ఔషధ విలువల మొక్కలు ( 48 ) : గుంటగలగరాకు
గుంటగలగరాకు కురులకు నేస్తమై
రంగు పొడవు పెంచు హంగునిచ్చు
భృంగరాజు పేర పేరెన్నికైనది
పేను కొరకు వ్యాధి వెడల జేయు
నాగమంజరి గుమ్మా
గుంటకలగర లేదా గుంటగలగర ఒక విధమైన ఔషధ మొక్క. నీటి కాలువలు, గుంటల పక్కన, తేమగల ప్రదేశాలలో నేలబారుగా పెరిగే కలుపు మొక్క గుంటగలిజేరు. గుత్తులుగా ఉన్న తెల్లని చిన్న పూలను పూస్తుంది. సంస్కృతంలో దీన్ని భృంగరాజ అంటారు
సంస్కృతంలో దీన్ని భృంగరాజ అంటారు
గుంటగలగరాకు లేదా భృంగరాజ్ అనే పేరున్న ఈ ఆకు చిరపరిచితమే. నల్లని ఒత్తైన జుట్టు కొరకు నూనెలో ఈ ఆకులను కలిపి ఉపయోగిస్తారు. పేను కొరుకుడు వ్యాధికి ఇది మంచి మందు.
గుంటగలగర మొక్కలను వేళ్లతో సహా తీసి శుభ్రపరచి నీడలో ఎండబెట్టాలి. దీనికి మార్కెట్లో మంచి అమ్మకపు విలువ వుంటుంది. ఆధునిక పరిశోధనలలో ఇందులో కల ఎక్లిప్టిన్ అనే ఔషధతత్వానికి లివర్ ను బాగుచేయగల శక్తి ఉందని కనుగొన్నారు. ఆయుర్వేద వైద్య విధానంలో గుంటగలిజేరును ప్రధానంగా తల వెండ్రుకలు నల్లగా, వత్తుగా పెరగటానికే కాకుండా లివరు, చర్మ వ్యాధులలో వాడుతారు.
నాగమంజరి గుమ్మా వృత్తి రీత్యా ఉపాధ్యాయురాలు. ప్రవృత్తి రీత్యా రచయిత్రి. వారు కవిత్వం, పద్యం, గద్యం వంటి ప్రక్రియల్లో అనేక రచనలు చేశారు. ప్రతి రోజూ ఒక రచనతో అనేక వాట్సప్ గ్రూపుల్లో వందలాది మందికి చేరువయ్యారు. ముఖ్యంగా పూవుల వర్ణన పద్యములు – పుష్పవిలాసం (1116), పండ్ల విశిష్టత తెలుపే ఫల విలాసం (108), పక్షుల గురించిన విహంగ విలాసం (108), సముద్ర జీవుల గురించి రాసిన జలచర విలాసం (108), – వీటి ప్రశస్తిని శతకాలుగా రచించారు. ప్రస్తుతం శ్రీమతి చివుకుల శ్రీలక్ష్మి గారు అందించే చిత్రాల సహకారంతో ప్రతి రోజూ ఒక్క మొక్క తాలూకు ఔషధ విలువలను పద్యం సహితంగా అందిస్తున్నారు.
మన ప్రాంతీయ మొక్కలలోని ఔషధ గుణాలు గురించిన ఈ సమాచారం ఎంతో విలువైనదే. అలా అని వైద్యుని పర్యవేక్షణ లేకుండా వాటిని ఉపయోగించకూడదని నాగమంజరి గారి మనవి.