ఔషధ విలువల మొక్కలు ( 44 ) : మెంతి
మధుర పిత్త హృదయ మందాగ్ని కామెర్లు
రోగమేది యైన వీగిపోవు
మెంతియాకు లోన మేలుచేయు గుణము
లిట్టె తరిమివేయు కట్టె నుండి
నాగమంజరి గుమ్మా
ఆకులు గుండెకు, పేగులకు మెంతి మంచి ఔషధం. పైత్యం అధికంగా ఉన్నప్పుడు ఆకులను శుభ్రంగా కడిగి రసంగా చేసి, ఒక చెంచాడు తేనె కలిపి తీసుకుంటే త్వరగా తగ్గుతుంది.
కామెర్ల వచ్చిన వారికి, లివర్ సిర్రోసిస్ (కాలేయ క్షయం)తో బాధపడుతున్న వారికి ఆకుల దంచి కాచిన రసం తేనె కలిపి తాగిస్తే ఆకలి పెరిగి త్వరగా కోలుకుంటారు. ఆకులను రసంగా చేసి రాత్రి భోజనానికి ముందు తాగితే చక్కగా నిద్రపడుతుంది.
ఆకుల రసాన్ని పిప్పితో సహా నిమ్మకాయ పిండి భోజనానికి ముందు తాగితే స్థూలకాయులు, మధుమేహ వ్యాధిగ్రస్తులకు కొంత గుణం కనిపిస్తుంది.
ఆకును దంచి పేస్ట్‌గా చేసి తలకు రాస్తే చుండ్రు, వెండ్రుకలు రాలడం తగ్గుతాయి. వెండ్రుకలు నిగనిగలాడతాయి. ఆకులను దంచి పేస్ట్‌గా ముఖానికి రాస్తే ముఖంపై మొటిమలు, మచ్చలు తగ్గుతాయి. పొడి బారడడం తగ్గుతుంది. కంటి నుండి అదే పనిగా నీరు కారతుంటే ఆకులను శుభ్రమైన వస్త్రంతో కట్టి రాత్రి పూట కంటికి కట్టాలి.
వైట్‌హెడ్స్ నివారణలో ముఖ్యంగా చెప్పుకోదగ్గ ఔషధం మెంతి ఆకుల మిశ్రమం. తాజాగా ఉండే గుప్పెడు మెంతి ఆకులను తీసుకుని రోట్లో వేసి మెత్తగా నూరి, ఆ పేస్టును ముఖంమీద వైట్‌హెడ్స్ అధికంగా ఉండే చోట బాగా అప్లయ్ చేసి రాత్రంతా అలాగే ఉంచుకోవాలి. తెల్లారగానే లేచి గోరువెచ్చటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే కొన్ని రోజులకు వైట్‌హెడ్స్ బారినుంచి విముక్తి అవ్వచ్చు.
నాగమంజరి గుమ్మా వృత్తి రీత్యా ఉపాధ్యాయురాలు. ప్రవృత్తి రీత్యా రచయిత్రి. వారు కవిత్వం, పద్యం, గద్యం వంటి ప్రక్రియల్లో అనేక రచనలు చేశారు. ప్రతి రోజూ ఒక రచనతో అనేక వాట్సప్ గ్రూపుల్లో వందలాది మందికి చేరువయ్యారు. ముఖ్యంగా పూవుల వర్ణన పద్యములు – పుష్పవిలాసం (1116), పండ్ల విశిష్టత తెలుపే ఫల విలాసం (108), పక్షుల గురించిన విహంగ విలాసం (108), సముద్ర జీవుల గురించి రాసిన జలచర విలాసం (108), – వీటి ప్రశస్తిని శతకాలుగా రచించారు. ప్రస్తుతం శ్రీమతి చివుకుల శ్రీలక్ష్మి గారు అందించే చిత్రాల సహకారంతో ప్రతి రోజూ ఒక్క మొక్క తాలూకు ఔషధ విలువలను పద్యం సహితంగా అందిస్తున్నారు.
మన ప్రాంతీయ మొక్కలలోని ఔషధ గుణాలు గురించిన ఈ సమాచారం ఎంతో విలువైనదే. అలా అని వైద్యుని పర్యవేక్షణ లేకుండా వాటిని ఉపయోగించకూడదని నాగమంజరి గారి మనవి.