“జనని జన్మ భూమిశ్చ స్వర్గాదపి గరీయసీ”
“జనని,జన్మ భూమి స్వర్గం కంటే గొప్పవి”నాకు ఊహ తెలిసినప్పటి నుండి నాకు జన్మనిచ్చిన మా అమ్మ, నా జన్మను ఆహ్వానించిన నా ఊరు నాకు ఎంతో ప్రీతిపాత్రమైనవి.
సయ్యద్ షాదుల్లా
సిరిసిల్ల జిల్లా పరిధిలో వస్తుంది మా ఊరు నారాయణపురం. చిన్న గ్రామమైనా అందంగా పొందికగా ఉంటుంది. రామాలయం పక్కనే కోనేరు, కోనేటిలోనే మా వేసవి సెలవులు గడిచిపోయేవి. అక్కడి నుంచి కిలో మీటర్ దూరంలో మానేరు వాగు నిరంతరం పారేది. అందులోని మడుగుల్లోనే ఈత నేర్చుకున్నాము.
ఇసుకలో గవ్వలు ఏరుకునే వారము. ఒక కాలుపై ఇసుక నింపి గుట్టలా చేసి మెల్లగా కాలు బయటకు లాగితే ఇసుక గూడు అయ్యేది. అదో అందమైన అనుభూతి. ఆక్షణాన మాకు తెలియదు మేమూ భవిష్యత్తులో గూడొకటి కట్టుకుంటామని.
మామిడి తోటల్లో మామిడి కాయలు కోసుకుని వెంట ఇంటి నుంచి పేపర్‌లో పొట్లం కట్టి తెచ్చుకున్న ఉప్పు కారం అద్దుకుని తినేవారం. మామిడి పండ్లను కోసుకుని తినడం, ఈత పండ్లు, తాటి ముంజలు అబ్బ ఎంత లేతవో, ఎంత తీయనివో?
మా ఊరు పక్కనే మంగళాలయ కాలువ. అదే మాకు సహజ అక్వేరియం. అందులో చిన్న చిన్న చేపలు గుంపులు గుంపులుగా సభలు సమావేశాలు జరిపినట్లు, మనషులకంటే క్రమశిక్షణతో తిరిగేవి. మేం వాటికి ఆప్తులమన్నట్టు మా అలికిడి వినగానే మా వేపు తోసుకుని వచ్చి విభిన్న విన్యాసాలు చేసి మమ్మల్ని అలరించేవి. మా కాళ్ళు నీళ్ళలో పెడితే అవి మా కాళ్ళను కొరుకుతుంటే ఇప్పటికీ చెక్కిలిగింతలు పెట్టినట్లనిపిస్తుంది.
నారాయణపురంలోని గడి ఒక ప్రాచీన కట్టడానికి, దొరలకు, దొరతనానికి ప్రతీక. ఆ కట్టడంలో హుందాతనం, రాజసం ఉట్టిపడుతుంది. మేమందరం చిన్నప్పుడు గడీకి వెళ్ళేవాళ్ళం. మాతో దొరల కూతుర్లు, కొడుకు చాలా ప్రేమగా, స్నేహంగా ఉండేవారు. అక్కడే మేము గుజరాతీ స్వీట్లు మెదటిసారిగా కొంచెంకొంచె కొరుకుతూ తిన్న జ్ఞాపకం పదిలం.
మా ఊరికి కిలోమీటర్ దూరంలో ఉన్న ఎల్లారెడ్డి పేట గురించి మాట్లాడకుంటే ఖచ్చితంగా అదొక పెద్ద లోటే. మా గ్రామాన్ని అక్కున చేర్చుకున్న పెద్దన్నలాంటిది ఈ ఊరు.
“దరియశావలి గుట్ట” కాస్తా దర్శాలగుట్టగా ఓ కిలోమీటర్ దూరంలో మా గ్రామానికి పెట్టని కోట. అక్కడి నుంచి మా ఊరిని విహంగ వీక్షణం చేయవచ్చు. మా ఊరికి వేంచేసే అతిథి దేవుళ్ళకు ఈ గుట్ట నేటికీ ఒక విహార స్థలం.
