Editorial

Monday, December 23, 2024
కాల‌మ్‌‘నాకు నేను తెలిసే’ : ఈ వారం మంచి పుస్తకం

‘నాకు నేను తెలిసే’ : ఈ వారం మంచి పుస్తకం

‘మంచి పుస్తకం’ ఒక సంపద.
‘తెలుపు’ కోసం కొసరాజు సురేష్ అందిస్తున్న ఈ శీర్షికలో  ‘నాకు నేను తెలిసే’ నాలుగవది.

K Suresh

నా జీవితాన్ని ముఖ్యమైన మలుపులు తిప్పింది రవీంద్ర. వ్యవసాయ శాఖలో చేరిన తరవాత డెప్యుటేషన్‌పై హైదరాబాదు రావటానికి విజయవాడలో రవీంద్ర (1996 జనవరి 8న) యాదృచ్ఛికంగా కలవటమే కారణం. 2001లో ఎపిఆర్ఎల్‌పి ద్వారా రవీంద్ర కార్యదర్శిగా ఉన్న వాసన్ స్వచ్ఛంద సంస్థకి డెప్యుటేషన్ మీద వచ్చాను. 2006లో అంతిమంగా వ్యవసాయ శాఖకి రాజీనామా చేసినప్పుడు వాసన్ సంస్థలోనే చేరాను. తెలుగులో సరైన పదం దొరకటం లేదు, ‘మంచి పుస్తకం’ వాసన్ సంస్థలోనే ‘incubate’ అయ్యింది.

ఆ రవీంద్ర, అతని మిత్రుడు రామాంజనేయులు, ఇంకొంత మంది కలిసి ‘సైన్స్ ఫర్ పీపుల్’ అన్న పేరుతో పని చేద్దామనుకున్నారు. టెర్మినేటర్ విత్తనాలపై ఆ సంస్థ ప్రచురించిన ‘మృత్యు బీజాలు’ అన్న పుస్తకాన్ని నేను అనువదించాను. ఆ సంస్థ 2000లో ప్రచురించిన రెండవ పుస్తకం ‘నాకు నేను తెలిసే’ కూడా నేనే అనువాదం చేశాను. హిందీ లోంచి తెలుగులోకి నేను అనువదించిన కొద్ది పుస్తకాలలో ఇది ఒకటి.

‘రుతుస్రావం ప్రకృతి ధర్మం. మరి దీనితో అంటరానితనం ఎలా ముడిపడింది? స్త్రీ  అపవిత్రురాలు ఎలా అయ్యింది? స్రీని అణచివేసే కుట్రలో ఇది భాగం కాదు కదా?’ అన్న ప్రశ్నలను ఈ పుస్తకం లేవనెత్తుతుంది.

భోపాల్ లోని ఏకలవ్య సంస్థ ఆడపిల్లల కోసం రుతుస్రావంపై ‘బేటీ కరే సవాల్’ అన్న పుస్తకాన్ని ప్రచురించింది. దీనిని తెలుగులో ప్రచురిస్తే బాగుంటుందని రవీంద్ర ముందుకు వచ్చాడు. ఆ సమయంలో నేను అపార్డ్‌లో ఉన్నాను. దీనిని అనువాదం చేస్తున్న సమయంలో అపార్డ్‌కి శిక్షణకు వచ్చిన వాళ్లు ‘నాకు నేను తెలిసే’ అన్న పాట పాడగా విన్నాను. ఇది మా అందరికి చాలా నచ్చింది. ఆ పాట ఈ పుస్తకానికి అనువుగా ఉంటుందనిపించి వెనక అట్ట మీద వెయ్యటానికి సిద్ధం చేశాం. ఈ పాటని మొక్కపాటి సుమతి రాశారని అప్పట్లో బాలజ్యోతిలో (ఇప్పుడు డిఆర్ఎఫ్‌లో) పనిచేస్తున్న వాసిరెడ్డి శరత్ చెప్పాడు. ‘బేటీ కరే సవాల్’ అన్న పుస్తకం పేరుని తెలుగులోకి అనువదించటానికి బదులు ఈ పాట శీర్షిక బాగుంటుందనిపించి దానిని పెట్టాం. ఈ పుస్తకానికి ‘నాకు నేను తెలిసే’ అన్న పేరు ఎంతో నప్పింది. అయితే ఆ పాటని, ఆ పేరుని ఉపయోగించి ఎన్నో చేద్దామనుకున్నానని, తనకు చెప్పకుండా ఇలా చెయ్యటం బాగా లేదని సుమతి గారు బాధపడ్డారు. అప్పుడు ఆవిడని కలిసి క్షమాపణ చెప్పాను. ఇంత మంచి పేరు ఇచ్చినందుకు సుమతి గారికి ధన్యవాదాలు, మరోసారి క్షమాపణలు.

