ఔషధ విలువల మొక్కలు ( 42 ) : గోరింటాకు
గోరింటాకును చూడగ
కోరిక మొలకెత్తనీని కోమలి గలదే
తీరిక చేసుకు చేతుల
తీరిచి రంగుల కళలను తీర్చును మురిపెం
నాగమంజరి గుమ్మా
గోరింటాకును హెన్నా అని మెహంది అని అంటారు. ఆకును రుబ్బి, ఆ ముద్దను వేళ్ళకు, అరచేతికి, పాదాలకు అద్దుకునే అలవాటు దక్షిణాది రాష్ట్రాలలో ముఖ్యంగా ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటకలో కొన్ని ప్రాంతాలలో మాత్రమే ఉంది. మిగిలిన ప్రాంతాల్లో పొడిగా చేసిన గోరింటాకులో హానికారకం కాని రసాయనాలు కలిపి ఉపయోగిస్తారు.
సహజమైన గోరింటాకు ముద్ద గోళ్లకు నీటిలో నానడం వలన కలిగే ఫంగస్ ఇన్ఫెక్షన్ ను అరికడుతుంది. రంగు, అందం, ఆకర్షణ ల సంగతి వేరే. తల వెంట్రుకలకు గోరింటాకు తగిలితే సహజమైన నల్లని రంగు పోయి మొదట ఎరుపు గాను, తర్వాత తెల్లగాను మారిపోతాయి. అందుకే పెద్దవాళ్ళు జుట్టుకి గోరింటాకు తగలనిచ్చేవారు కాదు. ఇప్పుడు రంగు కోసమని తలకు హెన్నా పెట్టించుకుంటున్నారు.
వేరేదేశాల ఆచారాలను పాటిస్తూ కృత్రిమ మెహందీలు, డిజైన్లు పెట్టుకోవడం ఆరోగ్యానికి హానికరం. పెళ్లికి సహజమైన గోరింటాకు పెట్టుకుంటే 16 రోజుల పండుగ వరకు అలాగే ఉంటుంది. హెన్నా / మెహంది పెడితే గృహప్రవేశం నాటికే రంగు వెలిసిపోతుంది.
నాగమంజరి గుమ్మా వృత్తి రీత్యా ఉపాధ్యాయురాలు. ప్రవృత్తి రీత్యా రచయిత్రి. వారు కవిత్వం, పద్యం, గద్యం వంటి ప్రక్రియల్లో అనేక రచనలు చేశారు. ప్రతి రోజూ ఒక రచనతో అనేక వాట్సప్ గ్రూపుల్లో వందలాది మందికి చేరువయ్యారు. ముఖ్యంగా పూవుల వర్ణన పద్యములు – పుష్పవిలాసం (1116), పండ్ల విశిష్టత తెలుపే ఫల విలాసం (108), పక్షుల గురించిన విహంగ విలాసం (108), సముద్ర జీవుల గురించి రాసిన జలచర విలాసం (108), – వీటి ప్రశస్తిని శతకాలుగా రచించారు. ప్రస్తుతం శ్రీమతి చివుకుల శ్రీలక్ష్మి గారు అందించే చిత్రాల సహకారంతో ప్రతి రోజూ ఒక్క మొక్క తాలూకు ఔషధ విలువలను పద్యం సహితంగా అందిస్తున్నారు.
మన ప్రాంతీయ మొక్కలలోని ఔషధ గుణాలు గురించిన ఈ సమాచారం ఎంతో విలువైనదే. అలా అని వైద్యుని పర్యవేక్షణ లేకుండా వాటిని ఉపయోగించకూడదని నాగమంజరి గారి మనవి.