ఔషధ విలువల మొక్కలు ( 39 ) : తంగేడు
తంగేడు పూల శోభలు
రంగుల వల్లికల నిండి రమణీయమయెన్
తంగేడాకుల లొంగక
భంగమవని రోగమేది వైద్యుని మ్రోలన్
నాగమంజరి గుమ్మా
తంగేడు పూవులు, ఆకులు దసరా పూజలకు, సంక్రాంతి గొబ్బెమ్మలకు అలంకరణకు, బతుకమ్మలకు మాత్రమే కాదు, ఔషధంగా కూడా ఉపయోగపడతాయి.
వీటి లేత అకులు గుప్పెడు తీసుకుని, రెండు చిటికెల గవ్వపలుకుల బూడిద కలిపి, టాబ్లెట్స్ లాగా చేసి రోజుకు రెండు కడుపులోకి తీసుకుంటే వీర్యవృద్ధి కలిగి, సంతానం కలుగుతుందని గిరిజనులు నమ్ముతారు.
ఆయుర్వేదంలో తంగేడుకు మంచి ప్రాముఖ్యత ఉంది. దీనికి మధుర, రూక్ష, పిత్త, వాత కఫ హర గుణాలున్నట్టు పేర్కొన్నారు.
మధుమెహ వ్యాధితో కలిగే అతిమూత్రవ్యాధి నివారణకు, పూమొగ్గలతో తయారు చేసిన కషాయంలో తేనె కలుపుకుని తాగితే మంచిదని అంటారు. పంటి నొప్పి తగ్గడానికి కాండం టూత్ బ్రష్ లాగా చేసి వాడితే మంచిది. కడుపు నొప్పితో బాధపడే పిల్లలకు కాండం మీది బెరడుతో కాషాయం కాచి ఇస్తే తక్షణం ఉపశమనం కలుగుతుందని కూడా చెబుతారు.
నాగమంజరి గుమ్మా వృత్తి రీత్యా ఉపాధ్యాయురాలు. ప్రవృత్తి రీత్యా రచయిత్రి. వారు కవిత్వం, పద్యం, గద్యం వంటి ప్రక్రియల్లో అనేక రచనలు చేశారు. ప్రతి రోజూ ఒక రచనతో అనేక వాట్సప్ గ్రూపుల్లో వందలాది మందికి చేరువయ్యారు. ముఖ్యంగా పూవుల వర్ణన పద్యములు – పుష్పవిలాసం (1116), పండ్ల విశిష్టత తెలుపే ఫల విలాసం (108), పక్షుల గురించిన విహంగ విలాసం (108), సముద్ర జీవుల గురించి రాసిన జలచర విలాసం (108), – వీటి ప్రశస్తిని శతకాలుగా రచించారు. ప్రస్తుతం శ్రీమతి చివుకుల శ్రీలక్ష్మి గారు అందించే చిత్రాల సహకారంతో ప్రతి రోజూ ఒక్క మొక్క తాలూకు ఔషధ విలువలను పద్యం సహితంగా అందిస్తున్నారు.
మన ప్రాంతీయ మొక్కలలోని ఔషధ గుణాలు గురించిన ఈ సమాచారం ఎంతో విలువైనదే. అలా అని వైద్యుని పర్యవేక్షణ లేకుండా వాటిని ఉపయోగించకూడదని నాగమంజరి గారి మనవి.