శరపుంఖ మనెడి పేరిట
సరియగు నౌషధమిది జన సామాన్యమునన్
పరిసరముల వెంపలియని
పరిచితమౌ పేర తెలియు పల్లెల యందున్
నాగమంజరి గుమ్మా
వెంపలి , శరపుంఖ tephrosia purpurea అనే పేరిట పెరిగే చిన్న మొక్క లేదా పొద. బచ్చలి పండు రంగు చిన్న పూవులు, గుత్తి చిక్కుడు వంటి కాయలు… కాలజ్ఞానం లో బ్రహ్మం గారు చెప్పిన మొక్క ఇదే… వెంపలి చెట్టుకు నిచ్చెన వేసి ప్రజలు ఎక్కుతారు అని.. అంటే అంత చిన్న మనుషులన్నమాట.
ఔషధ విషయానికి వస్తే ఆకలి పుట్టకపోతే వెంపలి (మందాగ్ని) వేరు కషాయం 1/2 కప్పు తాగించాలట. విరోచనాలకు ఆ కషాయంలో శొంఠి లేదా లవంగాలు చేర్చాలట. కడుపులో నులిపురుగుల నివారణకు ఆ కషాయంలో వాయు విడంగాల చూర్ణం కలిపి తీసుకోవాలట.
చర్మవ్యాధులకు కషాయంలో తేనె కలిపి ఒంటికి పూయాలట. కడుపు నొప్పికి వేరు పట్ట, మిరియాలు ముద్ద చేసి లేదా వేరు కషాయం, అల్లంరసం కలిపి పనిచేస్తాయట. వ్రణాలకు ఆకులను తేనెతో నూరి పట్టు వేయాలట.
ఆయుర్వేద వైద్యం లేదా సాంప్రదాయక వైద్య విధానాలలో ఏవి ఎంతెంత పాళ్లు కలపాలో వైద్యునికి తప్ప ఇతరులకు చెప్పరు. కనుక స్వీయ వైద్యం ప్రమాదకరం.
నాగమంజరి గుమ్మా వృత్తి రీత్యా ఉపాధ్యాయురాలు. ప్రవృత్తి రీత్యా రచయిత్రి. వారు కవిత్వం, పద్యం, గద్యం వంటి ప్రక్రియల్లో అనేక రచనలు చేశారు. ప్రతి రోజూ ఒక రచనతో అనేక వాట్సప్ గ్రూపుల్లో వందలాది మందికి చేరువయ్యారు. ముఖ్యంగా పూవుల వర్ణన పద్యములు – పుష్పవిలాసం (1116), పండ్ల విశిష్టత తెలుపే ఫల విలాసం (108), పక్షుల గురించిన విహంగ విలాసం (108), సముద్ర జీవుల గురించి రాసిన జలచర విలాసం (108), – వీటి ప్రశస్తిని శతకాలుగా రచించారు. ప్రస్తుతం శ్రీమతి చివుకుల శ్రీలక్ష్మి గారు అందించే చిత్రాల సహకారంతో ప్రతి రోజూ ఒక్క మొక్క తాలూకు ఔషధ విలువలను పద్యం సహితంగా అందిస్తున్నారు.
మన ప్రాంతీయ మొక్కలలోని ఔషధ గుణాలు గురించిన ఈ సమాచారం ఎంతో విలువైనదే. అలా అని వైద్యుని పర్యవేక్షణ లేకుండా వాటిని ఉపయోగించకూడదని నాగమంజరి గారి మనవి.