Editorial

Wednesday, January 22, 2025
కథనాలుమండల్‌ మంటలు లేచే వరకూ అంబేడ్కర్‌ ఘనత తెలియని స్థితి! - 'మెరుగుమాల' తెలుపు

మండల్‌ మంటలు లేచే వరకూ అంబేడ్కర్‌ ఘనత తెలియని స్థితి! – ‘మెరుగుమాల’ తెలుపు

1990లో మండల్‌ మంటలు లేచే వరకూ…అంబేడ్కర్‌ ఘనత తెలియని పరిస్థితి ఓబీసీలలో నెలకొని ఉంది.

అప్పటిదాకా అంబడ్కేర్‌ విగ్రహాలు పెట్టించి, ఎస్సీల ఓట్లు గుండుగుత్తగా కొల్లగొట్టిన కాంగ్రెస్‌ పార్టీ ప్రధానులకు పట్టని బాబా సాహబ్‌కు అదే కాంగ్రెస్‌ కుదురు నుంచే వచ్చిన విశ్వనాథ్‌ ప్రతాప్‌ సింగ్‌ సర్కారు భారతరత్న ప్రకటించిన అనంతరం ప్రపంచవ్యాప్తంగా అంబేద్కర్ రచనలు, జీవితం, రాజకీయ, సామాజిక విశేషాలపై ఆసక్తి, అధ్యయనం పెరిగాయి.

మెరుగుమాల నాంచారయ్య

1990 ద్వితీయార్ధంలో బీసీలకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో కోటా కల్పించే మండల్‌ కమిషన్‌ నివేదికలోని ఓ సిఫార్సు అమలుకు వీపీ సింగ్‌ సర్కారు నిర్ణయం తీసుకునే వరకూ నాలాంటి ‘ఇంటర్మీడియెట్‌’ కులాల్లో పుట్టినవారికి బాబాసాహెబ్‌ గురించి సరిగా తేలీదు. ఆయన రచనలపై ఆసక్తి లేదు. మండల్‌ వివాదం ఫలితంగా దళితులకు (ఎస్సీలు) వెనుకబడిన తరగతులు కాస్త దగ్గరయ్యాయి. అంతేకాదు, చాలా వరకు సామాజిక చైతన్యం విషయంలో వెనుకబడే ఉన్న ఓబీసీలు కొత్తగా అంబేడ్కర్‌ రచనలు చదవడం మొదలెట్టారు.

బహుజన మేధావి కంచ ఐలయ్య, మా ఊరు దగ్గరి నుంచి ప్రజా విప్లవ పంథా అన్వేషిస్తూ జీవితాంతం శ్రమించిన కేజీ సత్యమూర్తి వంటి మహనీయుల కారణంగా ఓబీసీలకు ది ఆర్కిటెక్ట్‌ ఆఫ్‌ ద కాన్ట్సిట్యూషన్‌ అంబేడ్కర్‌ ఔన్నత్యం ఏమిటో తెలిసింది. లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఇకనామిక్స్‌ అండ్‌ పొలిటికల్‌ సైన్స్‌ (ఎలెస్యీ)లో అంబేడ్కర్‌ చదివారనే వాస్తవం కూడా దళితేతర బీసీలకు, ఇతర అగ్రవర్ణాలు, వ్యవసాయాధారిత కులాలవారికి 1990 తర్వాతే స్పృహలోకి వచ్చింది. ఊరూరా దళితవాడల్లో ముదురు నీలిరంగు బట్టలేసుకున్న అంబెడ్కర్‌ విగ్రహాలు పెట్టించి, ఎస్సీల ఓట్లు గుండుగుత్తగా కొల్లగొట్టిన కాంగ్రెస్‌ పార్టీ ప్రధానులకు పట్టని బాబా సాహబ్‌కు– ఆ కాంగ్రెస్‌ కుదురు నుంచే వచ్చిన ‘మాండా తాలుక్‌దార్‌’ (ఓ మోస్తరు జమిందారు) విశ్వనాథ్‌ ప్రతాప్‌ సింగ్‌ సర్కారు రాజకీయ కారణాల వల్ల భారతరత్న ప్రకటించింది. అప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా భీంరావ్‌ రచనలు, జీవితం, రాజకీయ, సామాజిక విశేషాలపై ఆసక్తి, అధ్యయనం పెరిగాయి.

