కుదురుగాను మొక్క కుచ్చులా పత్రాలు
చూడ చక్కనమ్మ జాడ కనరె
మొక్కపేరు తెలియ మురిపిండి , కుప్పింట
దారి పక్కనుండు తట్టి చూడు
నాగమంజరి గుమ్మా
దారికిరువైపులా జాగ్రత్తగా పరిశీలిస్తూ పోతే చక్కని కుచ్చిళ్ళు పోసినట్లున్న ఆకులతో ఒక మొక్క కనిపిస్తుంది. దానిపేరే మురిపిండి లేదా కుప్పింట. Acalypha Indica.
ఈ ఆకులు రసం తీసి చెవిలో వేస్తే చెవిపోటు, తలనొప్పి కూడా తగ్గుతాయట. ఆకుల రసంలో పచ్చకర్పూరం కలిపి పెడితే పంటినొప్పి పోతుందట. ఆకుల రసం లేదా చూర్ణం కడుపులోకి వెళ్తే నులిపురుగులు పోతాయట. మురిపిండి ఆకులు, ఉప్పు, పసుపు కలిపి నూరి రాస్తే చర్మ వ్యాధులు తగ్గుతాయట. అలాగే ఆకుల రసంలో వేపనూనె కలిపి ఒంటికి రాసినా చాలు. ఇంకా వ్రణాలకు, గోరుచుట్టు, విషపురుగుల కాటుకు (తేనెటీగ, జెర్రి, కందిరీగ కరిచినపుడు) వీటి ఆకులు నలిపి పెడితే చాలు. తక్షణ ఉపశమనం లభిస్తుందట.
విషపురుగుల కాటుకు వీటి ఆకులు నలిపి పెడితే చాలు. తక్షణ ఉపశమనం లభిస్తుందట.
నాగమంజరి గుమ్మా వృత్తి రీత్యా ఉపాధ్యాయురాలు. ప్రవృత్తి రీత్యా రచయిత్రి. వారు కవిత్వం, పద్యం, గద్యం వంటి ప్రక్రియల్లో అనేక రచనలు చేశారు. ప్రతి రోజూ ఒక రచనతో అనేక వాట్సప్ గ్రూపుల్లో వందలాది మందికి చేరువయ్యారు. ముఖ్యంగా పూవుల వర్ణన పద్యములు – పుష్పవిలాసం (1116), పండ్ల విశిష్టత తెలుపే ఫల విలాసం (108), పక్షుల గురించిన విహంగ విలాసం (108), సముద్ర జీవుల గురించి రాసిన జలచర విలాసం (108), – వీటి ప్రశస్తిని శతకాలుగా రచించారు. ప్రస్తుతం శ్రీమతి చివుకుల శ్రీలక్ష్మి గారు అందించే చిత్రాల సహకారంతో ప్రతి రోజూ ఒక్క మొక్క తాలూకు ఔషధ విలువలను పద్యం సహితంగా అందిస్తున్నారు.
మన ప్రాంతీయ మొక్కలలోని ఔషధ గుణాలు గురించిన ఈ సమాచారం ఎంతో విలువైనదే. అలా అని వైద్యుని పర్యవేక్షణ లేకుండా వాటిని ఉపయోగించకూడదని నాగమంజరి గారి మనవి.