Editorial

Wednesday, January 22, 2025
Peopleదాము ఒక రివల్యూషనరీ - పాతర వేసిన నిజాలు తెలుపు

దాము ఒక రివల్యూషనరీ – పాతర వేసిన నిజాలు తెలుపు

తాను చాలా నిశ్శబ్దంగానే పని చేశారు. ఐతే, నాడు దాము ప్రవాహ గానానికి మునికృష్ణ ముందుమాట ఎలా మందుపాతర అయిందో నేడు నయీం డైరీస్ కి దాము దర్శకత్వం మరో పెను విస్పోటనం.

కందుకూరి రమేష్ బాబు

త్వరలో విడుదల కానున్న ‘నయీం డైరీస్’ దర్శకుడు దాము బాలాజీతో తెలుపు టివి ముఖాముఖి అనేక వాస్తవాలను వెల్లడి చేస్తున్నది. చర్చకు తావిచ్చేలాగా ఉన్నది.

సామాన్యంగా మొదలైన నయూం అంచెలంచెలుగా ఎదిగి ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకోవడం వెనకాల రెండిటి లొసుగులూ ఉన్నై. ఒక ప్రత్యామ్నాయ వ్యవస్థగా ఎదిగిన అప్పటి పీపుల్స్ వార్ ఉద్యమం ఉన్నది. నిరంకుశ వ్యవస్థగా కొసదేలిన రాజ్య వ్యవస్థా ఉన్నది. ఈ రెండిటి  లొసుగులను, వైఫల్యాలను నిశితంగా ఎండగట్టె సినిమాగా దాము అన్న ఒక రివల్యూషనరీ ప్రయత్నం ఒక నిశ్శబ్ద విస్పోటనంగా ఉన్నది.

ఈ సినిమా ఆ హంతకుడు గురించి అతడి వెనకాల అమానుష హంతక వ్యవస్థ గురించేగాక  దర్శకుడి ఉద్యమ చేతన గురించి, ఆతడి వ్యక్తిత్వం గురించి కూడా తెలుపుతున్నది. అతడి కవి హృదయం అరాచకత్వనాన్ని దర్శించడం, కార్యకారణాలను ప్రదర్శింప జేయడం కూడా. అందుకే  నయూం విషయంలో ఇంతదాకా నెలకొన్న మౌనాన్ని బట్ట బయలు చేసే ప్రయత్నంగా ఈ సినిమా నిలిచే అవకాశం ఉందని వారితో ఈ ఉదయం మాట్లాడాక అనిపించినది.

Nayeem is the Monster created, unleashed and destroyed by the bigger monster  – The State.

తెలంగాణ ప్రభుత్వమూ అంతే!

ప్రభుత్వం తయారు చేసిన హంతక ముఠాకు నేతృత్వం వహించిన నయీం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటయ్యాక ఎన్ కౌంటర్ లో మరణించారు. ఐతే, అతడికి పోలీసులకు ఉన్న సంభందాలను బట్ట బయలు చేసే స్థితిలో రాష్ట్రం ప్రభుత్వం లేకపోవడం విషాదం కాదు, నేరమే. ఆ విషయాన్ని దాము అంగీకరించారు.

గత ప్రభుత్వాల మాదిరిగా తెలంగాణ ప్రభుత్వం నయూంను వాడుకోలేదు గానీ అతడికీ – ప్రభుత్వానికి, రాజకీయ నేతలకూ ఉన్న నెక్సస్ ని బయట పెట్టే ప్రయత్నాలు చేయకపోగా, చట్ట పరంగా అతడి కేసును నీరు గార్చే విధంగా ప్రవర్తిస్తోందని, అది మరో పెద్ద నేరంగానే చూడాల్సి వస్తుందని ఆయన నేటి ముఖాముఖిలో స్పష్టంగా చెప్పారు. ఈ అంశంతో సహా తన సినిమా ఇప్పటిదాకా ఎవరూ ఊహించని అనేక వాస్తవాలను తేట తెల్లం చేస్తుందని కూడా ఆయన అన్నారు.

