ఔషధ విలువల మొక్కలు ( 25 ) : మునగాకు
మునగ ఔషధమ్ము మున్నూరు రోగాల
మునగ తినిన చాలు ముదిమి రాదు
మునగ కాయ, జిగురు పువ్వులు మందులే
మునగ నెక్కరాదు మూతి పగులు
నాగమంజరి గుమ్మా
మునగ ఆకులు చాలా బలమైన ఆహారం. వేర్లు, ఆకులు, కాయలు, జిగురు, విత్తనాలు వైద్యంలో ఉపయోగిస్తున్నారు. ఆకులు, బెరడు, వాత, కంటి సమస్యలకు మంచి మందు. బాక్టీరియా, శిలీంధ్ర, కీటక సంహారిగా ఎరువుగా కూడా దీన్ని ఉపయోగిస్తారు. పాడి పశువులకు ఆకులు బలవర్ధకం. పాల ఉత్పత్తి 43-60 శాతం వరకు పెరుగుతుంది
నిత్య జీవితంలో ఎదుర్కొనే అనేక వ్యాధులను తగ్గించే శక్తి మునగ కలిగి ఉంది. కంటిచూపు తగ్గినా, అల్జీమర్స్, ఎముకల, కీళ్ల నొప్పులు , స్త్రీల వ్యాధులు, రక్తహీనత ఇంకా ఎన్నో కొన్ని వందల శారీరక రుగ్మతలు మునగ వల్ల నయమవుతాయి. ఆరోగ్యంగా జీవించడానికి కావలసిన అన్ని రకాల పోషక పదార్థాలు మునగలో ఉన్నాయి.
మునగ తింటే మూడు వందల రకాల జబ్బులు పరార్.
ఇతర ఆకుకూరల్లానే మునగాకుతో పప్పూ కూరలూ పచ్చళ్లూ పొడులూ రైస్ వెరైటీలూ కోఫ్తాలూ… అన్ని రకాలూ వండుకోవచ్చు. దోసెల్లో రొట్టెల్లో దట్టించినా రుచే. పొడిని టీ రూపంలో తాగొచ్చు, సూపుల్లో అన్నంలో కూరల్లో… ఎలా కావాలంటే అలా తినొచ్చు. అయితే ముదిరిన ఆకుల్లో పీచెక్కువ.
ఈ ఆషాఢ మాసంలో మునగాకు, తెలకపిండి (నువ్వుల నూనె గానుగలో ఆడగా వచ్చే పిండి), వెల్లుల్లి కలిపి కూరగా చేసుకుని ఒక్కసారైనా తినాలంటారు. ఇన్ని విశేషాలు ఎందుకు… మునగ తింటే మూడు వందల రకాల జబ్బులు పరార్…
మునగ విషయంలో చేయకూడనిది ఒక్కటే… మునగచెట్టు ఎక్కడం. చెట్టు పెళుసు. ఎక్కితే కొమ్మ విరిగి , మూతి పగలవచ్చు. ఇంకేదైనా కూడా అవవచ్చు
నాగమంజరి గుమ్మా వృత్తి రీత్యా ఉపాధ్యాయురాలు. ప్రవృత్తి రీత్యా రచయిత్రి. వారు కవిత్వం, పద్యం, గద్యం వంటి ప్రక్రియల్లో అనేక రచనలు చేశారు. ప్రతి రోజూ ఒక రచనతో అనేక వాట్సప్ గ్రూపుల్లో వందలాది మందికి చేరువయ్యారు. ముఖ్యంగా పూవుల వర్ణన పద్యములు – పుష్పవిలాసం (1116), పండ్ల విశిష్టత తెలుపే ఫల విలాసం (108), పక్షుల గురించిన విహంగ విలాసం (108), సముద్ర జీవుల గురించి రాసిన జలచర విలాసం (108), – వీటి ప్రశస్తిని శతకాలుగా రచించారు. ప్రస్తుతం శ్రీమతి చివుకుల శ్రీలక్ష్మి గారు అందించే చిత్రాల సహకారంతో ప్రతి రోజూ ఒక్క మొక్క తాలూకు ఔషధ విలువలను పద్యం సహితంగా అందిస్తున్నారు.
మన ప్రాంతీయ మొక్కలలోని ఔషధ గుణాలు గురించిన ఈ సమాచారం ఎంతో విలువైనదే. అలా అని వైద్యుని పర్యవేక్షణ లేకుండా వాటిని ఉపయోగించకూడదని నాగమంజరి గారి మనవి.