ఔషధ విలువల మొక్కలు ( 18 ) : శమీ పత్రం
అరణి యనెడి పేర నగ్ని మధించెడి
కలప జమ్మి పత్ర కనక మిదియె
శ్రీ గణేశు పూజ శ్రీ గౌరి పూజల
వెలుగు దివ్య పత్రి విజయ పత్రి
నాగమంజరి గుమ్మా
శమీ లేదా జమ్మి అని పిలిచే ఈ పత్రి పురాణ సంబంధమైనది. యజ్ఞ యాగాదులు చేసినపుడు అరణి మధించి అగ్ని పుట్టిస్తారు. ఆ అరణి ఈ జమ్మి కలపయే. జమ్మి ఆకులు బంగారంతో సమానం. విఘ్నేశ్వర పూజలోను, విజయదశమి అమ్మవారి పూజలోను దీనికి విశేష ప్రాముఖ్యముంది.
వైద్య పరంగా కుష్టు రోగ నివారణకు, అవాంఛిత రోమాల నివారణకు జమ్మి యొక్క ఆకులను ఉపయోగిస్తారు. జమ్మి ఆకుల నుండి పసరు తీసి దానిని పుళ్ళు ఉన్న చోట రాస్తే కుష్ఠువ్యాధి నశిస్తుంది.
ఆయుర్వేద మందులలో శమీవృక్షం ఆకు, పువ్వులు, విత్తనాలు, చెట్టు బెరడు అన్నీ ఉపయోగిస్తారు. కొన్ని జమ్మి ఆకులు, కొంచం చెట్టు బెరడు, రెండు మిరియాలు నూరి మాత్రలు చేసుకొని మజ్జిగతో వేసుకుంటే అతిసార వ్యాధి తగ్గుతుంది. ఇలా ఎన్నో రోగాలకు ఉపయోగపడుతుంది. అందుకే ఈ చెట్టుకు సురభి బంగారం అనే పేరు వచ్చింది.
ఈ చెట్టుకు సురభి బంగారం అనే పేరు
నాగమంజరి గుమ్మా వృత్తి రీత్యా ఉపాధ్యాయురాలు. ప్రవృత్తి రీత్యా రచయిత్రి. వారు కవిత్వం, పద్యం, గద్యం వంటి ప్రక్రియల్లో అనేక రచనలు చేశారు. ప్రతి రోజూ ఒక రచనతో అనేక వాట్సప్ గ్రూపుల్లో వందలాది మందికి చేరువయ్యారు. ముఖ్యంగా పూవుల వర్ణన పద్యములు – పుష్పవిలాసం (1116), పండ్ల విశిష్టత తెలుపే ఫల విలాసం (108), పక్షుల గురించిన విహంగ విలాసం (108), సముద్ర జీవుల గురించి రాసిన జలచర విలాసం (108), – వీటి ప్రశస్తిని శతకాలుగా రచించారు. ప్రస్తుతం శ్రీమతి చివుకుల శ్రీలక్ష్మి గారు అందించే చిత్రాల సహకారంతో ప్రతి రోజూ ఒక్క మొక్క తాలూకు ఔషధ విలువలను పద్యం సహితంగా అందిస్తున్నారు.
మన ప్రాంతీయ మొక్కలలోని ఔషధ గుణాలు గురించిన ఈ సమాచారం ఎంతో విలువైనదే. అలా అని వైద్యుని పర్యవేక్షణ లేకుండా వాటిని ఉపయోగించకూడదని నాగమంజరి గారి మనవి.