మా ఊరికి కిలోమీటర్ దూరంలో ఉన్న ఎల్లారెడ్డి పేట గురించి మాట్లాడకుంటే ఖచ్చితంగా అదొక పెద్ద లోటే. మా గ్రామాన్ని అక్కున చేర్చుకున్న పెద్దన్నలాంటిది ఈ ఊరు. మండల కేంద్రం. వ్యాపార కూడలి. ఎక్కడికి వెళ్ళాలన్నా ఎల్లారెడ్డి పేటను దాటే వెళ్లాలి. భక్తి సంఘం అనే ఆధ్యాత్మిక కేంద్రం, కార్తీకపూర్ణిమ జాతర ఈ రెండింటితో మా ఊరు మమేకమై జంట నగరాలను తలపిస్తుంది. జాతర సందర్భంగా ఎల్లలెరుగని జనసందోహం పుష్కరాలను తలపిస్తుంది.
బతుకమ్మ పండగ వచ్చిందా…ఇక ఊరు ఊరంతా సంబురమే. గున్క పువ్వు, తంగేడు పువ్వులను కలిపి బతుకమ్మలను భయభక్తులతో పేర్చి మా ఊరు ఆడ పడుచులు, అమ్మలు, వదినలు, అక్కలు, చెల్లెలు అందరూ కొత్త బట్టలు తొడిగి, పసుపు కుంకుమలతో ముఖాలకు అలంకరణచేసి, బతుకమ్మలను చేతుల్లో పెట్టుకుని బయలుదేరితే దివి నుండి భువికి దిగి వచ్చి బారులు తీరిన దేవకన్యల్లా కనిపిస్తారు. బతుకమ్మలను ఒక చోట పెట్టి వాటి చుట్టూ లయబద్దంగా తిరుగుతూ శ్రావ్యంగా “ బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో ….. నీ బిడ్డ పేరేమి ఉయ్యాలో” అని పాడుతుంటే మేమంతా ఆనందంతో తన్మయులమై వినేవాళ్ళం. ఒక ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసేది.
దసరా పండగకి ఊరునుండి వలస వెళ్ళిన వారు సాయంత్రం గూటికి చేరుకునే పక్షుల్లా అందరూ తమతమ ఇండ్లకు చేరుకునేవారు. పలకరింపుల్లో ఆప్యాయత అనురాగాలు పొంగిపొర్లేవి. రథం ఊరేగింపు, జమ్మి చెట్టు చుట్టూ రథాన్ని తిప్పిన తరువాత అందరు జమ్మి ఆకును తెంపుకుని ఒకరికి ఒకరు ఇచ్చిపుచ్చుకుని అలాయ్ బలాయ్ చేసుకునేవారు. ఊళ్ళోని చాలా మంది మా నాన్న గారికి పాదాభివందనం చేసి ఆయన చేతికి జమ్మి ఆకు ఇచ్చి ఆశీర్వాదం పొందడం, నేను అబ్బురపడి చూడడం జరిగేది. అదొక అద్భుత దృశ్యంగా, మత సామరస్యానికి ప్రతీకగా కనిపించేది.
రంజాన్, బక్రీద్ పండగల సమయంలో ఈద్ ముబారక్ అంటూ అలాయ్ బలాయ్ లు… మా ఇంట్లో నా మిత్రులు షీర్ ఖుర్మాలు తాగడం అదొక అందమైన ఆనవాయితీ. మా ఇల్లు రామాలయం వెనక ఒకే ఒక్క ముస్లిం కుటుంబం. అందుకే దాదాపు మా ఇరుగు పొరుగు వారందరికీ మా ఇంటి నుండి షీర్ ఖుర్మా పార్సెల్ వెళ్లేది. నేను నా తమ్ముడు సంతోషంగా వాటిని పోటీపడి డెలివరీ చేసేవారం.
మా ఊరు చుట్టూ పరుచుకున్న పచ్చని పంట పొలాలను పైనుంచి చూస్తే పచ్చ సముద్రం మధ్యలో ముత్యాలదీవిలా అగుపడుతుంది.
