చిట్టి మొక్క కాని చెయ్యెత్తు గుణములు
మింటు పేర నిదియె మిలమిలమను
నుదర, శ్వాస, పార్శ్వ, ఉదయ వికారాలు
తొలగిగొట్టు నింటి తొట్ల నుండి
నాగమంజరి గుమ్మా
ఇంట్లో పెంచుకునే చిన్న మొక్క పుదీనా. ఇది ఎన్నో వ్యాధులను హరిస్తుంది. ఆయుర్వేద పుదీనాహరా మాత్రలు ఈ మొక్క రసంతో చేసినవే..
పుదీనా ఆకుల రసంలో అల్లంరసం, కలబంద గుజ్జు, ఏలకులు, దాల్చిన చెక్క కలిపి నూరి, ప్రతి రోజూ, 2-3 చెంచాలు సేవిస్తూవుంటే అరుగుదల పెరుగుతుంది. జీర్ణకోశ వ్యాధులకి, కడుపు నొప్పికి, పుదీనా గింజలు కొన్ని నమిలి తిన్న తరువాత గ్లాసుడు వేడినీళ్ళు తాగితే ఎంతో ఉపశమనం కలుగుతుంది.
కొన్ని పుదీనా ఆకుల్ని గ్లాసుడు నీళ్లతో మరిగించి, ఆ కషాయాన్ని సేవిస్తే, జ్వరం తగ్గిపోవడమే కాక కామెర్లు, ఛాతిమంట, కడుపులో మంట, మూత్ర సంబంధవ్యాధులు సమసిపోతాయి.
నెల తప్పిన స్త్రీలు ఒక చెంచాడు పుదీనా రసంలో చెంచాడు నిమ్మరసం, చెంచాడు తేనె కలిపి, ఆరారగా చేతిలో వేసుకుని సేవిస్తూ వుంటే, వాంతులు, ఎసిడిటీ, వంటి వికారాలు తగ్గుతాయి. అలాగే నిద్రలేమికి, మానసిక వత్తిడికి, నోటి వ్యాధులకి కొన్ని పుదీనా ఆకులు గ్లాసుడు వేడి నీటిలో వేసి, మూతపెట్టి అర్ధగంట తరువాత తాగితే చాలా ఉపశమనం కలగజేస్తుంది. మంచి నిద్ర పడుతుంది.
పుదీనా ఆకులు అరచేతిలో బాగా నలిపి ఆరసాన్ని కణతలకి, నుదుటికి రాసుకుంటే, తలనొప్పి తగ్గిపోయి, చల్లదనాన్నిస్తుంది. ఇంకా జలుబు, దగ్గు, ఇతర అనేకానేక శారీరక ఇబ్బందులకు మంచి ఔషధం పుదీనా.
నాగమంజరి గుమ్మా వృత్తి రీత్యా ఉపాధ్యాయురాలు. ప్రవృత్తి రీత్యా రచయిత్రి. వారు కవిత్వం, పద్యం, గద్యం వంటి ప్రక్రియల్లో అనేక రచనలు చేశారు. ప్రతి రోజూ ఒక రచనతో అనేక వాట్సప్ గ్రూపుల్లో వందలాది మందికి చేరువయ్యారు. ముఖ్యంగా పూవుల వర్ణన పద్యములు – పుష్పవిలాసం (1116), పండ్ల విశిష్టత తెలుపే ఫల విలాసం (108), పక్షుల గురించిన విహంగ విలాసం (108), సముద్ర జీవుల గురించి రాసిన జలచర విలాసం (108), – వీటి ప్రశస్తిని శతకాలుగా రచించారు. ప్రస్తుతం శ్రీమతి చివుకుల శ్రీలక్ష్మి గారు అందించే చిత్రాల సహకారంతో ప్రతి రోజూ ఒక్క మొక్క తాలూకు ఔషధ విలువలను పద్యం సహితంగా అందిస్తున్నారు.
మన ప్రాంతీయ మొక్కలలోని ఔషధ గుణాలు గురించిన ఈ సమాచారం ఎంతో విలువైనదే. అలా అని వైద్యుని పర్యవేక్షణ లేకుండా వాటిని ఉపయోగించకూడదని నాగమంజరి గారి మనవి.