ముఖ చిత్రానికి హెచ్.బి.టి. గీత కూతురు లీల వేసిన బొమ్మను తీసుకున్నాం. ఇది కూడా పుస్తకానికి చాలా అందాన్ని ఇచ్చింది.

పుస్తకంలోకి వెళ్లే ముందు చిత్రకారిణి కారెన్ హెడాక్ గురించి కూడా చెప్పాలి. అమెరికాలో జీవ భౌతిక శాస్త్రంలో పిహెచ్‌డి చేసిన ఆమె భారత దేశంలో స్థిరపడ్డారు.

2000లో ముద్రించిన 3000 ప్రతులు అయిపోయిన తరవాత ఆ పుస్తకాన్ని విజ్ఞాన ప్రచురణలు ముద్రిస్తూ వచ్చింది. ఇప్పుడు ఇది మంచి పుస్తకం, విజ్ఞాన ప్రచురణల సంయుక్త ప్రచురణగా అందుబాటులో ఉంది.
అను గుప్తా ప్రధాన రచయిత్రిగానూ, కారెన్ హెడాక్ ప్రధాన చిత్రకారిణిగా  ఉన్న ఈ పుస్తక రూపకల్పనలో ఎంతో మంది పాల్గొన్నారు. పుస్తకంలోకి వెళ్లే ముందు చిత్రకారిణి కారెన్ హెడాక్ గురించి కూడా చెప్పాలి. అమెరికాలో జీవ భౌతిక శాస్త్రంలో పిహెచ్‌డి చేసిన ఆమె భారత దేశంలో స్థిరపడ్డారు. పిల్లల కోసం ఎన్నో పుస్తకాలకు, ఎన్నో పాఠ్య పుస్తకాలకు బొమ్మలు వేశారు. ఆమె కళాకారిణియే కాకుండా రచయిత్రి, బోధకురాలు కూడా. ఉపాధ్యాయ శిక్షణ, బోధనా పద్ధతుల రూపకల్పన వంటి రంగాలలో కృషి చేశారు. ఆమె బొమ్మలది ప్రత్యేక శైలి- నలుపు-తెలుపులో చక్కటి బొమ్మలు వేస్తారు. (Girl 21)

ఏమాత్రం సిగ్గు పడకుండా ప్రతి ఆడ పిల్లా ఈ పుస్తకం చేతిలో పట్టుకోవాలని బొమ్మలను ప్రత్యేకంగా వేశారని తెలిసిన తరవాత దీని విలువ అర్థమయ్యింది.

ఇందులో మొత్తం అయిదు అధ్యాయాలు ఉన్నాయి. రెండవ అధ్యాయం రుతు చక్రం గురించి పూర్తి సమాచారాన్ని ఇస్తుంది. అయితే, శరీర నిర్మాణం గురించి అన్ని పుస్తకాలలో ఉండే బొమ్మలు ఇందులో లేవని నాకు మొదట అనిపించింది. ఏమాత్రం సిగ్గు పడకుండా ప్రతి ఆడ పిల్లా ఈ పుస్తకం చేతిలో పట్టుకోవాలని బొమ్మలను ప్రత్యేకంగా వేశారని తెలిసిన తరవాత దీని విలువ అర్థమయ్యింది. మూడవ అధ్యాయంలో రుతుస్రావానికి సంబంధించి ప్రశ్నలూ, సమస్యలూ ఉన్నాయి.