అంబేడ్కర్‌ భార్య రమాబాయి చిన్న వయసులోనే కన్నుమూశాక 1948లో ప్రగతిశీల మరాఠీ సారస్వత బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన డాక్టర్‌ సవితా (శారద) కబీర్‌ను భీంరావ్‌ పెళ్లాడిన విషయం కూడా అప్పటి దాకా చాలా మందికి తెలియదు.

అలాగే, బహుజన్‌ సమాజ్‌ పార్టీ స్థాపకుడు కాశీరామ్‌ ఓ సందర్భంలో తనను ఓ రిపోర్టర్, ‘ మీరెందుకు ఇంకా పెళ్లి ఎందుకు చేసుకోలేదని అడిగినప్పుడు ఇచ్చిన సమాధానం కూడా అంబేడ్కర్‌ వ్యక్తిగత జీవితంలోని సాధారణ విషయాలు వెల్లడించింది.

“ఆయనలా రెండు పెళ్లిళ్లు చేసుకునే శక్తి నాకెక్కడిది?”

‘అంబేడ్కర్‌ గొప్పవాడు, ఆయనలా రెండు పెళ్లిళ్లు చేసుకునే శక్తి నాకెక్కడిది?’ అని కాన్షీరామ్‌ చమత్కారం జోడించి జవాబివ్వగానే కొందరు కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలు నిరసన ప్రదర్శనలు కూడా జరిపారు. అంబేడ్కర్‌ భార్య రమాబాయి చిన్న వయసులోనే కన్నుమూశాక 1948లో ప్రగతిశీల మరాఠీ సారస్వత బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన డాక్టర్‌ సవితా (శారద) కబీర్‌ను భీంరావ్‌ పెళ్లాడిన విషయం కూడా అప్పటి దాకా చాలా మందికి తెలియదు.

భారత రాజ్యాంగ నిర్మాత, భారతదేశపు గొప్ప బిడ్డ డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ పాతికేళ్లు నిండటానికి ముందే మా యూనివర్సిటీలో ఆర్థిక, సామాజిక శాస్త్రాలు చదివారు. ఆ చదువుతోనే ఆయన చైతన్య యాత్ర ఆరంభమైంది,’ అని చెప్పారు.

ఆధునిక భారతంలో ఆర్థిక సంస్కరణలు అంబేడ్కర్‌ పుట్టిన (1991) వందేళ్లకు ప్రవేశపెట్టడం మొదలైంది. సరిగ్గా అప్పుడే బాబాసాహబ్‌పై ఆసక్తి, గౌరవం దేశంలో పెరగనారంభించాయి. ఆర్థిక సంస్కరణలతోపాటే అంబేడ్కర్‌ విచారధార దేశంలో ప్రాచుర్యం పొందడంతో దళిత, ఓబీసీ వర్గాలకు ఉన్నత చదువుల ప్రాధాన్యం తెలిసొచ్చింది. అమెరికాకు ఐటీ ఉద్యోగాల కోసమేగాక, ఎంఎస్‌ వంటి చదువల కోసం పోయేవారికి అక్కడి అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాల్లో ఒకటైన కొలంబియా యూనివర్సిటీలో 22 ఏళ్ల భీంరావ్‌ 1913లోనే చేరి ఎంఏ, పీఎచ్‌ డీ పూర్తిచేశారని విషయం ఎంతో స్ఫూర్తిదాయకం అయింది. ఆ తర్వాత ఆయన లండన్‌ గ్రేస్‌ ఇన్‌ లో బారెట్‌ లా, అదే సమయంలో లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఇకనామిక్స్‌లో ఎంఎస్సీ, డీఎస్సీ చదివారనే విషయం కూడా దళితేతర బుద్ధిజీవులకు చాలా ఆలస్యంగా తెలిసిన గొప్ప సమాచారం. ఈ కారణాల వల్లే, పదేళ్ల క్రితం తమ యూనివర్సిటీలో అడ్మిషన్‌ పొంది చదువు పూర్తిచేయడం గొప్ప విషయం అనే ప్రచారం చేయడానికి వచ్చిన కొలంబియా యూనివర్సిటీ ఉన్నతాధికారులు (ప్రెసిడెంట్‌ లేదా వైస్‌ ప్రెసిడెంట్‌) ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో, ‘భారత రాజ్యాంగ నిర్మాత, భారతదేశపు గొప్ప బిడ్డ డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ పాతికేళ్లు నిండటానికి ముందే మా యూనివర్సిటీలో ఆర్థిక, సామాజిక శాస్త్రాలు చదివారు. ఆ చదువుతోనే ఆయన చైతన్య యాత్ర ఆరంభమైంది,’ అని చెప్పారు.

