ఔషధ విలువల మొక్కలు ( 20 ) : అర్జున పత్రం
తెల్లమద్ది పేర తెలిసిన పత్రము
అర్జునమను పేర నవతరించె
పూలు తండ్రి కివ్వ పొసగి పేరున దాల్చె
పత్రి కొమరు పూజ వరము పొందె
నాగమంజరి గుమ్మా
అర్జున పత్రం అంటే తెల్లమద్ది ఆకు.
ఒక రాజు కుమార్తె శ్రీశైలంలో శివుణ్ణి అర్జున పుష్పాలతో, మల్లికలతో పూజించడం వలన ఆమెను కటాక్షించిన శివుడు ఆ రెండు పూల పేరుతో మల్లికార్జునుడు అయ్యాడట. ఆ చెట్టు పత్రి ఆయన కుమారుని పూజా పత్రులలో స్థానం పొందిందట.
ఔషధ పరంగా చూస్తే దీని బెరడు అధిక రక్తపోటు, గుండె నొప్పి మొదలైన వివిధ రకాలైన గుండె జబ్బులలో చాలా ఉపయోగపడుతుందని పరిశోధనలు నిరూపించాయి. ఆధునిక పరిశోధనలలో కూడా ఇది ‘కార్డియాక్ టానిక్’ గా ఉపయోగపడుతున్నట్లు కనుగొన్నారు. ఇది ఇతర రకాలైన నొప్పులలో కూడా ఉపయోగపడుతుంది. తెల్ల మద్ది రక్తంలో కొలెస్టిరాల్ అధికంగా ఉన్నవారికి ఉపయోగపడుతుంది
ఆధునిక పరిశోధనలలో కూడా ఇది ‘కార్డియాక్ టానిక్’ గా ఉపయోగపడుతున్నట్లు కనుగొన్నారు.
నాగమంజరి గుమ్మా వృత్తి రీత్యా ఉపాధ్యాయురాలు. ప్రవృత్తి రీత్యా రచయిత్రి. వారు కవిత్వం, పద్యం, గద్యం వంటి ప్రక్రియల్లో అనేక రచనలు చేశారు. ప్రతి రోజూ ఒక రచనతో అనేక వాట్సప్ గ్రూపుల్లో వందలాది మందికి చేరువయ్యారు. ముఖ్యంగా పూవుల వర్ణన పద్యములు – పుష్పవిలాసం (1116), పండ్ల విశిష్టత తెలుపే ఫల విలాసం (108), పక్షుల గురించిన విహంగ విలాసం (108), సముద్ర జీవుల గురించి రాసిన జలచర విలాసం (108), – వీటి ప్రశస్తిని శతకాలుగా రచించారు. ప్రస్తుతం శ్రీమతి చివుకుల శ్రీలక్ష్మి గారు అందించే చిత్రాల సహకారంతో ప్రతి రోజూ ఒక్క మొక్క తాలూకు ఔషధ విలువలను పద్యం సహితంగా అందిస్తున్నారు.
మన ప్రాంతీయ మొక్కలలోని ఔషధ గుణాలు గురించిన ఈ సమాచారం ఎంతో విలువైనదే. అలా అని వైద్యుని పర్యవేక్షణ లేకుండా వాటిని ఉపయోగించకూడదని నాగమంజరి గారి మనవి.