ఔషధ విలువల మొక్కలు ( 36 ) : చామంతి
రంగు రంగుల పూవులు లచ్చి సిరులు
పడతులందరు మెచ్చెడి పసిడి విరులు
పసుపు పారాణి చామంతి వగలు పెరుగ
ఆకు లొక్కటి చాలునే ఔషధముగ
నాగమంజరి గుమ్మా
రంగు రంగుల చామంతులంటే ఇష్టపడని వారెవరు? పూజల్లో రంగురంగుల చామంతుల అందమే వేరు.
ఇపుడు చామంతి టీ కూడా అందుబాటులోకి వచ్చింది. ఈ చామంతి పూల తేనీరు సేవించడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని పలువురు పరిశోధకులు చెపుతున్నారు.
నిద్రలేమి, పని ఒత్తిడి… ఇతరాత్రా కారణాలు కళ్లకింద వాపు వస్తుంది. ఇలాంటప్పుడు చామంతి టీ బ్యాగులని ఫ్రిజ్‌లో ఉంచి మూసిన కనురెప్పలపై ఉంచినట్టయితే ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చట. కంటి అలసటనూ తగ్గిస్తుందట. కంటికింద ఏర్పడే నల్లటి వలయాలూ దూరమవుతాయట.
ఇది చర్మ ఛాయను మెరుగుపరిచి వన్నెలీనేలా చేస్తుందట.
చామంతి టీని ముఖానికి రాసుకుని కొద్దిసేపు ఆరబెట్టడం వల్ల వడలిన చర్మం తక్షణ ఉపశమనం పొందేలా చేస్తుందట. దీనిలోని పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లూ, చర్మగ్రంథుల లోపలివరకూ చొచ్చుకునిపోయి శుభ్రం చేస్తాయి. చర్మం తాజా గానూ ఉంటుంది. అంతేనా కాలిన గాయాలు, దోమకాటు వల్ల వచ్చే దద్దుర్లు తగ్గుతాయి.
చామంతి టీని రోజూ ముఖానికి రాసుకుంటే సహజ బ్లీచింగ్ ఏజెంట్‌లా ఉపయోగపడుతుంది. ఇది చర్మ ఛాయను మెరుగుపరిచి వన్నెలీనేలా చేస్తుందట. ఇది చర్మాన్ని బిగుతుగా చేస్తుంది. ఫలితంగా ముఖంపై ఏర్పడే మచ్చలు వంటివి తగ్గుముఖం పడతాయి.
నాగమంజరి గుమ్మా వృత్తి రీత్యా ఉపాధ్యాయురాలు. ప్రవృత్తి రీత్యా రచయిత్రి. వారు కవిత్వం, పద్యం, గద్యం వంటి ప్రక్రియల్లో అనేక రచనలు చేశారు. ప్రతి రోజూ ఒక రచనతో అనేక వాట్సప్ గ్రూపుల్లో వందలాది మందికి చేరువయ్యారు. ముఖ్యంగా పూవుల వర్ణన పద్యములు – పుష్పవిలాసం (1116), పండ్ల విశిష్టత తెలుపే ఫల విలాసం (108), పక్షుల గురించిన విహంగ విలాసం (108), సముద్ర జీవుల గురించి రాసిన జలచర విలాసం (108), – వీటి ప్రశస్తిని శతకాలుగా రచించారు. ప్రస్తుతం శ్రీమతి చివుకుల శ్రీలక్ష్మి గారు అందించే చిత్రాల సహకారంతో ప్రతి రోజూ ఒక్క మొక్క తాలూకు ఔషధ విలువలను పద్యం సహితంగా అందిస్తున్నారు.
మన ప్రాంతీయ మొక్కలలోని ఔషధ గుణాలు గురించిన ఈ సమాచారం ఎంతో విలువైనదే. అలా అని వైద్యుని పర్యవేక్షణ లేకుండా వాటిని ఉపయోగించకూడదని నాగమంజరి గారి మనవి.