ని ఒక్కోమెట్టు ఎక్కనిస్తారు. అందుకోసం వేలకోట్ల రుణాలు తెచ్చి మనల్ని మనం పాశ్చాత్యీకరించుకోవాలి.

 

ఆరోగ్య సూచికలో స్థానాన్ని బట్టి ఆయా దేశాల్లో ప్రజలు ఆరోగ్యాన్ని అంచనా వేద్దాం అని ఎవరైనా అనుకుంటే పొరపాటే. సూచికలకూ, ఆరోగ్యానికి సంబంధం కంటే సూచికలకూ, ఆరోగ్య మార్కెట్టుకూ సంబంధమే ఎక్కువ.

ఆరోగ్య సూచికలో స్థానాన్ని బట్టి ఆయా దేశాల్లో ప్రజలు ఆరోగ్యాన్ని అంచనా వేద్దాం అని ఎవరైనా అనుకుంటే పొరపాటే. సూచికలకూ, ఆరోగ్యానికి సంబంధం కంటే సూచికలకూ, ఆరోగ్య మార్కెట్టుకూ సంబంధమే ఎక్కువ. తలసరి ఏడాదికి డాక్టర్లకు, మందులకు ఎంత ఖర్చు పెడుతున్నారు అన్న ప్రశ్నకు సమాధానాన్ని బట్టి ఆరోగ్య సూచికలో పాయింట్లుంటాయి. అమెరికాలో తలసరి ఏడువేల డాలర్లకు పైగా ఖర్చు పెడతారు. కాబట్టి అమెరికా పై ఎత్తున ఉంటే, మనం 45 డాలర్లు ఖర్చు పెడుతున్నాం కాబట్టి మనం ఏ 90వ స్థానంలోనో వందో స్థానంలోనో ఉంటాం.

మనకు జలుబు చేస్తే శొంఠివాడి తగ్గించుకుంటే లాభం లేదు. పుండ్లకు పసుపురాసి నయం చేసుకుంటే, కలబందను యాంటీ సెప్టిక్ గా వాడుకుంటేనో, కామెర్లకు ఆకుపసర్లు వాడితేనో మనకు పాయింట్లురావు. ఆహారపు అలవాట్లను మార్చుకునో, వ్యాయామం చేసో ఆరోగ్యాన్ని కుదుటపర్చుకుంటే పాయింట్లు సున్నా. మన గతి ఆరోగ్య సూచిక నిచ్చెన మెట్లలో అథోగతే.

ఆ అథోగతిని తప్పించుకోవడానికి, ఆ నిచ్చెనమెట్లు ఎక్కడానికి మనం ప్రతి చిన్న సమస్యకూ అల్లోపతి డాక్టర్ దగ్గరకు వెళ్ళి కన్సల్టేషన్ ఫీజు చెల్లించి, పరీక్షల ఖర్చులు భరించి జర్మన్, అమెరికన్ డ్రగ్ కంపెనీల యాంటిబయటిక్ మందుల లాంటివి భారీగా వాడితేనే సూచికలో ముల్లు కదులుతుంది. మన జేబు ఖాళీ అయితేనే మార్కెట్ సాలభంజిక పై మెట్టెక్కనిస్తుంది. ఐరాస అభినందిస్తుంది.

అలా ఎక్కేకొద్దీ మన ఆర్థికవ్యవస్థ ఆరోగ్యం కునారిల్లుతుంది.. దేశీయ వైద్యం అటకెక్కుతుంది. మన అథోగతే మార్కెట్ పురోగతి అదే అభివృద్ధికి అసలు అర్థం.

More articles

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article