సరాసరి సిరా నీళ్లు పారిస్తూ
శ్రద్ధగా కలంతో దున్ని
నాట్లు వేస్తాను అక్షరాల్ని
కాగితాల కమతాల్లో.
అడ్డదిడ్డంగా ఆగమాగంగా
మెదట్లోంచి వచ్చి చేరిన
పనికి మాలిన పదాల్ని
కలుపుతీస్తాను పొలాల్లో.
మూడు నెళ్ళకో ఆరు మాసాలకో
నా కవిత్వం అచ్చై వస్తే పత్రికలో
పంట చేతికి అందివచ్చినట్లు
కాంతులీనుతూ వుంటాను
ఏ ఆకలిగొన్న పాఠకుడో అది
ఆబ ఆబగా కళ్ళతో చదివేసి
మెదట్లో అరిగించుకుని
‘రైతన్నా! నీ కైత
నా మనసును కదిలించిందే’ అని చెబితే
సేద్యం పూర్తయి కాసేపు
సేదదీరుతాను మరో కాయిదం క’వన’ఛాయలో
అద్భుతమైన కవిత ఆబగా చదివాను. అరిగించుకున్నాను.
మనసు అరల్లో దాచుకున్నాను.
పేదవాడి కోసం మీరు చేసే సాహితీ సేద్యం… పీడిత తాడిత ప్రజలకు నైవేద్యం.