ఔషధ విలువల మొక్కలు ( 9 ) : విష్ణు క్రాంతపత్రం
చిట్టి నీలిపూలు శివుని వెన్నుని ప్రీతి
శ్రీ గణేశు పూజ చేయ నోచె
పూజ లెన్నియైన పూవులెన్నియు నైన
ఔషధమివి యనుచు నాదరించు
నాగమంజరి గుమ్మా
చిన్ని నీలిపువ్వులున్న ఈ విష్ణుక్రాంత పత్రం శ్రీ గణేశ పూజకు నోచుకున్నది. సంస్కృతంలో వీటిని శంఖపుష్పి అని ఆంగ్లంలో morning glory అని పిలుస్తారు. ఆయుర్వేదంలో విష్ణు క్రాంత మొక్క మొత్తం ఆకులు, పూవులు సహా ప్రాధాన్యం ఉన్నది. విఘ్నేశ్వరునికే కాకుండా విష్ణువుకు, శివునకు కూడా ఈ పువ్వులు ప్రీతియైనవి. ఈ ఆకులు చెరువు నీటిలో వేసినపుడు, జలచరాలు ఆ ఆకులను తిని, వృద్ది చెంది నీటిని శుద్ధి చేస్తాయంటారు.
ఆయుర్వేద వైద్య నియమాల రీత్యా కడుపులోకి తీసుకునే ఔషధాలను యధాతధంగా అందించకూడదు. ఉపయోగించేవారికి ఒక్కొక్కప్పుడు వికటించవచ్చు. అందుకే విధానం గోప్యంగా ఉంచబడుతుంది.
నాగమంజరి గుమ్మా వృత్తి రీత్యా ఉపాధ్యాయురాలు. ప్రవృత్తి రీత్యా రచయిత్రి. వారు కవిత్వం, పద్యం, గద్యం వంటి ప్రక్రియల్లో అనేక రచనలు చేశారు. ప్రతి రోజూ ఒక రచనతో అనేక వాట్సప్ గ్రూపుల్లో వందలాది మందికి చేరువయ్యారు. ముఖ్యంగా పూవుల వర్ణన పద్యములు – పుష్పవిలాసం (1116), పండ్ల విశిష్టత తెలుపే ఫల విలాసం (108), పక్షుల గురించిన విహంగ విలాసం (108), సముద్ర జీవుల గురించి రాసిన జలచర విలాసం (108), – వీటి ప్రశస్తిని శతకాలుగా రచించారు. ప్రస్తుతం శ్రీమతి చివుకుల శ్రీలక్ష్మి గారు అందించే చిత్రాల సహకారంతో ప్రతి రోజూ ఒక్క మొక్క తాలూకు ఔషధ విలువలను పద్యం సహితంగా అందిస్తున్నారు.
మన ప్రాంతీయ మొక్కలలోని ఔషధ గుణాలు గురించిన ఈ సమాచారం ఎంతో విలువైనదే. అలా అని వైద్యుని పర్యవేక్షణ లేకుండా వాటిని ఉపయోగించకూడదని నాగమంజరి గారి మనవి.