ప్రవాహ గానమూ – దామూ

నయీం డైరీస్ మరెవరో దర్శకత్వం వహిస్తే ఇంత ప్రాధాన్యత ఉండేది కాదు. దర్శకులు బాలాజీ దాము పేరుతో కవిగా ప్రసిద్దులు. దాము అలియాస్ బాలాజీ అప్పటి పీపుల్స్ వార్ పార్టీలో ఐదేళ్ళు పూర్తికాలం రివల్యూషనరీగా పని చేశారు. రాడికల్స్ స్టూడెంట్ యూనియన్ కి (ఆర్ ఎస్ యూ) వారు అధ్యక్షుడిగా పని చేశారు. అంతకు ముందు పౌరహక్కుల కోసం పోరాడారు. కార్మికుల కోసం కూడా పని చేశారు. అనుకోకుండా అరెస్టయి ఎనిమిది నెలలు జైలు జీవితం గడిపడం వారి జీవితంలో ఒక పెద్ద మలుపు. వారు జైలులో ఉన్నప్పడే తన కవితా సంకలనం ‘ప్రవాహ గానం’ విడుదలై పెను సంచలనం సృష్టించింది. నిజానికి ఆ కవితలు జైలులో రాసినవి కావుగానీ, తానే అన్నట్టు అతడి కవిత్వం విప్లవ కవిత్వమూ అని చెప్పలేము గానీ విప్లవాత్మకమైన మనిషి వ్యక్తీకరణకు దాఖలా ఆ సంపుటి. విశేషం ఏమిటంటే, ఆ సంపుటికి మునికృష్ణ రాసిన ‘ముందుమాట’ ఆ కవిత్వం మందుపాతరలా పేలడానికి అసలు కారణమైంది. అందుకు మరో ముఖ్య కారణం దాము కవిత్వంలో ఒక విప్లవ కారుడి నిబద్దత, నిమగ్నత మాత్రమే కాక అతడిలో ఒక అరాచకుడు ఉన్నాడు. విమర్శకులు అఫ్సర్ అన్నట్టు అతడి కవిత్వంలో కనిపించే అరాచక విధ్వంసక ధోరణి ఒకటున్నది. అలాగే అతడిలో ఉన్మత్త ప్రేలాపనలూ ఉన్నాయ్.  ఒత్తిడి, ఒంటరితనం, మృత్యు బీతి, నేరవేరని ఆశయాల స్రవంతి, యవ్వన ఉద్రేకమూ, ఉద్యమ  కర్యాచరణా – వెరసి ఒక యువకుడి అంతరంగ ప్రవాహ దర్శనం అది.

చెప్పదల్చుకున్నది ఏమిటంటే, సరిగ్గా నాడు తన కవితా సంపుటికి ముందుమాట ఎట్లా అతడిని సంచలనంగానే ఐనప్పటికీ తనని వాస్తవికంగా సమాజానికి పరిచయం చేసిందో నేడు తాను దర్శకత్వం వహిస్తున్న ‘నయీం డైరీస్’ అందరూ మరచిపోయిన ఒక మాజీ నక్సలైట్ పరిణామ క్రమాన్ని అంతే సంచలనంగా, వాస్తవికంగా చూపడం విశేషం.

ఐనప్పటికీ ఇద్దరు మాజీ నక్సలైట్ల విషయం తెలుపు సినిమా ఇది. ఆ ఇద్దరు మాజీ నక్సలైట్లకూ జైలు జీవితం ఉన్నది. నేడిప్పుడు ఒకరు పాత్ర, మరొకరి వ్యవస్థలో విక్టిమ్ ఐన పాత్రను తెలిపే దర్శకులుగా మారారు.

ఐతే, తనలోని అరాచకత్వం వేరని, నయూంకి తనకూ ఉన్న తేడా వేరే అని వారు తెలుపుకి ఇచ్చిన ముఖాముఖిలో వివరించారు. ఐనప్పటికీ ఇద్దరు మాజీ నక్సలైట్ల విషయం తెలుపు సినిమా ఇది. ఆ ఇద్దరు మాజీ నక్సలైట్లకూ జైలు జీవితం ఉన్నది. ఇద్దరూ ప్రజా స్రవంతిలో సంచలనం సృష్టించిన వారే. నేడిప్పుడు ఒకరు పాత్ర, మరొకరి వ్యవస్థలో విక్టిమ్ ఐన పాత్రను తెలిపే దర్శకులుగా మారారు.

ఇదిలా ఉంటే, ఉద్యమ జీవితం అనంతరం సినిమా నిర్మాణాన్ని సీరియస్ గా తీసుకున్న దాము బాలాజీ గతంలో డ్రీమ్స్ అన్న సినిమాకు దర్శకత్వం వహించారు. రాం గోపాల్ వర్మ సినిమా కిల్లర్ వీరప్పన్ కు రచనా సహకారం అందించారు. ఈ నెలాఖరు లేదా వచ్చేనెలలో ‘నయీం డైరీస్’తో మన ముందుకు వస్తున్నారు. ఈ సందర్భంగా వారు సినిమా గురించిన అనేక విషయాలను వివరించారు.