అంబేడ్కర్‌ అంటే ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ల కల్పనకు కారకుడు మాత్రమే అనే తప్పుడు ప్రచారానికి బాబాసాహబ్‌ శతజయంతి సంవత్సరం (1991) నుంచి తెరపడింది. అంబేడ్కర్‌ గొప్ప ప్రజాస్వామ్యవాది, ఆధునిక ప్రగతిశీల విచారధారకు ఆద్యుడు అనే విషయం కమ్యూనిస్టులు, మిగిలిన జనం ఒకేసారి గుర్తించడం ఓ చారిత్రక వింత.

“నా జాతి అంతా నిద్రిస్తోంది కాబట్టి నేను ఇంకా మేల్కొనే ఉన్నాను”

1990ల్లో గుడివాడకు చెందిన ఎంఆర్‌ నాగేశ్వరరావు అంతకు ముందు కొన్ని దశాబ్దాల క్రితం డా.అంబేడ్కర్‌ నడిపిన మరాఠీ పత్రిక ‘మూక్‌ నాయక్‌’ పేరుతో తెలుగులో పక్ష పత్రిక కొద్ది మాసాలు నడిపారు. ఈ పత్రిక ఓ సంచికలో (తేదీ గుర్తు లేదు) అంబేడ్కర్‌ జీవితంలో మనం తెలుసుకోవాల్సిన సందర్భం గురించి చిన్న కథనం ప్రచురించారు. ఈ కథనం ప్రకారం– స్వాతంత్య్రం వచ్చాకో లేదా అంతకు ముందు కొన్నేళ్ల క్రితమోగాని అమెరికాకు చెందిన ప్రసిద్ధ జర్నలిస్టు (పేరు కూడా గుర్తుకు రావడం లేదు) ఒకరు ఒక రోజు దిల్లీలో రాత్రి ఏడెనిమిది గంటల మధ్య మహాత్మా గాంధీ నివాసానికి వెళ్లారు. అప్పటికే రేత్తిరి భోజనం పూర్తి చేసిన బాపూ నిద్రకు ఉపక్రమిస్తున్నారు. ఉదయం పెందలకాడ లేచి రాత్రి త్వరగా పడుకునే అలవాటు గాంధీకి ఉన్న విషయం తెలియని ఆ పాత్రికేయుడితో మోహన్‌ దాస్‌ ఐదు నిమిషాల్లో భేటీ ముగించేశారు. తర్వాత కాంగ్రెస్‌ నేత, పాశ్చాత్య జీవనశైలి తెలిసి అభిమానించే పండిత జవాహర్‌ లాల్‌ నెహ్రూ ఇంటికి ఈ అమెరికన్‌ వెళ్లారు. అప్పటికి సమయం రాత్రి పదిన్నర దాటుతోంది. రెండు పెగ్గుల విస్కీతో డినర్‌ ముగించిన చాచాజీ కూడా ఈ జర్నలిస్టుతో సుదీర్ఘ సంభాషణ చేయకుండా ముక్తసరిగా మాట్లాడి తర్వాత కలుద్దామని అంటూ బెడ్‌ రూమ్‌ వైపు కదిలారు. వైశ్య, బ్రాహ్మణ ప్రముఖులు ఇద్దరితో తాపీగా మాట్లాడే అవకాశం దక్కని ఈ పాశ్చాత్య రచయిత తాను భోజనం చేసుకుని బాబాసాహబ్‌ అంబేడ్కర్‌ ఇంటికి వెళ్లారు.

‘ఈ ఇద్దరు అగ్రవర్ణ మేధావులు, పోరాటయోధుల కన్నా బాగా చదువుకున్న మీరు అర్ధరాత్రి అయినా ఇంకా నిద్రపోకుండా అధ్యయనంలో ఎందుకున్నారు?’ అని ప్రశ్నించాడు బాబాసాహబ్‌ ను.

