తులసి గుణములున్ను తులసి రూపము తోను
చలువ చేయు గింజ సబ్జ యనుచు
రుద్రజడయె పుట్టె భద్రమై కాచగా
ముంగిటొకటి యున్న ముదము గూర్చు
నాగమంజరి గుమ్మా
రుద్రజడ లేదా భూతులసి అనే పేరున్న ఈ మొక్క తులసి రూపంలోనే, తులసి గుణాలనే కలిగి ఉంటుంది. పైగా ఈ మొక్క గింజలను సబ్జాగింజలు అంటారు. వేసవిలో ఈ గింజలను కాస్త నీళ్లలో నానబెట్టి, పాలు, పంచదార వేసి తాగితే చలువ, బలం కలిగిస్తాయి.
నాగమంజరి గుమ్మా వృత్తి రీత్యా ఉపాధ్యాయురాలు. ప్రవృత్తి రీత్యా రచయిత్రి. వారు కవిత్వం, పద్యం, గద్యం వంటి ప్రక్రియల్లో అనేక రచనలు చేశారు. ప్రతి రోజూ ఒక రచనతో అనేక వాట్సప్ గ్రూపుల్లో వందలాది మందికి చేరువయ్యారు. ముఖ్యంగా పూవుల వర్ణన పద్యములు – పుష్పవిలాసం (1116), పండ్ల విశిష్టత తెలుపే ఫల విలాసం (108), పక్షుల గురించిన విహంగ విలాసం (108), సముద్ర జీవుల గురించి రాసిన జలచర విలాసం (108), – వీటి ప్రశస్తిని శతకాలుగా రచించారు. ప్రస్తుతం శ్రీమతి చివుకుల శ్రీలక్ష్మి గారు అందించే చిత్రాల సహకారంతో ప్రతి రోజూ ఒక్క మొక్క తాలూకు ఔషధ విలువలను పద్యం సహితంగా అందిస్తున్నారు.
మన ప్రాంతీయ మొక్కలలోని ఔషధ గుణాలు గురించిన ఈ సమాచారం ఎంతో విలువైనదే. అలా అని వైద్యుని పర్యవేక్షణ లేకుండా వాటిని ఉపయోగించకూడదని నాగమంజరి గారి మనవి.