ఔషధ విలువల మొక్కలు ( 26 ) : రణపాల
పర్ణబీజమనుచు ప్రఖ్యాతి నొందిన
పత్రమిదని తెలియ చిత్రమగును
బాహ్య వర్తనమున పరమౌషధ మిదియే
మందమగు దళములు సుందరమ్ము
నాగమంజరి గుమ్మా
రణపాల.. నామ సార్ధక్యము తెలియదు కాని, ఆకు చివరల నున్న కణుపుల నుండి కొత్త మొక్కలు పుడతాయి కనుక పర్ణబీజ మయ్యింది. దీని రసాన్ని లోపలికి కషాయంగా తీసుకుంటే మూత్రపిండాలలోని రాళ్లు కరుగుతాయి అన్న విషయానికి ఆయుర్వేద నిరూపణ లేదు కానీ సెగ గడ్డలు, పొత్తికడుపు నొప్పులకు మాత్రం ఆకును కాస్త వేడి చేసి, ఆముదం రాసి సెగ గడ్డపై లేదా పొత్తికడుపుపై వేసి కడితే వెంటనే ఉపశమనం లభిస్తుంది.
రణపాల మొక్క రసంవల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుందంటారు. రణపాల ఆకు రసాన్ని కళ్ల చుట్టూ పలుచటి లేపనంగా రాయడం వల్ల కంటి నొప్పుల నుంచి బయటపడవచ్చుని చెబుతారు. స్త్రీలలో ఎక్కువగా యోని సంబంధిత వ్యాధులకు దీని కషాయం వల్ల త్వరగా ఉపశమనం కలుగుతుందనీ అంటారు. ఇది రక్త విరేచనాలను కూడా నయం చేయడంలో పైల్స్ నుంచి విముక్తి కలుగించడంలో అమోఘంగా పనిచేస్తుందనీ చెబుతారు.
దళసరిఆకులు, ఎర్రని చిన్న పువ్వులు కలిగి అలంకరణ మొక్కలుగా కూడా ఇవి బావుంటాయి. ఇంట్లో కుండీలో పెంచుకోదగిన మొక్కల్లో ఇది ఒకటి.
నాగమంజరి గుమ్మా వృత్తి రీత్యా ఉపాధ్యాయురాలు. ప్రవృత్తి రీత్యా రచయిత్రి. వారు కవిత్వం, పద్యం, గద్యం వంటి ప్రక్రియల్లో అనేక రచనలు చేశారు. ప్రతి రోజూ ఒక రచనతో అనేక వాట్సప్ గ్రూపుల్లో వందలాది మందికి చేరువయ్యారు. ముఖ్యంగా పూవుల వర్ణన పద్యములు – పుష్పవిలాసం (1116), పండ్ల విశిష్టత తెలుపే ఫల విలాసం (108), పక్షుల గురించిన విహంగ విలాసం (108), సముద్ర జీవుల గురించి రాసిన జలచర విలాసం (108), – వీటి ప్రశస్తిని శతకాలుగా రచించారు. ప్రస్తుతం శ్రీమతి చివుకుల శ్రీలక్ష్మి గారు అందించే చిత్రాల సహకారంతో ప్రతి రోజూ ఒక్క మొక్క తాలూకు ఔషధ విలువలను పద్యం సహితంగా అందిస్తున్నారు.
మన ప్రాంతీయ మొక్కలలోని ఔషధ గుణాలు గురించిన ఈ సమాచారం ఎంతో విలువైనదే. అలా అని వైద్యుని పర్యవేక్షణ లేకుండా వాటిని ఉపయోగించకూడదని నాగమంజరి గారి మనవి.