మా ఊరు చైతన్యవంతమైంది. అక్షరాస్యతలో చాలా ముందుంది. డా. కె.వి. రమణాచారి గారు, IAS Retired, రాష్ట్ర సాంస్కృతిక వ్యవహారాల సలహాదారు, డా. నలిమెల భాస్కర్ గారు 14 భారతీయ భాషల్లో ప్రావీణ్యులు, కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు గ్రహీత. డా. తిరుమల శ్రీనివాసాచార్యులు గారు , ఉస్మానియా యూనివర్సిటీ తెలుగు విభాగం లో పనిచేసారు. ఈ కళామతల్లి ముద్దుబిడ్డలందరూ ఈ గడ్డపైనే పురుడు పోసుకున్నరు.
మా గ్రామంలో మాకు ఆదర్శమూర్తులు, స్తితప్రజ్ఞులైన కీ. శే. శ్రీ లద్దునూరి వెంకటయ్య సార్ ని మరువలేం. లెక్కలు, ఫిజిక్స్ తో పాటు వారు ఇంగ్లీషు కూడ బోధించేవారు. కీట్స్, షెల్లీ , వడ్స్ వర్త్ ఇంగ్లీషు కవితలను అలవోకగా చదివేవారు. ఎక్కడో ఆక్సఫర్డ్ యూనివర్సిటీ లో ప్రొఫెసర్ గా ఉండాల్నిన సార్ నారాయణపురం అంటే వల్లమాలిన అభిమానంతో అక్కడే జీవనయానం చేసి తరతరాలకు తరగని గొప్ప స్పూర్తిని నింపి అదే మట్టిలో తృప్తిగా కలిసిపోయారు.
వీరే కాకుండా ఎందరో ఉపాధ్యాయులు, వైద్యులు, ఇంజనీర్లు, న్యాయవాదులు, విభిన్న ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగులు, IT రంగంలో దేశవిదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. ఇక్కడ కొందరినే పెర్కొన్నందుకు క్షమించాలి.
అన్నట్టు మా గ్రామం వ్యవసాయానికి పెద్ద పీట వేసి రకరకాల వాణిజ్య పంటలు పండిస్తుంది. జిల్లా స్థాయిలో మా గ్రామం ఎన్నో సార్లు ఉత్తమ రైతులను సగర్వంగా సమర్పించింది. మా ఊరు చుట్టూ పరుచుకున్న పచ్చని పంట పొలాలను పైనుంచి చూస్తే పచ్చ సముద్రం మధ్యలో ముత్యాలదీవిలా అగుపడుతుంది.
అమ్మానాన్నలు, అక్కలు, తమ్ముడు నా నుండి దూరమైనా పండగకు వెళ్ళిన ప్రతి సారి వారి సమాధులపై పుష్పగుచ్ఛాలుంచి కొంత సమయం వారి జ్ఞాపకాలతో మౌనంగా గడపడంతో మనసు తేలిక పడుతుంది.
ఇప్పుడు గ్రామ రూపురేఖలు మారిపోయాయి. విశాలమైన సిమెంటు రోడ్లు, అండర్ గ్రవుండ్ డ్రైనేజ్, రక్షిత మంచినీరు, కోవిడ్ పుణ్యమా అని ఇంటి నుండి పని చేసే IT వారి కోసం మంచి నాణ్యతతో కూడిన ఇంటర్నెట్ సౌకర్యం కూడా అందుబాటులోకి వచ్చింది.
అమ్మానాన్నలు, అక్కలు, తమ్ముడు నా నుండి దూరమైనా పండగకు వెళ్ళిన ప్రతి సారి వారి సమాధులపై పుష్పగుచ్ఛాలుంచి కొంత సమయం వారి జ్ఞాపకాలతో మౌనంగా గడపడంతో మనసు తేలిక పడుతుంది.
చిన్ననాటి స్నేహితులు నన్ను ఆనందంగా, అబ్బురంగా చూస్తారు. “మాకు చిన్నప్పుడే తెలుసు నీవు మాకంటే బాగుంటావని” అన్నప్పుడు వారి కళ్ళలోకి నిశితంగా చూస్తే ఏదో వెలితి కనిపించేది. నాకు తోచిన విధంగా వారికి, నాకు తెలిసిన నా పరిధిలోని కుటుంబాల అవసరాలను గుప్తంగా తీర్చే ప్రయత్నం చేయడం చెప్పలేని తృప్తి.