రుతుస్రావానికి సంబంధించి మూఢనమ్మకాల గురించి నాల్గవ అధ్యాయం ప్రస్తావిస్తుంది. ‘రుతుస్రావం ప్రకృతి ధర్మం. మరి దీనితో అంటరానితనం ఎలా ముడిపడింది? స్ర్తీ అపవిత్రురాలు ఎలా అయ్యింది? స్రీని అణచివేసే కుట్రలో ఇది భాగం కాదు కదా?’ అన్న ప్రశ్నలను ఈ పుస్తకం లేవనెత్తుతుంది. అయితే ఈ మూఢ నమ్మకాలు ఆడవాళ్లల్లో బలంగా నాటుకుపోయి వాటిని ప్రశ్నించాలన్నా, ఉల్లంఘించాలన్నా భయపడిపోతారని, జీవితంలో 35-40 సంవత్సరాల పాటు ఈ మచ్చని భరిస్తూ ఉంటారని, తమ వ్యక్తిత్వాన్నే కాక మొత్తంగా స్త్రీ జాతినే తృణీకరిస్తారని పేర్కొంటుంది.

ఎదుగుతున్న ఆడపిల్లలకు ‘నాకు నేను తెలిసే’ అన్న ఈ పుస్తకం ఎంతో విలువైనది. ఈ అంశాల మీద చాలానే పుస్తకాలు ఉన్నాయి కానీ విషయ వివరణ, హేతుబద్ధతలలో వీటికి మించిన పుస్తకాలను నేను ఇప్పటివరకు చూడలేదు.

మొదటి అధ్యాయం (‘నువ్వు పెద్దదానివవుతున్నావు’) స్త్రీల శరీరాలలో ఎదుగులతో వచ్చే మార్పులను తెలియచేస్తుంది. ఇక చివరి అధ్యాయం కౌమార దశకు సంబంధించిన మరికొన్ని సమస్యలను ప్రస్తావిస్తుంది.

అన్ని అధ్యాయలలో పిల్లల అనుభవాలను వాళ్ల మాటల్లోనే ఇచ్చారు.

పుస్తకాల అనువాదంలో అవసరం అయినప్పుడల్లా పాద సూచికలు ఇవ్వటం ‘గడ్డిపరకతో విప్లవం’ తోనే మొదలయ్యింది. పుస్తకం చివరలో పారిభాషిక పదజాలం ఇవ్వటం ఈ పుస్తకంతో మొదలయ్యింది. డా. జతిన్ అనువాదం చేసిన ‘మీ శరీరం’ (రచయిత్రి క్లేర్ రేనర్) పుస్తకం పిల్లలకు శరీరం గురించి పరిచయం చేస్తుంది. దానికి తోడుగా ఎదుగుతున్న ఆడపిల్లలకు ‘నాకు నేను తెలిసే’ అన్న ఈ పుస్తకం ఎంతో విలువైనది. ఈ అంశాల మీద చాలానే పుస్తకాలు ఉన్నాయి కానీ విషయ వివరణ, హేతుబద్ధతలలో వీటికి మించిన పుస్తకాలను నేను ఇప్పటివరకు చూడలేదు.

కాలమిస్టు పరిచయం

పాఠకుల అభిరుచికి పెద్దపీట వేయడం కారణంగా కొసరాజు సురేష్ గారు మంచి అనువాద పుస్తకాలు అందించిన ఘనతని మాత్రమే సొంతం చేసుకోలేదు, వారు ‘మంచి పుస్తకం’ ప్రచురణ సంస్థ ట్రస్టీగా వందలాది పుస్తకాల భండాగారాన్ని తెలుగు పాఠకులకు అందించి మనల్ని సంపద్వంతం చేశారు. వారి అనువాదాల్లో గడ్డికపరకతో విప్లవం మొదటిదైతే బాబోయ్:బడి! రెండవది. ‘సందిగ్ధ’ మూడవది. మీకు పరిచయం చేసిన పై పుస్తకం నాలుగవది. చిన్నవి పెద్దవి కలిపి వారువంద పుస్తకాల దాకా తెలుగు పాఠక ప్రపంచానికి అనువదించి ఇచ్చారు, అందులో అత్యధిక ప్రజాదరణ, పలు ముద్రణలు పొందిన పాలో కోయిలో తాత్వక గ్రంథం ‘పరుసవేది’ని మీరు చదివే ఉంటారు. దాంతో పాటు హృదయాలను మండించే పెరుమాళ్ మురుగన్ ‘చితి’ కూడా వారు అనువదించినదే. ‘మంచి పుస్తకం’ శీర్షిక పేరిటే వారు మిగతా పుస్తకాలను కూడా వారానికి ఒకటి మీకు పరిచయం చేస్తారు. 

More articles

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article