ఔషధ విలువల మొక్కలు ( 23 ) : కొత్తిమీర
కొత్తిమీర చూడ ఘుమఘుమలు రుచియే
ధనియపాకు లివియె కనగ మంచి
కూర పచ్చడులకు కొండంత రుచినిచ్చు
కడుపు శుభ్రపరచు కాంతి పెంచు
నాగమంజరి గుమ్మా
కొత్తిమీర మంచి సువావన కలిగి ఉంటుంది. దీన్నివంటకాలలో విరివిగా వాడతారు. తెలుగు వారు దాదాపు ప్రతి కూరలో దీనిని వేస్తారు. అంతేకాక కొత్తిమీరతో పచ్చడి కూడా చేస్తారు.
కొత్తిమీర శాస్త్రీయ నామము “Coriandrum sativum”. ఇది ఆహార పదార్దాల మీద అలంకరించుకోవడానికి అని మాత్రమే భావిస్తే పొరబాటే. కొత్తిమిరి నిండా విటమిన్లు, ఖనిజ లవణాలు ఉన్నాయి. అంతేకాదు సమృద్ధిగా ఐరన్ కుడా లభిస్తుంది. మనం తీసుకునే అన్ని రకాల ఆకుకూరలు, కాయగూరల వంటకాలలో విరివిగా దీన్ని వాడవచ్చు.
ఇది రక్తహీనతను తగ్గిస్తుంది. పొగతాగడం, కీమోథెరపీ వల్ల కలిగే నష్టాన్ని తగ్గించడానికి పోరాడుతుంది
కొలెస్టరాల్ ను తగ్గిస్తుంది.రక్తనాళాలలో ఆటంకాలను తొలగిస్తుంది
కొత్తిమీర మొక్క కాండంలోనూ, ఆకుల్లోనూ, గింజల్లోనూ సుగంధ తత్వాలూ, ఔషధ తత్వాలూ అనేకం ఉంటాయి. ఈమధ్య జరిగిన అధ్యయనాల్లో కొత్తిమీర ఫుడ్ పాయిజనింగ్‌లో అత్యంత ప్రయోజనకారిగా పనిచేస్తుందని తేలింది. సాధారణంగా ఫుడ్ పాయినింగ్‌లో జెంటామైసిన్ వాడుతుంటారు. అయితే దీనికన్నా కొత్తిమీర ప్రభావవంతంగా, సురక్షితంగా పనిచేసినట్లు రుజువయ్యింది.
కొత్తిమీర ఉదరంలో చేరిన గ్యాస్‌ని తగ్గించటంతోపాటు మూత్రాన్ని చేయటం, జ్వరాన్ని తగ్గించటం చేస్తుంది. అలాగే శృంగారానురక్తిని పెంచటం, శ్వాసనాళికల్లో సంచితమైన కఫాన్ని కరిగించి వెలుపలకు వచ్చేలా చేయటం వంటి పనులను కూడా చేస్తుంది. ఉదర కండరాలు పట్టేసి నొప్పిని కలిగిస్తున్నప్పుడు ఉపశమనాన్ని కలిగిస్తుంది.
ఇది ఆహార పదార్దాల మీద అలంకరించుకోవడానికి అని మాత్రమే భావిస్తే పొరబాటే.
నాగమంజరి గుమ్మా వృత్తి రీత్యా ఉపాధ్యాయురాలు. ప్రవృత్తి రీత్యా రచయిత్రి. వారు కవిత్వం, పద్యం, గద్యం వంటి ప్రక్రియల్లో అనేక రచనలు చేశారు. ప్రతి రోజూ ఒక రచనతో అనేక వాట్సప్ గ్రూపుల్లో వందలాది మందికి చేరువయ్యారు. ముఖ్యంగా పూవుల వర్ణన పద్యములు – పుష్పవిలాసం (1116), పండ్ల విశిష్టత తెలుపే ఫల విలాసం (108), పక్షుల గురించిన విహంగ విలాసం (108), సముద్ర జీవుల గురించి రాసిన జలచర విలాసం (108), – వీటి ప్రశస్తిని శతకాలుగా రచించారు. ప్రస్తుతం శ్రీమతి చివుకుల శ్రీలక్ష్మి గారు అందించే చిత్రాల సహకారంతో ప్రతి రోజూ ఒక్క మొక్క తాలూకు ఔషధ విలువలను పద్యం సహితంగా అందిస్తున్నారు.
మన ప్రాంతీయ మొక్కలలోని ఔషధ గుణాలు గురించిన ఈ సమాచారం ఎంతో విలువైనదే. అలా అని వైద్యుని పర్యవేక్షణ లేకుండా వాటిని ఉపయోగించకూడదని నాగమంజరి గారి మనవి.