ఔషధ విలువల మొక్కలు ( 41 ) : నేరేడు
ఏరువాక కొమ్మ నేరేడు సిరికొమ్మ
పెండ్లి రాట కిదియె పేర్మి కొమ్మ
పండ్లు బెరడు నాకు పరగి ఔషధములే
గట్టి కలప నిచ్చు గడుసు కొమ్మ
నాగమంజరి గుమ్మా
శుభకార్యం అంటే గుర్తొచ్చేది నేరేడు. చక్కని పంటల కోసం ఏరువాక ముహూర్తం పెట్టినప్పుడు రైతుల ఇళ్లను అలంకరించేది, ముహూర్తపు రాటకు, ఇంట్లో వస్తువుల తయారీకి ఉపయోగించేది నేరేడే.
నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోయే ఈ పండు పోషకాల గని, అనారోగ్యాల నివారణి. నేరేడు శక్తి నందించి ఆరోగ్యానికి మేలు చేయడమే కాదు, కొన్నిరకాల రోగాలనూ నియంత్రించే శక్తి నేరేడు సొంతం. ఒక్క పండే కాదు, ఆకులు, బెరడు కూడా శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఆక్సాలిక్ టాన్మిక్ ఆమ్లం, విటమిన్లు, క్రోమియం వంటివి నేరేడులో పుష్కలం. సిజిజియం క్యుమిన్ దీని శాస్త్రీయ నామము .
మధుమేహ బాధితులకు వరంలా పనిచేస్తుంది నేరేడు
నేరేడు ఆకులతో చేసే కషాయం.. బ్యాక్టీరియల్, వైరల్ ఇన్‌ఫెక్షన్లు రాకుండా కాపాడుతుంది. ఆకుల్ని దంచి కషాయంగా కాచి పుక్కిలిస్తే దంతాలు కదలడం.. చిగుళ్ల వాపులు, పుండ్లు వంటివి త్వరగా తగ్గుతాయి. ఆకులను నమిలి నీళ్లతో పుక్కిలించి ఉమ్మి వేస్తుంటే.. నోటి దుర్వాసన తగ్గుతుంది. ఆకు రసంలో పసుపు కలిపి పురుగులు కుట్టినచోట, దురదలు, సాధారణ దద్దుర్లకు లేపనంగా రాస్తే ఉపశమనం లభిస్తుంది.
నాగమంజరి గుమ్మా వృత్తి రీత్యా ఉపాధ్యాయురాలు. ప్రవృత్తి రీత్యా రచయిత్రి. వారు కవిత్వం, పద్యం, గద్యం వంటి ప్రక్రియల్లో అనేక రచనలు చేశారు. ప్రతి రోజూ ఒక రచనతో అనేక వాట్సప్ గ్రూపుల్లో వందలాది మందికి చేరువయ్యారు. ముఖ్యంగా పూవుల వర్ణన పద్యములు – పుష్పవిలాసం (1116), పండ్ల విశిష్టత తెలుపే ఫల విలాసం (108), పక్షుల గురించిన విహంగ విలాసం (108), సముద్ర జీవుల గురించి రాసిన జలచర విలాసం (108), – వీటి ప్రశస్తిని శతకాలుగా రచించారు. ప్రస్తుతం శ్రీమతి చివుకుల శ్రీలక్ష్మి గారు అందించే చిత్రాల సహకారంతో ప్రతి రోజూ ఒక్క మొక్క తాలూకు ఔషధ విలువలను పద్యం సహితంగా అందిస్తున్నారు.
మన ప్రాంతీయ మొక్కలలోని ఔషధ గుణాలు గురించిన ఈ సమాచారం ఎంతో విలువైనదే. అలా అని వైద్యుని పర్యవేక్షణ లేకుండా వాటిని ఉపయోగించకూడదని నాగమంజరి గారి మనవి.