అత్తి పత్తి చూడ నంటకు నన్నను
ముట్టుకున్న చాలు ముడుచుకొనును
సిగ్గరియని పేరు చేయు మేలది వేలు
ముళ్ల మొక్క యనుచు వెళ్ల బోకు
నాగమంజరి గుమ్మా
అత్తిపత్తి, నిద్రగన్నేరు, touch me not, సిగ్గరి అనే పేర్లున్న ఈ మొక్క తెలియని వారు లేరు.
ఇది రక్త శుద్ధి చేస్తుంది. ముక్కు నుండి కారే రక్తాన్ని ఆపుతుంది. స్త్రీ రోగాలను హరించి వేస్తుంది. ఋతురక్తాన్ని, మూత్రాన్ని సాఫీగా జారీచేస్తుంది. వాతాన్ని హరిస్తుంది. పాత వ్రణాలను మాన్పుతుంది. మధుమేహ రోగాన్ని, మూలవ్యాధిని, బోదకాలును, కామెర్లను, పొడలను, కుష్టు వ్యాధిని, విరేచనాలను, జ్వరమును, గుండెదడను, శ్వాసకాసాలను, తుంటి నొప్పిని, ఉబ్బరోగం వంటి వాటిని తగ్గిస్తుంది. ఐతే, వైద్యుని పర్యవేక్షణ అవసరం. స్వీయ వైద్యం ప్రాణాంతకం అని గమనించాలి.
పేరుకు, తీరుకు సిగ్గరి అయిన ఈ మొక్క ఔషధ గుణాలలో నేర్పరి.
నాగమంజరి గుమ్మా వృత్తి రీత్యా ఉపాధ్యాయురాలు. ప్రవృత్తి రీత్యా రచయిత్రి. వారు కవిత్వం, పద్యం, గద్యం వంటి ప్రక్రియల్లో అనేక రచనలు చేశారు. ప్రతి రోజూ ఒక రచనతో అనేక వాట్సప్ గ్రూపుల్లో వందలాది మందికి చేరువయ్యారు. ముఖ్యంగా పూవుల వర్ణన పద్యములు – పుష్పవిలాసం (1116), పండ్ల విశిష్టత తెలుపే ఫల విలాసం (108), పక్షుల గురించిన విహంగ విలాసం (108), సముద్ర జీవుల గురించి రాసిన జలచర విలాసం (108), – వీటి ప్రశస్తిని శతకాలుగా రచించారు. ప్రస్తుతం శ్రీమతి చివుకుల శ్రీలక్ష్మి గారు అందించే చిత్రాల సహకారంతో ప్రతి రోజూ ఒక్క మొక్క తాలూకు ఔషధ విలువలను పద్యం సహితంగా అందిస్తున్నారు.
మన ప్రాంతీయ మొక్కలలోని ఔషధ గుణాలు గురించిన ఈ సమాచారం ఎంతో విలువైనదే. అలా అని వైద్యుని పర్యవేక్షణ లేకుండా వాటిని ఉపయోగించకూడదని నాగమంజరి గారి మనవి.