పరిమళ సుగంధ ద్రవ్యము
బిరియానిని కూడి యాకు బిర్యానాకై
వరి కూటికి రుచినిడుచును
పరదేశపుటాకు మనకు పరిచయమయ్యెన్
నాగమంజరి గుమ్మా
బిర్యానీ ఆకు అని పేరొందిన ఈ పరిమళ ద్రవ్యము పచ్చి ఆకుల కంటే ఎండిన తర్వాతే హెచ్చు గుణాలను చూపిస్తుంది. దీన్ని ప్రాచీన అరబ్, గ్రీకు వంటలలో నిత్యము తప్పనిసరిగా ఉపయోగించేవారు. వరి అన్నములో ఇతర మసాలా దినుసులతో పాటు ఈ ఆకును కూడా కలిపి వండే బిర్యానీ చాలా రుచిగా ఉంటుంది. ఆ పేరిట ఈ ఆకు బిర్యానీ ఆకుగా ప్రసిద్ది పొందింది. అన్నానికి రుచి పట్టిన తర్వాత ఈ ఆకును బయటకు తీసి పారవేయడం ఆనవాయితీ. పొడి చేసి వాడితే సువాసన పెరుగుతుంది కానీ తీసివేయలేం. ఘాటు ఎక్కువై తలతిప్పడం, అజీర్ణం మొదలగు అవలక్షణాలు కలగవచ్చు. ఎక్కువగా తినడం కూడా మంచిది కాదు.
నాగమంజరి గుమ్మా వృత్తి రీత్యా ఉపాధ్యాయురాలు. ప్రవృత్తి రీత్యా రచయిత్రి. వారు కవిత్వం, పద్యం, గద్యం వంటి ప్రక్రియల్లో అనేక రచనలు చేశారు. ప్రతి రోజూ ఒక రచనతో అనేక వాట్సప్ గ్రూపుల్లో వందలాది మందికి చేరువయ్యారు. ముఖ్యంగా పూవుల వర్ణన పద్యములు – పుష్పవిలాసం (1116), పండ్ల విశిష్టత తెలుపే ఫల విలాసం (108), పక్షుల గురించిన విహంగ విలాసం (108), సముద్ర జీవుల గురించి రాసిన జలచర విలాసం (108), – వీటి ప్రశస్తిని శతకాలుగా రచించారు. ప్రస్తుతం శ్రీమతి చివుకుల శ్రీలక్ష్మి గారు అందించే చిత్రాల సహకారంతో ప్రతి రోజూ ఒక్క మొక్క తాలూకు ఔషధ విలువలను పద్యం సహితంగా అందిస్తున్నారు.
మన ప్రాంతీయ మొక్కలలోని ఔషధ గుణాలు గురించిన ఈ సమాచారం ఎంతో విలువైనదే. అలా అని వైద్యుని పర్యవేక్షణ లేకుండా వాటిని ఉపయోగించకూడదని నాగమంజరి గారి మనవి.