గొప్ప వసతులు లేకపోయినా నా బెడ్ రూంలో పడుకుంటే అమ్మ ఒడిలో పడుకున్నట్లు, ఆమె నా తల ప్రేమగా నిమురుతున్నట్లు అనిపిస్తుంది.
మా ఇల్లు 1995లో మా నాన్న ఇష్టం మేరకు నిర్మించబడడం, ఆ కాలంలో ఆ ఇల్లు చాల బాగా కట్టారని ప్రశంసించబడడం, మా నాన్నకు ఓ పెద్ద సంతృప్తిని మిగిల్చింది. అదే ఇంట్లో నా వివాహం, నా సహధర్మచారిణితో జీవితం గడపడం మధురమైన జ్ఞాపకాల జావళి.
ఇప్పటికీ ఆ ఇంటికి వెళితే ఆ పాత జ్ఞాపకాలు తాజా అవుతాయి. పక్క గదిలో నాన్న ఉన్నట్లుగా , వంటగదిలో అమ్మ నాకోసం చేపల పులుసు చేస్తున్నట్లుగా, తమ్ముడు మా కోసం చెరకు గడలు, పచ్చి వేరు సెనగ కాయలు తెచ్చినట్లనిపిస్తుంది. గొప్ప వసతులు లేకపోయినా నా బెడ్ రూంలో పడుకుంటే అమ్మ ఒడిలో పడుకున్నట్లు, ఆమె నా తల ప్రేమగా నిమురుతున్నట్లు అనిపిస్తుంది. వచ్చిన మొదటి రెండురోజులు చికాకుగా ఉన్నా తిరిగి ఇల్లు విడిచి ప్రయాణం మొదలు పెట్టే సమయానికి గుండె బరువెక్కి ఏదో తెలియని వేదన కళ్ళను తడిచేస్తుంది.
ఎంత రాసినా తరగని జ్ఞాపకాల చెలిమె మా ఊరు. నాకు ఒక జీవిత కాలం సరిపడే మధురమైన జ్ఞాపకాల ఖజానాను అందించింది.
“జనని జన్మ భూమిశ్చ స్వర్గాదపి గరీయసీ”.
ధన్యుడని.
సయ్యద్ షాదుల్లా నిండుగా కలలు గన్న మనిషి. వాటిని సాకారం చేసుకోవడానికి ఎదురీదిన వ్యక్తి. ఆ ఎదురీతను ఎక్కడ ఆపాలో కూడా తెలిసిన మనిషి. తాను డైరీ టెక్నాలజీ చదివాక దేశ విదేశాల్లో దాదాపు మూడు దశాబ్దాలు వివిధ సంస్థల్లో వేరు వేరు హోదాల్లో పనిచేశారు. చివరకు స్వదేశంలో ఉంటూనే తన వృత్తి నైపుణ్యాలకు పని చెప్పాలని నిర్ణయించుకున్నాక నాలుగేళ్ల క్రితం సౌది అరేబియా నుంచి తిరిగి భారత్ వచ్చేశారు. అప్పటి నుంచి కన్సల్టెంట్ గా వివిధ దేశ విదేశీ సంస్థలకు సేవలు అందిస్తూ షాద్ నగర్ లో ప్రశాంత జీవనం గడుపుతున్నారు. సాహిత్యం, సంగీతం వారి అభిరుచులు.
తెలుపు ప్రచురించిన వారి గత వ్యాసాలు
“నా USA ప్రయాణం సోదరుడి సమాధి నుండి మొదలయ్యింది
Dear Shadulla Saheb,
Your village culture and life spent is well narrated.
Your bovoyage to USA with heavy heart due to the sad demise of your beloved brother indicates dutymindness and loyalty towards your organisation.
Please keep going well with these literary works.
We all wish you all the best.
Thank you for your thoughts for me sir. Your words mean a lot for me. Thank you.