అన్నిటికన్నా ముఖ్యగా ఏడేళ్ళ జైలు జీవితమే నయూంను అత్యంత కిరాతకుడిగా, నరరూప రాక్షసుడిగా మార్చిందని దాము చెభుతున్నారు. అలాగే పదహారేళ్ళు ఒక బలమైన ఉద్యమ పార్టీని డీకొని బతకడం అంటే మాటలు కాదని, అంతటి క్రమశిక్షణ తాను పార్టీ నుంచి నేర్చుకున్నదే అని చెప్పారు. అందరూ భావిస్తున్నట్టు ముఖ్యంగా మీడియా ప్రాచుర్యంలో పెట్టినట్టు అతడు విమెనైజర్ కాదు, ఆల్కహాల్ కాదు కదా… సిగరెట్టూ కూడా ముట్టని విషయం చెబుతూ పిల్లలను లైంగికంగా వాడుకున్నది అబద్దం అని, అతడిని పీపుల్స్ వార్ హతమార్చకుండా ఉండేందుకే మహిళలు, పిల్లలతో రక్షణ వలయం ఏర్పాటు చేసుకున్నారని వివరించారు. అది కూడా పార్టీ అవలంభించే ఒక జాగ్రత్తను తాను సానుకూలంగా వాడుకున్న వైనమే అని చెప్పారు. ఇది అతడి వ్యక్తిగత విషయం ఐతే అతడు రాక్షసుడిగా మార్చిన వైనం అంతా అమానుషమైనదని, అడుగడుగునా, ప్రతి మలుపులో అతడిని విధి వెంటాడింది అన్నారు. ‘విధి’ గురించి అతడి అభిప్రాయం యూ ట్యూబ్ లో వినండి.

జైలే ఒక నక్సల్బరి

జైలులో ఉన్న అప్పటి పీపుల్స్ వార్ నలుగురు అగ్ర నేతలు, ముషీరాబాద్ జైలు లోని ప్రత్యేక బారక్ లు, రోజువారీగా రాజకీయ ఖైదీలు నిర్వహించుకునే అక్కడి  తరగతులు, వారు ఏర్పాటు చేసిన కార్య నిర్వాహక నిర్మాణాలు తదితర విషయాలను పూసగుచ్చినట్టు సినిమాలో చూపిస్తూ, ఆ అగ్ర నేతలు తీసుకున్న ఒక పొరబాటు నిర్ణయం ఎట్లా నయీంను అకస్మాత్తుగా నక్సలైట్ వ్యతిరేకిగా మార్చివేసిందో తెలిపామన్నారు.

అదే కీలకమైన మలుపు కాగా  నక్సలైట్ ఖైదీలపై ఒక కన్ను వేసి పెట్టిన పోలీసులు అదే అదనుగా తీసుకుని అతడిని లోబర్చుకోవడం మరో మలుపు. ఇక అక్కడి నుంచి మరిన్ని మలుపులు. హత్యలు, సినిమా పొడవునా బీతివాహ జీవితం. అతడు హతమయ్యేదాకా అన్ని వివరాలను సినిమాలో చూపామన్నారు. కాగా, నయీం జీవితంలోను, ఈ సినిమాలోనూ జైలు జీవితం ఒక ముఖ్య పాత్ర వంటిదని, ఆ అంశం ఎంతటి ప్రాధాన్యం వహించిందో వివరంగా చాలా మందికి తెలియదని అన్నారాయన.

బెల్లి లలిత – ఒక వాస్తవం

నిజ జేవితంలో అత్యంత పాశవికంగా హతమార్చిన బెల్లి లలిత  గురించి చెబుతూ ఆ ఘట్టాలను అంతే దారుణంగా సినిమాలో చిత్రీకరించాల్సి వచ్చిందన్నారు. అదే సమయంలో ఆమె పట్ల ఇప్పటిదాకా వెల్లడి కాని ఒక వాస్తవాన్ని, తన పరిశోధనలో గ్రహించిన ఆ ముఖ్య అంశాన్ని సినిమాలో చూపించామన్నారు. ‘తెలంగాణా కోకిల’గా పేరున్న ప్రజా గాయని బెల్లి లలితను పద్దెనిమిది ముక్కలుగా నయూం గ్యాంగ్ నరకడం తెలిసిందే. ఆ హత్య సృష్టించిన భయోత్పాతం ఇంత అంతా కాదని నాటి రోజులు యాదికి ఉన్నవారందరికీ తెలిసిందే.

అట్లే, పౌరహక్కుల పురుషోత్తం, ఆజం అలీ మొదలు ఇతర ప్రజా సంఘాల నేతల హత్యల గురించి అడిగిన ప్రశ్నలకు కూడా దాము బలాజీ సమాధానం ఇచ్చారు.

తెలంగాణ సినిమా!

