చాలా కాలం తర్వాత కళ్ళతో బాటు మేధకి, బుద్దికీ కూడా మేత.
నరుకుర్తి శ్రీధర్
ఈ సినిమా హిస్టారికల్ ఎపిక్ కాదు. ఈ సినిమాని పొలిటికల్ థ్రిల్లర్ అనవొచ్చేమో! అసలు హిస్టరీ ని ఎటువంటి ఫిక్షన్ లేకుండా మూడు గంటల పాటు ఆకట్టుకునే సినిమాగా తీయలేము. దానికి docu-drama ఫార్మాట్ బెటర్ ఆప్షన్. ఈ సినిమాలో మనల్ని కట్టిపడేసేది తర్వాత ఏమి జరుగుతుందో అనేది కాదు. ఈ పాత్రలు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాయనే enigma సీట్లకి అతుక్కునేలా చేస్తుంది.
అకీరా కురొసావా మూవీస్ చూసారా? యుద్ధంలో పరుగెత్తే గుఱ్ఱం కదనుతొక్కే కవిత్వంలా ఉంటుంది. యుద్దం అందం, బీభత్సం కూడా. అది శరీర భాగాలు తెగిపడిన జంతువుల, నిస్సహాయులైన మనుషుల విషాదాంత నాటకం. రాజమౌళి సినిమాల్లో అది ధర్మం కోసం చేసేది. రాజమౌళి యుద్దంలో ఆ విషాదం కనబడదు. మణిరత్నం కురొసావాని అనుసరించాడు. ఆదిత్య కరికాలుడుకి యుద్ధం ఒక వ్యసనం. తనని తాను కోల్పోవడానికి కల్పించుకున్న సాధనం. అది ఒక దుఃఖం నుంచి ఇంకో దుఃఖం లోకి ప్రయాణం.
అకీరా కురొసావా సినిమాల్లో సమురాయ్ చేసే యుద్ధం బయట కన్నా ఆంతర్యం లోనే ఎక్కువ. కరికాల చోళుడిలో ఆ conflict మనల్ని కురొసావా హీరోలు గుర్తుకొచ్చేలా చేస్తుంది. చాలా సన్నివేశాలు సెట్స్ లోనే చేసారు లాగుంది. Vfx కంటే సెట్స్ మీద కెమెరా మీద ఎక్కువ ఆధారపడటం వల్ల ఫ్రేమ్స్ లో కృతకత్వం తగ్గి richness పెరిగింది. ఆర్ట్ డైరెక్షన్, కెమెరా, దర్శకుడితో పూర్తిగా సింక్ అయ్యాయి. కొన్ని బలమైన సన్నివేశాలని నృత్యరూపకాలతో కవిత్వం లా మార్చేశాడు దర్శకుడు. కార్తి, శోభిత ధూళిపాల మధ్య చిత్రించిన నృత్యం అలాంటిదే. బహుశా పుస్తకంలోని కార్తి, త్రిషల మీటింగ్ ని సినిమా కోసం అలా జపనీస్ (Noh ధియేటర్ ) మ్యూజిక్ డ్రామా గా మార్చి ఉంటాడు. మళ్ళీ కురొసావా…
ఇది ఒకరి చేతిలో ఇంకొకరు చిక్కిన విచిత్ర ప్రపంచం. ఈ కథలో స్త్రీలే అసలు ఆటగాళ్ళు.
ఇందులో నాకు బాగా నచ్చినది స్త్రీ పాత్రలు. ఇందులో మగ పాత్రలన్నీ స్త్రీల అందం, తెలివి తేటల చేత బందింపబడి ఉంటే, స్త్రీలు పితృస్వామ్య వ్యవస్థ అనే పంజరం లో చిక్కుకుని ఉంటారు. ఇది ఒకరి చేతిలో ఇంకొకరు చిక్కిన విచిత్ర ప్రపంచం. ఈ కథలో స్త్రీలే అసలు ఆటగాళ్ళు. పురుషులు ప్రత్యర్థి శిబిరాల్లోని స్త్రీలు వేసే ఎత్తులకి అనుగుణంగా నడిచే పావులు. పడవ నడుపుకునే సముద్ర కన్యతో సహా అన్నీ బలమైన పాత్రలే.
మణిరత్నం కురొసావాని అనుసరించాడు.
ఇక కార్తి పాత్ర పాతాళభైరవి లో తోటరాముడిని గుర్తుకు తెస్తే, విక్రం కురోసవా మూవీస్ లోని తొషిరోని గుర్తుకు తెస్తాడు. ప్రకాష్ రాజ్ kurosawa ‘Ran ‘ మూవీ లో ముసలి రాజులా కనిపించినా శరీరం వడిలిపోతున్నా బుద్ధి మందగించని చక్రవర్తి.
ఆ కాలంలో శైవ వైష్ణవ conflict చూచాయగా టచ్ చేసి వదిలేశాడు దర్శకుడు. అంతకంటే ఎక్కువ చెప్పే సమయం లేదు. తనికెళ్ళ భరణి తెలుగు డబ్బింగ్ చాలా వరకూ బాగున్నట్లే. రెహ్మాన్ BGM నాకు నచ్చింది.
నవల చదవలేదు కాబట్టి సినిమా నవలకి న్యాయం చేసిందో లేదో తెలియదు. అయితే రెండువేల పేజీల నవలని చిత్రీకరించడానికి game of thrones లాంటి వెబ్ సిరీస్ మంచి మీడియం అయ్యుండేదేమో . అప్పుడే అన్ని పాత్రల పరిచయానికీ, కథావికాసానికి పూర్తి సమయం దొరికి ఉండేది. కొంతమంది అంటున్నట్లు కన్ఫ్యూషన్ ఉండేది కాదు.
పుస్తకం చదవక పోయినా సినిమాలో కన్ఫ్యూషన్ ఏమీ నాకు కలగలేదు. చాలా కాలం తర్వాత కళ్ళతో బాటు మేధకి, బుద్దికీ కూడా మేత దొరకడం వల్ల లోపాలు కొట్టుకుపోయాయి.
ప్రయాణాలతో పాటు సినిమా, ఫోటోగ్రఫీలు ఇష్టాలుగా గల నరుకుర్తి శ్రీధర్ విశాఖ స్టీల్ ప్లాంట్ లో డిప్యూటీ జనరల్ మేనేజర్ గా పనిచేస్తున్నారు.
ప్రసాద్ ఐ మాక్స్ లో చూద్దామని అరగంట క్రితమే టికెట్ బుక్ చేసుకున్నాం మా పిల్లల బలవంతం మీద.