ఔషధ విలువల మొక్కలు ( 19 ) : అశ్వత్థ పత్రం
మూల బ్రహ్మ, విష్ణుమూర్తి మధ్య చివర
హరుడు నుండు గొప్ప తరువు రావి
విఘ్ననాయకునకు వినయంపు పత్రమై
పూజ సేయ వచ్చె భూజ మిద్ది
నాగమంజరి గుమ్మా
విశ్వరూప సందర్శనంలో శ్రీ కృష్ణ పరమాత్ముడు “వృక్షాలలోకెల్ల విశేషమైన అశ్వత్థ వృక్షమును అర్జునా నేను” అని తెలియజేసారు. చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసేటపుడు “మూలతో బ్రహ్మ రూపాయ మధ్యతో విష్ణు రూపిణీ, అగ్రతో శివరూపాయ వృక్షరాజాయతే నమః” అని శ్లోకం చదువుకోవడం కూడా పరిపాటి. అంత గొప్ప వృక్షం శ్రీ గణేశుని పూజలో పత్రమై వినయంగా ఒదిగిపోయింది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే విషయాన్ని చెప్పకనే చెప్తున్నది రావి చెట్టు.
ఆయుర్వేదం లో శ్వాసకోశ వ్యాధుల చికిత్సలో రావి ఆకులను, విత్తులను, మండలను (చిన్న, లేత కొమ్మలు) ఉపయోగిస్తారు. రావి మండలను ఎండబెట్టి.. ఎండిన పుల్లలను నేతితో కాల్చి భస్మం చేసి ఆ భస్మాన్ని తేనెతో కలి పి రోజూ సేవిస్తే శ్వాసకోశ వ్యాధులు నయమవుతాయని చెబుతారు.
ఈ పత్రి సుగంధమూ, దుర్గంధమూ కాని విశిష్టమైన వాసనతో ఉంటుంది.
నాగమంజరి గుమ్మా వృత్తి రీత్యా ఉపాధ్యాయురాలు. ప్రవృత్తి రీత్యా రచయిత్రి. వారు కవిత్వం, పద్యం, గద్యం వంటి ప్రక్రియల్లో అనేక రచనలు చేశారు. ప్రతి రోజూ ఒక రచనతో అనేక వాట్సప్ గ్రూపుల్లో వందలాది మందికి చేరువయ్యారు. ముఖ్యంగా పూవుల వర్ణన పద్యములు – పుష్పవిలాసం (1116), పండ్ల విశిష్టత తెలుపే ఫల విలాసం (108), పక్షుల గురించిన విహంగ విలాసం (108), సముద్ర జీవుల గురించి రాసిన జలచర విలాసం (108), – వీటి ప్రశస్తిని శతకాలుగా రచించారు. ప్రస్తుతం శ్రీమతి చివుకుల శ్రీలక్ష్మి గారు అందించే చిత్రాల సహకారంతో ప్రతి రోజూ ఒక్క మొక్క తాలూకు ఔషధ విలువలను పద్యం సహితంగా అందిస్తున్నారు.
మన ప్రాంతీయ మొక్కలలోని ఔషధ గుణాలు గురించిన ఈ సమాచారం ఎంతో విలువైనదే. అలా అని వైద్యుని పర్యవేక్షణ లేకుండా వాటిని ఉపయోగించకూడదని నాగమంజరి గారి మనవి.