ఔషధ విలువల మొక్కలు ( 10 ) : బదరీ పత్రం
రేగు పత్రి యొకటి శ్రీ గణేశుని చేరి
పూజలందు మనుచు పొసగి వేడె
బదరి మనెడి పేరు పరిఢ విల్లెద వీవు
కాచుపిల్లల ననె గౌరి సుతుడు
నాగమంజరి గుమ్మా
బదరి లేదా రేగు, ఇది చిన్న పిల్లలకు సంబంధించిన వ్యాధుల నివారణకు దివ్యౌషధంగా పనిచేస్తుంది. ఒకటి లేదా రెండు ఆకులను ప్రతిరోజూ ఒకటి లేదా రెండు పూటలు తినిపిస్తే వ్యాధులు పూర్తిగా నయమవుతాయి. అన్నట్టు, ఎక్కువగా తింటే కఫం వచ్చే ప్రమాదముందని గమనించాలి.
ఈ పత్రి గురించి ఉల్లేఖన ఆయుర్వేదంలో ఉంది. ఇది రక్తహీనత, నీరసం, గొంతునొప్పి, శ్వాసనాళాల వాపు, విసుగు, హిస్టీరియా రోగాల నివారణకు ఉపయోగపడుతుంది.
వినాయక చవితి రోజు చేసుకునే వరసిద్ధి వినాయక ఏకవింశతి పత్రి పూజా క్రమములో ఈ ఆకు కూడా బదరీ పత్రం పేరుతో ఉంది.
ఆయుర్వేద వైద్య నియమాల రీత్యా కడుపులోకి తీసుకునే ఔషధాలను యధాతధంగా అందించకూడదు. ఉపయోగించేవారికి ఒక్కొక్కప్పుడు వికటించవచ్చు. అందుకే విధానం గోప్యంగా ఉంచబడుతుంది.
నాగమంజరి గుమ్మా వృత్తి రీత్యా ఉపాధ్యాయురాలు. ప్రవృత్తి రీత్యా రచయిత్రి. వారు కవిత్వం, పద్యం, గద్యం వంటి ప్రక్రియల్లో అనేక రచనలు చేశారు. ప్రతి రోజూ ఒక రచనతో అనేక వాట్సప్ గ్రూపుల్లో వందలాది మందికి చేరువయ్యారు. ముఖ్యంగా పూవుల వర్ణన పద్యములు – పుష్పవిలాసం (1116), పండ్ల విశిష్టత తెలుపే ఫల విలాసం (108), పక్షుల గురించిన విహంగ విలాసం (108), సముద్ర జీవుల గురించి రాసిన జలచర విలాసం (108), – వీటి ప్రశస్తిని శతకాలుగా రచించారు. ప్రస్తుతం శ్రీమతి చివుకుల శ్రీలక్ష్మి గారు అందించే చిత్రాల సహకారంతో ప్రతి రోజూ ఒక్క మొక్క తాలూకు ఔషధ విలువలను పద్యం సహితంగా అందిస్తున్నారు.
మన ప్రాంతీయ మొక్కలలోని ఔషధ గుణాలు గురించిన ఈ సమాచారం ఎంతో విలువైనదే. అలా అని వైద్యుని పర్యవేక్షణ లేకుండా వాటిని ఉపయోగించకూడదని నాగమంజరి గారి మనవి.