అరిటాకు భోజనమునకు
నరటి మొలకలంకరణకు ననువైనవిగా
అరిటాకు గరళ హారిణి
అరిటాకు మైత్రి నిలుపు ననుబంధములున్
నాగమంజరి గుమ్మా
అరటి ఆకులో భోజనం మన తెలుగువారి సంప్రదాయం. ఒకప్పుడు మన ఇండ్లకు పరిమితమైన ఈ ఆచారం నేను హోటళ్లలోను, పార్సేళ్లకు కూడా పాకింది.
ఒకసారి తిని, కడిగి మళ్ళీ ఉపయోగించే పాత్రల కంటే అరిటాకులో భోజనం ఉత్తమం. పర్యావరణ హితం. అరటి నార అలంకరణ వస్తువులు, పూలమాలలకు, అరటి మొలకలను దైవ కార్యాలలో, శుభకార్యాలలో అలంకరణకు ఉపయోగిస్తారు.
అరటి ఆకులో భోజనం పెట్టినప్పుడు, ఆహారంలో విషం కలిస్తే నల్లగా మారిపోతుందని అంటారు.
ఇక, అరటిపండ్లు. అవి ఆరోగ్యానికి ఎంతో మేలని అందరికీ తెలుసు. అవి రకరకాల రంగులలో, ఆకారాల్లో లభిస్తున్నాయి. పండిన పండ్లు తేలికగా తొక్క వలుచుకొని తినడానికీ, పచ్చి కాయలు తేలికగా వంట చేసుకుని తినడానికీ అనువుగా ఉంటాయి. పక్వ దశను బట్టి వీటి రుచి వగరు నుండి తియ్యదనానికి మారుతుంది. ‘పచ్చి’ అరటికాయలను వండటానికి ఉపయోగిస్తారు.
అరటి చెట్లతో పాటు అరటి పువ్వును (దీనిని తరచూ అరటి పుష్పం లేదా అరటి హృదయం అని అంటారు) బెంగాలీ వంటలలో, కేరళ వంటలలో ఉపయోగిస్తారు. అరటి కాండములోని సున్నితమైన మధ్య భాగం (దూట) కూడా వంటలలో ఉపయోగిస్తారు
నాగమంజరి గుమ్మా వృత్తి రీత్యా ఉపాధ్యాయురాలు. ప్రవృత్తి రీత్యా రచయిత్రి. వారు కవిత్వం, పద్యం, గద్యం వంటి ప్రక్రియల్లో అనేక రచనలు చేశారు. ప్రతి రోజూ ఒక రచనతో అనేక వాట్సప్ గ్రూపుల్లో వందలాది మందికి చేరువయ్యారు. ముఖ్యంగా పూవుల వర్ణన పద్యములు – పుష్పవిలాసం (1116), పండ్ల విశిష్టత తెలుపే ఫల విలాసం (108), పక్షుల గురించిన విహంగ విలాసం (108), సముద్ర జీవుల గురించి రాసిన జలచర విలాసం (108), – వీటి ప్రశస్తిని శతకాలుగా రచించారు. ప్రస్తుతం శ్రీమతి చివుకుల శ్రీలక్ష్మి గారు అందించే చిత్రాల సహకారంతో ప్రతి రోజూ ఒక్క మొక్క తాలూకు ఔషధ విలువలను పద్యం సహితంగా అందిస్తున్నారు.
మన ప్రాంతీయ మొక్కలలోని ఔషధ గుణాలు గురించిన ఈ సమాచారం ఎంతో విలువైనదే. అలా అని వైద్యుని పర్యవేక్షణ లేకుండా వాటిని ఉపయోగించకూడదని నాగమంజరి గారి మనవి.