అప్పుడు సమయం రెండు గంటలవుతోంది. భీంరావ్‌ పడక గదిలో లైటు వెలుగుతున్నట్టు ఈ జర్నలిస్టుకు కనిపించింది. అంటే డాక్టర్‌ గారు మెలకువగానే ఉన్నారని అనుకుని ఇంట్లోకి వెళ్లాడు. అంబేడ్కర్‌ ఈ విదేశీ అతిథిని సాదరంగా తన ఇంటిలోకి ఆహ్వానించి చాలాసేపు మాట్లాడారు. ఈ పాత్రికేయుడు అంతకు కొన్ని గంటల ముందు గాంధీజీ, నెహ్రూజీలతో తన అనుభవాన్ని వివరించాక, ‘ఈ ఇద్దరు అగ్రవర్ణ మేధావులు, పోరాటయోధుల కన్నా బాగా చదువుకున్న మీరు అర్ధరాత్రి అయినా ఇంకా నిద్రపోకుండా అధ్యయనంలో ఎందుకున్నారు?’ అని ప్రశ్నించాడు బాబాసాహబ్‌ ను. దానికి భీంరావ్‌ జవాబిస్తూ, ‘‘బాపూ, పండిత నెహ్రూలు రాత్రి పది లోపే నిద్రపోవడానికి వీలైన సామాజిక పరిస్థితులున్నాయి. ఎందుకంటే వారి సామాజికవర్గాలకు చెందిన ప్రజలు ఎప్పుడో చాలా వరకు చైతన్యవంతులయ్యారు. తెలివితేటలు సంపాదించారు. నేను ప్రాతినిధ్యం వహించడానికి ప్రయత్నిస్తున్న నా బడుగు బలహీనవర్గాల జనం ఇంకా సామాజిక స్పృహలోకి రాలేదు. వారు నిరంతరం నిద్రలోనే ఉంటారు. వారిని మేల్కొలపడానికి నేను ఇలా రాత్రి రెండు దాటే వరకూ నిద్రపోకుండా చదవుతూ, రాస్తూ ఉంటాను,’’ అని వివరించారు.

ఆరోగ్యం దెబ్బతినకుండా ఉండి ఉంటే…

ఇప్పటికి నూటా పదేళ్ల క్రితమే అంబేడ్కర్‌ అట్టాంటిక్‌ మహా సముద్రం దాటి న్యూయార్క్‌ కొలంబియా వర్సిటీలో, లండన్‌ లోని ఎలెస్యీ, గ్రేస్‌ ఇన్‌ లో పీజీ డిగ్రీలు, పీఎచ్‌డీలు, డీఎస్సీ పట్టాలు చేతికి రాగానే తన చదువు, అధ్యయనం ముగించకుండా పీడితవర్గాల కోసం వాటిని కొనసాగించారు.

అంబేడ్కర్‌ అనే విశ్వమానవుడు భారతదేశం నుంచి ప్రయాణం ప్రారంభించి విశ్వవ్యాప్తంగా జనాన్ని ప్రభావితం చేసే పనులు చేశారంటే కొన్నేళ్ల తర్వాత ఇండియాలో నమ్మేవారు ఎంత మంది ఉంటారో మరి?

భారత రాజ్యాంగ రచన అనే ఆయన ఆరోగ్యాన్ని బాగా దెబ్బదీసిన భారం లేకపోయి ఉంటే– బాబాసాహబ్‌ హిందూ సమాజంలో సమత సాధనకు అవసరమైన ఎక్కువ పని పూర్తిచేసి ఉండేవారు. భీంరావ్‌ రాంజీ అంబేడ్కర్‌ (1891–1956) అనే విశ్వమానవుడు భారతదేశం నుంచి ప్రయాణం ప్రారంభించి విశ్వవ్యాప్తంగా జనాన్ని ప్రభావితం చేసే పనులు చేశారంటే కొన్నేళ్ల తర్వాత ఇండియాలో నమ్మేవారు ఎంత మంది ఉంటారో మరి?

మెరుగుమాల నాంచారయ్య సీనియర్ పాత్రికేయులు. ఉదయం, వార్త దిన పత్రికల్లో పనిచేయడమే కాక ఈనాడు, సాక్షి జర్నలిజం కళాశాల అధ్యాపకులుగా వారు సుశిక్షితులైన యువ పాత్రికేయులను అందించిన మార్గదర్శి. నిశితమైన విశ్లేషకులుగా వారు పాఠకులకు పరిచితులే. మనదేశ వాస్తవికత అయిన కులాన్ని, దాని విస్తృతిని వారు లోతుగా అధ్యయనం చేయడమే కాక అనేక శ్రేణుల్లో. పలు రంగాల్లో దాని అనివార్య ప్రభావాన్ని వారు రచించే కథనాల ద్వారా వివరించడం తన ప్రత్యేకత.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article