ఔషధ విలువల మొక్కలు ( 4 ) : అపామార్గ పత్రం
ఉత్తరేణి పేర నుత్తమౌషధమిది
పంటి గట్టిదనము పట్టు పెంచు
పాపల వరదాయి వంధ్యత్వ నాశిని
పల్లెటూళ్ల నెరుగు బల, హితకరి
నాగమంజరి గుమ్మా
అపామార్గ పత్రం – దీనిని ఉత్తరేణి అంటారు.
ఓం గజ కర్ణికాయ నమః అపామార్గ పత్రం పూజయామి అని ప్రార్ధిస్తూ వేసే నాల్గవ పత్రం ఈ ఉత్తరేణి.
దీని శాస్త్రీయ నామం అఖిరాంథస్ ఆస్పరా.
పల్లెల్లో వీటిని కుచ్చిన పుల్లలు అంటారు. వీటి ప్రయోజనం పల్లె ప్రజలకు బాగా తెలుసు.
పసి పిల్లలకు బలం చేకూర్చడం, అన్న హితవు కలిగించడంతో పాటు ఇంకా ఎన్నో వ్యాధులకు ఈ ఉత్తరేణి మందు. ఈ మొక్కను సమూలంగా…వేళ్ళు కూడా తెగకుండా తీసి బాగా ఇసుక, మట్టి లేకుండా కడిగి, నీడను ఆరబెట్టాలి (ఎండబెట్టకూడదు). బాగా ఆరిన తర్వాత కాల్చి మసి చేసి ఆ పొడితో పళ్ళు తోముకోవాలి. లేదా ఆ పుల్లలనే పళ్ళు తోమే కుంచెగా ఉపయోగించవచ్చు. పళ్ళు వజ్రాల మాదిరి గట్టిగా తయారవుతాయి. పుచ్చుపళ్ళు మచ్చుకైనా కనిపించవు.
ఇంక ఈ గింజలను పాలతో వాడితే పురుషులలో వంధ్యత్వం పోయి ఆ ఇల్లు పిల్లా పాపలతో కళకళ లాడుతుందట.
అన్నట్టు, ఆయుర్వేద వైద్య నియమాల రీత్యా కడుపులోకి తీసుకునే ఔషధాలను యధాతధంగా అందించకూడదు. ఉపయోగించేవారికి ఒక్కొక్కప్పుడు వికటించవచ్చు. అందుకే విధానం గోప్యంగా ఉంచబడుతుంది.
నాగమంజరి గుమ్మా వృత్తి రీత్యా ఉపాధ్యాయురాలు. ప్రవృత్తి రీత్యా రచయిత్రి. వారు కవిత్వం, పద్యం, గద్యం వంటి ప్రక్రియల్లో అనేక రచనలు చేశారు. ప్రతి రోజూ ఒక రచనతో అనేక వాట్సప్ గ్రూపుల్లో వందలాది మందికి చేరువయ్యారు. ముఖ్యంగా పూవుల వర్ణన పద్యములు – పుష్పవిలాసం (1116), పండ్ల విశిష్టత తెలుపే ఫల విలాసం (108), పక్షుల గురించిన విహంగ విలాసం (108), సముద్ర జీవుల గురించి రాసిన జలచర విలాసం (108), – వీటి ప్రశస్తిని శతకాలుగా రచించారు. ప్రస్తుతం శ్రీమతి చివుకుల శ్రీలక్ష్మి గారు అందించే చిత్రాల సహకారంతో ప్రతి రోజూ ఒక్క మొక్క తాలూకు ఔషధ విలువలను పద్యం సహితంగా అందిస్తున్నారు.
వస్తుగుణ దీపిక, బసవ రాజీయం, చరక సంహిత, సుగుణ రత్నాకరం మొదలైన ఆయుర్వేద గ్రంధాలను పరిశీలించి, సంక్షిప్తగా నాగమంజరి గుమ్మా అందిస్తున్న ఈ రచనలను ప్రతి రోజూ తెలుపు అందిస్తుందని చెప్పడానికి సంతోషంగా ఉంది.
మన ప్రాంతీయ మొక్కలలోని ఔషధ గుణాలు గురించిన ఈ సమాచారం ఎంతో విలువైనదే. అలా అని వైద్యుని పర్యవేక్షణ లేకుండా వాటిని ఉపయోగించకూడదని నాగామంజరి గారి మనవి.