ఐతే, ఈ సినిమా ఇతివృత్తం, కార్యక్షేత్రం తెలంగాణ కావడం వల్ల దీన్ని తెలంగాణా సినిమాగా కూడా చూడవచ్చేమో! ఐతే, నిజానికి ఒక తెలంగాణేతర వ్యక్తి మాత్రమే ఇటువంటి సినిమా తీయగలరు. నిజానికి అన్ని హత్యలు చేసిన వ్యక్తిలోని మంచితనం తెలంగాణ సమాజం చూసే స్థితిలో కూడా లేదు. కానీ చూడవలసిన ఆవశ్యకత ఉందని, పోలీస్ ఇన్ఫార్మర్ గా, హంతక ముఠా నాయకుడిగా నయీం పరిణామ క్రమానికి గల అసలు కారణాలు, ఇప్పటిదాకా వెల్లడి కాని నిజాలు బట్ట బయలు కావలసి ఉందని దాము అన్నారు.

నయీం డైరీస్’ ఆ దిశలో మొట్టమొదటిసారిగా అనేక విప్లవాత్మకమైన విషయాలు ప్రేక్షకుల వద్దకు తెస్తోందని, ఈ సినిమా సాధారణ ప్రేక్షకులకు ఆసక్తిగానూ సమాజం పట్ల బాధ్యత గల వారికి ఆలోచనాత్మకంగానూ ఉంటుందని అన్నారు.

ఆ విషయంలో సరియన కథనాలు ఇప్పటిదాకా అచ్చుకాలేదని, అందుకే తాను ఈ సినిమా కోసం ఒక పరిశోధనాత్మక విలేకరిగా పనిచేయవలసి వచ్చిందన్నారు. వాటి గురించి చెబుతూ ‘నయీం డైరీస్’ ఆ దిశలో మొట్టమొదటిసారిగా అనేక విప్లవాత్మకమైన విషయాలు ప్రేక్షకుల వద్దకు తెస్తోందని, ఈ సినిమా సాధారణ ప్రేక్షకులకు ఆసక్తిగానూ సమాజం పట్ల బాధ్యత గల వారికి ఆలోచనాత్మకంగానూ ఉంటుందని అన్నారు.

మౌనాన్ని చేదించే సినిమా

ఒక్క మాటలో నయీంకి సంభందించిన మౌనాన్ని చేదించి, అటు ఉద్యమ కారుల జైలు జీవితం, అక్కడి నుంచి ప్రభుత్వం అతడిని కోవర్ట్ గా మార్చడం, ఆ తర్వాత తను ప్రజా సంఘాల నేతలను హతమార్చే ఆయుధంగా మారడం, ఈ క్రమంలో ఇటు ప్రభుత్వం, అటు అప్పటి పీపుల్స్ వార్ పార్టీ లొసుగులను, పోలీసు అధికారుల సన్నిహితత్వాన్ని చూపిస్తూ ఇప్పటికైనా సిసలైన వాస్తవికతను ఆవిష్కరించడం కోసం ఈ సినిమా తీశానని అయన అన్నారు.

వర్మ సాధారణంగా ఇలాంటి పాత్రలతో వ్యక్తి విధ్వంసాన్ని ఆవిష్కరించాలనుకుంటే తాను వ్యవస్థలో ఒక మనిషి విధ్వంసకుడిగా ఎలా మారాడన్నది చూపానని, ఒక్కమాటలో తన సినిమా యాంటి ఎస్టాభ్లిష్ మెంట్, యాంటి స్టేట్, యాంటి పోలీస్ వైఖరితోనే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

విశేషం ఏమిటంటే, ఈ ముఖాముఖీ దర్శకుడి దాము వ్యక్తిత్వాన్ని, కవిగా అయన మూర్తిమత్వాన్ని కూడా స్వల్పంగా తడుముతుంది.

అన్నట్టు, ఈ సినిమాను ముందు రాం గోపాల్ వర్మ నిర్మించాలనుకున్నప్పటికీ అది కార్యరూప ధరించక పోవడంతో తానే ఆ సినిమా రూపొందించారు. ఐతే, వర్మ సాధారణంగా ఇలాంటి పాత్రలతో వ్యక్తి విధ్వంసాన్ని ఆవిష్కరించాలనుకుంటే తాను వ్యవస్థలో ఒక మనిషి విధ్వంసకుడిగా ఎలా మారాడన్నది చూపానని, ఒక్కమాటలో తన సినిమా యాంటి ఎస్టాభ్లిష్ మెంట్, యాంటి స్టేట్, యాంటి పోలీస్ వైఖరితోనే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. “NO MONSTER HAS EVER BEEN BORN ON IT’S OWN” అన్నది అందుకే అని చెప్పారు.

Please subscribe Telupu Tv యూ ట్యూబ్ ఛానల్.
అతి త్వరలో పూర్తి ఇంటర్వ్యూ విందురు గానీ…

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article