ఔషధ విలువల మొక్కలు ( 24 ) : నేలవేము
పేరు పోలికొకటి తీరు దానిని మించి
ఒక్క ఆకు చాలు మొక్క నుండి
చంటి పిల్లలకును సామాన్య రోగాల
అంతు చూచి వదలు అమృత పత్రి
నాగమంజరి గుమ్మా
పల్లెల్లో నివసించేవారు చిన్నతనం నుంచి శారీరక దృఢత్వం కోసం అనేక మందులు తినిపిస్తారు. వాటిలో ఒకటి ఈ నేలవేము.
చూడటానికి ఇది చిన్న మొక్కలా ఉంటుంది. ఒక్క ఆకు తీసి నోట పెట్టుకుంటే భరించలేని చేదు.
నేలవేము, పసుపు కలిపి నూరి ప్రతిశనివారం పిల్లలకి దాదాపు పది సంవత్సరాలు వయసు వచ్చేవరకు తాగిస్తారు. చేదు అంటారు గానీ ఇది జీర్ణవ్యవస్థ లోని అనేక ఇబ్బందులను తొలగిస్తుంది.
ఇది చక్కర వ్యాధిని అరికడుతుంది. కాలేయ వ్యాధులు రాకుండా చూస్తుంది. విష జ్వరాలు రాకుండా కాపాడుతుంది. చికున్ గున్యా వచ్చిన వారికి కూడా ఉపశమనం కలిగిస్తుంది.
గిరిజనులు నేలవేము చెట్లను ఇంట్లో వేలాడగట్టుకొని వాడుకుంటూ ఉంటారు. తెలు కుట్టిన వారికి నేలవేము ఆకు తినిపిస్తే తగ్గిపోతుందంటారు.
ఇది వేప కన్నా చేదుగా ఉంటుంది. కాండంలోను, ఆకులోను ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి.
నాగమంజరి గుమ్మా వృత్తి రీత్యా ఉపాధ్యాయురాలు. ప్రవృత్తి రీత్యా రచయిత్రి. వారు కవిత్వం, పద్యం, గద్యం వంటి ప్రక్రియల్లో అనేక రచనలు చేశారు. ప్రతి రోజూ ఒక రచనతో అనేక వాట్సప్ గ్రూపుల్లో వందలాది మందికి చేరువయ్యారు. ముఖ్యంగా పూవుల వర్ణన పద్యములు – పుష్పవిలాసం (1116), పండ్ల విశిష్టత తెలుపే ఫల విలాసం (108), పక్షుల గురించిన విహంగ విలాసం (108), సముద్ర జీవుల గురించి రాసిన జలచర విలాసం (108), – వీటి ప్రశస్తిని శతకాలుగా రచించారు. ప్రస్తుతం శ్రీమతి చివుకుల శ్రీలక్ష్మి గారు అందించే చిత్రాల సహకారంతో ప్రతి రోజూ ఒక్క మొక్క తాలూకు ఔషధ విలువలను పద్యం సహితంగా అందిస్తున్నారు.
మన ప్రాంతీయ మొక్కలలోని ఔషధ గుణాలు గురించిన ఈ సమాచారం ఎంతో విలువైనదే. అలా అని వైద్యుని పర్యవేక్షణ లేకుండా వాటిని ఉపయోగించకూడదని నాగమంజరి గారి మనవి.