పాప మాటలాడ వసపిట్ట యనుచును
మురిసిపోనిదెవరు ముద్దులాడి?
వసను రంగరించి రసనకు నాకించు
సంప్రదాయముండె జనులలోన
నాగమంజరి గుమ్మా
పూర్వం మనదేశంలో అన్ని పల్లెసీమలలో పుట్టిన ప్రతి బిడ్డకు పురిట్లోనే వస కొమ్మును చనుబాలతో అరగదీసి పట్టేవారు. ఇప్పటికీ ఈ సాంప్రదాయం తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలలో కొనసాగుతూనే ఉంది. దీని వలన గొంతులోని కఫం పోవడమే గాక ఉత్తరోత్తరా మాటలు స్పస్టంగా రావడానికి ఉపకరిస్తుందని భావిస్తారు.
శాస్త్రీయంగా కూడా దీనిని పిల్లలలో ఉపయోగించడం వలన కపమును హరించి మానసిక ఉత్తేజాన్ని కలిగిస్తుంది. దీని ప్రభావం వలన నాలుక సంబంధమైన నాడులు చురుకుగా పనిచేస్తాయి.
వస వేళ్ళను గొంతు వ్యాధులు, కడుపు నొప్పి, జ్వరం, మానసిక రుగ్మత, కాలేయం, రొమ్ము నొప్పుల నివారణలోను, మూత్రపిండ వ్యాధులలోను బొల్లి మచ్చల నివారణలో వాడతారు.
చరక సంహిత, చికిత్సా స్థానం, అష్టాంగ హృదయం, వంగసేన సంహిత మొదలగు ఆయుర్వేద గ్రంధాలలో వీటి ఉపయోగం వివరించబడింది.
నాగమంజరి గుమ్మా వృత్తి రీత్యా ఉపాధ్యాయురాలు. ప్రవృత్తి రీత్యా రచయిత్రి. వారు కవిత్వం, పద్యం, గద్యం వంటి ప్రక్రియల్లో అనేక రచనలు చేశారు. ప్రతి రోజూ ఒక రచనతో అనేక వాట్సప్ గ్రూపుల్లో వందలాది మందికి చేరువయ్యారు. ముఖ్యంగా పూవుల వర్ణన పద్యములు – పుష్పవిలాసం (1116), పండ్ల విశిష్టత తెలుపే ఫల విలాసం (108), పక్షుల గురించిన విహంగ విలాసం (108), సముద్ర జీవుల గురించి రాసిన జలచర విలాసం (108), – వీటి ప్రశస్తిని శతకాలుగా రచించారు. ప్రస్తుతం శ్రీమతి చివుకుల శ్రీలక్ష్మి గారు అందించే చిత్రాల సహకారంతో ప్రతి రోజూ ఒక్క మొక్క తాలూకు ఔషధ విలువలను పద్యం సహితంగా అందిస్తున్నారు.
మన ప్రాంతీయ మొక్కలలోని ఔషధ గుణాలు గురించిన ఈ సమాచారం ఎంతో విలువైనదే. అలా అని వైద్యుని పర్యవేక్షణ లేకుండా వాటిని ఉపయోగించకూడదని నాగమంజరి గారి మనవి.